నాందేడ్: ప్రభుత్వ ఆస్పత్రిలో 24 గంటల్లో 24 మంది ఎలా చనిపోయారు?

మహారాష్ట్రలోని నాందేడ్ ప్రభుత్వాస్పత్రిలో 24 గంటల్లో 24 మంది మృతి చెందారు. వారిలో అప్పుడే పుట్టిన శిశువులు 12 మంది ఉన్నారు.
చిన్నారులు కాకుండా మిగిలిన వారు పాముకాటు, విష ప్రయోగం కారణంగా చనిపోయారని ఆస్పత్రి డైరెక్టర్ ఎస్‌ఆర్ వాకోడే తెలిపారు.
సరైన సమయంలో చికిత్స అందకపోవడం వల్లే ఈ మరణాలు సంభవించాయనే ఆరోపణలు వచ్చాయి. అయితే, వాకోడే ఈ ఆరోపణలను తోసిపుచ్చారు.
ఆస్పత్రిలో మందుల కొరత ఉంది. కానీ, ఆ రోగులు అత్యవసర పరిస్థితిలో ఉన్నారు.
అయితే, అలాంటిదేమీ లేదని, అవసరమైన మందులు అందుబాటులో ఉన్నాయని వాకోడే చెబుతున్నారు.
హాఫ్‌కిన్ ఇన్‌స్టిట్యూట్ నుంచి మందుల కొనుగోళ్లు ఆగిపోయినప్పటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందుల కొరత ఏర్పడిందని చెబుతున్నారు.
ఇక్కడి డాక్టర్ శంకర్‌రావు చవాన్ ప్రభుత్వ ఆస్పత్రి తృతీయ స్థాయి ఆస్పత్రి. చుట్టుపక్కల 70 - 80 కిలోమీటర్ల నుంచి రోగులు వైద్యం కోసం ఈ ఆస్పత్రికి వస్తుంటారు.
ఈ ప్రాంతంలో ఇంత పెద్ద ఆస్పత్రి మరోటి లేకపోవడంతో అత్యవసర రోగులు ఇక్కడికే వస్తుంటారు.
గడిచిన 24 గంటల్లో చనిపోయిన వారంతా ఎమర్జెన్సీ రోగులేనని ఆస్పత్రివర్గాలు చెబుతున్నాయి.
దానికి తోడు కొందరు వైద్యాధికారుల బదిలీలతో పరిస్థితి కాస్త ఇబ్బందికరంగా మారిందని డాక్టర్ వాకోడే చెప్పారు.
అదే సమయంలో, హాఫ్‌కిన్ ఇన్‌స్టిట్యూట్ నుంచి మందులు కొనుగోలు చేయడం లేదు. అందువల్ల మందుల కొరత ఏర్పడింది. ఆస్పత్రికి వచ్చే రోగుల సంఖ్య పెరుగుతుండడంతో బడ్జెట్ తగ్గుతోందని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి.
విచారణకు ప్రతిపక్షాల డిమాండ్
నాందేడ్ ఘటనతో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
''ఈ మరణాలపై సమగ్ర విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది. ఒక్కరోజులో ఇన్ని మరణాలు జరిగాయి. విషయం తీవ్రతను అర్థం చేసుకుని ముఖ్యమంత్రి విచారణకు ఆదేశించాలని కోరుతున్నాం'' అని ఎంపీ సుప్రియా సూలే అన్నారు.
''థానే ఘటనలో కనిపించిన నిర్లక్ష్యం, ఉదాసీన వైఖరి ఇందులోనూ కనిపిస్తున్నాయి. ఒకరి తప్పులను మరొకరు కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆస్పత్రిలో మందుల కొరత కారణంగా రోగులకు సరైన సమయంలో మందులు ఇవ్వలేకపోయారు. మహారాష్ట్ర ప్రజల జీవితాలకు విలువ లేదా'' అని ఆమె ప్రశ్నించారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, సీనియర్ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు.

ఫొటో సోర్స్, @RAJTHACKERAY
అనారోగ్యం బారిన మహారాష్ట్ర: రాజ్ థాకరే
''నాందేడ్ ప్రభుత్వాస్పత్రిలో 24 గంటల్లో 24 మంది చనిపోయారు. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. థానేలోనూ ఇలాంటి ఘటన జరిగింది. రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రుల్లో మందుల కొరత ఉంది. ముంబైలో టీబీ మందులల్లేవు. సరఫరా లేదు, ఉన్నవి వాడుకోండి అని సలహా ఇస్తున్నారు. ఇది నాందేడ్, థానే, ముంబయికి మాత్రమే పరిమితం కాదు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది'' అని ఎంఎన్‌ఎస్ నాయకుడు రాజ్ థాకరే అన్నారు.
''మూడు ఇంజిన్ల వల్ల ఉపయోగమేంటి? రాష్ట్రం అనారోగ్యానికి గురై వెంటిలేటర్‌పై ఉంది. ఆ మూడు పార్టీలకూ ఇన్సూరెన్స్ ఉంది. మరి మహారాష్ట్ర సంగతేంటి?'' అని ఆయన అన్నారు.
''దురదృష్టవశాత్తూ ప్రభుత్వంలోని ఆ మూడు పార్టీలు మినహా మహారాష్ట్ర అంతా అనారోగ్యానికి గురైంది. మహారాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యంపై మరింత శ్రద్ధ వహించాలి'' అని సూచించారు.
ఆస్పత్రి ఏమంటోంది?
ఈ ఘటనపై నాందేడ్‌లోని శంకర్‌రావు చవాన్ ఆస్పత్రి వర్గాలు వివరణ ఇచ్చాయి.
ఆస్పత్రి జాబితా ప్రకారం, ‘‘సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 1 మధ్య 24 మంది రోగులు చనిపోయారు. వారిలో ఎక్కువ మంది ప్రైవేట్ ఆస్పత్రుల నుంచి సీరియస్ కండిషన్‌లో ఇక్కడకు వచ్చారు’’ అని చెప్పారు.
''ఆస్పత్రిలో సరిపడా మందులు అందుబాటులో ఉన్నాయి. డిస్ట్రిక్ట్ ప్లానింగ్ నుంచి ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.12 కోట్ల నిధులు సమకూరాయి. మరో రూ.4 కోట్లు మంజూరయ్యాయి. జిల్లా నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా రెండు రోజుల్లో అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగులు ఎక్కువ మంది వచ్చారు. అందువల్ల మరణాల రేటు ఎక్కువగా ఉంది.''
''వైద్యులు, సిబ్బంది మెరుగైన వైద్య సేవలందించేందుకు కృషి చేస్తున్నారు. ఆస్పత్రికి వచ్చిన రోగులకు వైద్యం అందిస్తున్నారు'' అని ఆస్పత్రివర్గాలు విడుదల చేసిన లేఖలో పేర్కొన్నాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
డాక్టర్లు లేరు, మెషీన్లు పనిచేయడం లేదు - చవాన్
కాంగ్రెస్ నేత అశోక్ చవాన్ ఆస్పత్రిని సందర్శించారు. రోగులకు తక్షణ సాయం అందించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ- ఆస్పత్రిలో పరిస్థితిని వివరించారు.
''ఆస్పత్రిలో మరో 70 మంది పరిస్థితి విషమంగా ఉంది. నర్సింగ్ స్టాఫ్‌ని బదిలీ చేశారు. ఆ పోస్టులను ఇంకా భర్తీ చేయలేదు. వైద్యుల సంఖ్య కూడా తక్కువగా ఉంది. ఆస్పత్రిలో మెషీన్లు పనిచేయడం లేదు. ఆస్పత్రికి సరిపడా నిధులు సమకూర్చడం లేదు. ఆస్పత్రి సామర్థ్యానికి రెండింతల మంది రోగులు ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్నారు. ఆస్పత్రి సామర్థ్యం 500 మంది. కానీ ఇప్పుడు 1,200 మంది ఉన్నారు'' అని తెలిపారు.
విచారణ జరుపుతున్నాం: సీఎం ఏక్‌నాథ్ శిందే
ఈ మొత్తం ఘటనపై విచారణ జరుపుతామని ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే, మంత్రి హసన్ ముష్రిఫ్ తెలిపారు.
''పర్భాని, హింగోలి, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల నుంచి ఈ ఆస్పత్రికి ఎక్కువగా రోగులు వస్తుంటారు. రోగులు మొదట ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్తున్నారు. అక్కడ ఆరోగ్యం మెరుగుపడకపోవడం, ఆస్పత్రి బిల్లులు పెరిగిపోవడం వంటి కారణాలతో ఆ తర్వాత ప్రభుత్వ ఆస్పత్రులకు వస్తున్నారు. అయినప్పటికీ, 24 గంటల్లో 24 మంది చనిపోవడం తీవ్రమైన విషయం. దీనిపై విచారణ జరుగుతుంది'' అని హసన్ ముష్రిఫ్ అన్నారు.
నెలన్నర రోజుల కిందట థానేలోని ఆస్పత్రిలో 18 మంది చనిపోయారు.
థానేలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ ఆస్పత్రిలో ఈ ఘటన జరిగింది. వైద్యులు సరైన సమయంలో స్పందించకపోవడం, మందుల కొరత కారణంగానే రోగులు మరణించారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి.
ఇవి కూడా చదవండి:
- సారా సన్నీ: భారతదేశ చరిత్రలో తొలిసారిగా సుప్రీం కోర్టులో వాదన వినిపించిన చెవిటి లాయర్
- 'ఇండియా ఔట్' నినాదం ఇచ్చిన మహమ్మద్ మయిజ్జు మాల్దీవుల అధ్యక్షుడిగా గెలిచారు... భారత్‌పై దీని ప్రభావం ఎంత?
- లాగరిథమిక్ అంటే ఏమిటో తెలుసా... ఎంత డబ్బుకు ఎంత ఆనందం వస్తుందో చెప్పే గణిత సూత్రం
- పర్సనల్ ఫైనాన్స్: ఒక ఏడాదిలో ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా ఉండాలి?
- కామెరూన్: ఈ దేశంలో శవపేటికలు అమ్ముకోవడం మంచి వ్యాపారం, ఎందుకంటే....
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














