పవన్ కల్యాణ్ - వారాహి యాత్ర: ‘మీరు ఓడిపోవడం ఖాయం, మేము గెలవడం డబుల్ ఖాయం’

ఫొటో సోర్స్, Janasena party
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వారాహి నాలుగో దశ యాత్ర కృష్ణా జిల్లాలో ప్రారంభించారు. ఈ సందర్భంగా అవనిగడ్డలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమని, జనసేన టీడీపీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయని పవన్ కల్యాణ్ అన్నారు.
ఈసారి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా ఉండేందుకే టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నామన్నారు.
పవన్ కల్యాణ్ ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే..
డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థుల కోసం అండగా ఉంటాం.
అవనిగడ్డలో డీఎస్సీ శిక్షణా కేంద్రాలు అనేక సంఖ్యలో ఉన్నాయి. మెగా డీఎస్సీ కోసం వేలామంది ఎదురుచూస్తున్నారు.
వైఎస్. జగన్ సీఎం కాకముందు పాదయాత్రలో అనేక హామీలు ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రభుత్వ ఉద్యోగి కొడుకుగా చెబుతున్నాను, ఇక్కడి అన్నం తిన్నాం. ప్రభుత్వ జీతాలతోనే బతికాం. మీ రుణం తీర్చుకుంటాం. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తాం.
జనసేన పార్టీ పెట్టిన తర్వాత ఈ పదేళ్లలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం.
2014, 2019 ఎన్నికలు చూశాం. ఇది మూడో ఎన్నిక.
2014లో టీడీపీ, బీజేపీలకు మద్దతు ఇచ్చాను. హామీలు నెరవేర్చకుంటే ప్రజల వైపు నిలబడతానని అప్పుడు వాళ్లకు చెప్పాను. ప్రధానమంత్రితోనూ విభేదించాల్సి వచ్చింది.
ప్రత్యేక హోదాకు బదులుగా ప్రత్యేక ప్యాకేజీకి ఎందుకు అంగీకరించారని చంద్రబాబును విభేదించాను.
ఇప్పుడు ప్రత్యేక పరిస్థితుల్లో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని టీడీపీతో పొత్తుకు అంగీకరించాను.
వైసీపీ పతనం మొదలైంది. వారిని అధికారం నుంచి దించడమే జనసేన లక్ష్యం. వచ్చేది మా ప్రభుత్వమే.
రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి కనిపించట్లేదు.
నా దగ్గర డబ్బులు ఉండకూడదని నా సినిమాలను ఆపారు. అయినా, నేను ఎవరినీ అభ్యర్థించలేదు.
నన్ను మొన్న తెలంగాణ నుంచి వస్తుంటే అడ్డుకున్నారు. ఇక్కడ పుట్టిన వాడిని నన్ను ఎలా అడ్డుకుంటారు?
నాకు డబ్బు మీద వ్యామోహం ఉంటే హైదరాబాద్‌లో ఎకరాల కొద్ది భూములు కొనేవాడిని.
నేను ప్యాకేజీలు తీసుకున్నానని వైసీపీ వాళ్లు అంటున్నారు. కానీ, నేను అలా ఎప్పుడూ చేయను.
తెలుగు దేశం పార్టీతో పొత్తు విషయంలో ఒకసారి మాట ఇచ్చానంటే వెనక్కి తగ్గను.
మీకు మాటిస్తున్నా. నేను అద్భుతాలు చేయను. కానీ, మీ సమస్యలను పరిష్కరించి, మీకు అవకాశాలు కల్పించేలా పనిచేస్తా.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














