'ఇండియా ఔట్' నినాదం ఇచ్చిన మహమ్మద్ మయిజ్జు మాల్దీవుల అధ్యక్షుడిగా గెలిచారు... భారత్‌పై దీని ప్రభావం ఎంత?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ప్రియాంక ఝా
- హోదా, బీబీసీ ప్రతినిధి
మాల్దీవుల అధ్యక్ష ఎన్నికల్లో మహమ్మద్ మయిజ్జు విజయం సాధించారు. అదే సమయంలో, భారత్‌కు అత్యంత సన్నిహితుడిగా భావించే ప్రస్తుత అధ్యక్షుడు ఇబ్రహీం మహమ్మద్ సోలిహ్ ఓడిపోయారు.
సెప్టెంబర్ 9న మాల్దీవుల అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో ఎవరికీ 50 శాతానికి మించి ఓట్లు రాకపోవడంతో సెప్టెంబర్ 30న రెండోవిడత పోలింగ్ నిర్వహించారు.
మహమ్మద్ మయిజ్జుకి చైనాతో సన్నిహిత సంబంధాలున్న ప్రోగ్రెసివ్ పార్టీ ఆఫ్ మాల్దీవ్స్ (పీపీఎం) నేతృత్వంలోని మిత్రపక్షాల మద్దతు లభించింది.
దేశ విధానపరమైన నిర్ణయాల్లో భారత్ జోక్యం పెరిగిపోయిందని, అది మాల్దీవుల సార్వభౌమత్వాన్ని, స్వతంత్రతకు గొడ్డలిపెట్టుగా మారిందని మయిజ్జు ఎన్నికల ప్రచారంలో ఆరోపణలు చేశారు.
ఇబ్రహీ సోలిమ్ హయాంలో భారత్, మాల్దీవుల మధ్య సంబంధాలు మరింత బలపడ్డాయి.
అయితే, ఇకపై మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మయిజ్జు. ఎన్నికల్లో విజయం సాధించిన మయిజ్జుకి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
వ్యూహాత్మక కారణాల రీత్యా మాల్దీవుల అధ్యక్ష ఎన్నికలను భారత్, చైనా ఆసక్తిగా గమనించాయి. అయితే, నిపుణులకు ఈ ఎన్నికల ఫలితాలు భారత్‌కు శుభసూచికంగా కనిపించడం లేదు.

ఫొటో సోర్స్, Getty Images
భారత్‌పై ఎలాంటి ప్రభావం?
దాదాపు వెయ్యికి పైగా దీవులున్న దేశం మాల్దీవులు. ఆ దేశ జనాభా సుమారు 5 లక్షల 57 వేల మంది. అయితే, ఈ చిన్న దేశం వ్యూహాత్మకంగా భారత్, చైనాకి కీలకం.
భౌగోళికంగా హిందూ మహాసముద్రంలో ఉండే మాల్దీవులు రెండు దేశాలకూ వ్యూహాత్మక ప్రదేశం. చైనా తన నౌకాదళాన్ని విస్తరిస్తోంది. మాల్దీవుల్లో తమ పట్టు పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది.
చైనా దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు భారత్ ప్రయత్నాలు చేస్తోంది.
గల్ఫ్ దేశాల నుంచి వచ్చే చమురు రవాణా ఈ మార్గంలోనే జరుగుతుంది. అందువల్ల, ఈ మార్గాన్ని తమ గుప్పిట్లో పెట్టుకోవాలని చైనా భావిస్తోంది.
పదవీచ్యుతుడైన మాల్దీవుల అధ్యక్షుడు సోలిహ్ భారత్‌తో సన్నిహిత సంబంధాలు నెరిపేందుకు ప్రాధాన్యమిచ్చేవారు. మాల్దీవియన్ డెమొక్రటిక్ పార్టీకి చెందిన సోలిహ్ తన హయాంలో భారత్‌కే తొలిప్రాధాన్యం 'ఇండియా ఫస్ట్' విధానాన్ని అమలు చేశారు.
అయితే, ఈ ఎన్నికల్లో 54 శాతం ఓట్లు సాధించి నూతన అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్న మయిజ్జు తన ఎన్నికల ప్రచారంలో 'ఇండియా ఔట్' నినాదమిచ్చారు. ఆయన చైనాతో మెరుగైన సంబంధాలు కొనసాగించేందుకు అనుకూలంగా ఉన్నారు.
ఎన్నికల ప్రచారంలో ప్రోగ్రెసివ్ పార్టీ ఆఫ్ మాల్దీవ్స్ (పీపీఎం), దాని మిత్రపక్షాలు భారత్‌పై బహిరంగంగానే విమర్శలు చేశాయి.
భారత మిలిటరీ అధికారులను, పరికరాలను మాల్దీవుల నుంచి ఖాళీ చేయించాలన్నదే ఆయా పార్టీల ముఖ్య ఉద్దేశం. భారత బలగాలు మాల్దీవుల నుంచి వెళ్లిపోవాలని పీపీఎం, దాని మిత్రపక్షాలు డిమాండ్ చేశాయి.

ఫొటో సోర్స్, Getty Images
పీపీఎం నేత అబ్దుల్లా యమీన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో భారత్‌కు వ్యతిరేకంగా వందలాది మంది వీధుల్లోకి వచ్చి నిరసనలు నిర్వహించారు.
దీంతో అప్పటి అధ్యక్షుడు యమీన్ భారత్ తన రెండు హెలికాప్టర్లు, డొర్నియర్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను వెనక్కి తీసుకోవాలని కోరారు.
ఈ హెలికాప్టర్లను మాల్దీవుల్లో సెర్చ్, రెస్క్యూ ఆపరేషన్ల కోసం భారత్ మోహరించింది. అయితే, ఆ హెలికాప్టర్లను భారత్ బహుమతిగా ఇచ్చినట్టైతే, దాని పైలట్లు మాల్దీవులకు చెందిన వారే ఉండాలని, భారత్‌కు చెందినవారు ఉండనక్కర్లేదని ఆ దేశం తెలిపింది.
మాల్దీవుల్లో గత ప్రభుత్వం అనుసరించిన విధానాలనే మహమ్మద్ మయిజ్జు కూడా అనుసరించే పరిస్థితి కనిపిస్తోందని దిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ ప్రొఫెసర్, విదేశీ వ్యవహారాల నిపుణులు అర్వింద్ యేలారి అభిప్రాయపడ్డారు.
''ఈ ఎన్నికల ఫలితాలు భారత్‌కు అనుకూలంగా లేవు. ఎందుకంటే మయిజ్జు కూటమికి చైనాకి మద్దతు ఇచ్చిన చరిత్ర ఉంది. మాజీ అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్ కూడా చైనాకి సన్నిహితుడిగా పరిగణిస్తారు.
మయిజ్జుకి కూడా చైనాకు అనుకూలమనే పేరుంది. భారత సైన్యాన్ని మయిజ్జు తీవ్రంగా వ్యతిరేకించారు. మయిజ్జు విజయం తప్పకుండా చైనాకు అనుకూలమే. మాల్దీవులపై పట్టు సాధించేందుకు చైనా నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంది. చివరికి అదే జరిగింది. మాల్దీవుల్లో భారత్ పట్టుపై దెబ్బ కొట్టేందుకు చైనా ప్రయత్నిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో మయిజ్జు విజయం ఒక అసమతుల్య స్థితికి కారణమవుతుంది. అది కచ్చితంగా చైనాకి అనుకూలంగా మారుతుంది'' అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
'ఇండియా ఔట్' సాధ్యమేనా?
అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో మాల్దీవుల మాజీ అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్ స్థానిక మీడియాతో మాట్లాడుతూ మాల్దీవుల్లో భారత్ జోక్యాన్ని తగ్గించాలని, భారత్‌ను ఓడించాలని అన్నారు.
అబ్దుల్లా యమీన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో మాల్దీవులు భారత్‌కు దూరమై చైనాకు దగ్గరైంది.
యమీన్ ప్రస్తుతం అవినీతి, మనీలాండరింగ్ కేసుల కారణంగా జైల్లో ఉన్నారు. ఇండియా ఔట్ ప్రచారం వెనక యమీన్ హస్తం ఉంటుందని భావిస్తున్నారు.
''గత 15 నుంచి 20 ఏళ్లుగా మాల్దీవుల రాజకీయాలు భారత్ వ్యతిరేక, లేదంటే చైనా వ్యతిరేక విధానాల చుట్టూనే తిరుగుతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో మళ్లీ యమీన్ పార్టీ అధికారంలోకి రావడమంటే, గత ప్రభుత్వ విధానాలు తిరిగి అమల్లోకి రావడమే. అయితే, అవి భారత్‌కు వ్యతిరేక విధానాలు'' అని నిపుణులు చెబుతున్నారు.
భారత బలగాలను మాల్దీవుల్లో మోహరించడం ద్వారా సోలిహ్ ప్రభుత్వం మాల్దీవుల సార్వభౌమాధికారాన్ని ధిక్కరించిందని యమీన్, మిత్రపక్షాలు ఆరోపణలు గుప్పించాయి.
మయిజ్జు విజయం భారత్‌కు ఆందోళన కలిగించే అంశమని జామియా మిల్లియా యూనివర్సిటీలో నెల్సన్ మండేలా సెంటర్ ఫర్ పీస్ అండ్ కాన్‌ఫ్లిక్ట్ రిజల్యూషన్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రేమానంద్ మిశ్రా అన్నారు.
''ప్రస్తుతం భారత్ గ్లోబల్ సౌత్ దేశాల ప్రతినిధిగా ఎదుగుతోంది. మరీముఖ్యంగా గత రెండుమూడేళ్ల నుంచి ఆ పరిస్థితి కనిపిస్తోంది. బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్ వంటి పొరుగు దేశాలు అంతర్జాతీయ వేదికలపై భారత్‌ను తమ ప్రతినిధిగా భావిస్తున్నాయి. వాటితో పాటు అమెరికాతోనూ భారత్‌కు సత్సంబంధాలున్నాయి. అందువల్ల, భారత్‌ను తక్కువ అంచనా వేయడం మాల్దీవులకు అంత చిన్నవిషయం కాదు'' అని ఆయన చెప్పారు.
ఈ గ్లోబల్ సౌత్ అనే పదం లాటిన్ అమెరికా, ఆఫ్రికా, ఆసియా, ఓషెయేనియా ప్రాంతాలను సూచించేందుకు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఈ ప్రాంతాల్లోని దేశాల్లో ఎక్కువ శాతం తక్కువ ఆదాయ దేశాలు. సాంస్కృతికంగా, రాజకీయంగా వెనుకబాటులో ఉన్న దేశాలు.
''ఎన్నికల్లో సమయంలో ఇచ్చే నినాదాలకు, విధానపరమైన నిర్ణయాలకు చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే, నిర్ణయాలు తీసుకునేప్పుడు జవాబుదారీతనం పరిగణనలోకి వస్తుంది. రాజకీయాలు ఎప్పటికీ ఆర్థిక వ్యవస్థపై పెత్తనం చెలాయించలేవు. మున్ముందు మాల్దీవుల్లో భారత్ చేపట్టిన అభివృద్ధి పనులన్నీ అలాగే కొనసాగుతాయి. ఇక భారత్ వ్యతిరేక నినాదాలిచ్చిన వారి జోరు కూడా కాస్త తగ్గుతుంది'' అని డాక్టర్ ప్రేమానంద్ మిశ్రా చెప్పారు.

ఫొటో సోర్స్, @PPM_HULHUMALE
దేశ రాజకీయాల్లో సాధారణంగా స్థానిక విషయాలే ఎక్కువగా ప్రభావం చూపిస్తాయి. కానీ, ఆరు లక్షల కంటే తక్కువ జనాభా ఉన్న మాల్దీవుల్లో మాత్రం భారత్, చైనా పేర్తే మళ్లీ మళ్లీ వినిపిస్తున్నాయి.
మొదటి విడత ఎన్నికల ప్రచారంలో భారత్‌కు వ్యతిరేకంగా ఫేక్ న్యూస్ ఎంత కీలకంగా మారిందో ఇంగ్లీష్ దినపత్రిక ది హిందూ కథనం ప్రచురించింది.
మాల్దీవుల ఎన్నికల ప్రచారంలో భారత్‌లో ముస్లింలతో వ్యవహరిస్తున్న తీరు, మణిపూర్ హింస, ముస్లిం ఎంపీపై బీజేపీ నేత రమేష్ బిధూరి చేసిన అనుచిత వ్యాఖ్యలకు సంబంధించిన పోస్టులు వాట్సాప్ ద్వారా నేరుగా ఓటర్లకు వెళ్లాయి.
ఇదే ఎన్నికల ప్రచారంలో పీపీఎంకు అస్త్రంగా మారిందని ఆ కథనం పేర్కొంది.
మాల్దీవుల జనాభాలో 98 శాతం మంది సున్నీ ముస్లింలు. ఎన్నికలకు ముందు వారు భారత్‌లో ముస్లింల స్థితిగతుల గురించి తెలుసుకునేందుకు ఎంత ఆసక్తిగా ఉన్నారో కూడా ఈ కథనం చెబుతోంది.
అయితే, భారత్ అంతర్గత విషయాలు మాల్దీవుల ఎన్నికల్లో ప్రభావం చూపించాయా?
ఈ ప్రశ్నలకు ప్రేమానంద్ మిశ్రా సమాధానమిస్తూ ''ప్రజాకర్షక రాజకీయాల్లో ఇలాంటివి కొన్ని కచ్చితంగా ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఏదైనా సమస్య ఉంటే దానిని మనం ఎలా వాడుకోవాలా అని రాజకీయ పార్టీలు చూస్తాయి. మాల్దీవుల ఎన్నికల నేపథ్యంలో చూస్తే అవి దేశంలో జరుగుతున్న ఎన్నికలు. అయితే, ఇండియా ఔట్ ప్రచారం నిర్వహించడానికి కారణమేంటి?
సార్వభౌమాధికారం అనేది తప్పకుండా పరిగణించాల్సిన విషయమే కానీ, ప్రజలు తమ మతవిశ్వాసాలను అర్థం చేసుకున్నంతగా సార్వభౌమాధికారం గురించి అర్థం చేసుకోరు. తమ ఉనికికి ముప్పు వస్తుందని భావించినప్పుడు, వాటి ప్రభావం ఎన్నికలపై తప్పకుండా ఉంటుంది. అయితే, ఈ ఎన్నికల్లో దానిని అంత విస్తృతంగా ఉపయోగించలేదని నేను భావిస్తున్నా'' అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
మాల్దీవుల్లో చైనా ప్రభావం పెరగనుందా?
గత పదేళ్లలో మాల్దీవులకు భారత్ రెండు హెలికాప్టర్లు, ఒక చిన్న ఎయిర్‌క్రాఫ్ట్ ఇచ్చింది. ఆ ఇండియన్ ఎయిర్‌క్రాఫ్ట్ కార్యకలాపాలు నిర్వహించేందుకు భారత్‌కు చెందిన 75 మంది ఆర్మీ అధికారులు మాల్దీవుల్లో ఉన్నారని మాల్దీవ్స్ డిఫెన్స్ ఫోర్స్ 2021లో తెలిపింది.
కోవిడ్ మహమ్మారి సమయంలో కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను మాల్దీవులకు భారత్ ఉచితంగా అందజేసింది. ఇరుదేశాల మధ్య నిరుడు దాదాపు 500 మిలియన్ డాలర్ల విలువైన వాణిజ్య కార్యకలాపాలు జరిగాయి.
ఈ ఏడాది హనిమధూ అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కూడా హాజరయ్యారు. ఆ తర్వాత భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మూడురోజుల మాల్దీవుల పర్యటన జరిగింది.
అయితే, 2013 నుంచి మాల్దీవుల ఆర్థిక రంగంలో చైనా ప్రభావం పెరుగుతూ వస్తోంది. పర్యాటకం, పెట్టుబడులకు చైనా ప్రధాన వనరుగా మారింది.
ఇన్‌ఫ్రాస్టక్చర్ ప్రాజెక్ట్స్ కోసం మాల్దీవుల ప్రభుత్వం చైనా నుంచి భారీ మొత్తంలో రుణం తీసుకుంది. చైనా నుంచి దాదాపుగా 3.4 బిలియన్ డాలర్లు అప్పు తీసుకున్నట్లు నివేదిక చెబుతోంది.
2017లో ఇరుదేశాల మధ్య స్వేచ్ఛావాణిజ్య ఒప్పందాలు జరిగాయి. అప్పట్లో ఆ విధానాలను ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి.
అయితే, యమీన్ హయాంలో జరిగిన తప్పులు మళ్లీ జరగకుండా మయిజ్జు ప్రభుత్వం నివారించొచ్చని చైనా, మాల్దీవుల సంబంధాల నిపుణులు చెబుతున్నారు.
''ఒక్క యమీన్ ప్రభుత్వం మినహా, మిగిలిన అన్ని ప్రభుత్వాలు భారత్‌తో సత్సంబంధాలు కొనసాగించేందుకు ప్రాధాన్యం ఇచ్చాయి. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. మయిజ్జు తన ప్రచారంలో ఇండియా వ్యతిరేక నినాదాలిచ్చినప్పటికీ, హిందూ మహాసముద్రంలో భారత్ ముఖ్యమైన భాగస్వామి అని ఇప్పుడాయన సలహాదారులు చెబుతున్నారు'' అని శివ్ నాడార్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్‌లో ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ గవర్నెన్స్ స్టడీస్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ జబిన్ టి జాకబ్ చెప్పారు.
ప్రచారంలో ఏం జరిగిందో పక్కనబెడితే క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో వేచిచూడాలని జాకబ్ అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి:
- జంజీరా కోట: ఛత్రపతి శివాజీ ఎంత ప్రయత్నించినా ఈ దుర్గాన్ని ఎందుకు జయించలేకపోయారు?
- 'డబుల్ బెడ్రూం ఫ్లాట్‌లో 20 మందితో కలిసి ఉండాల్సి వచ్చింది...' లండన్‌లో విద్యార్థుల కష్టాలు
- ఏలియన్లను ఎప్పుడు కనిపెడతాం? వారికి ఇంకెంత దూరంలో ఉన్నాం?
- పాలస్తీనా ఖైదీతో సెక్స్‌లో పాల్గొన్నారని ఇజ్రాయెల్ మహిళా సైనికులపై ఆరోపణలు.. ప్రభుత్వం ఏం చేసింది?
- చిత్తూరు: భార్యతో ఉన్నప్పుడు పురుషుడు.. బాయ్‌ఫ్రెండ్‌ను కలిస్తే మహిళ














