సొమాలియా సంక్షోభం: ఓ వైపు కరువు.. మరోవైపు అంతులేని యుద్ధం.. సాయం చేయని ప్రపంచ దేశాలు

వీడియో క్యాప్షన్, సొమాలియా సంక్షోభం: ఓ వైపు కరువు.. మరోవైపు అంతులేని యుద్ధం.. సాయం చేయని ప్రపంచ దేశాలు

కరవు కోరల్లో చిక్కుకున్న సొమాలియాకు సాయం అవసరమని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది ఐక్యరాజ్యసమితి. నాలుగు దశాబ్ధాలలో ఎన్నడూ చూడని కరవు సొమాలియాని కమ్మేయడంతో లక్షల మంది తిండి లేక అల్లాడుతున్నారు. ఇస్లామిస్ట్ అల్ షాబాబ్ మిలిటెంట్ల వరుస దాడులతో బాధితల వరకు సాయం చేరడం కూడా కష్టంగా మారింది. సొమాలియాలోని బైదోవా నగరం నుంచి బీబీసీ ఆఫ్రికా ప్రతినిధి ఆండ్రూ హార్డింగ్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్.

దక్షిణ సొమాలియాలోని బీడు భూములు.. త్వరలోనే కరవుగా ప్రకటించడానికి సిద్దంగా ఉన్న ప్రాంతం ఇది.

మేము కొన్నేళ్లుగా సంఘర్షణలతో కొట్టుమిట్టాడుతున్న బైడోవా నగరానికి వచ్చాం.

నాలుగు దశాబ్ధాలలో ఎప్పుడూ లేని కరువు పరిస్థితులు ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నాయి.

ప్రధాన ఆసుపత్రిలో ప్రతి బెడ్ మీద పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న చిన్నారులే ఉన్నారు.

వారిలో కొందరు చావుబతుకుల్లో ఉన్నారు.

కొన్నేళ్లుగా ఈ సంక్షోభం కొనసాగుతూనే ఉంది. కానీ వీరికి సాయపడేందుకు ప్రపంచ దేశాలు మాత్రం సిద్దంగా లేవు.

''మాకు మరింత సామాగ్రి అవసరం. ప్రజలకు ఆపన్నహస్తం అందించేందుకు మరిన్ని సాయం చేసే చేతులు అవసరం'' అని యునిసెఫ్ ప్రతినిధి చార్లెస్ జుకి అన్నారు.

ప్రాంతీయ కరవు పరిస్థితులు మరింత తీవ్రరూపం దాల్చనున్నాయని నిపుణులు చెబుతున్నారు.

బైడోవా శివారు ప్రాంతాలలో ఇప్పటికే లక్షలాది ఆహారం కోసం గుమిగూడారు.

యాభై ఏళ్ల హబీబా మొహ్మూద్ తన కుటుంబం కోసం నివాసం ఏర్పాటు చేసుకుంటున్నారు.

మాకు పొలంలో ఏమీ మిగల్లేదు, ఇక మేం వెనక్కి వెళ్లడం కూడా అనవసరం అని ఆమె చెబుతున్నారు

ఈ సంక్షోభానికి ప్రధాన కారణం పర్యావరణ మార్పులే అయినా అనేక ఇతర కారణాలు కూడా ఉన్నాయి.

ఇక్కడి శిబిరాల చుట్టూ ఎటు చూసినా మీకు చాలా వరకు మహిళలే కనిపిస్తారు. మూడు దశాబ్ధాలుగా కొనసాగుతున్న సొమాలియా సంఘర్షణే దీనికి కారణం. మనం ఉన్న ప్రాంతానికి నాలుగు కిలోమీటర్ల దూరంలోనే సైనిక దళాలు పోరాడుతున్నాయి.

సొమాలి ప్రభుత్వ దళాలు...బలమైన ఇస్లామిస్ట్ మిలిటెంట్ గ్రూప్ అల్ షాబాబ్ భూభాగాన్ని స్వాధీనం చేసుకుని ఉత్తర దిశగా ముందుకెళ్తున్నాయి.

కానీ ఈ యుద్దంలో చిక్కుకున్న చాలా గ్రామీణ ప్రాంతాలకు కనీస సాయం కూడా అందడం లేదు.

బైడోవాలో నివసించే రెండేళ్ల నేమాకు చివరికి సాయం అందుతుంది.

నేహా తల్లి తన గుర్తింపును తెలిపేందుకు భయపడుతున్నారు. అయితే తమ గ్రామంలో ఘర్షణలు ఎక్కువవడంతో ప్రాణాలు దక్కించుకోవడానికి దాక్కుంటున్నామంటూ బంధువులు తనకు ఫోన్లో చెప్పారని ఆమె అన్నారు.

ఓ వైపు కరువు.. మరోవైపు అంతులేని యుద్ధం.. ఇప్పటికే సంక్షోభంలో ఉన్న దేశం మరిన్ని సమస్యల సుడిగుండంలో పడిపోతోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)