ఒకేసారి రెండు కంటే ఎక్కువ చోట్ల పోటీ చేయకూడదా? ఎలక్షన్ కమిషన్ ఏమంటోంది? సుప్రీంకోర్టు ఏం చెప్పింది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అరుణ్ శాండిల్య
- హోదా, బీబీసీ ప్రతినిధి
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయనుండడం రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది.
ఆయన తన సిటింగ్ స్థానం గజ్వేల్ నుంచే కాకుండా సమీపంలోని కామారెడ్డి నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేయనున్నారు.
బీఆర్ఎస్ పార్టీ తొలి విడతలో 115 అసెంబ్లీ స్థానాలకు ప్రకటించిన అభ్యర్థుల జాబితా ప్రకారం కేసీఆర్ రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయడం ఖరారైనట్లే.
అయితే, ఏ అభ్యర్థి అయినా రెండు చోట్ల నుంచి పోటీ చేసి రెండు చోట్లా గెలిస్తే ఓ స్థానాన్ని వదులుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఆ నియోజకవర్గానికి మళ్లీ ఎన్నికలు నిర్వహించాల్సిందే.
దీంతో ఇలా ఒకటి కంటే ఎక్కువ స్థానాల నుంచి పోటీ చేయడం వల్ల ఖజానాకు నష్టమేర్పడుతుందని, ప్రజాధనం వృథా అవుతుందని, ఎన్నికల నిర్వహణకు మళ్లీ విలువైన మానవ వనరులు కూడా వృథా అవుతాయన్న వాదన చాలా కాలంగా ఉంది.
అంతేకాదు.. ఒక ఓటరు ఒక అభ్యర్థికి మాత్రమే ఓటు వేయాలన్న నిబంధన ఉన్నప్పుడు అభ్యర్థులు రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయడం సరైనదేనా అనే చర్చ కూడా ఉంది.
అయితే, ఇలా రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నది కేసీఆర్ ఒక్కరే కాదు.
ఇంతకుముందు నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ, ఇందిరా గాంధీ, ఎన్టీఆర్, పీవీ నరసింహారావు వంటి ఎందరో నాయకులు ఒకటి కంటే ఎక్కువ నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు.
ఇంతకూ భారత దేశంలో శాసనసభ, లోక్‌సభ ఎన్నికలలో ఒక అభ్యర్థి గరిష్ఠంగా ఎన్ని స్థానాలలో పోటీ చేయొచ్చు? ప్రజా ప్రాతినిధ్య చట్టం ఏం చెప్తోంది?
గతంలో ఎలక్షన్ కమిషన్ ఈ విషయంలో ఎలాంటి సిఫారసులు చేసింది? లా కమిషన్ ఎలాంటి సూచనలు చేసింది? సుప్రీంకోర్టు ఏం చెప్పింది?

ఫొటో సోర్స్, Getty Images
ఈ ఏడాది(2023) ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు ఈ విషయంపై స్పష్టత ఇచ్చింది. ఎన్నికలలో ఒకేసారి రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన ఓ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు ఆ అభ్యర్థనను తిరస్కరించింది.
ఒక అభ్యర్థి ఏకకాలంలో రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయడానికి ఎలాంటి అభ్యంతరాలు లేవని స్పష్టం చేసింది.
ఒకేసారి రెండు నియోజకవర్గాల నుంచి పోటీచేసేందుకు అనుమతిస్తున్న ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 33(7) చెల్లుబాటు కాదని ప్రకటించాలంటూ దాఖలైన ఆ పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలో ధర్మాసనం విచారించింది.
ఆ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాది గతంలో లా కమిషన్ చేసిన సిఫారసులను ధర్మాసనానికి గుర్తు చేశారు. ఒక అభ్యర్థి ఒక నియోజకవర్గం నుంచి మాత్రమే పోటీ చేసేలా ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 33(7)ని సవరించాంటూ లా కమిషన్ గతంలో సిఫారసు చేసిందని ఆయన చెప్పారు.
అయితే, లా కమిషన్ చేసింది సిఫారసు మాత్రమేనని, రాజ్యాంగంలోని మూడో భాగాన్ని(ప్రాథమిక హక్కులు) ఉల్లంఘించనంతవరకు ఇలా రెండేసి చోట్ల నుంచి పోటీ చేయడం రాజ్యాంగ విరుద్ధమేమీ కాదని కోర్టు అభిప్రాయపడింది.
అంతేకాదు, రాజకీయ ప్రజాస్వామ్యం, పార్లమెంటరీ సార్వభౌమత్వానికి సంబంధించిన విషయమని చెప్పింది.
కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది?
వేర్వేరు నియోజకవర్గాల నుంచి ఒకేసారి అభ్యర్థులు పోటీ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు 2018లో విచారించిన సమయంలో కేంద్రం తన అభిప్రాయాన్ని చెప్పింది.
ఒక అభ్యర్థి ఒక నియోజకవర్గం నుంచి మాత్రమే పోటీ చేయాలన్న నిబంధన తేవాలంటే ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 33(7)ని సవరించాలని, అది రాజకీయ వ్యవస్థలో అభ్యర్థుల ఎంపిక అవకాశాలను తగ్గించేస్తుందని, ఎన్నికలలో పోటీ చేయడానికి వ్యక్తులకు ఉండే హక్కును కూడా అది పరిమితం చేస్తుందని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో వాదించింది.
సెక్షన్ 33(7)ని సవరించాల్సిన అవసరం లేనేలేదంటూ కేంద్రం కోర్టులో చెప్పింది.

ఫొటో సోర్స్, Getty Images
ఎన్నికల కమిషన్ ఏం చెప్పింది?
కేంద్రం అభిప్రాయానికి పూర్తిగా విరుద్ధమైన అభిప్రాయం వ్యక్తం చేసింది ఎన్నికల కమిషన్. 2018లో ఈ విషయంలో వాదనలు జరిగినప్పుడే ఎన్నికల కమిషన్ కూడా సుప్రీంకోర్టులో తన వాదన వినిపించింది.
సెక్షన్ 33(7)ను సవరించి ఒక అభ్యర్థి ఒక నియోజకవర్గం నుంచి మాత్రమే పోటీ చేసేలా నిబంధనలు మార్చాలని 2004లోనే తాము సిఫారసు చేసినట్లు ఎలక్షన్ కమిషన్ చెప్పింది.
2016లో నజీమ్ జైదీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా ఉన్న కాలంలో కమిషన్ మరోసారి ఎన్నికల సంస్కరణలను ప్రతిపాదించింది. అందులో ఎన్నికల సంస్కరణల కోసం చేయాల్సిన కొన్ని రాజ్యాంగ సవరణలు, ప్రజా ప్రాతినిధ్య చట్టానికి సవరణలు ప్రతిపాదించింది.
అందులో భాగంగానే ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 33(7)ని సవరించి ఒక అభ్యర్థి ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేసేలా నిబంధనలు మార్చాలని 2004లో చేసిన సూచనను ఈ ప్రతిపాదనలలోనూ పేర్కొంది.
అలా కుదరని పక్షంలో, ప్రస్తుతం ఉన్న నిబంధనలే కనుక అమలులో ఉంటే రెండు చోట్ల నుంచి పోటీ చేసి రెండు చోట్లా గెలిచిన అభ్యర్థులు అందులో ఒకటి వదులుకుంటే ఆ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నిక ఖర్చును భరించాలని కమిషన్ ప్రతిపాదించింది.
అది అసెంబ్లీ నియోజకవర్గమైతే రూ. 5 లక్షలు, లోక్ సభ నియోజకవర్గమైతే రూ. 10 లక్షలు ఖర్చు భరించాలని కమిషన్ ప్రతిపాదించింది.

ఫొటో సోర్స్, Getty Images
లా కమిషన్ మాటేమిటి?
ఈ విషయంలో గతంలో లా కమిషన్ కూడా ఎలక్షన్ కమిషన్ సిఫారసుకు మద్దతు పలికింది.
ఒక అభ్యర్థి ఒకసారి ఒక నియోజకవర్గం నుంచి మాత్రమే పోటీ చేసేలా ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని సవరించాలన్న ఎలక్షన్ కమిషన్ సిఫారసుతో లా కమిషన్ ఏకీభవించింది.
1999లో వాజపేయీ ప్రభుత్వంలో రాం జెఠ్మలానీ కేంద్ర న్యాయ శాఖగా మంత్రిగా ఉన్న సమయంలో జస్టిస్ బీపీ జీవన్ రెడ్డి నేతృత్వంలోని లా కమిషన్ ‘ఎన్నికల సంస్కరణలు’పై తన నివేదిక సమర్పించింది.
అందులో ఎలక్షన్ కమిషన్ సిఫారసు చేసినట్లు ఒక అభ్యర్థిని ఒకసారి ఒక నియోజకవర్గంలో పోటీకి పరిమితం చేయడాన్ని లా కమిషన్ సమర్థించింది.
అయితే, రెండో చోట్ల గెలిచిన తరువాత ఖాళీ చేసిన సీటుకు జరిగే ఉప ఎన్నిక ఖర్చును భరించాలన్న సూచనకు మాత్రం లా కమిషన్ మద్దతు పలకలేదు.

ఫొటో సోర్స్, Getty Images
1996కి ముందు ఎన్ని నియోజకవర్గాల నుంచైనా పోటీ..
ఒక అభ్యర్థి ఒకసారి రెండు నియోజవర్గాల నుంచి పోటీ చేసేందుకు ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 33(7) అనుమతిస్తుంది. ఈ సెక్షన్‌ను 1996లో చట్ట సవరణ ద్వారా జోడించారు.
చట్టంలో ఈ సెక్షన్‌ను సవరించడానికి ముందు.. అంటే 1996కి ముందు ఎన్నికలలో అభ్యర్థులు ఒకేసారి ఎన్ని నియోజకవర్గాల నుంచైనా పోటీ చేసే వెసులుబాటు ఉండేది.
ఈ సవరణ తరువాత రెండు నియోజకవర్గాల పరిమితి విధించారు.
అయితే, ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 70 ప్రకారం అసెంబ్లీ ఎన్నికలలోనైనా, లోక్ సభ ఎన్నికలలోనైనా అభ్యర్థి రెండు చోట్ల నుంచి గెలిచినప్పటికీ ఒక నియోజకవర్గానికి మాత్రమే ప్రాతినిధ్యం వహించాల్సి ఉంటుంది.
అంటే, రెండింట్లో ఒక నియోజకవర్గానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది.
ఎవరు వేశారీ కేసు?
వోటర్స్ పార్టీ 2014లో సుప్రీంకోర్టులో ఈ కేసు వేసింది.
ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 33లోని సబ్ సెక్షన్లు 6, 7, సెక్షన్ 70లను సవాల్ చేస్తూ ఆ పార్టీ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది.
ఇవి కూడా చదవండి:
- హైదరాబాద్‌లో పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు ఎలాంటి భోజనం వడ్డిస్తున్నారు? సోషల్ మీడియాలో చర్చకు కారణం ఏంటి?
- తెలంగాణలో పసుపు బోర్డ్ ఏర్పాటైతే రైతులకు కలిగే లాభమేంటి?
- Sexual Health: సెక్స్‌లో ఎంతసేపు పాల్గొన్నా భావప్రాప్తి కలగకపోవడానికి కారణమేంటి? ఇది వ్యాధి లక్షణమా?
- ‘సెక్స్ కోరికలు పెంచే ఆ హార్మోన్ తీసుకున్నాక నాకు కొడుకు పుట్టాడు’
- పువ్వును కాయగా మార్చే యంత్రం
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














