అఫ్గాన్ శరణార్థుల నుంచి వేలకు వేలు వసూలు చేస్తున్న పాకిస్తాన్

ఫొటో సోర్స్, EPA
- రచయిత, కరోలిన్ డేవీస్
- హోదా, పాకిస్తాన్ ప్రతినిధి
సరైన ధ్రువపత్రాలు లేని శరణార్థులు దేశం వదిలి వెళ్లేందుకు 830 డాలర్లు (అంటే 69 వేల రూపాయలకి పైగా) వసూలు చేస్తున్నట్లు పాకిస్తాన్ తెలిపింది.
వీసా లేకుండా దేశంలోకి ప్రవేశించిన వారికి ఈ ఎగ్జిట్ ఫీజు వర్తిస్తుంది.
ధ్రువపత్రాలు లేకుండా దేశంలో ఉంటున్న 17 లక్షల మంది విదేశీయులు నవంబర్ 1లోగా వెళ్లపోకపోతే దేశం నుంచి బహిష్కరిస్తామని అక్టోబర్‌లో పాకిస్తాన్ ప్రకటించింది.
వారిలో అఫ్గానిస్తాన్‌కు చెందిన వారే ఎక్కువ. 2021లో అఫ్గాన్‌లో తాలిబాన్లు తిరిగి అధికారం చేజిక్కించుకున్న తర్వాత ఆ దేశం నుంచి లక్షల మంది పారిపోయి ఇక్కడకు వచ్చారు.
ఇక వీసాల కాలపరిమితి ముగిసిన వారిపై కూడా గడువు ముగిసిపోయిన తేదీని అనుసరించి చార్జీలు వసూలు చేస్తున్నారు.
తాలిబాన్లు కాబూల్‌ని చేజిక్కించుకున్న సమయంలో అఫ్గాన్ నుంచి పారిపోయి వచ్చిన వారిలో చాలా మందికి అవసరమైన ధ్రువపత్రాలు పొందడంలో జాప్యం జరిగిందని ఆమ్నెస్టీ వంటి సంస్థలు చెబుతున్నాయి.
‘రెఫ్యూజీస్ కన్వెన్షన్’లో పాకిస్తాన్ భాగస్వామి కాదు. తమ సరిహద్దుల్లో నివసిస్తున్న అఫ్గాన్‌లలో ఎవరినీ శరణార్థులుగా గుర్తించడం లేదని పాకిస్తాన్ చెబుతోంది.
మానవతా ప్రాతిపదికన వెనక్కి తిప్పి పంపుతున్న వారి వద్ద ఫీజు వసూలు చేయడం ఆందోళన కలిగిస్తోందని పాకిస్తాన్‌కు చెందిన సీనియర్ దౌత్యవేత్త ఒకరు బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
''వీసా గడువు ముగిసిపోతే ఫీజులు చెల్లించడం, లేదా వారిని దేశం నుంచి బహిష్కరించడం చాలా దేశాల్లో ఉంది'' అని ఆయన చెప్పారు.
''అయితే, మానవతా వీసాలు పొందిన వారి నుంచి చార్జీలు వసూలు చేయడమే ఇబ్బంది. అలాంటి వారి నుంచి చార్జీలు వసూలు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, వాళ్లు మన కోసం పనిచేశారు. ఐరాస శరణార్థి సంస్థ (యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్ - యూఎన్‌హెచ్‌సీఆర్ ) దీనిని మానవతా సాయంగా చూస్తోంది. ఇలా చార్జీలు వసూలు చేయడం వల్ల చాలా చెడ్డపేరు వస్తుంది'' అని తెలిపారు.
ప్రభుత్వం ఈ విధానాన్ని సమీక్షించే అవకాశం ఉందనే సంకేతాలు ఉన్నాయని, ఆ దిశగా అడుగులు పడే అవకాశం ఉందని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు.
అయితే, సమీక్షకు సంబంధించిన ఎలాంటి అవకాశాల గురించి పాకిస్తాన్ అధికారులు బీబీసీతో ప్రస్తావించలేదు.
మరోవైపు, ఈ విషయాన్ని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు యూఎన్‌హెచ్‌సీఆర్ బీబీసీకి తెలిపింది.
''ఈ చార్జీల నుంచి శరణార్థులను మినహాయించాలని అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాం. అఫ్గాన్ శరణార్థులకు ఆశ్రయం, రక్షణ కల్పించడంలో పాకిస్తాన్ ప్రభుత్వాన్ని, ప్రజలను ప్రశంసించాల్సినంత దశాబ్దాల చరిత్ర ఉంది. దానిని కొనసాగించాల్సిన అవసరం ఉంది" అని యూఎన్‌హెచ్‌సీఆర్ చెప్పింది.
''బ్రిటన్ సహా ఇతర దేశాల్లో అమలవుతున్న ఇమ్మిగ్రేషన్ చట్టాల మాదిరిగానే పాకిస్తాన్ చట్టాలు కూడా ఉంటాయి. వీసాలు గడువు దాటినా, లేదా ఇమ్మిగ్రేషన్ చట్టాలను ఉల్లంఘించినా జరిమానాలు, శిక్షలు ఉంటాయి'' అని పాక్ విదేశీ వ్యవహారాలశాఖ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.
పాకిస్తాన్ విధించే జరిమానాలు చట్టాలను అనుసరించే ఉంటాయని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- ‘పిల్లల పట్ల లైంగికంగా ఆకర్షితులయ్యే నా భర్త నుంచి నా కూతుర్ని కాపాడుకునేందుకు 30 లక్షలు ఖర్చు చేశాను’
- చైనా: ‘మసీదులను మూసేస్తున్నారు, ముస్లిం ప్రార్థనా స్థలాల స్వరూపాన్నే మార్చేస్తున్నారు’ – హ్యూమన్ రైట్స్ వాచ్
- బంగ్లాదేశ్ ఎన్నికలు: అతిపెద్ద ఇస్లామిక్ పార్టీపై నిషేధాన్ని తొలగించేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు... ఈ ప్రభావం ఎలా ఉండబోతోంది?
- రోహిత్ శర్మ ‘టాస్’ కావాలనే అలా వేస్తున్నాడా? పాక్ మాజీ క్రికెటర్ వ్యాఖ్యలపై వివాదమేంటి?
- వరల్డ్ కప్ ఫైనల్లో ఓడినా ఎన్నో కొత్త రికార్డులు సృష్టించిన ఇండియా
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














