సారా సన్నీ: భారతదేశ చరిత్రలో తొలిసారిగా సుప్రీం కోర్టులో వాదన వినిపించిన చెవిటి లాయర్

sarah senn

ఫొటో సోర్స్, సరాగ్ సన్ని

ఫొటో క్యాప్షన్, సారా సన్నీ
    • రచయిత, ఇమ్రాన్ ఖురేషి
    • హోదా, బీబీసీ కోసం

27 ఏళ్ల అడ్వకేట్ సారా సన్నీ కొత్త మార్పునకు నాంది పలికారు. చెవిటి వారు కూడా న్యాయ వ్యవస్థలో మనుగడ సాధించడమే కాదు..కేసు వాదించవచ్చని, సాధారణ లాయర్లతో సరిసమంగా వాదించడానికి వైకల్యం అడ్డుకాదని చెప్పడానికి తార్కాణంగా నిలిచారు.

గతవారం సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ తీసుకున్న నిర్ణయంతో అడ్వకేట్ సారా సన్నీకి సుప్రీంకోర్టులో వాదనలు వినిపించే అవకాశం దక్కింది. ఇండియన్ సైన్ లాంగ్వేజ్ (సంజ్ఞా భాష) ఇంటర్‌ప్రిటర్ సాయంతో కేసు వాదించేందుకు చీఫ్ జస్టిస్ ఆమెకు అనుమతి ఇచ్చారు. ఈ నిర్ణయం కేవలం సారా సన్నీకి మాత్రమే కాదు, రానున్న రోజుల్లో మరెంతో మంది దివ్యాంగ లాయర్లు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగొచ్చనే సందేశాన్ని ఇచ్చింది.

అప్పటికే రెండేళ్లుగా బెంగళూరులో ట్రయల్ కోర్టులో ఇంటర్‌ప్రిటర్ సాయంతో సారా సన్నీ కేసు వాదించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, న్యాయమూర్తి అందుకు అనుమతి ఇవ్వలేదు. న్యాయపరమైన భాషను అర్థం చేసుకోవడానికి ఇంటర్‌ప్రిటర్‌కు కూడా సంబంధిత అనుభవం ఉండాలంటూ సారా సన్ని అభ్యర్థనని తోసిపుచ్చారు. అందువల్ల సారా తన వాదనలను రాతపూర్వకంగా సమర్పించాల్సి వచ్చేది.

అయితే, ప్రస్తుతం జస్టిస్ చంద్రచూడ్ తీసుకున్న నిర్ణయంతో ఇకపై కేసు వాదనల సమయంలో ఐఎస్ఎల్‌లు కూడా పాల్గొని, చెవిటి లాయర్లు తమ వాదన వినిపించేలా వారికి సాయం చేసేందుకు అవకాశం లభించినట్లయింది. ఫలితంగా ఈ వృత్తిలో కొనసాగే వారికి ఎక్కువ అవకాశాలు రానున్నాయి.

సుప్రీం కోర్టు అడ్వకేట్ సంచిత ఎయిన్ తరపున సారాసన్నీ కేసులో హాజరయ్యారు.

“ఈ నిర్ణయం ఎన్నో అపోహలు, అనుమానాలను తొలగించింది. దీనివలన న్యాయ వ్యవస్థలో ఎక్కువ మంది మూగ, చెవుడు ఉన్న న్యాయవాదుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యాఖ్యాతలు (ఇంటర్‌ప్రిటర్‌)లకు కూడా అవకాశాలు పెరుగుతాయి” అని సంచిత్ అన్నారు.

ఐఎస్ఎల్ సౌరవ్ రాయ్ చౌదరి బీబీసీతో మాట్లాడుతూ..95% మంది మూగ, చెవిటి సమస్య ఉన్న పిల్లలు అటువంటి సమస్యలే లేని తల్లిదండ్రులకి జన్మిస్తారని అన్నారు.

“2011 లెక్కల ప్రకారం దేశ జనాభా మూగ లేదా వినికిడి లోపం ఉన్నవారి సంఖ్య 18 లక్షలు. గడిచిన 12 ఏళ్లలో ఈ సంఖ్య మరింత పెరిగి ఉండొచ్చు. సుప్రీం కోర్టు తీసుకున్న నిర్ణయం వలన మూగ, చెవుడు సమస్య ఉన్నవారు కూడా సమానమే అన్న నమ్మకం పెరుగుతుంది” అన్నారు.

కేసు విచారణ సమయంలో ఇంటర్‌ప్రిటర్ రాయ్ చౌదరి కేసు విషయాలను సారాసన్నీకి వివరించిన తీరును ప్రశంసించారు అడ్వకేట్ జనరల్ తుషార్ మెహతా. చీఫ్ జస్టిస్ కూడా అభినందించారు.

Sarah Senny

ఫొటో సోర్స్, sarah sunny

ఫొటో క్యాప్షన్, తల్లిదండ్రులతో సారా సన్ని

నెరవేరిన కల..

అడ్వకేట్ సారా సన్నీ తన కలను నెరవేర్చుకున్నారు.

బీబీసీతో ఆమె మాట్లాడుతూ “సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎదుట వాదనలు వినిపించడం నాకు చాలా సంతోషాన్నిచ్చింది. ఆ రోజు కేసు వాదిస్తున్న సమయంలో నాపై నాకు పూర్తి నమ్మకం వచ్చింది. నాలాంటి వారు ఏమీ చేయలేరు అన్న అపోహలు తొలగించి, ఏమైనా చేయగలరు అని నిరూపించాలని అనుకున్నాను. అది నెరవేర్చుకున్నాను” అంటూ బీబీసీతో తన అనుభవాన్ని పంచుకున్నారు.

సారా సన్నీ కవల సోదరి మరియా, సోదరుడు ప్రతీక్ కురువిల్లాకు ఈ సమస్య ఉంది. తమ సంతానానికి ఉన్న వైకల్యాన్ని అవరోధంగా భావించకుండా, వారి జీవితాలను తీర్చిదిద్దారు సారాసన్ని తల్లిదండ్రులు. ఈ సమస్య ఉన్నా కూడా వారిని మూగ, చెవిటి వారికి ప్రత్యేకంగా ఉండే పాఠశాలలకు పంపలేదు.

సారా సన్ని తండ్రి సన్ని కురివిల్లా మాట్లాడుతూ “మేం చెన్నైలో ఉన్నప్పుడు ప్రతీక్‌ను కిండర్ గార్డెన్‌కు పంపాం. బెంగళూరుకు మారిన తర్వాత ప్రతీక్‌ను స్కూల్లో చేర్చడానికి దాదాపు 12 పాఠశాలలు తిరిగాం. ఎవరూ ప్రతీక్‌ను చేర్చుకోవడానికి ముందుకు రాలేదు. ఆంథోని పాఠశాల యాజమాన్యం ముందుకొచ్చింది. అంటూ తాము ఎదుర్కొన్న ఇబ్బందులను గుర్తు చేసుకున్నారు.

“ప్రతీక్ 10వ తరగతి పూర్తి చేసిన సమయంలో మాకు కవలలు జన్మించారు. ఆ ఇద్దరి కోసం దాదాపు 25-30 స్కూళ్లలో ప్రయత్నించాం. చివరికి ఓ కాన్వెంట్‌లో అడ్మిషన్ దొరికింది” అన్నారు.

sarah sunny and maria sunny

ఫొటో సోర్స్, sarah sunny

ఫొటో క్యాప్షన్, సారా సన్ని, మరియా సన్ని

నన్ను ఎగతాళి చేసినవారూ ఉన్నారు..

ప్రతీక్ ఉన్నత విద్యకోసం విదేశాలకు వెళ్లారు. చదువు పూర్తి చేసుకుని సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తున్నారు. అయితే సారా, మరియాల కాలేజీ అడ్మిషన్ల విషయంలోనూ ఇబ్బందులు పడాల్సి వచ్చిందని సన్ని కురివిల్లా తెలిపారు. జ్యోతి నివాస్ కాలేజీలో అడ్మిషన్ దొరికిందని చెప్పారు. మరియా సన్ని ఛార్టెడ్ అకౌంటెన్సీ పూర్తి చేశారు. సారా సన్ని సెయింట్ జోసెఫ్ లా కాలేజీ నుంచి 2021లో డిగ్రీ పట్టా అందుకున్నారు.

“నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది మా తల్లిదండ్రులే. సాధరణ విద్యార్థులతో నేనూ సమానమే అన్నట్లుగా నన్ను పెంచారు. లిప్ రీడింగ్ ద్వారా పాఠాలు విని అర్థం చేసుకునేదానిని. నా స్నేహితురాలి సాయంతో నోట్స్ రాసుకున్నాను. నన్ను ఎగతాళి చేసిన వారు కూడా ఉన్నారు. అలాంటి వారికి గట్టిగానే సమాధానం చెప్పాను అన్నారు” సారా.

సారా, మరియాలు ఇద్దరూ కవల సోదరిలు కావడంతో ఇద్దరి మధ్యా మంచిబంధం ఏర్పడింది. కాలేజీ విద్య నుంచి వేర్వేరు దారులు అవడం, ఇటీవలే మరియా వివాహం చేసుకోవడం గురించి సారా చెప్పారు.

’’నా సోదరి మరియాకు వివాహం అయినప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. ఇకపై నేను దేనినీ పంచుకోవాల్సిన పనిలేదు. గది మొత్తం నాదే. అంతా నాదే అని సంతోషించా. కానీ రెండు నెలల తర్వాత నాకు మరియా లోటు తెలిసింది. ఒంటరితనంగా అనిపించింది. అప్పుడే అర్థమైంది తనంటే నాకు ఎంత ఇష్టమో. ఇప్పటికీ రోజూ తనతో వీడియోకాల్ మాట్లాడుతుంటాను” అని చెప్పారు సారా.

supreme court of India

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, సుప్రీం కోర్టు

ఢిల్లీ హైకోర్టులో తొలిసారిగా..

సారా సన్ని సుప్రీం కోర్టులో వాదనలు వినిపించిన తొలి వికలాంగురాలు(మూగ, చెవుడు). అయితే సారా కన్నా ముందే వైకల్యం అడ్డుకాదని నిరూపించిన మరో అడ్వకేట్ ఉన్నారు. ఆమె పేరు సౌదామిని పెథె (చెవుడు).

రోహ్‌తక్‌కు చెందిన సౌదామిని పెథె 40 ఏళ్ల వయసులో లా పూర్తి చేశారు. ఇంటర్‌ప్రిటర్ ఐఎస్ఎల్ రాయ్ చౌదరినే ఈమెకు కూడా సాయం చేశారు.

చెవుడు ఉన్న వారిని కేంద్రీయ విద్యాలయాల్లో ఉపాధ్యాయులుగా తీసుకోవడం లేదనే కేసు విషయమై సౌదామిని ఢిల్లీ హైకోర్టు ఎదుట హాజరయ్యారు.

సౌదామిని గురించి సంచిత ఐన్ ఆమె గురించి మాట్లాడారు. “ఏప్రిల్ 17వ తేదీన ఆమె హైకోర్ట్ జడ్జి ఎదుట హాజరయ్యారు. సరిగ్గా ఆ సమయానికి ఐఎస్ఎల్ ఇంటర్‌ప్రిటర్ కూడా అందుబాటులో ఉండటంతో ఆమె కల నెరవేరింది. కానీ దురదృష్టవశాత్తు ఏప్రిల్ 22న ఆమె చనిపోయారు” అని చెప్పారు.

ఐదు నెలల తర్వాత అంధులైన అడ్వకేట్ రాహుల్ బజాజ్ కోర్టులో ఇద్దరు ఐఎస్ఎల్‌ ఇంటర్‌ప్రిటర్‌ల నియామకాన్ని కోరుతూ పిటిషన్ వేశారు. అంధులు, మూగ, చెవుడు ఉన్నవారు వాదనలు వినిపించేందుకు ఇంటర్‌ప్రిటర్‌ల అవసరం ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు. పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి ప్రతిభా సింగ్ అందుకు ఆమోదం తెలిపారు.

సారా సన్ని సుప్రీం కోర్టు ఎదుట హాజరైన సమయంలో రాయ్ చౌదరి, శివాయ్ శర్మలు ఐఎస్ఎల్‌ ఇంటర్‌ప్రిటర్‌లుగా ఉన్నారు.

“ఢిల్లీ హైకోర్టు అనుమతి ఇచ్చినట్లుగానే సుప్రీం కోర్టు కూడా వికలాంగులైన లాయర్లు, పిటీషనర్ల సమస్యను దృష్టిలో ఉంచుకుని ఇంటర్‌ప్రిటర్‌లను నియమిస్తుందని ఆశిస్తున్నాను” అని సంచిత్ ఐన్ అన్నారు.

sarah senny

ఫొటో సోర్స్, sarah sunny

ఫొటో క్యాప్షన్, సోదరి మరియా, సోదరుడు ప్రతీక్‌లతో సారా సన్ని

ఇండియన్ సైన్ లాంగ్వేజ్..

సైన్ లాంగ్వేజ్ ఇంటర్‌ప్రిటర్స్ ఆఫ్ ఇండియా అసోసియేషన్ ప్రెసిడెంట్ రేణుకా రమేశన్‌తో కూడా బీబీసీ మాట్లాడింది.

“ఐఎస్ఎల్‌ ఇంటర్‌ప్రిటర్‌ల అవసరం ఉందని ఢిల్లీ హైకోర్టు నుంచి సమాచారం అందింది. అందుకు అనుగుణంగా మేం ప్రొటోకాల్స్ రూపొందించాం ’’అని చెప్పారు.

ఎవరైనా ఐఎస్ఎల్‌ ఇంటర్‌ప్రిటర్‌గా అర్హత సాధించేందుకు ప్రత్యేకమైన కోర్సును పూర్తి చేయాల్సి ఉంటుంది.

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హియరింగ్ హ్యాండికాప్డ్(NIHA) ఈ కోర్సును ఏ, బీ, సీ లెవల్స్‌గా విభజించి అందిస్తోంది. ప్రస్తుతం డిప్లొమా కోర్సు కూడా అందుబాటులో ఉంది. ఈ కోర్సు డిప్లొమా ఇన్ ఇండియన్ సైన్ లాంగ్వేజ్ ఇంటర్‌ప్రిటింగ్ అండ్ టీచింగ్ (DTISL) పేరుతో ఢిల్లీ, కోల్‌కతాతోపాటు మరిన్ని నగరాల్లో అందుబాటులో ఉంది. ఇవేకాకుండా బెంగళూరులోని ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హియరింగ్ కూడా ఇలాంటి కోర్సులను అందిస్తోంది.

రాయ్ చౌదరి మాట్లాడుతూ.. “దేశంలో 400-500 మంది సెర్టిఫైడ్ ఇంటర్‌ప్రిటర్‌లు ఉన్నారు. ఐఎస్ఎల్‌లో వందమంది సభ్యులు ఉన్నారు. కానీ మొత్తంగా చూస్తే నైపుణ్యం కలిగిన వారు 10% ఉన్నారు . అయితే సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం వలన ఈ వృత్తిలో ఉన్నవారికి మరిన్ని అవకాశాలు రానున్నాయి. సైన్ లాంగ్వేజ్(సంజ్ఞ భాష) గురించి చర్చ జరగడం మంచి విషయం” అన్నారు.

“సైన్ లాంగ్వేజ్ క్రమంగా పరిణితి చెందుతూ వస్తోంది. ప్రస్తుతం పనిచేస్తున్న ఐఎస్ఎల్‌ ఇంటర్‌ప్రిటర్‌లలో ఎక్కువమంది ఫ్రీలాన్సర్లే. ప్రస్తుతానికి లైసెన్స్‌లు ఇచ్చే వ్యవస్థ అయితే లేదు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. రానున్న కాలంలో మార్పులు జరగొచ్చు” అన్నారు రమేశన్.

ఇవి కూాడా చదవండి..

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)