చెంఘిజ్ ఖాన్ వారసురాలు ప్రిన్సెస్ ఖుతులున్ ఎంత సౌందర్యవతో అంత యోధురాలు... తనను పెళ్ళి చేసుకోవాలనే యువకులకు ఆమె పెట్టిన షరతులేంటి?

- రచయిత, డాలియా వెంచురా
- హోదా, బీబీసీ ముండో
‘‘మంగోలు రాజు కైదూకు ఒక కుమార్తె ఉంది. ఆమె పేరు అజియార్నే. అంటే తాతర్ భాషలో ‘ప్రకాశవంతమైన చందమామ’ అని అర్థం. ఆమె చాలా అందంగా ఉండేది. అంతే బలవంతురాలు కూడా. ఆ రాజ్యం మొత్తంలో ఆమెతో పోటీపడే మగవారే లేరు.’’
అత్యంత శక్తిమంతమైన రాజ్యాల్లో ఒకటైన మంగోల్ సామ్రాజ్యం రాకుమారి గురించి తన పుస్తకం ‘బుక్ ఆఫ్ వండర్స్’లో వెనీషియా నావికుడు మార్కో పోలో ఇలా రాసుకొచ్చారు.
ఆమె పేరు ఖుతులున్. ఆమెకు అజియార్నే సహా ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. 13వ శతాబ్దంలో మంగోల్ సామ్రాజ్యం తూర్పు చైనా సముద్రం నుంచి హంగరీ సరిహద్దుల వరకూ విస్తరించి ఉండేది. దీన్ని చెంఘిజ్ ఖాన్ వారసులు పాలించేవారు.
చెంఘిజ్ ఖాన్ తన వారసుడిగా ఒగొడేయ్‌ని ప్రకటించారు. ఒగొడేయ్ ముని మనుమరాలే ఖుతులున్. అంటే ఆమె తండ్రి శక్తిమంతమైన మంగోల్ సామ్రాజ్యంలోని ప్రముఖుల్లో ఒకరు.
అయితే, వంశ పరంపర కంటే అద్భుతమైన ఆమె వ్యక్తిత్వం మార్కో పోలోను కట్టిపడేసింది. కుస్తీ పోరాటంలో ఆమె అసామాన్య ప్రతిభ కనబరిచేది. అంతేకాదు, తనను ఓడించే వ్యక్తి వచ్చేవరకూ తాను పెళ్లిచేసుకోనని ఆమె పట్టుపట్టుకొని కూర్చుంది.

ఇదేమీ అంత తేలిక కాదు. ఎందుకంటే ఇతర మంగోలుల తరహాలో ఆమె కూడా విలువిద్యా నిపుణురాలు. గుర్రాలను కూడా ఆమె చక్కగా స్వారీ చేసేది. మంగోలు ఫ్రీస్టైల్ రెజ్లింగ్ ‘బోఖ్’లోనూ ఆమెకు మంచి నైపుణ్యముంది. ఈ కుస్తీలో పాదాలు, చేతులు మినహా ఇతర శరీర భాగాలు నేలను తాకితే ఆ వ్యక్తి ఓడిపోయినట్లే.
అందుకే, ఆమెతో పోటీపడే ఎవరికైనా ఇదొక పెద్ద సవాల్ లాంటిది. ఈ పోటీలో ఆమె గెలిస్తే ఆమెకు వంద గుర్రాలు ఇవ్వాలి. అదే ఆమె ఓడిపోతే అతడిని ఆమె పెళ్లి చేసుకుంటుంది.
ఈ సవాల్ గురించి విశేషాలు రాజ్యం మొత్తానికి పాకాయి. చాలా మంది ఆమెతో పోరాటానికి వచ్చేవారు. కానీ, ఎవరూ విజయం సాధించలేకపోయేవారు. ఖుతులున్ దగ్గర 10,000 గుర్రాలు ఉండేవని మార్కో పోలో తన పుస్తకంలో రాసుకొచ్చారు.
అయితే, ఒక రాకుమారుడు తనను ఓడిస్తే వందకు బదులు వెయ్యి గుర్రాలను ఇస్తానని సవాల్ విసిరాడు. అయితే, తాను ఏం గెలవాలని అనుకుంటున్నారో ఆయనకు బాగా తెలుసు.
‘‘కైదూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఆ రాకుమారుడు గొప్ప రాజుకు వారసుడు. అంతేకాదు, తన కుమార్తెను పెళ్లి చేసుకోవాలని తను ఎంతో ఆసక్తితో ఉన్నాడు’’ అని మార్కో పోలో తన పుస్తకంలో రాశారు.
కానీ, అటువైపు నిలబడింది ఖుతులున్. ఆమెను ఓడించడం అంత తేలిక కాదు. అక్కడకు వచ్చిన వారంతా ఆమె ఓడిపోవాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే అప్పుడే వారిద్దరు జంటగా జీవించగలరు.
‘‘కుస్తీకి వారిద్దరూ ఎదురెదురుగా వచ్చారు. ఒకరిని మరొకరు చూసుకున్నారు. ఇద్దరూ వీరోచితంగా పోరాటాన్ని మొదలుపెట్టారు. కానీ, కొంతసేపటికే ఆయనను ఖుతులున్ మట్టికరిపించింది’’ అని మార్కో పోలో రాసుకొచ్చారు.

ఫొటో సోర్స్, Getty Images
‘‘ఆ కుస్తీ పోటీని చూసేందుకు వచ్చిన వారిలో చాలా బాధ కనిపించింది. ఎందుకంటే, అత్యంత అందమైన మగవారిలో ఒకరు ఆమె చేతిలో ఓడిపోయారు. ఆమెను పెళ్లి చేసుకునే సువర్ణ అవకాశాన్ని చేజార్చుకున్నారు’’ అని మార్కో పోలో రాశారు.
‘‘ఆ పోటీ తర్వాత ఆమెకు మరో వెయ్యి గుర్రాలు వచ్చాయి. ఆ రాకుమారుడు సిగ్గుతో తల దించుకొని తన రాజ్యానికి వెళ్లిపోయాడు’’అని మార్కో పోలో వివరించారు.
ఇలాంటి అవమానం చాలా మందికి జరిగింది.
ఇది చూడటానికి కల్పిత కథలా కనిపించొచ్చు. కానీ, దీన్ని మార్కో పోలో తన పుస్తకంలో రాసుకొచ్చారు. చరిత్రకు సంబంధించిన విశ్వసనీయ సమాచారం అందించిన వారిలో ఆయన కూడా ఒకరు.
అయితే, ఈ పుస్తకం మొదట్లో చాలా మందికి రుచించలేదు. ఎందుకంటే మంగోలులను చాలా మంది రక్తంతాగే రాక్షసులుగా పరిగణించేవారు. వారిని నాగరిక మనుషుల్లా భావించేవారు చాలా తక్కువ.
కొన్నిసార్లు మార్కో పోలో చెప్పిన దాంట్లో అతిశయోక్తులు ఉండొచ్చు కానీ. ఆయనేమీ అబద్ధాల కోరుకాదు. ఖుతులున్‌ను ఆయన ఏ కోణంలో చూశారో తన మాటల్లో ఆ పుస్తకంలో రాసుకొచ్చారు.
అయితే, ఖుతులున్‌ను కొంతమంది చరిత్రకారులు మంగోలు పురాణాల్లో వర్ణించిన యువతిగా రాసుకొచ్చారు. అలాంటి వారిలో రషీద్-ల్-దిన్ హమ్దానీ కూడా ఒకరు. 14వ శతాబ్దంనాటి తన పుస్తకం ‘జమీ అల్-తవారిజ్’లో ఆమె గురించి ఆయన రాసుకొచ్చారు.
అయితే, ఇందులో పేర్కొన్న కొన్ని వివరాలు చాలా అసాధారణంగా ఉన్నాయి. ముఖ్యంగా రాకుమారి రూపురేఖలు వాస్తవానికి ఏ మాత్రమూ దగ్గరగా లేవు.
కాబట్టి ఖుతులున్ కథలో చాలా కల్పితాలు కూడా ఉండొచ్చు.
ఆమె గురించి ఏం తెలుసు?
ఆమె కైదూకు ఎకైక, ముద్దుల కుమార్తె. అతడికి సూచనలు, సలహాలు ఇచ్చేందుకు, వ్యూహాలు రూపొందించేందుకు 14 మంది సోదరులు ఉన్నారు. కానీ, ఆయన ఎక్కువగా తన కుమార్తె బుద్ధిబలంపైనే ఆధారపడేవారు.
తను పోరాడే యుద్ధాలకూ కూడా కుమార్తెను కైదు తీసుకెళ్లేవాడు. ముఖ్యంగా చైనా మొత్తానికి పాలకుడిగా మారిన యువాన్ వంశ చక్రవర్తి కుబ్లాయ్ ఖాన్‌పై యుద్ధానికి కూడా ఆమెను వెంటపెట్టుకుని వెళ్లాడు. మంగోలుకు బదులుగా చైనా సంప్రదాయాలకు పెద్దపీట వేసిన కుబ్లాయ్ ఖాన్‌ను రాజద్రోహిగా చూసేవారు.
‘‘శత్రువుల పైకి బాణంలా ఖుతులున్ దూసుకెళ్లేది. వారిని ఓడించి, బంధించి జాగ్రత్తగా తండ్రి దగ్గరకు ఆమె పట్టుకొని వచ్చేది’’ అని మార్కో పోలో రాసుకొచ్చారు.
ఆమె శరీరాకృతి గురించి కూడా తన పుస్తకంలో మార్కో పోలో రాసుకొచ్చారు. ‘‘తన అవయవాలన్నీ చక్కగా ఉండేవి. ఆమె పొడుగ్గా, బలంగా ఉండేది’’ అని రాశారు.
చివర్లో తనను ఓడించకపోయినా పెళ్లి చేసుకుంటానని ఆమె అంగీకరించినట్లు కొన్ని పుస్తకాల్లో రాశారు. అయితే, తండ్రితో ఆమెకు లైంగిక సంబంధం ఉందని కొందరు పుకార్లు సృష్టించేవారు.
మొత్తానికి ఆమెను ఎవరు పెళ్లి చేసుకున్నారో స్పష్టంగా తెలియదు.
1295లో పర్షియా చక్రవర్తి ఘజన్‌తో ఖుతులున్ ప్రేమలో పడినట్లు రషీద్ తన పుస్తకంలో రాశారు. కానీ, వారిద్దరూ పెళ్లి చేసుకోలేదు.
అయితే, తన తండ్రిని చంపేందుకు కుబ్లాయ్ నియమించిన ఓ హంతకుడిని ఆమె పెళ్లి చేసుకుందని కొన్ని పుస్తకాల్లో రాశారు. ఆ హంతకుడిని కనిపెట్టిన తర్వాత అతడి ధైర్యసాహసాలకు ఆమె మంత్రముగ్ధురాలైందని రాసుకొచ్చారు.
కానీ, వీటిలో ఏది నిజమో తెలియదు.
చాలా మంది చరిత్రకారులు ఏకీభవించే విషయం ఏమిటంటే.. కైదూ తన వారసురాలిగా ఖుతులున్‌ను ప్రకటించాలని భావించారు. కానీ, దీన్ని ఆమె సోదరులు వ్యతిరేకించారు. అయితే, దేశానికి పాలకురాలిగా మారడంపై ఆమెకు అంత ఆసక్తి లేదు.
మొత్తానికి 1306లో ఖుతులున్ మరణించింది. ఆమె ఎలా చనిపోయిందో స్పష్టమైన ఆధారాలు లేవు.
ఖుతులున్ మరణం తర్వాత ఆమెపై చాలా కథలు, పుస్తకాలు, సినిమాలు వచ్చాయి. అంతేకాదు, ఆమె కథపై వీడియో గేమ్‌లు కూడా తయారు చేశారు.
ఇవి కూడా చదవండి:
- హైదరాబాద్‌లో పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు ఎలాంటి భోజనం వడ్డిస్తున్నారు? సోషల్ మీడియాలో చర్చకు కారణం ఏంటి?
- తెలంగాణలో పసుపు బోర్డ్ ఏర్పాటైతే రైతులకు కలిగే లాభమేంటి?
- Sexual Health: సెక్స్‌లో ఎంతసేపు పాల్గొన్నా భావప్రాప్తి కలగకపోవడానికి కారణమేంటి? ఇది వ్యాధి లక్షణమా?
- ‘సెక్స్ కోరికలు పెంచే ఆ హార్మోన్ తీసుకున్నాక నాకు కొడుకు పుట్టాడు’
- పువ్వును కాయగా మార్చే యంత్రం
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















