కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలకు ఎవరు బాధ్యులు? తల్లిదండ్రులా? కోచింగ్ సెంటర్లా? – బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, వినీత్ ఖరే
- హోదా, కోటా నుంచి బీబీసీ ప్రతినిధి
అది జనవరి నెల. 21 ఏళ్ల విజయ్ రాజ్(పేరు మార్చాం) చాలా దిగాలుగా ఉన్నారు.
విజయ్ అప్పటికే రెండుసార్లు నీట్ పరీక్షలో ఫెయిల్ అయ్యారు. మే నెలలో నిర్వహించే మరో పరీక్షలో కూడా ఫెయిల్ అవుతానేమోనని భయపడుతున్నారు.
ఎంతో కాలంగా విజయ్‌కి ఫిజిక్స్ సబ్జెట్ చాలా కష్టంగా ఉంటోంది. దాంతో పాటు, కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ నిర్వహించిన ఇంటర్నల్ టెస్టులో అంత మంచి మార్కులు రాకపోవడం అతని ఆత్మవిశ్వాసాన్ని మరింత దెబ్బకొట్టింది.
రైతు కుటుంబం నుంచి వచ్చిన విజయ్, ఈ కారణంతో తీవ్రమైన ఒత్తిడి, ఆందోళన, ఛాతి నొప్పితో ఇబ్బంది పడుతుండేవాడు.
ఈ సమస్యల నుంచి తనని తాను దృష్టి మళ్లించుకోవడం కోసం మొబైల్‌లో రీల్స్, షార్ట్స్ చూసేవారు. ఇవి అతని సమయాన్ని మరింత వృథా చేసేవి.
పరీక్షల్లో మంచి మార్కులు రాలేదని చెప్పి తల్లిదండ్రులను బాధపెట్టకుండా ఉండేందుకు, ఆయన ఎన్నో సార్లు అబద్ధాలు చెప్పారు.
‘‘మానసిక ఒత్తిడితో తొలిసారి నాకు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన వచ్చింది. దీని గురించి అమ్మానాన్నలకు చెప్పలేదు. వారిని బాధపెట్టాలనుకోలేదు’’ అని కొన్నేళ్లు కోటాలో చదువుకున్న విజయ్ చెప్పారు.
ఒకసారి మానసిక ఒత్తిడి మరింత తీవ్రంగా మారి, ఆత్మహత్య చేసుకునే దాకా వెళ్లానని తెలిపారు.
‘‘నా ముందు ఏ ఆప్షన్లు లేవనిపించింది. పేరెంట్స్ డబ్బులను వృథా చేస్తున్నట్లు, వారి గౌరవాన్ని మరింత దిగజారుస్తున్నట్లు అనిపించింది’’ అని విజయ్ చెప్పారు.
మూడోసారి కూడా విజయ్ నీట్ పరీక్షలో ఫెయిల్ అయ్యారు.

సాయం అడగడం ఎంతో ముఖ్యం
ప్రముఖ ఇంజనీరింగ్ లేదా మెడికల్ కాలేజీలో తమ పిల్లలకు సీటు సంపాదించడం ఎంతో గౌరవంగా భావిస్తాయి భారతీయ కుటుంబాలు.
నటి దీపికా పదుకొణే తాను ఎదుర్కొన్న మానసిక కుంగుబాటు గురించి బయటికి చెప్పారు. వీటిని విన్న విజయ్, దీపికా పదుకొణేను స్ఫూర్తిగా తీసుకుని, సామాజిక కట్టుబాట్లను పక్కన పెట్టి, సైకియాట్రిస్ట్‌ను కలిశారు. ప్రస్తుతం విజయ్ మానసిక ఒత్తిడిని అధిగమించి ఎంతో మెరుగైన స్థితిలో ఉన్నారు.
కానీ, 18 ఏళ్ల ఆదర్శ్ రాజ్ మాత్రం దీని నుంచి బయటపడలేకపోయారు. ఆదర్శ్ డాక్టర్ కావాలనుకున్నారు.
రైతు కుటుంబానికి చెందిన ఆదర్శ్, ఇంటికి 900 కిలోమీటర్ల దూరంలో ఉంటూ చదువుకునేవారు.

ఆదర్శ్ బలవన్మరణం గురించి తెలుసుకున్న అతని కుటుంబం తీవ్ర షాకింగ్‌కు గురైంది.
కోచింగ్ సెంటర్ నిర్వహించే టెస్టులలో కొన్నిసార్లు ఆదర్శ్‌కి తక్కువ మార్కులు వచ్చేవని అతని అంకుల్ హరిశంకర్ ప్రసాద్ సింగ్ తెలిపారు.
పరీక్షల్లో తక్కువ మార్కులు రావడంతో ఒత్తిడికి గురై బలవన్మరణానికి పాల్పడ్డాడని తమకనిపిస్తుందన్నారు.
గత పదేళ్లలో కోటాలో 100 మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుని చనిపోయారని పోలీసు గణాంకాలు చెబుతున్నాయి.
ఈ ఏడాది ఇప్పటి వరకు 25 మంది చనిపోయారు. ఇప్పటి వరకు ఈ ఏడాది ఆత్మహత్యలే అత్యధికం. గత సంవత్సరం 15 మంది తనువులు చాలించారు.

మానసిక ఒత్తిడి ఎంత పెద్ద సమస్య?
ఆత్మహత్యలు చేసుకుంటున్న వారిలో ఎక్కువ మంది నీట్‌కు సిద్ధమవుతున్న విద్యార్థలు ఉంటున్నట్లు ఒక పరిశీలనలో తేలింది.
గణాంకాల ప్రకారం, కోటాలో చదువుకుంటోన్న విద్యార్థుల వయసు 15 నుంచి 17 ఏళ్ల మధ్య ఉంటుంది. ఈ నగరంలో తమ తల్లిదండ్రుల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ఒంటరిగా జీవించడం అంత తేలికైన విషయం కాదు.
రోజూ కనీసం 13 నుంచి 14 గంటల పాటు చదువుకోవాల్సి ఉంటుంది. టాపర్లతో తీవ్రమైన పోటీ ఉంటుంది. ఇది విద్యార్థులను మరింత ఒత్తిడికి గురి చేస్తుంది.
ఆదర్శ్ అంకుల్ అంతకుముందెప్పుడూ కోటాలో ఆత్మహత్యల గురించి వినలేదని చెప్పారు. ఆదర్శ్‌పై తామెప్పుడూ ఒత్తిడి పెట్టలేదని అన్నారు.
ప్రభుత్వ డేటా ప్రకారం, 2021 ఏడాదిలో భారత్‌లో 13 వేల మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. 2020 గణాంకాలతో పోలిస్తే, ఈ గణాంకాలు 4.5 శాతం ఎక్కువ.
ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్న వివరాల ప్రకారం, ప్రతి సంవత్సరం సుమారు 7 లక్షల మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు.
15 నుంచి 29 ఏళ్ల మధ్య వయసు ఉండి చనిపోతున్న వారిలో ఆత్మహత్య నాలుగో ప్రధాన కారణంగా ఉంటోంది.

కరోనా కూడా ఒక కారణమా?
కోటాలోని మూడున్నర వేల హాస్టల్స్, వేలాది ఇళ్లల్లో 2 లక్షల మంది విద్యార్థులు నివసిస్తున్నారు.
ఈ ఏడాది ఆత్మహత్యలు పెరిగేందుకు కరోనా కూడా ఒక కారణమని ప్రజలు అంటున్నారు.
కరోనా సమయంలో విద్యార్థుల చదువులు బాగా ప్రభావితమయ్యాయి. తిరిగి కోటాకు వచ్చిన తర్వాత చాలా మంది విద్యార్థులు ఈ తీవ్రమైన పోటీని తట్టుకోలేక బాధితులుగా మారుతున్నారు.
కరోనా సమయంలో స్కూళ్లకు వెళ్లే పిల్లల లెర్నింగ్ ప్రాసెస్ బాగా తగ్గిపోయినట్లు ఇటీవల ప్రచురితమైన ఒక అనాలసిస్ తెలిపింది.
‘‘కరోనా తర్వాత పిల్లలు స్కూళ్లకు వచ్చినప్పుడు, వారు రాసే సామర్థ్యాన్ని, ఇతరులతో మాట్లాడే విధానాన్ని కోల్పోయారు. ఇతరులతో ఎలా మాట్లాడాలి, టీచర్లతో ఎలా సంభాషించాలి వంటి విషయాలను పిల్లలకు మేం మళ్లీ మొదట్నుంచి బోధించాల్సి వచ్చింది’’ అని విద్యావేత్త ఉర్మిల్ భక్షి చెప్పారు.
‘‘కరోనా తర్వాత తిరిగి వచ్చిన విద్యార్థులలో ఒత్తిడిని ఎదుర్కొనే సామర్థ్యం కాస్త తక్కువగా ఉంది. కానీ, సమయం గడుస్తున్నా కొద్ది ఒత్తిడిని అధిగమించే సామర్థ్యం కాస్త మెరుగుపడుతుంది’’ అని కోటాలోని ప్రముఖ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ మోషన్ ఎడ్యుకేషన్ మేనేజింగ్ ఎడిటర్ నితిన్ విజయ్ చెప్పారు.
కరోనా సమయంలో చదువులన్నీ ఆన్‌లైన్‌కి మారిపోయాయి. పిల్లలు ఒంటరి అయిపోయారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు స్మార్ట్‌ఫోన్లు ఇచ్చి, చదువులు చెప్పించారు.

నిపుణులు ఏం చెబుతున్నారు?
‘‘స్మార్ట్‌ఫోన్లు ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతుల్లో ఉంటున్నాయి. కొంతమంది పిల్లలు వాటిని దుర్వినియోగం చేస్తున్నారు. ఇంటర్నెట్‌కు బానిసలుగా మారుతున్నారు.
దీని వల్ల, కొందరు క్లాస్‌లకు బంక్ కొడుతున్నారు. దీంతో ఇతర పిల్లలతో పోలిస్తే వెనుకబడి పోతున్నారు. పిల్లలు వెనుకబడిపోయినప్పుడు డిప్రెషన్‌లో కూరుకుపోతున్నారు. ఆ తర్వాత ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
ఇక్కడ కోచింగ్ చాలా వేగంగా ఇస్తారు. ఒకవేళ ఒకటి లేదా రెండు మూడు రోజులు క్లాస్‌లకు వెళ్లకపోయినా, కోచింగ్ ఇన్‌స్టిట్యూట్లు చెబుతున్న పాఠాలను వారు అందుకోలేకపోతారు.’’ సైకియాట్రిస్ట్ డాక్టర్ ఎంఎల్ అగర్వాల్ చెప్పారు.
200 నుంచి 300 వరకు విద్యార్థులున్న క్లాస్‌లు ఒకసారి వెనుకబడితే, ఆ సిలంబస్‌ను అందుకోవడం అంత తేలికైన విషయం కాదు.
దీంతో మానసిక ఒత్తిడి తీవ్రంగా పెరిగిపోతుంది. ఈ ప్రభావం టెస్ట్‌లపై కనిపిస్తోంది. ఇది విద్యార్థులలో మరింత ఒత్తిడిని పెంచుతోంది.
నిపుణలు చెబుతున్న ప్రకారం, కోటాలో చదువుకుంటోన్న చాలా మంది విద్యార్థుల వయసు 15 నుంచి 17 ఏళ్ల మధ్యలో ఉంటుంది. వారి జీవితాల్లో ఇది చాలా కీలకమైన సమయం. కానీ, వాస్తవంగా వారింకా పిల్లలే.
‘‘పిల్లలు ఇక్కడికి వచ్చే సమయం, శారీరకంగా, మానసికంగా అభివృద్ధి చెందే దశ. హార్మోనల్ మార్పులు కూడా అప్పుడే వస్తాయి’’ అని డాక్టర్ ఎంఎల్ అగర్వాల్ చెప్పారు.

హెల్ప్‌లైన్, కౌన్సిలింగ్
ఈ నగర ఆర్థిక వ్యవస్థ 5 వేల కోట్లకు పైగా ఉంటుంది. ఇక్కడికి వచ్చే విద్యార్థులపైనే దీని ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉంటుందని ఒక ట్రేడ్ ఆర్గనైజేషన్ చెప్పింది.
నగరంలో ఆత్మహత్యల కేసులు పెరుగుతున్నప్పటికీ, వ్యాపారాలు ఏమీ ప్రభావితం కావడం లేదని, విద్యార్థులు చదువుకునేందుకు కోటాకు వస్తున్నారని కోటా హాస్టల్ అసోసియేషన్ చీఫ్ నవీన్ మిట్టల్ తెలిపారు.
పోటీ చాలా తీవ్రంగా ఉంటుంది. విద్యార్థుల ఆత్మహత్యలను నిర్మూలించేందుకు నగరంలో పలు కార్యక్రమాలను చేపడుతున్నారు.
మానసిక ఆరోగ్యంపై విద్యార్థులకు, ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. కానీ, కోటాలో ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. మానసిక ఒత్తిడికి గురవుతున్న చాలా మంది విద్యార్థులు హెల్ప్‌లైన్‌కు కాల్ చేస్తున్నారు.
‘‘మానసిక ఒత్తిడికి గురవుతున్న విద్యార్థులు ఫోన్‌లో మాట్లాడుతూ ఏడ్చేస్తున్నారు. వారి చూస్తే చాలా బాధవేస్తుంది. ఆ తర్వాత వారి తల్లిదండ్రులతో కూడా మేం మాట్లాడుతున్నాం. పిల్లలపై ఎందుకంత ఒత్తిడి పెడుతున్నారని మేం అడుగుతున్నాం.
పిల్లలు ఎదుర్కొనే ఒత్తిడిని వారికి వివరిస్తున్నాం. నిజంగా వారి పిల్లలు డాక్టర్ కావాలనుకుంటున్నారా? ఒకవేళ ఆ పిల్లలే ఈ లోకంలో లేకపోతే మీరేం చేస్తారు? అని అడుగుతున్నాం’’ అని హెల్ప్‌లైన్ కౌన్సిలర్ ప్రమీలా సఖాలా చెప్పారు.

మార్కెటింగ్ ఎంత పాత్ర పోషిస్తోంది?
పిల్లల మరణాలకు కోటాలో పెరుగుతోన్న మార్కెటైజేషన్ కారణమని విద్యావేత్త ఉర్మిల్ భక్షి చెప్పారు.
‘‘కోచింగ్ క్లాస్‌లలో విద్యార్థుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. టీచర్లకు కనీసం విద్యార్థుల పేర్లు కూడా తెలియవు. ఒక క్లాస్‌లో 300 లేదా అంతకంటే ఎక్కువ మంది విద్యార్థులుంటారు.
వారి పేర్లు టీచర్లకు తెలుసా? ఎవరి పేర్లు ఎవరికీ తెలియవు. విద్యార్థులను ఇతరులను స్నేహితులుగా చేసుకోలేకపోతున్నారు. ఒంటరిగా మారుతున్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం’’ అని ఆమె అన్నారు.
‘‘కేవలం డబ్బు, డబ్బు, డబ్బే. మీకెంత డబ్బు కావాలి? పిల్లల్ని కోల్పోయే అంత డబ్బు మాకొద్దు. మేం పిల్లల్ని కోల్పోవాలనుకోవడం లేదు. పిల్లల్ని ప్రత్యేకమైన వారిగా తీర్చిదిద్దాలనుకుంటున్నాం.
మంచి మనిషిగా మార్చాలనుకుంటున్నాం. తల్లిదండ్రులు చెబుతున్న దాని ప్రకారం, ఇన్‌స్టిట్యూట్ ఫీజులు సంవత్సరానికి లక్ష నుంచి రూ.లక్షన్నర వరకు ఉంటున్నాయి.’’ అని తెలిపారు.
క్లాస్‌రూమ్ సైజు చాలా పెద్దగా ఉంటుందని, కానీ, తీవ్రమైన పోటీ అనేది సమస్యగా మారుతుందని మోషన్ ఎడ్యుకేషన్ కోచింగ్ ఎండీ నితిన్ విజయ్ అన్నారు. ఫీజులు తక్కువగానే ఉన్నాయన్నారు.
కోటాలో ప్రతి కోచింగ్ సెంటర్ కూడా విద్యార్థులలో మంచి పేరున్న టీచర్లను రిక్రూట్ చేసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటోంది.
కోటా ఒక మాఫియా అన్నట్లు మీడియా తమ్మల్ని చిత్రీకరిస్తోందని నితిన్ విజయ్ అన్నారు. గత పదేళ్లలో 25 కోచింగ్ సెంటర్లు మూతపడ్డాయని, బుకింగ్ చేసుకున్న తర్వాత ఒక్కోదాని నష్టం రూ.50 కోట్లు ఉంటుందన్నారు.
ఇప్పటి వరకు మోషన్ ఇన్‌స్టిట్యూట్‌లో ఎలాంటి ఆత్మహత్య ఘటనలు చోటుచేసుకోలేదని నితిన్ విజయ్ అన్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు, విద్యార్థులకు ఫన్ యాక్టివిటీలు నిర్వహించడం, కోర్సులను సరళతరంగా, చిన్నగా మార్చడం, ఎప్పటికప్పుడు కౌన్సిలింగ్ ఇవ్వడం, విద్యార్థుల అటెండెన్స్‌ను పర్యవేక్షించడం వంటివి చేస్తున్నామన్నారు.

పిల్లల జీవితం ఎంత కష్టతరంగా ఉంటుంది?
కోటాలో చాలా మంది జీవితాలు అర్థాంతరంగా ముగిసోతున్నాయి. ప్రజలు చాలా విచారం వ్యక్తం చేస్తున్నారు. కానీ, వారి కలలు మాత్రం ఆగడం లేదు.
ఉన్నత వర్గానికి చెందిన విద్యార్థులుండే ఇళ్ల అద్దె ఇక్కడ నెలకు రూ.20 నుంచి రూ.25 వేల మధ్యలో ఉంటుంది. కానీ, ప్రతి ఒక్కరూ ఈ ఇళ్లు అందుబాటులో ఉండటం కష్టం.
నగరంలోని విజ్ఞాన్ నగర్‌లో సన్నగా, చీకటిగా ఉన్న కారిడార్ల మధ్య నడుచుకుంటూ, మెట్లెక్కి అర్నవ్ అనురాగ్ గదికి మేం చేరుకున్నాం. అనురాగ్ గది ఆ ఇంట్లో రెండో అంతస్తులో ఉంది.
డాక్టర్ అవుదామని అర్నవ్ ఇక్కడికి వచ్చాడు. అర్నవ్ తండ్రి ఒక టీచర్. వచ్చే కొన్ని నెలల పాటు ఇదే గదిలో తాను ఉంటానని అర్నవ్ చెప్పాడు. అర్నవ్ సంవత్సరానికి కట్టే కోచింగ్ ఫీజు లక్షా 20 వేలు. అతని నెలవారీ ఖర్చులు రూ.12 వేల నుంచి రూ.13 వేలు అవుతున్నాయి.
తాను ఉంటున్న ఈ గదికి ఎనిమిదన్నర వేలు కడుతున్నాడు.
ఈ గది అచ్చం బ్యాచిలర్ గది మాదిరే ఉంది. బెడ్‌పై అన్ని పుస్తకాలు పరిచి ఉన్నాయి. ల్యాప్‌టాప్ ఉన్న టేబుల్‌పై ఇండక్షన్ కుక్కర్ కూడా ఉంది. ఆ టేబుల్ దగ్గరే అన్ని సామాన్లు సర్దాడు. ఒక మూలన కూలర్ ఉంది.
గదిలో చాలా చిరాకుగా, ఊపిరిడానంతగా ఉంటుంది. కానీ, తానిక్కడే బాగా చదువుకోవాలని చెప్పాడు.
కోటాలో చదువుకునే చాలా మంది విద్యార్థులు ఇక్కడి వాతావరణాన్ని అలవాటు చేసుకోవాలి. కానీ, ప్రతి ఒక్కరికీ ఇది సాధ్యం కాదు.

పిల్లల మనస్సును అర్థం చేసుకోవాలి
మేం కోటాలో ఉన్నప్పుడు, హాస్టల్‌లో ఉంటున్న మరో బాలిక ఆత్మహత్య చేసుకున్నట్లు మాకు న్యూస్ అందింది. హాస్టల్‌లో ఉంటున్న ప్రతి ఒక్కరూ షాక్‌కి గురయ్యారు.
‘‘ఆమె మా కూతురు లాంటిది’’ అని కేర్ టేకర్ చెప్పారు.
మేం ఫోన్‌లో మాట్లాడినప్పుడు ఆ బాలిక తండ్రి హడావుడిగా కోటాకు బయలు దేరారు.
‘‘కోటాలో ఆత్మహత్యల గురించి మా కూతురు చెబుతూ ఉండేది. ఈ విషయాలపై పెద్దగా దృష్టి పెట్టొద్దని మేం చెప్పాం. మాకు ఇద్దరు కూతుర్లు. వారిలో ఒకర్ని కోల్పోయాం’’ అని తండ్రి కన్నీరు మున్నీరయ్యారు.
ఆత్మహత్యలు నివారించేందుకు, తమ టీమ్ నిరంతరం హాస్టల్స్‌కు వెళ్లి పర్యవేక్షిస్తుందని రాజస్తాన్ పోలీసులకు చెందిన కోటా స్టూడెంట్ సెల్ ఇన్‌ఛార్జ్ చంద్రశీల్ చెప్పారు.
విద్యార్థుల ప్రవర్తనలో ఏదైనా మార్పు ఉందా? లేదా ఏదైనా తేడాలు కనిపిస్తున్నాయా? వంటి వాటిని గమనించేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు.
హాస్టల్ వార్డెన్‌తో, వంట చేసే వారితో మాట్లాడుతున్నామన్నారు.
ఇక్కడ నివసించే పిల్లల తల్లులు విద్యార్థులలో ఒంటరితనాన్ని తొలగిచేందుకు, వారికి ఇంటి భోజనాన్ని, వాతావరణాన్ని అందించడం చేస్తున్నారు.
‘‘పిల్లల మనస్సులో ఏముందో తల్లిదండ్రులు తెలుసుకుంటూ ఉండాలి. వారితో ఎక్కువ సేపు గడపాలి, మాట్లాడాలి. దీంతో పిల్లలు వారి మనస్సులోని భావనలను బయటికి చెబుతారు’’ అని నిపుణులు సూచించారు.
(ఈ కథనంలో కొందరి పేర్లను వారి గుర్తింపును కాపాడేందుకు మార్చాం)
ముఖ్యమైన సమాచారం..
మెడిసిన్, థెరపీతో మానసిక సమస్యలకు చికిత్స ఇస్తారు. దీని కోసం సైకియాట్రిస్ట్ నుంచి సాయం తీసుకోవచ్చు. కావాలనుకుంటే ఈ హెల్ప్‌లైన్లను సంప్రదించవచ్చు.
సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ హెల్ప్‌లైన్ - 1800-599-0019(13 భాషల్లో అందుబాటు)
హ్యుమన్ బిహేవియర్, అలయిడ్ సైన్సెస్ ఇన్‌స్టిట్యూట్ - 9868396824, 9868396841, 011-22574820
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్, న్యూరోసైన్స్ - 080 – 26995000
హిట్‌గుజ్ హెల్ప్‌లైన్, ముంబై - 022- 24131212
ఇవి కూడా చదవండి:
- సారా సన్నీ: భారతదేశ చరిత్రలో తొలిసారిగా సుప్రీం కోర్టులో వాదన వినిపించిన చెవిటి లాయర్
- చెంఘిజ్ ఖాన్ వారసురాలు ప్రిన్సెస్ ఖుతులున్ ఎంత సౌందర్యవతో అంత యోధురాలు... తనను పెళ్ళి చేసుకోవాలనే యువకులకు ఆమె పెట్టిన షరతులేంటి?
- ఇండియా-యూరప్ కారిడార్ అంటే ఏంటి... ఇది చైనా 'బెల్ట్ అండ్ రోడ్'తో పోటీపడగలదా?
- బిహార్: బీసీలు ఎంత శాతం? కులాల వారీ జన గణనలో ఏం తేలింది?
- ఏలియన్లను ఎప్పుడు కనిపెడతాం? వారికి ఇంకెంత దూరంలో ఉన్నాం?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















