బీబీసీతో కవిత: 'నిజామాబాద్‌లో రైతులు బీజేపీ, కాంగ్రెస్‌లపైనే పోటీకి దిగారు' - ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ
పసుపు పంటకు మద్దతు ధర ఇవ్వాలని, పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని, ఎర్రజొన్నలకు మద్దతుధర ఇవ్వాలని ఐదేళ్లుగా అడుగుతూనే ఉన్నామని, కానీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని నిజామాబాద్ టీఆర్‌ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత సోమవారం బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
నిజామాబాద్ లోక్‌సభ స్థానంలో 170 మందికి పైగా రైతులు పోటీచేస్తుండటంపై అడిగిన ప్రశ్నకు ఆమె స్పందిస్తూ- వారు జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లకు వ్యతిరేకంగానే బరిలోకి దిగారని చెప్పారు.
పసుపు రైతుల సమస్యలను జాతీయ పార్టీల దృష్టికి తీసుకొచ్చేందుకే నిజామాబాద్‌లో ఆ రైతులు నామినేషన్లు వేశారని కవిత తెలిపారు. ఆ రైతులు, తాను ఆ జాతీయ పార్టీలతోనే కొట్లాడుతున్నామని చెప్పారు. అక్కడ జరుగుతున్న పోరాటం తనపై కాదని, జాతీయ పార్టీలపై అని వ్యాఖ్యానించారు.
తెలంగాణ ప్రయోజనాల కోసం బీజేపీ, కాంగ్రెస్ ఏమీ చేయలేదని ఆమె ఆరోపించారు. "తెలంగాణకు చెందిన ఏడు మండలాలను కేంద్ర ప్రభుత్వం లాక్కొని ఆంధ్రప్రదేశ్‌కు అప్పనంగా అప్పజెబితే కూడా కేంద్ర మంత్రిగా ఉన్న బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ కనీసం నిరసన కూడా వ్యక్తంచేయలేదు’’ అని విమర్శించారు.
టీఆర్‌ఎస్ లాంటి ప్రాంతీయ పార్టీలు ఎన్నికల అనంతరం కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తాయని కవిత తెలిపారు.
'ఆంధ్రప్రదేశ్‌పై మేం ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించలేదు'
ఫెడరల్ ఫ్రంట్(సమాఖ్య కూటమి) విషయమై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డితో టీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు చర్చించారని కవిత ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
ఎవరు విజయం సాధిస్తారనేది పక్కనబెడితే, టీఆర్‌ఎస్‌కు ఆంధ్రప్రదేశ్ కూడా దేశంలోని ఇతర రాష్ట్రాల మాదిరే ఒక రాష్ట్రమని ఆమె తెలిపారు.

ఫొటో సోర్స్, Twitter/Kavitha Kalvakuntla
ఫెడరల్ ఫ్రంట్ విషయమై ఇతర రాష్ట్రాల్లోని పార్టీలతో చర్చించినట్లుగానే ఏపీలో వైసీపీతో చర్చించామని కవిత తెలిపారు. అంతేగాని ఆంధ్రప్రదేశ్‌పై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించి చేసే ఆలోచన లేదని చెప్పారు. అంతిమంగా ఈ ప్రయత్నం దేశం గురించి చేస్తున్నదని తెలిపారు.
ఆత్మగౌరవంతో కూడిన అభివృద్ధిని తెలంగాణ ప్రజలు కోరుకొంటున్నారని ఆమె తెలిపారు. ఆత్మగౌరవమనేది అత్యంత ముఖ్యమైన అంశమని, తెలంగాణ ప్రజల్లో ఈ భావన ఎప్పుడూ ఉందని పేర్కొన్నారు. గులాబీ జెండా దిల్లీలో రెపరెపలాడాలనే ఆకాంక్ష ప్రజల్లో ఉందన్నారు.
ఇవి కూడా చదవండి:
- బీజేపీ మేనిఫెస్టో 2019: 'ఆరు కోట్ల మంది ప్రజల అభిప్రాయాలతో హామీ పత్రం'
- లోక్‌సభ: పెరుగుతున్న బీజేపీ ప్రాబల్యం.. తగ్గుతున్న ముస్లిం ప్రాతినిధ్యం
- వంద రోజుల్లో ఎనిమిది లక్షల మందిని చంపేసిన నరమేధం
- కాళేశ్వరం ప్రాజెక్టు: కలల నిర్మాణం ఒక వైపు... కడతేరని విషాదం మరో వైపు
- Reality Check: నరేంద్ర మోదీ హామీలు నిలబెట్టుకున్నారా?
- నీరవ్ మోదీ: భారత్‌కు ఎలా రప్పిస్తారు? రూ.11,360 కోట్ల సంగతేంటి?
- ఈమెకు నెల రోజుల్లో రెండు కాన్పులు, ముగ్గురు పిల్లలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)