‘రాత్రి పదిన్నరకు.. ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు తీశాం’ - కొండచరియలు విరిగిపడి 12 మంది మృతి, 103 మంది ఇంకా రాళ్ల కిందే

"రాత్రి పదిన్నర గంటల ప్రాంతంలో జరిగింది ఇది. ఒక్కసారిగా భూమి కంపించినట్లయింది. ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు తీశాం. మా రెండు ఇళ్లలో పది పన్నెండు మంది ఉన్నాం. మా ఇంట్లో వాళ్లందరం బయటకి వచ్చాం. రాత్రంతా వర్షంలోనే ఉండిపోయాం. మా బంధువు కుటుంబం అందులోనే చిక్కుకుంది. ఒక్క కొడుకు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. ఇంకో అబ్బాయి కూడా కనిపించడంలేదు"
మహారాష్ట్రలోని ఇర్షాల్‌వాడిలో కొండచరియలు విరిగిపడి బంధువులను కోల్పోయిన వ్యక్తి రోదన ఇది.
ప్రమాదం జరిగిన ప్రాంతానికి అధికారులు ఎవరినీ వెళ్లనివ్వడం లేదు. దీంతో బాధితుల బంధువులు ఊరి బయట ఎదురుచూస్తున్నారు. అక్కడ చిన్న పిల్లలు ఏడుస్తూ కనిపించారు.
"కాల్ రావడంతో ఏం జరుగుతుందో తెలిసింది. మా ఇల్లు పైన ఉంది. అమ్మ, అన్న, చెల్లెలు అందులోనే ఉన్నారు. మా పెద్దక్క కుటుంబం అందులో చిక్కుకుంది. ఒక కొడుకు వేరే చోట పడుకున్నాడు, అతను బయటపడ్డాడు. ఇలా ఇంతకుముందెన్నడూ జరగలేదు. కొండ కూలిపోతుందని ఎప్పుడూ అనుకోలేదు, ఇది అకస్మాత్తుగా జరిగింది. ఒక అబ్బాయి ఇంటి లోపలే ఇరుక్కుపోయాడు, బయటకు రాలేదు" అని ఒక మహిళ వివరించారు.
రాయ్‌గఢ్ జిల్లాలోని ఇర్షాల్‌వాడి , ఇతర గ్రామాల ప్రజలు తమ కుటుంబ సభ్యులు, బంధువుల కోసం ఊరు బయట రోదిస్తున్నారు.
వారి బంధువులు క్షేమంగా ఉన్నారో లేదో వారికి ఇంకా తెలియదు.

అసలేం జరిగింది?
బుధవారం (జులై 20) రాత్రి ఇర్షాల్‌వాడిలో కొండచరియలు విరిగిపడ్డాయి.
ఆ శబ్దానికి అల్లాడిపోయిన ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకునేందుకు పరుగులు తీయడం ప్రారంభించారు. కానీ కొందరు చిక్కుకుపోయారు.
తమ కుటుంబాలు ఎక్కడున్నాయో.. ఎలా ఉన్నాయో.. వారిని కలుస్తామో.. లేదా.. అని ప్రాణాలతో బయటపడిన వారు ఆందోళన చెందుతున్నారు.
ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 12 మంది మృతి చెందారు. 103 మంది ఆచూకీ తెలియలేదు.
మృతుల బంధువులకు ప్రభుత్వం ఐదు లక్షల రూపాయల సాయం ప్రకటించింది.
కాగా, శాసనసభలో ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ ఈ ఘటనకు సంబంధించిన ప్రకటన చేశారు.
ఆ ప్రకటన ప్రకారం.. ఎత్తైన కొండ దిగువన ఇర్షల్వాడి గ్రామం ఉంది. అక్కడికి వెళ్లేందుకు రోడ్డు మార్గం లేదు. కాలినడకన వెళ్లాలి.
ఆ ప్రాంతంలో 48 కుటుంబాలు ఉంటున్నాయి. 228 మంది నివసిస్తున్నారు. అక్కడ గత మూడు రోజుల్లో 499 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది
రాత్రి 10:30 నుంచి 11 గంటల మధ్య కొండ చరియలు విరిగిపడ్డాయి. ఆ సమయంలోనే జిల్లా అధికారులకు సమాచారం అందింది.
ఎత్తైన వాలులో ఉన్న దూరప్రాంతం కావడంతో త్వరగా చేరుకోలేకపోయారు.

ఇర్షాల్‌వాడి ఎక్కడ ఉంది?
ముంబయి-పుణే పాత రహదారి మార్గంలో లేదా కర్జాత్-పన్వెల్ రైలు మార్గంలో ఇర్షాల్‌వాడి గ్రామం ఉంది.
రాయ్‌గఢ్ జిల్లాలోని ఖలాపూర్ తాలూకాలోని చౌక్ గ్రామానికి ఉత్తరం వైపున గల కొండ వద్ద ఇర్షల్వాడి గిరిజన స్థావరం కనిపిస్తుంది.
గ్రామం ఉన్న కొండ ఈశాన్య దిశలో నవీ ముంబైకి నీటిని సరఫరా చేసే మోర్బే డ్యామ్ రిజర్వాయర్ ఉంది.
మంత్రి గిరీష్ మహాజన్, దాదా భూసే, ఉదయ్ సామంత్ మహాజన్, అదితి తట్కరే, ఎమ్మెల్యే మహేశ్ బల్ది, సామాజిక కార్యకర్త గురునాథ్ సహిల్కర్‌తో పాటు కర్జాత్-ఖలాపూర్ అధికారులు, పోలీసు బలగాలు, ఎన్డీఆర్‌ఎఫ్ బృందం, పలు సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నారు.
ఇవి కూడా చదవండి
- ట్రినిటైట్: అణుబాంబు బద్దలై రంగు రాళ్లు బయటపడ్డాయి
- అస్పర్టేమ్ : టూత్‌పేస్ట్ నుంచి కోక్ వరకు... అనేక పదార్ధాల్లో ఉండే ఈ చక్కెరతో క్యాన్సర్ వస్తుందా, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం తేల్చింది?
- లాగరిథమిక్ అంటే ఏమిటో తెలుసా... ఎంత డబ్బుకు ఎంత ఆనందం వస్తుందో చెప్పే గణిత సూత్రం
- పర్సనల్ ఫైనాన్స్: ఒక ఏడాదిలో ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా ఉండాలి?
- కామెరూన్: ఈ దేశంలో శవపేటికలు అమ్ముకోవడం మంచి వ్యాపారం, ఎందుకంటే....
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














