ఇందూరు సభ: ‘మీకో రహస్యం చెప్పనా’ అంటూ కేసీఆర్‌పై ప్రధాని మోదీ ఆ వ్యాఖ్యలు ఎందుకు చేశారు?

నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, Twitter/BJPTelangana

    • రచయిత, ప్రవీణ్ శుభం, బళ్ల సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీఆర్ఎస్‌పై, పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుపై ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ‘ఇందూరు జనగర్జన’ బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.

‘మీకో రహస్యం చెప్పనా’ అంటూ మోదీ చేసిన ఈ వ్యాఖ్యలను అబద్ధాలంటూ బీఆర్‌ఎస్ తీవ్రంగా ఖండించింది.

కేసీఆర్ ఎన్డీఏలో చేరతానన్నారని, అయితే తానే ఒప్పుకోలేదని ప్రధాని మోదీ సభలో చెప్పారు.

ఈ అంశంలో బీజేపీ, బీఆర్‌ఎస్ పరస్పరం విమర్శలు గుప్పించుకొంటుండగా, ఈ రెండు పార్టీలపై కాంగ్రెస్ విమర్శలు చేసింది.

''ఇంతకుముందెన్నడూ చెప్పని రహస్యం ఒకటి చెబుతాను. జీహెచ్ఎంసీ ఎన్నికల(2020) అనంతరం కేసీఆర్ దిల్లీ వచ్చి, నన్ను కలిశారు. చాలా ప్రేమను చూపించారు. మీ నేతృత్వంలో దేశం ప్రగతిపథంలో నడుస్తోంది, ఎన్డీఏలో చేరుతామని కోరారు. నేను తిరస్కరించా'' అని మోదీ సభలో చెప్పారు.

ఆ ప్రతిపాదన తిరస్కరించడంతో కేసీఆర్ చాలా రోజుల వరకు తనను కలవలేదని ఆయన అన్నారు.

కొన్ని రోజుల తర్వాత మళ్లీ వచ్చి కేసీఆర్ కుమారుడు, మంత్రి కేటీ రామారావు గురించి చెప్పారని తెలిపారు.

‘‘ఇప్పటికే చాలా చేశాను. కేటీఆర్‌కు బాధ్యతలు అప్పగిస్తామని కేసీఆర్ నాతో చెప్పారు. మీరేమన్నా రాజులా, మహారాజులా? అని నేను ప్రశ్నించాను. అప్పటి నుంచి నన్ను కలవలేదు’’ అని మోదీ వ్యాఖ్యానించారు.

''కేంద్రం ద్వారా తెలంగాణకు చేయాల్సిందంతా చేస్తున్నాం. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వానికి కోట్ల నిధులిచ్చాం. కేంద్రం నిధులను బీఆర్ఎస్ దోచుకుంది. అవినీతిని వాళ్లు ప్రోత్సహిస్తున్నారు. వాళ్లు ప్రజాస్వామ్యాన్ని కుటుంబవాదంగా మార్చారు'' అని ఆరోపించారు మోదీ.

బీజేపీ ఇందూరు సభ

ఫొటో సోర్స్, Twitter/Bjptelangana

బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ఒప్పందం: మోదీ

''తెలంగాణను దోచుకోవడమే బీఆర్ఎస్ పనిగా పెట్టుకుంది. కేంద్ర ప్రభుత్వ నిధులను సైతం దోచేస్తోంది. తెలంగాణ ప్రభుత్వంలోని ఉన్నత పదవుల్లో సామాన్యులకు తావు లేకుండా పోయింది. కేవలం కుటుంబ సభ్యులకే అన్ని పదవులు దక్కుతున్నాయి. ఎందరో త్యాగాలతో ఏర్పడ్డ తెలంగాణలో కుటుంబ వాదాన్ని బీఆర్ఎస్ పెంచి పోషిస్తోంది. లక్షల కుటుంబాలు కన్న కలలను దోచుకున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్‌ల మధ్య తెరచాటు ఒప్పందం కొనసాగుతోంది. కర్ణాటక‌లో కాంగ్రెస్‌కు బీఆర్ఎస్ సాయపడింది. వచ్చే ఎన్నికల్లో సాయం చేయడానికి కాంగ్రెస్ సిద్దమవుతోంది'' అని మోదీ ఆరోపించారు.

ప్రజలు కాంగ్రెస్‌‌తో జాగ్రత్తగా ఉండాలని, ఆ పార్టీని దేశం మొత్తం తిరస్కరించిందని, వారికి దేశం, సమాజం అక్కర్లేదని మోదీ ఆరోపించారు.

కేటీఆర్

ఫొటో సోర్స్, FACEBOOK/KTR

ఫొటో క్యాప్షన్, నరేంద్ర మోదీ వ్యాఖ్యలను మంత్రి కేటీఆర్ ఖండించారు.

మోదీ అబద్దాల ప్రచారకర్త: కేటీఆర్

కేసీఆర్‌పై నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ పార్టీ ఖండించింది.

ప్రధాని మోదీ జూమ్లాలకు ప్రసిద్ధి చెందిన వ్యక్తి అని, ఆయనో అబద్ధాల ప్రచారకర్తని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు ఆరోపించారు.

''ప్రధానమంత్రి స్థాయిని తగ్గించేలా నరేంద్ర మోదీ మాట్లాడారు. రాజకీయాల కోసం ఇంత నీచానికి దిగజారిన వ్యక్తి మాటలను పట్టించుకోవాల్సిన అవసరం మాకు లేదు. ప్రధాని, ముఖ్యమంత్రి మధ్య జరిగిన ఒక అధికారిక సమావేశాన్ని నీచమైన రాజకీయాలకు మోదీ వాడుతున్నారు. మోదీ అబద్ధాల తర్వాత ప్రతి అధికారిక సమావేశానికి ఒక కెమెరాని పట్టుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తోంది'' అని కేటీఆర్ తెలిపారు.

తనకు అలవాటైన అబద్దాలకు అనుగుణంగా మోదీ రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

విద్యార్హతల విషయంలోనే అబద్దాలు చెప్పిన మోదీ మాటలను ఎవరు నమ్ముతారని, ప్రధాని లాంటి వ్యక్తి ఇన్ని అబద్ధాలాడటం దురదృష్టకరమన్నారు కేటీఆర్. ఇంతకంటే బాధాకరం, శోచనీయం ఇంకోటి లేదన్నారు.

ఇంటింటికి నీళ్లు , ప్రతి ఒక్కరికి ఇల్లు, రూ. 15 లక్షలు , రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని, భారత ఆర్థిక వ్యవస్థను ఐదు ట్రిలియన్ డాలర్లకు చేర్చుతానని ఆయన చెప్పినవన్నీ అబద్ధాలేనని మంత్రి ఆరోపించారు.

కేసీఆర్ ఒక ఫైటర్ అని, ఆయన మోదీలాంటి మోసపూరిత నాయకులతో కలిసి పని చేయరన్నారు కేటీఆర్.

''కేసీఆర్ గురించి మోదీ ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలేదు? మోదీ జుమ్లా మాటలు అనేది ఇప్పుడు నిరూపితం అయింది'' అని బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ విమర్శించారు.

వారిద్దరు చీకటి మిత్రులు: రేవంత్ రెడ్డి

బీజేపీ, బీఆర్ఎస్‌ పార్టీల మధ్య ఫెవికాల్ బంధముందని మోదీ నిజామాబాద్ సాక్షిగా మరోసారి స్పష్టం చేశారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు.

వారిద్దరు చీకటి మిత్రులు, 'దిల్లీలో దోస్తీ – గల్లీలో కుస్తీ' అని తాము మొదటి నుంచి చెబుతున్నామన్నారు రేవంత్.

''కేసీఆర్ ఎన్డీయేలో చేరాలనుకున్నది నిజం. మోదీ ఆశీస్సులతో కేటీఆర్‌ను ముఖ్యమంత్రి చేయాలనుకున్నది నిజం. ఇప్పటికీ మోదీ కేసీఆర్ చీకటి మిత్రులే. నిజం నిప్పులాంటిది, ఎప్పటికైనా నిగ్గుతేలక మానదు. తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండాలి. బీజేపీ – బీఆర్ఎస్ ఫెవికాల్ బంధాన్ని అర్థం చేసుకోవాలి. గడిచిన తొమ్మిదేళ్లలో మోదీ తీసుకున్న ప్రతి నిర్ణయంలో కేసీఆర్ మద్ధతును పార్లమెంట్ రికార్డులే చెబుతాయి'' అని రేవంత్ తెలిపారు.

ఆ మాటలతో బీజేపీ క్యాడర్‌కు ఊపిరి: సీనియర్ పాత్రికేయుడు

నరేంద్ర మోదీ వ్యాఖ్యలపై సీనియర్ పాత్రికేయుడు దుర్గం రవీందర్ బీబీసీతో మాట్లాడుతూ- ''మోదీతో కేసీఆర్ ఏమన్నారనేది మనం వినలేదు. కొంత వరకు నిజం ఉండవచ్చేమో. మనం స్పష్టంగా చెప్పలేం'' అని అన్నారు

అయితే, మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా అసలేమీ లేకుండా అలా మాట్లాడరని, అలాగని అన్నీ నిజాలే మాట్లాడతారని కూడా అనుకోవడానికి లేదని ఆయన అభిప్రాయం వ్యక్తంచేశారు.

''నిజంగా కేసీఆర్ అలాంటి మాట అని ఉంటే ఇన్నేళ్లలో ఎప్పుడో ఒకప్పుడు బయటపెట్టేసి ఉండేవాళ్లు. మద్యం కుంభకోణం కేసులో దిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను అరెస్టు చేసి, కేసీఆర్ కుమార్తె కవిత జోలికి వెళ్లలేదంటేనే విషయం తెలుస్తోంది. కాకపోతే మోదీ మాటలు బీజేపీ కేడర్‌‌‌కు ఊపిరి పోస్తాయి’’ అని రవీందర్ అభిప్రాయపడ్డారు.

సభలో మోదీ ఇంకా ఏమన్నారు?

చిన్న ప్రయోజనాలు కల్పించి, వచ్చే ఐదేళ్లు అధికారం చేజిక్కించుకోవాలని చూస్తున్నారని, ఇప్పటికీ తెలంగాణలో నిరుద్యోగ భృతి ఇవ్వలేదని మోదీ ఇందూరు సభలో చెప్పారు.

ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే ట్రాక్ రికార్డ్ బీజేపీ సొంతం అని, తెలంగాణలో ఒకసారి తమ పార్టీకి అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు.

తెలంగాణలో అధికారంలోకి ఇస్తే బీఆర్ఎస్ అవినీతి సొమ్మును బయటకు తీస్తామన్నారు మోదీ.

తెలంగాణ అభివృద్ది కోసం కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, మహబూబ్‌నగర్ పర్యటన సందర్భంగా ప్రకటించిన సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ‌ని రూ. 900 కోట్లతో నిర్మిస్తామని చెప్పారు.

తెలంగాణలోని 40 లక్షల రైతుల ఖాతాల్లో ఇప్పటివరకు 10 వేల కోట్ల రూపాయల నగదు జమ చేశామని మోదీ అన్నారు.

దేశంలోని ప్రతి జిల్లాలో ఒక పంటను ప్రోత్సహించే కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

తెలంగాణలో బీజేపికి అవకాశం ఇస్టే డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడి, అభివృద్ది పరుగులు పెడుతుందని మోదీ అన్నారు.

అంతకుముందు నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన మోదీ రూ. 8 వేల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మనోహరాబాద్- సిద్ధిపేట రైల్వే లైన్ ప్రారంభించారు.

దక్షిణ భారతదేశానికి అన్యాయం చేయడమే కాంగ్రెస్ ఆలోచన అని ప్రధాని ఆరోపించారు.

దేశాన్ని కాంగ్రెస్ తప్పు దారి పట్టిస్తోందని, ఈ విషయంలో భాగస్వామ్య పార్టీలు కాంగ్రెస్‌ను నిలదీయాలని మోదీ డిమాండ్ చేశారు.

తమిళనాడులో హిందూ మందిరాలన్నీ ప్రభుత్వ అధీనంలో ఉన్నాయని, మరి మైనార్టీ ప్రార్థనా స్థలాలను అలానే స్వాధీనం చేసుకుంటారా అని మోదీ అక్కడి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)