నాందేడ్: ‘డాక్టర్లు లేరు, మెషీన్లు ఆగిపోయాయి.. పిల్లలు చనిపోయాక మా సంతకాలు తీసుకున్నారు’

యోగేశ్ సాలొంకే
ఫొటో క్యాప్షన్, యోగేశ్ సాలొంకే

‘‘మా పిల్లాడు, ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో పుట్టాడు. కానీ, పుట్టినప్పటి నుంచి అతని పరిస్థితి విషమంగా ఉంది.

బాబును ఇంక్యూబేటర్‌లో పెట్టాలని డాక్టర్ అన్నారు. దాని కోసమే లక్షన్నర ఖర్చు పెట్టాం. ఇంకా ఖర్చు భరించే స్తోమత మాకు లేదు. అందుకే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చాం.

ఇక్కడికి తీసుకొచ్చాక, బాబును ఆసుపత్రిలో చేర్చుకున్నారు. ఏవో మందులు తీసుకురమ్మని రాసిచ్చారు. వాటిని తీసుకొచ్చి ఇచ్చాను. కానీ, రాత్రి పూట మా దగ్గరకు వచ్చి మీ అబ్బాయి చనిపోయాడని చెప్పారు. మా పిల్లాడి కంటే ముందు ఇక్కడ మరో నలుగురు శిశువులు కూడా చనిపోయారు. ఆసుపత్రిలోని మిషన్లు ఆగిపోయాయి. డాక్టర్లు అసలు ఏమీ పట్టించుకోలేదు.’’

తన అన్న కుమారుడి గురించి మాట్లాడుతున్నప్పుడు యోగేశ్ సాలొంకే కళ్లలో నీళ్లు తిరిగాయి.

మహారాష్ట్రలోని నాందేడ్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో అక్టోబర్ 1 నుంచి గడిచిన 48 గంటల్లో 32 మంది చనిపోయారు.

నాందేడ్
ఫొటో క్యాప్షన్, డాక్టర్ శంకర్‌రావు చవాన్ ప్రభుత్వ ఆసుపత్రి

అందులో 12 మంది నవజాత శిశువులు. వారిలో ఒకరు యోగేశ్ అన్న కుమారుడు ఒకరు.

ప్రపంచాన్ని చూడకముందే తమ పిల్లాడు ఈ లోకాన్ని విడిచి వెళ్లిన బాధ ఆయన ముఖంలో స్పష్టంగా కనిపించింది.

డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే పిల్లలు చనిపోయారని తల్లిదండ్రులు ఆరోపించారు.

యోగేశ్ వదినకు ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో సిజేరియన్ ద్వారా ప్రసవం జరిగింది. దీంతో చాలా డబ్బు ఖర్చయ్యింది.

ఇంకా ఖర్చు పెట్టే స్తోమత లేక, నవజాత శిశువును ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు.

‘‘లోపల చూడటానికి మమ్మల్ని అనుమతించలేదు. అక్కడ ఆక్సీజన్ లేదు. మెషీన్లు అన్ని ఆపేసి ఉన్నాయి. ఆసుపత్రిలో సౌకర్యాలు లేవని చెబితే బాబును వేరే దగ్గరికి తీసుకెళ్లేవాళ్లం’’ అని యోగేశ్ చెప్పారు.

బాబు చనిపోయాక ఆసుపత్రి సిబ్బంది కొన్ని పేపర్ల మీద తమ సంతకాలు తీసుకున్నారని యోగేశ్ తెలిపారు.

‘‘డైపర్ మార్చాలంటూ బాబును రాత్రిపూట మాకు ఇచ్చారు. అప్పుడు బాగానే ఉన్నాడు. నోటితో శబ్దాలు చేశాడు. కాస్త ఏడ్చాడు కూడా. డైపర్ మార్చిన తర్వాత మళ్లీ ఐసీయూలోకి తీసుకెళ్లారు. అర్ధగంట తర్వాత వచ్చి మా సంతకాలు తీసుకున్నారు. ఆ తర్వాత కాసేపటికే బాబు చనిపోయాడని చెప్పారు’’ అని ఆయన వివరించారు.

వీడియో క్యాప్షన్, డ్యాన్స్ చేస్తుండగా గుండెపోటుతో యువకులు మృతి చెందడానికి కారణమిదేనా?

నాందేడ్‌లోని డాక్టర్ శంకర్‌రావు చవాన్ ప్రభుత్వ ఆసుపత్రికి చుట్టుపక్కల 70-80 కి.మీ నుంచి రోగులు వస్తుంటారు.

ఆ ప్రాంతంలో మరో పెద్ద ఆసుపత్రి లేకపోవడంతో, అత్యవసర రోగులు ఇక్కడికే వస్తుంటారు.

చనిపోయిన రోగులంతా ఎమర్జెన్సీ రోగులే అని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

వీటితో పాటు ఆసుపత్రిలోని సిబ్బంది బదిలీలతో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారినట్లు డాక్టర్ వాకోడే చెప్పారు.

అదే సమయంలో హాఫ్‌కిన్ ఇన్‌స్టిట్యూట్ నుంచి మందుల కొనుగోళ్లు లేకపోవడంతో ఆసుపత్రిలో ఔషధాల కొరత ఏర్పడింది. అంతేకాకుండా ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య పెరుగుతుండటంతో బడ్జెట్ తగ్గుతోందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

‘‘గత ఒకట్రెండు రోజుల్లో రోగుల సంఖ్య అకస్మాత్తుతగా పెరిగింది. వారిలో చాలామంది ఆరోగ్యం విషమ పరిస్థితుల్లో ఉన్నవారే. 12 మంది నవజాత శిశువులు చనిపోయారు. వీరిలో 8 మందిని చికిత్స కోసం బయటకు తీసుకొచ్చారు. వారంతా తక్కువ బరువు ఉన్న పిల్లలు. ఇందులో కొందరు నెలలు నిండక ముందే పుట్టినవారు’’ అని వైద్యాధికారి గణేశ్ మనుర్కర్ చెప్పారు.

ఆసుపత్రి వర్గాలు ఏం చెబుతున్నారు?

ఈ ఘటనపై శంకర్‌రావు చవాన్ ఆసుపత్రి వివరణ ఇచ్చింది.

ఆసుపత్రిలోని షీట్ ప్రకారం, ‘‘సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 1 వరకు 24 మంది రోగులు మృతి చెందారు. వీరిలో చాలామంది విషమ పరిస్థితుల్లో ప్రైవేట్ ఆసుపత్రుల నుంచి వచ్చారు.

ఆసుపత్రిలో అవసరమైన మందుల స్టాక్ ఉంది. ఆసుపత్రి కోసం ఈ ఏడాదికి రూ. 12 కోట్ల బడ్జెట్ ఇచ్చారు. మరో రూ. 4 కోట్ల నిధులు కూడా మంజూరయ్యాయి. గత రెండు రోజుల్లో జిల్లా నుంచే కాకుండా బయటి నుంచి కూడా ఎక్కువ మంది రోగులు ఆసుపత్రికి వచ్చారు. అందువల్ల మరణాల రేటు ఎక్కువగా ఉంది.

ఆసుపత్రికి వచ్చిన రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు వైద్యులు, సిబ్బంది కృషి చేస్తున్నారు’’ అని ఆ షీట్‌లో పేర్కొన్నారు.

ఏక్‌నాథ్ శిందే

విచారణ జరిపిస్తాం: ముఖ్యమంత్రి

అక్టోబర్ 3న రాష్ట్ర మంత్రి మండలి సమావేశం తర్వాత ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే మీడియాతో మాట్లాడారు.

నాందేడ్ ఆసుపత్రి ఘటన గురించి కేబినేట్ భేటీలో చర్చించినట్లు ఆయన చెప్పారు.

‘‘నాందేడ్ ప్రభుత్వ ఆసుపత్రి ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ప్రాథమిక సమాచారం ప్రకారం, చనిపోయిన వారిలో పిల్లలతో పాటు వృద్ధులు, గుండె సమస్యలతో ఉన్నవారు, ప్రమాదాల్లో గాయపడినవారు ఉన్నారు. ఈ మొత్తం అంశంపై విచారణ జరుపుతాం’’ అని శిందే తెలిపారు.

ఆసుపత్రిలో సరిపడా సిబ్బంది, మందులు ఉన్నాయని ఆయన అన్నారు.

ఆసుపత్రి నిర్వహణకు ఇప్పటికే రూ. 12 కోట్లు ఇచ్చినట్లు చెప్పారు.

అంతకుముందే అంటే అక్టోబర్ 2న కాంగ్రెస్ నాయకుడు అశోక్ చవాన్, ఆసుపత్రిని సందర్శించారు.

బదిలీల కారణంగా ఆసుపత్రిలో నర్సుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని అశోక్ చవాన్ అన్నారు.

వైద్యుల కొరత కూడా ఉంది. ఆసుపత్రిలో చాలా మెషీన్లు నిలిపేసి ఉన్నాయి. సరిపడా బడ్జెట్ రాలేదు. 500 మంది రోగుల సామర్థ్యంతో కూడిన ఆ ఆసుపత్రిలో 1200 మంది ఉన్నారు.

నెలన్నర క్రితం, థానేలో ఒక్క రాత్రిలోనే 18 మరణాలు సంభవించిన ఘటన జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు అలాంటిదే నాందేడ్‌లో జరిగింది.

థానేలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆసుపత్రిలో రోగుల్ని పరీక్షించేందుకు వైద్యులు సరైన సమయానికి రావడం లేదని, మందులు ఇవ్వడం లేదని అప్పుడు ఆరోపణలు వచ్చాయి.

వీడియో క్యాప్షన్, ఇది లక్షలాది మంది ప్రాణాలు కాపాడుతుందన్న WHO

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)