రోహిత్ శర్మ ‘టాస్’ కావాలనే అలా వేస్తున్నాడా? పాక్ మాజీ క్రికెటర్ వ్యాఖ్యలపై వివాదమేంటి?

ఫొటో సోర్స్, Getty Images
ప్రపంచ కప్‌లో భారత జైత్రయాత్రపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
సెమీ ఫైనల్లో న్యూజిలాండ్‌పై భారీ విజయంతో ఫైనల్లో అడుగు పెట్టిన భారత్, నవంబరు 19 ఆదివారం అహ్మదాబాద్‌లో ఆస్ట్రేలియాను ఢీకొనబోతోంది.
అత్యధికులు టీమిండియా ప్రదర్శనకు ముగ్ధులవుతుండగా, మరోవైపు కొన్ని వివాదాలు కూడా రేగుతున్నాయి.
తాజా వివాదం- భారత కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ వేసే తీరు గురించి.
మ్యాచ్ ప్రారంభానికి ముందు ఎవరు తొలుత బ్యాటింగ్ చేయాలి, ఎవరు బౌలింగ్ చేయాలనేది టాస్ వేసి నిర్ణయించడం ఆనవాయితీ. ఇరు జట్ల కెప్టెన్లలో ఒకరు టాస్ వేస్తారు.
మరో జట్టు కెప్టెన్, టాస్ వేసిన కాయిన్ హెడ్(బొమ్మ) పడిందా, లేదా టెయిల్(బొరుసు) పడిందా అనేది చూస్తారు. టాస్‌లో ఎవరు నెగ్గితే వాళ్లు బ్యాటింగ్, లేదా బౌలింగ్ ఎంపిక చేసుకుంటారు.

ఫొటో సోర్స్, Getty Images
సికందర్ బఖ్త్ ఆరోపణలను కొట్టిపారేసిన వసీం అక్రమ్, షోయబ్ అఖ్తర్
కాయిన్ హెడ్ పడిందో, టెయిల్ పడిందో ప్రత్యర్థి జట్టు కెప్టెన్‌కు కనిపించనంత దూరంగా టాస్ వేస్తున్నాడంటూ భారత కెప్టెన్ రోహిత్ శర్మపై పాకిస్తానీ మాజీ క్రికెటర్ సికందర్ బఖ్త్ ఆరోపణలు చేశాడు.
''టాస్ వేసేటప్పుడు రోహిత్ శర్మ, ప్రత్యర్థి కెప్టెన్‌కు కనిపించకుండా కాయిన్‌ను దూరంగా వేస్తాడు. అందువల్ల, ఎదుటి జట్టు కెప్టెన్ వెళ్లి దానిని చూడలేడు'' అని ఆయన ఓ టీవీ ఇంటర్వ్యూలో ఆరోపణలు చేశాడు.
రోహిత్ శర్మ టాస్ వేస్తున్న వీడియోలను సోషల్ మీడియా వేదిక 'ఎక్స్'(ట్విటర్)లో షేర్ చేస్తూ ప్రశ్నలు కూడా వేశాడు.
సికందర్ బఖ్త్ ఆరోపణలను ఇతర పాకిస్తానీ మాజీ క్రికెటర్లు ఖండించారు. దీనిపై చర్చించాల్సిన అవసరం లేదని వసీం అక్రమ్, మొయిన్ ఖాన్, షోయబ్ మాలిక్ తదితరులు కొట్టిపారేశారు.
''కాయిన్ ఎక్కడ పడుతుందో ఎవరికి తెలుసు? ఆ ఆరోపణలు నాకు చిరాకు తెప్పించాయి. దానిపై నేనేమీ మాట్లాడదలచుకోలేదు'' అని ఒక టీవీ కార్యక్రమంలో వసీం అక్రమ్ అన్నాడు.
''వాళ్లు రోహిత్‌ను అపార్థం చేసుకున్నారు. గందరగోళం సృష్టిస్తున్నారు. ఒక్కో కెప్టెన్ ఒక్కోలా టాస్ వేస్తారు'' అని మొయిన్ ఖాన్ చెప్పాడు.
''మాట్లాడేంత పెద్ద విషయం కాదది'' అని షోయబ్ అఖ్తర్ అన్నాడు.

ఫొటో సోర్స్, Getty Images
బంతులపై హసన్ రజా ఆరోపణలు
టాస్ తరహాలోనే భారత జట్టు వాడుతున్న బంతిపై కూడా వివాదం ముసురుకుంది.
''మొహమ్మద్ సిరాజ్, మొహమ్మద్ షమీ బౌలింగ్ తీరు చూస్తుంటే రెండో ఇన్నింగ్స్‌లో ఐసీసీ, బీసీసీఐ వారికి వేర్వేరు బంతులు ఇచ్చినట్లు కనిపిస్తోంది'' అని పాకిస్తానీ మాజీ క్రికెటర్ హసన్ రజా ఆరోపించారు.
''బంతి విషయంపై విచారణ జరపాలి. బంతి బాగా స్వింగ్ అయ్యేందుకు దానిపై మరో పూత పూసినట్లు ఉంది'' అని ఆయన అనుమానం వ్యక్తంచేశారు.

ఫొటో సోర్స్, Getty Images
మైదానంలో మార్పులపై విమర్శలు
న్యూజిలాండ్‌తో సెమీఫైనల్ మ్యాచ్ మైదానం(ముంబయిలోని వాంఖడే స్టేడియం)లో మార్పులపైనా వివాదం రేగింది. దీంతో ఐసీసీ వివరణ ఇవ్వాల్సి వచ్చింది.
''సుదీర్ఘంగా జరిగే ఇలాంటి పెద్ద టోర్నీలో రొటేషన్ ప్లాన్‌కు అనుగుణంగా మైదానంలో మార్పులు చేయడం సర్వసాధారణం'' అని ఐసీసీ చెప్పిందని బీబీసీ ప్రతినిధి నితిన్ శ్రీవాస్తవ తెలిపారు.
''గతంలోనూ కొన్నిసార్లు ఇలా జరిగింది. గ్రౌండ్ క్యురేటర్ సూచనల మేరకే ఈ మార్పులు జరిగాయి. టోర్నమెంట్ నిర్వాహకుల సూచనలు, సమ్మతితోనే ఇది జరుగుతుంది'' అని ఐసీసీ అధికార ప్రతినిధిని ఉటంకిస్తూ ఆయన చెప్పారు.
ఈ విషయంపై భారత మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ తీవ్రంగా స్పందించారు.
''గ్రౌండ్ మారిందని మాట్లాడే మూర్ఖులందరూ నోరు మూసుకుంటారని ఆశిస్తున్నా. గ్రౌండ్ మార్పుల గురించి మాట్లాడడం మానేయండి. రెండు జట్లకు గ్రౌండ్ అదే'' అని ఆయన వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి:
- సచిన్‌కూ, విరాట్ కోహ్లీకీ అదే తేడా: వసీం అక్రమ్
- అఫ్గానిస్తాన్ ఆటగాళ్లు తమకు క్రికెట్ నేర్పించిన పాకిస్తాన్‌ను కాదని భారత్‌ను ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు?
- అఫ్గానిస్తాన్: అంతర్యుద్ధం, పేదరికంతో అల్లాడుతున్న తాలిబాన్ల పాలనలో క్రికెట్ ఎలా వికసించింది?
- ‘షమీ ఫెరారీ లాంటి వాడు... స్పీడ్ తగ్గేదేలేదు’ అన్నది నిజమైందా?
- 30 వేల అడుగుల ఎత్తులో గుర్రం గందరగోళం, వెనుదిరిగిన బోయింగ్ విమానం
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














