తెలంగాణలో పసుపు బోర్డ్ ఏర్పాటైతే రైతులకు కలిగే లాభమేంటి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, బళ్ల సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మహబూబ్ నగర్‌లో బీజేపీ నిర్వహించిన ‘పాలమూరు ప్రజాగర్జన’ సభలో ఆయన ఈ ప్రకటన చేశారు.
ఇంతకీ ఈ పసుపు బోర్డు ఎందుకు? దీనివల్ల తెలంగాణ రైతులకు ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది?
పాత నిజమాబాద్, కరీంనగర్ జిల్లాల్లోని ఎక్కువ ప్రాంతాల్లో పసుపు బాగా పండుతుంది. దీంతో ఇక్కడి రైతులు విస్తృతంగా సాగు చేస్తారు. ఇక్కడ పసుపు బోర్డు ఉంటే తమకు మేలు జరుగుతుందని రైతులు చాలాకాలంగా కోరుతున్నారు.
పంట అభివృద్ధి, విస్తరణ,నాణ్యత ప్రమాణాలు పాటించడంవంటి అంశాలపై పరిశోధనలు జరిపి సలహాలు ఇవ్వడం, రైతులకు లాభం చేకూరేలా పసుపు ఎగుమతులకు అనువైన పరిస్థితులు కల్పించడం లక్ష్యంగా ఇక్కడ ఒక పసుపు పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని స్థానిక రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
వాస్తవానికి కేవలం పసుపే కాకుండా, ఇతర అన్నిరకాల సుగంధ ద్రవ్యాలకూ కలపి 1987లో సుగంధ ద్రవ్యాల బోర్డు కేరళలోని కోచిలో ఏర్పాటైంది. రైతు ప్రయోజనాలు, పరిశోధన, గిట్టుబాటు ధర వంటి చర్యలు తీసుకోవడం వీరి బాధ్యత.
2010లో కేరళ, తమిళనాడు, కర్ణాటక, సిక్కిం, గౌహతి, గుజరాత్, గుంటూరు, వరంగల్‌లో ప్రాంతీయ కార్యాలయాలు ఏర్పాటు చేశారు. వాటికి 16 జోనల్ కార్యాలయాలు, 13మార్కెటింగ్ కార్యాలయాలు ఉన్నాయి.
పాడేరు, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్, హైదరాబాద్‌లలో ఎగుమతి ప్రోత్సాహక ఆఫీసులు ఉన్నాయి. గుంటూరులో స్పైసెస్ పార్కు ఉంది. ఈ సంస్థకు చైర్మన్, కార్యదర్శి, డైరెక్టర్లు ఉంటారు. వారి కింద ప్రాంతీయ, డివిజినల్, ఫీల్డు కార్యాలయాలు ఉంటాయి.

ఫొటో సోర్స్, fb/Arvind Dharmapuri
నిజామాబాద్‌లోనే ఎందుకు ?
స్పైసెస్ బోర్డు 52 సుగంధ ద్రవ్యాల కోసం పనిచేస్తుంది. వాటిలో పసుపు ఒకటి. దేశంలో పండే పసుపులో సుమారు 70 శాతం నిజామాబాద్ ప్రాంతంలోనే పండుతుంది. అందుకే పసుపుకు ప్రత్యేకంగా బోర్డు కావాలని ఇక్కడి రైతుల వాదన.
ఇక్కడ బోర్డును ఏర్పాటు చేస్తే ఆ సంస్థ కేవలం పసుపుపైనే దృష్టి పెడుతుంది. లేదంటే సలహాలు, సూచనలు, పరిశోధనల కోసం రైతులు కోచి స్పైసెస్ బోర్డుపైనే ఆధారపడాల్సి ఉంటుందని రైతులు వాదిస్తున్నారు.

‘‘టీ బోర్డు, పొగాకు బోర్డులాగా పసుపు బోర్డు ఉంటే రైతులకు లాభం. స్పైసెస్ బోర్డులో పసుపు పంటకు ప్రాధాన్యం లేదు. ప్రత్యేకంగా బోర్డు ఉంటే రైతులకు నమ్మకం ఉంటుంది. అందుకే మేం బోర్డు విషయంలో ఒత్తిడి చేస్తున్నాం.’’ అని నిజామాబాద్‌కు చెందిన రైతు నాయకుడు ప్రభాకర్ బీబీసీతో అన్నారు.
2017 ఆగష్టులో అప్పటి ఎంపీ కవిత పసుపు బోర్డు ఏర్పాటు కోసం ప్రధాని మోదీని కలిశారు. 2018లో సురేశ్ ప్రభు స్పైసెస్ డెవలప్‌మెంట్ పార్క్ ప్రకటించారు.

ఫొటో సోర్స్, TWITTER/KAVITHA KALVAKUNTLA
2018లో పసుపు బోర్డు ఎన్నికల అంశంగా మారింది. అప్పటి ఎంపీ కవితకు వ్యతిరేకంగా 178మంది రైతులు నామినేషన్లు వేశారు.
‘‘బీజేపీ ఎంపీగా గెలిచిన తరువాత పసుపు బోర్డును తీసుకురాకపోతే రాజీనామా చేస్తా’’ అని రాతపూర్వకంగా హామీ ఇచ్చిన ధర్మపురి అరవింద్ ఈ ఎన్నికల్లో గెలిచారు.

2020 జనవరిలో నిజామాబాద్ లో స్పైసెస్ బోర్డు రీజినల్ ఆఫీసు ఏర్పాటు చేశారు. ఇందులో పసుపు, మిర్చి రెండు పంటలకు సంబంధించిన వ్యవహారాల పర్యవేక్షణ ఉంటుంది.
ఇప్పుడు ఇక్కడి రైతులకు పాలిషర్లు, బాయిలర్లు అందుతున్నాయి. వీటి సంఖ్య గతంకంటే గణనీయంగా పెరిగింది. రాయితీ ధరపై వీటిని ఇస్తున్నారు.
అలాగే విదేశాల నుంచి పసుపు దిగుమతి చేసుకోవడంపై కూడా ఆంక్షలు విధించింది కేంద్రం.

ఫొటో సోర్స్, getty images/manusapon kasosod
భారతదేశవ్యాప్తంగా 2016-17 నాటికి లక్షా 93వేల 395 హెక్టార్లలో 10,51,160 టన్నుల పసుపు ఉత్పత్తి అయింది. ఇక 2017-18 ఆర్థిక సంవత్సరానికిగానూ లక్షా 7 వేల 300 టన్నులు ఎగుమతి అయింది.
ప్రస్తుతం కమ్మరపల్లిలో పసుపు పరిశోధన కేంద్రం ఉంది. ఈ పరిశోధన కేంద్రం విషయంలో రైతులకు అవగాహన పెరిగింది. వారి పరిశోధనలకు సంబంధించిన విషయాలు, కొత్త వంగడాలు రైతులకు చేరుతున్నాయి. కానీ అది బోర్డులో భాగం అయితే ఇంకా లాభం ఉంటుందని స్థానికులు అంటున్నారు.
(గమనిక: ఈ కథనాన్ని తొలుత 2021 మార్చిలో పబ్లిష్ చేశాం. ప్రధాని నరేంద్ర మోదీ చేసిన తాజా ప్రకటనతో ఈ కథనాన్ని అప్‌డేట్ చేశాం.)
ఇవి కూడా చదవండి:
- సెక్స్‌కు 'విశ్వగురువు' ప్రాచీన భారతదేశమే
- పేద దేశాలకు దక్కకుండా ధనిక దేశాలు వ్యాక్సీన్‌ను లాగేసుకుంటున్నాయా?
- అంబేడ్కర్ తొలి పత్రిక ''మూక్ నాయక్''కు 101 ఏళ్లు: అప్పట్లో దళితులు మీడియాను ఎలా నడిపించేవారు?
- పువ్వును కాయగా మార్చే యంత్రం
- ‘టమోటా సాగుతో కోట్ల రూపాయలు వచ్చాయంటే మేం కూడా పంట వేశాం. తీరా చూస్తే..’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








