నా బాయ్‌ఫ్రెండ్ కోసం నా పిరుదులు పెద్దవి చేయించుకున్నాను.. కానీ ఏళ్ళ తరబడి నరకం అనుభవించాను

యాదిరా పెరెజ్

ఫొటో సోర్స్, YADIRA PEREZ

ఫొటో క్యాప్షన్, యాదిరా పెరెజ్ బయోపాలిమర్స్ కారణంగా 16 ఏళ్ళపాటు తీవ్రమైన బాధను అనుభవించారు
    • రచయిత, వాలెంటినా ఒరోపెజా కోల్మెనారెస్
    • హోదా, బీబీసీ న్యూస్ వరల్డ్

యాదిరా పెరేజ్ తన పిరుదులకు సర్జరీ చేయించుకున్నారు.

నాలుగునెలల కిందట సర్జన్ తొలగించిన టిష్యూ ఫోటోను చూపించినప్పుడు ఆమెకు అది పసుపు రంగులో సన్నని గోళాకారంలో కనిపించింది.

రక్తంతో ఎండిపోయిన ఆ టిష్యూ తనదికాదన్నట్టు నిర్వికారంగా చూశారామె.

‘‘ఆ గోళాకారంలో ఉన్నవి బయోపాలిమర్స్’’ అని 43 ఏళ్ళ వెనిజులియన్ ఫోటో గ్రాపర్ చెప్పారు.

‘‘నా కుడి పిరుదులో కొన్ని బంతుల్లాంటి వాటిని అమర్చారు. అవి నన్ను భరించలేని నొప్పికి గురిచేశాయి’’

యాదిరా 26 ఏళ్ళ వయసులో బయోపాలిమర్స్‌ను తన పిరుదులలోకి ఇంజెక్ట్ చేయించుకున్నారు.

యాదిరా తనను తాను అందమైన యువతిగానే భావించినప్పటికీ ఆమె బాయ్‌ఫ్రెండ్ ఆమె పిరుదులు పెద్దగా ఉండాలని పట్టుబట్టేవారు.

యాదిరా కూడా అతను కోరుకున్నట్టుగా ఉండాలని అనుకున్నారు.

పిరుదుల్లోకి బయోపాలిమర్స్ ఎక్కించిన కొన్ని రోజులకు యాదిరాకు పిరియడ్స్ వచ్చాయి. ఆ సమయంలో ఆమె పిరుదులు గట్టిగానూ, వేడిగా మారి ఎర్రబడ్డాయి. దీంతో ఆమె కూర్చోవడానికి, పడుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డారు.

అప్పటి నుంచి ఎప్పుడు పిరియడ్స్ వచ్చినా ఇటువంటి అనుభవాలే ఎదుర్కొనేవారు.

సింథటిక్‌తో తయారు చేసే బయోపాలిమర్స్‌ను పెదాలు, వక్షోజాలు, పిరుదుల సైజును పెంచడానికి ఉపయోగిస్తారు.

ఆమె ఈ ప్రక్రియ చేయించుకున్న 14 ఏళ్ళ తరువాత 2021లో కాస్మోటిక్ శస్త్ర చికిత్సలలో ‘ఫిల్లర్స్’ను వినియోగించడాన్ని కొలంబియా, బ్రెజిల్, మెక్సికో తరహాలోనే వెనెజ్వేలా కూడా నిషేధించింది.

బయోపాలిమర్స్‌ను ఎంతమంది పేషెంట్లకు ఇంజెక్ట్ చేయడం రహస్యంగా జరగడంతో, దీనిపై ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి గణాంకాలు లేవు.

వెనెజ్వేలా రాజధాని కారకస్‌లో యాదిరా బయోపాలిమర్స్ ఇంప్లాంట్ చేయించుకున్న బ్యూటీ సెలూన్‌‌ను ఫోన్లో సంప్రదించేందుకు బీబీసీ ప్రయత్నించగా, అటువైపు నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

యాదిరా ఇంప్లాంట్స్‌ను ఇంజెక్ట్ చేసుకున్నాక, వాటిని తొలగించుకోవడానికి గత 16 ఏళ్ళలో రెండు లేజర్ లైపోసక్షన్లు, ఒక సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది.

వీటిని తొలగించుకునే చివరి ప్రక్రియలో భాగంగా ఆపరేషన్, మందుల కోసం, తాను రెండేళ్ళు నివాసం ఉన్న మియామిలో ఆమె అప్పు తీసుకున్నారు. ఇందులో భాగంగా తనకు జరిగే చికిత్సను, కోలుకునే విధానాన్ని చిత్రీకరించాలని నిర్ణయించుకున్నారు.

క్యూబా, కొలంబియా, వెనిజులాకు చెంది, అమెరికాలోని వివిధ నగరాలలో నివసిస్తున్న 44 మంది మహిళల గ్రూపులో సభ్యురాలు. వీరంతా తమ శరీరాల్లోని ఇంప్లాంట్స్‌ను తొలగించుకోవడానికి శస్త్ర చికిత్సలు చేయించుకోవాలనుకుంటున్నారు.

ఈమె స్వగతంగా చెప్పిన విషయాలలో తాను ఆస్పత్రులు, క్లినిక్‌లు, స్పెషలిస్టుల చుట్టూ తిరిగిన వైనాన్ని, వారెవరూ తన ఇంప్లాంట్ కారణంగా ఏర్పడుతున్న లక్షణాలను గుర్తించకపోవడం లేదా తన బాధను తగ్గించేందుకు తగిన చికిత్స అందించకపోవడాన్ని వివరించారు.

పిరుదుల ప్రకటనలు

ఫొటో సోర్స్, COURTESY OF MAGDA GIBELLI

ఫొటో క్యాప్షన్, పిరుదులు పెద్దవి చేస్తామంటూ పేపర్లలో ప్రకటనలు వచ్చేవి

‘‘ పిరుదులను పెద్దవి చేద్దాం’’ అన్నారు

‘‘2007లో కారకస్‌లో కాస్మోటిక్ సర్జరీల బూమ్ నడిచింది. ఆ సమయంలో హెన్రీతో కలిసి ఉంటున్నాను. హెన్రీ ఎప్పుడూ సర్జరీల ప్రకటనలు ఉన్న వార్తాపత్రికలు, మ్యాగజైన్లు తీసుకువచ్చేవారు.

చూడు వారు పిరుదులను పెద్దవిగా తయారు చేస్తున్నారు. నీ పిరుదులను కూడా పెద్దవి చేయిద్దాం అని ఒకరోజు హెన్రీ చెప్పారు.

పెద్దపెద్దగా ఉన్న నీ పిరుదులను ఒకసారి ఊహించుకో అని చెప్పేవారు.

మొదట నేను దీనికి ఒప్పుకోలేదు. కానీ, చివరికి అతని కోరికను కాదనలేకపోయాను.

కారకస్‌లోని బెల్లోమాంటేలోని బ్రెస్ట్ ఇంప్లాంట్స్, లైపోసక్షన్ చేసేలాంటి చోటుకు వెళ్ళాం. మేం వెళ్ళిన చోట కనీసం క్లినిక్ కూడాలేదు. కానీ ఓ ఆపరేషన్ గది ఉంది.

మేం ఇక్కడికి ఎవరి సిఫార్సు లేకుండా పత్రికా ప్రకటన చూసి వచ్చాం. ఆ ప్రకటనలో అమెరికా, యూరప్‌లలో సర్జన్లు ఉపయోగించే ఇంప్లాంట్ మెటీరియల్‌ను తాము వినియోగిస్తామని చెప్పారు.

నా శరీరాకృతి బావుంటుంది. అందుకే నేనెప్పుడూ ఇంప్లాంట్స్ గురించి ఆలోచించలేదు. నాకు మరీ అంత చిన్న పిరుదులు లేవు, అలాగే పెద్దవీ లేవు. అవి నా శరీరానికి, ఎత్తుకు తగినట్టుగా ఉండేవి.

కానీ, హెన్రీకి పెద్ద పిరుదులపైన వ్యామోహం ఉండేది. అప్పటికే ఏడాది కాలంగా మేం రిలేషన్‌షిప్‌లో ఉన్నాం.

నాకు 21 ఏళ్ళు ఉన్నప్పుడు నా వక్షోజాలలో తిత్తులు వచ్చాయి. డాక్టర్లు బయాప్సీ చేసినప్పుడు ప్రాణాంతక కణాలు ఉన్నాయని తేల్చారు. దీంతో వక్షోజాలకు శస్త్రచికిత్స చేసి, ఇంప్లాంట్స్ అమర్చారు.

నా రెండు రొమ్ములకు పాక్షికంగా మాస్టెస్టోమి చేసి ప్రొస్థసిస్‌ను అమర్చారు.

‘టేప్ అంటించండి’

‘‘మొదటిసారి నేను, హెన్రీ కన్సల్టేషన్ కోసం వెళ్ళినప్పుడు బయోపాలిమర్స్ అమర్చుకోవడానికి మహిళలు వరుసగా నిలబడి ఉన్నారు.

మాకు చికిత్స అందించిన డాక్టర్ తాను సర్జన్‌ని అని చెప్పారు. ఆయన మాకో చిన్నబాటిల్ చూపించారు. అందులోని ద్రవాన్ని నాకు ఇంజెక్ట్ చేయనున్నట్టు చెప్పారు. ఆయన వాటిని బయోపాలిమర్స్ అని చెప్పలేదు. పిరుదులు పెద్దవి కావడానికి ఇస్తున్న ఎక్స్‌పాండింగ్ సెల్స్ అని చెప్పారు.

ఆ డాక్టర్ తన భార్యను పరిచయం చేశారు. ఆమె కూడా ఆయనలానే వయసుమళ్ళినట్టు కనిపించారు. ఆమె పిరుదలలలో కూడా ఈ ఎక్స్‌పాండింగ్ సెల్స్ 15 ఏళ్ళుగా ఉన్నాయని, ఆమెకు ఎటువంటి అసౌకర్యం కలగలేదని చెప్పారు.

ఆమె బిగుతైన చొక్కా, ప్యాంట్ ధరించి ఉన్నారు. ఆమె చాలా మామూలుగా కనిపించారు.

నాకు ఇంప్లాంట్స్ చేయించుకునే అవసరం లేకపోయినా, నేను చేయించుకునేవరకు హెన్రీ ఒప్పుకోడని తెలుసుకాబట్టి ‘ఎస్’ అని చెప్పక తప్పలేదు.

నాకు దీనిపై నమ్మకం ఉండటం వలన నా శరీరంలోకి ఏ వస్తువులు రాబోతున్నాయనే విషయమై నేను ఎటువంటి సమాచారాన్ని తెలుసుకోలేదు.

డాక్టర్ నన్ను పొవిడైన్ (టింక్చర్)తో శుభ్రం చేశారు. ఆపరేషన్ చేయబోయే ప్రాంతానికి మాత్రమే పరిమితమయ్యేలా మత్తుమందు ఇచ్చారు. నేను స్ట్రెచర్‌పై బోర్లా పడుకోవడంతో ఇంతకుమించి నాకేమీ కనిపించలేదు.

అతను నా శరీరంలోకి ఏ పరికరాన్ని పంపాడో, లేదంటే ఏమి ఇంజెక్ట్ చేశాడో నాకు తెలియలేదు. కానీ నాకెటువంటి నొప్పి కలగలేదు.

నాకు బయోపాలిమర్స్ ఇంజెక్ట్ చేసినచోట గుండ్రటి బ్యాండ్ ఎయిడ్ వేసి ఇంటికి పంపారు.

ఇంటికెళ్ళాకా అద్దంలో చూసుకుంటే ఆశ్చర్యంగా అనిపించింది. హెన్రీ అయితే నేను అద్భుతంగా ఉన్నానని చెప్పాడు.

మొదట నాకు కొంచెం వెచ్చగా అనిపించింది. కానీ సంభోగ అనంతరం నాకు చాలా సౌకర్యవంతంగా ఉన్న భావన కలిగింది. ఇది నా ఆత్మగౌరవంతో ఏమాత్రం సంబంధం లేని విషయం. కేవలం ఆ పనిలో ఇద్దరం సంతృప్తి చెందాం.

కానీ తరువాత రోజులలో నా పిరుదలలో నుంచి ద్రవాలు బయటకు రావడం మొదలై నా ప్యాంట్ తడిచిపోయింది. ద్రవాలు బయటకు రాకుండా డాక్టర్ అక్కడో టేప్ వేయమని చెప్పాడు.

యదిరా పెరేజ్

ఫొటో సోర్స్, YADIRA PEREZ

ఎర్రగా, గట్టిగా మారిన పిరుదులు

నా పిరుదులపై ఓ రంధ్రం పడింది. అది సెల్యూలైట్ లా అనిపించింది. దీన్ని తొలగించుకోవడానికి డాక్టర్ దగ్గరకు వెళదామని హెన్రీ చెప్పారు.

డాక్టర్ దగ్గరకు వెళితే అతను ఆ రంధ్రంలో మరింత ద్రవాన్ని నింపారు. కానీ ఆ చిన్నరంద్రం ఎప్పటికీ పూడిపోలేదు.

ఒకవారం తరువాత రెండో ఇంజెక్షన్ వలన నా పిరుదులు వాచిపోయాయి. అవి ఎర్రగా, గట్టిగా మారి వేడిని వెదజల్లాయి.

తరువాత నా తుంటిభాగం, నడుము నుంచి వాపు పైవరకు వ్యాపించింది.

నేను పడుకోలేకపోయాను. ముందువైపు వక్షోజాలలో ప్రోస్థటీస్ కారణంగా నేను బోర్లా పడుకోలేను. అలా అని నడుమువాలుద్దామంటే పిరుదుల్లో బయోపాలిమర్స్ ఇబ్బందిపెడుతున్నాయి. దీంతో నరకం అనుభవించాను.

ఎక్కడైనా కూర్చోవాలంటే కూడా నరకమే. అడుగువేస్తే మంటెక్కిపోయేది.

నేనీ సమస్యలతో బాధపడుతున్న వేళ హెన్రీతో ప్రతివిషయమూ మారిపోయింది. మేమింకెంత మాత్రం సెక్స్‌లో పాల్గొనలేము. నేను ఎక్కువ నొప్పిని భరించలేకపోతున్నాను.

కానీ అతను నానుంచి సెక్స్ ఆశిస్తున్నాడు. అతనికేమాత్రం సహనం లేదు. నేనే స్థితిలో ఉన్నాను. నేనెంత నొప్పితో అల్లాడుతున్నాను. నా పరిస్థితేంటనేదానితో అతనికి సంబంధం లేదు. కేవలం అతను తన లైంగికవాంఛలు తీర్చుకోవాలనుకునేవాడు.

పిరుదుల వాపు, నొప్పి తగ్గేందుకు డాక్టర్ ఇంజెక్షన్లు ఇవ్వడం మొదలుపెట్టాడు.

ప్రతినెలా నాకు రుతుస్రావం అయినప్పడల్లా నాకు ఇదే సమస్య. నా పిరుదులు, నడుము, తుంటిభాగం వాచిపోయేవి. అవి ఎర్రగానూ రాయిలానూ మారి నన్ను బాధపెట్టేవి.

‘‘ బాధపడకండి. కొన్నిసార్లు ఇలా జరుగుతుంది. ఈ సమస్యను పరిష్కరించబోతున్నాం’’ అని డాక్టర్ చెప్పారు.

ఇలా ప్రతినెలా డాక్టర్ ఇంజెక్షన్లు ఇవ్వడం ఓ ఏడాదిపాటు సాగింది.

అయితే మేం ఈ ఇంజెక్షన్లకు ఎటువంటి డబ్బులు ఇవ్వకపోవడం వలన ఓ ఏడాది తరువాత ఇది చాలా ఖరీదైన వ్యవహారమని తాను ఇంకా ఈ ఇంజెక్షన్లు ఇవ్వలేనని డాక్టర్ చెప్పేశారు.

గినియా పిగ్

నాకు రుతుస్రావం వచ్చినప్పుడల్లా నా పిరుదులువాచేవి. అవి గట్టిగానూ తయారయ్యేవి. నేను అప్పుడు కూర్చోలేకపోయేదానిని. ఏ పని చేయలేకపోయేదానిని.

డాక్టర్ మార్చి డాక్టర్ దగ్గరకు వెళ్ళేదానిని. వారు నాకు యాంటీబయాటిక్స్, యాంటీ ఎలర్జీ మందులు ఇచ్చి పంపేవారే కానీ, ఎటువంటి పరిష్కారాన్నీ చెప్పలేదు.

చివరికి నాకేమయ్యేందో అర్థంకాక ఎవరూ నాకు సాయం చేయడానికి ముందుకు రాలేదు.

బయోపాలిమర్స్ పై పరిశోధన చేస్తున్న డాక్టర్‌ను సంప్రదించేవరకూ నాకీ దుస్థితి ఎదురైంది. ఆయన నన్ను రుమటాలాజిస్టును కలవమని చెప్పారు. ఆ డాక్టర్ నాకు పరీక్షలు చేసి, నా తుంటి భాగంలో రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉందని చెప్పారు.

అప్పటికి నా వయసు 27 లేదా 28 ఏళ్ళు.

అయితే ఇది బయోపాలిమర్స్ వలనో కాదో అని డాక్టర్ చెప్పలేకపోయారు. కానీ వాపు రాకుండా మందులు సూచించారు.

కారకస్‌లోని సామాజిక భద్రత మందుల షాపులో కొన్నిరోజులు మందులు తీసుకున్నాను.

అప్పుడు నా తుంటి, నడుము భాగంలో వాపు తగ్గింది.

బయోపాలిమర్స్ పై పరిశోధన చేస్తున్న డాక్టర్‌ను ఓ ఏడాదిపాటు కలుస్తూనే ఉన్నాను. నా విషయంలో ఏం చేయాలోఆయనకు తెలియదు. ఆయన ఇతర సర్జన్లను సంప్రదించారు. తరువాత లైపోసక్షన్ చేయించుకోమని ఆయన సలహా ఇచ్చారు.

నాకు ఆపరేషన్ చేయించేందుకు సిద్ధంగా లేనని ఆయన చెప్పారు. అప్పట్లో కాస్త ఉపశమనం కలిగించిన విషయం ఏమిటంటే నా హిప్స్‌లోకి పైపు వేసి తీయగిలిగినంత మేరకు బయోపాలిమర్స్ ను తీశారు.

ఆ డాక్టర్ కు నేను, మరో మహిళ మాత్రమే పేషెంట్లం. దీంతో ఆయనకు మేమొక ప్రయోగశాలగా మారాం.

నేనప్పుడు చాలా కుంగిపోయాను. నా శరీరంలోంచి ప్రతి అణువును బయటకు తీసేయమని డాక్టర్‌కు చెప్పేదానిని. నాకు నడకలో ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ నా తుంటిభాగం, నడుము దెబ్బతిన్నాయి.

వెయిటింగ్ రూమ్‌లో ఏం చేశానంటే..

బయోపాలిమర్స్‌ను ఎక్కించిన డాక్టర్‌తో నేను, హెన్రీ మాట్లాడాం. ఏం జరిగిందో చెప్పాం. ఆ సమయంలో కూడా ఇంప్లాంట్స్ కోసం మహిళలు వరుసలో నిలబడి ఉండటం చూశాను.

ఒకసారి నేను తీవ్ర మనోవేదనకు గురయ్యాను. బయోపాలిమర్స్ ఎక్కించిన డాక్టర్ వద్ద వెయిటింగ్ రూమ్‌లో నా ప్యాంట్ విప్పి అక్కడున్న పేషెంట్లకు నా పిరుదులు చూపించి నా పరిస్థితిని వివరించాను.

‘‘ ఇంప్లాంట్స్ చేయించుకోకండి, చేయించుకోకండి... నాకేమైందో చూడండి’’ అంటూ పిచ్చిగా అరుస్తూ వారికి చెప్పాను.

కానీ వారిలో ఒకరు ‘ అది లాటరీ లాంటిది, అందరికీ అలాగే జరుగుతుందని చెప్పలేం’’ అన్నారు.

ఆ డాక్టర్ ఇక ఏమాత్రం సాయం చేయలేనని చెప్పేశారు. ‘‘ నా సమస్యను పరిష్కరించండి. లేదా నేను ప్రతిరోజూ మీ ఆస్పత్రికి వచ్చి పేషెంట్లందరికీ నా పిరుదులు చూపించి నాకు జరిగిన నష్టాన్ని చెప్పి, వారిని భయపెడతాను’’ అని చెప్పాను.

దీంతో ఆయన నేను వేరే డాక్టర్ దగ్గర లైపోసక్షన్ చేయించుకోవడానికి అవసరమయ్యే డబ్బు చెల్లించారు. బయోపాలిమర్స్ పై పరిశోధన చేసిన డాక్టర్ 2011లో నాకు ఈ ఆపరేషన్ చేశారు. నాకు ఎంఆర్ఐ చేశాకా నా పిరుదులలో కొంత మెటీరియల్ ఉండిపోయినట్టు గుర్తించారు. తరువాత గోళాలతో నిండిఉన్న మెత్తని పదార్థాన్ని ఓ జాడీడు తీశారు.

కోలుకోలేని నష్టం

ఓ ఏడాదిపాటు నేను బానే ఉన్నాను. కానీ 2012లో నాకు పిరియడ్స్ వచ్చినప్పుడు మళ్ళీ ఆ లక్షణాలు కనిపించాయి.

నా పిరుదులు గట్టిగా అయిపోయాయి. డాక్టర్ నన్ను ఎంఆర్ఐకు పంపారు. ఆ తరువాత నా పిరుదులలో ఇంకా 15శాతం బయోపాలిమర్స్ మిగిలిపోయినట్టు చెప్పారు.

మరోసారి ఆయన లైపోసక్షన్ చేశారు. ఈ ఆపరేషన్‌కు నేనే డబ్బులు చెల్లించాను. నేనప్పుడు నా నడుముకు బెల్ట్ ధరించాను.

దీని తరువాత కొన్నిరోజులలకే నేను గర్భవతిని అయ్యాను.

నాకు 17 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు మొదటి పాపకు జన్మనిచ్చాను. నాకెటువంటి పునరుత్పత్తి సమస్యలూ లేవు. కానీ ఇప్పుడు 32 ఏళ్ళ వయసులో పిండం నిలవలేదు.

డాక్టర్ నన్ను పరీక్షించి నాకు హష్మిటో థైరోయిడిటిస్ ఉన్నట్టు చెప్పారు. అంటే థైరాయిడ్‌పై రోగనిరోధకశక్తి దాడిచేస్తోందని చెప్పారు. థైరాయిడ్ చురుకుగా లేకపోవడం వలన ఇలా జరిగిందని, బయోపాలిమర్స్ వలన కూడా ఇలా జరిగి ఉండొచ్చని చెప్పారు.

అయితే ఇదెందుకు జరిగిందనే విషయం డాక్టర్ కు అర్థం కాలేదు. అయితే అతను నా బ్రెస్ట్ ప్రోస్థసిటిస్ వద్దే ఆగిపోయాడు. నా శరీరం ప్రోస్థసిటిస్‌ను అంగీకరించింది కానీ, బయోపాలిమర్స్‌ను కాదని అర్థమైంది.

నిజానికి నాకు ఇంత వేదన చెందాల్సిన అవసరమే లేదు. కేవలం ఇంప్లాంట్స్ కారణంగానే నేనింత బాధపడాల్సి వచ్చింది.

2014 జులైలో మరోసారి గర్భం దాల్చాను. ఈసారి నాకెటువంటి సమస్యలు లేకుండా నా కొడుకు లియో పుట్టాడు.

నొప్పి తిరగబెట్టింది

రెండోసారి ఆపరేషన్ అయ్యాక నా జీవితం మారిపోయింది. పదేళ్ళ వరకు నాకు ఎటువంటి నొప్పి లేదు. కానీ కిందటి ఏడాది అక్టోబరులో మరోసారి తుంటిభాగం, నడుము వాచాయి.

అయితే ఈసారి ఇవి తుంటిభాగం, నడుముతో ఆగలేదు. మొహం, చేతులకు కూడా వాపు వ్యాపించింది. మొదటిసారి నేను కీళ్ళనెప్పులు అనుభవించాను.

నాకు జ్వరమొచ్చినట్టు ఉండటంతోపాటు ఒళ్ళునెప్పలు మొదలయ్యాయి. నా తలపగిలిపోతుందేమోనంత నొప్పి వచ్చింది. నేను హాస్పిటల్‌కు పరిగెత్తాను. ఎమర్జెన్సీ రూమ్‌లో వేచి ఉన్నప్పుడు నా శరీరమంతా వణికిపోయింది. బయోపాలిమర్ల వలనే ఇలా జరుగుతోందని నేను డాక్టర్లకు చెప్పాను. కానీ నేనేం మాట్లడుతున్నానో అర్థం కావడంలేదని డాక్టర్ చెప్పారు. వారు నాకు ఎలక్ట్రోకార్డియోగ్రామ్ చేశారు. అందులో ఎటువంటి సమస్యాలేదని వచ్చింది. అప్పుడు కోవిడ్,ఫ్లూటెస్ట్ చేయించుకోమని చెప్పారు. ఆ రెండు కూడా నెగటివ్ అనే వచ్చాయి.

ఇదంతా బయోపాలిమర్స్ వలనే అని నేను చెపుతూనే ఉన్నాను. కానీ వారు నన్ను మూడురోజులపాటు హాస్పిటల్‌లోనే ఉంచారు. రిపోర్ట్సులో ఎటువంటి ఇన్ఫెక్షన్ లేదని వచ్చినా వారు నన్ను ఆస్పత్రిలోనే ఉంచి ఆ తరువాత పంపారు.

నా శరీరంలో ఇంప్లాంట్స్ ఉన్నాయని, అవే నన్ను ఇబ్బంది పెడుతున్నాయని, వాటిని తొలగించాలని నేను డాక్టర్‌కు చెప్పాను.

కానీ డాక్టర్లు నాకు ఆపరేషన్ చేయమని చెప్పారు. దీంతో నేను ఓ ప్రైవేటు కన్సల్‌టెంట్ సహకారంతో సర్జన్‌ను కలిశాను.

నా అత్యవసర స్థితి, ఇన్సూరెన్స్ కారణావలన వారు ఆపరేషన్ చేయమని చెప్పారు. ఎందుకంటే దీనిని వారొక కాస్మోటిక్ సర్జరీగా భావించారు. అయితే వారు నాకు యాంటీబయాటిక్స్ పదిరోజులకు సరిపడా ఇచ్చారు. ప్రతి 8గంటలకు ఒకటి వాడమని చెప్పారు. కొన్నిరోజుల తరువాత నేను కొద్దిగా కోలుకున్నాను.

యదిరా పెరేజ్

ఫొటో సోర్స్, YADIRA PEREZ

ఫొటో క్యాప్షన్, తన కుమారుడి కోసం యాంటిడిప్రెసెంట్ మందులు వాడకూడదని యదిరా నిర్ణయించుకున్నారు

కుంగుబాటు

అసలు నాకేం జరుగుతోందని నేను డాక్టర్‌ని అడిగాను. ఆయన ఇందుకు రెండు అవకాశాలు ఉన్నాయని చెప్పారు. బయోపాలిమర్స్ అవశేషాలైనా బాధపెడుతూ ఉండొచ్చు... రెండోది వక్షోజాలలోని ప్రోస్థసీస్ అయినా కారణం కావచ్చు అని చెప్పారు. వక్షోజాలలోని ప్రోస్థసీస్‌ను తొలగించుకోమని కూడా ఆయన సలహా ఇచ్చారు.

నేను తీవ్రమైన ఆందోళనతో అప్పటికే ఏడాదిన్నరగా మియామిలో ఉంటున్నాను. నా కుటుంబాన్ని చూడటానికి నేను వెనిజులాకు తిరిగి రావాలనుకుంటున్నాను. నా తల్లి, సోదరుడు లేకుండా నేను ఆస్పత్రి పాలయ్యి చాలా కష్టాలు పడ్డాను. మేం ముగ్గరం చాలా అనుబంధంతో ఉండేవాళ్లం.

యాంటీడిప్రెసెంట్ మందులు వాడమని డాక్టర్ సూచించారు. కుంగుబాటు కారణంగానే నా శరీరం ఇలా ప్రతిస్పందిస్తోందని డాక్టర్ చెప్పారు. ‘‘ ఈ చిన్న మాత్ర తీసుకోండి. ఇది మిమ్మల్ని హాయిగా ఉంచుతుంది’’ అని చెప్పారు.

నేను నా సైకాలజిస్ట్‌ను కలిశాను. ఆయన ఆ చిన్నమాత్రలను వేసుకోవద్దని, అవి అలవాటుపడితే లియోకు దూరమైపోతావని చెప్పారు.

దీంతో నేను యాంటి డిప్రెసెంట్ మందులు వాడకూదనుకున్నాను. బయోపాలిమర్స్‌లో స్పెషలిస్ట్ అయిన డాక్టర్‌ని కలవాలని నిర్ణయించుకున్నాను.

కొలంబియాలో ఇటువంటి డాక్టర్‌ను కనుగొన్నాను. కానీ నా ఇమ్మిగ్రేషన్ సమస్యల వనల నేనప్పుడు అమెరికా వదిలి వెళ్ళే పరిస్థితి లేదు. కానీ నేను ఆరోగ్యకారణాలతో ప్రయాణించడానికి రిక్వెస్ట్ పెట్టుకన్నాను. అయితే తరువాత ఈ నొప్పి కొద్దిగా తగ్గడంతో దీని గురించి కొంచెం ఆలోచించాలని నిర్ణయించుకున్నాను.

సర్జరీ మచ్చలు

నేను ఓ ఫ్రెండ్‌తో కలిసి ఓహియోకు రోడ్డు ట్రిప్ వెళ్ళాను. ఎక్కువ సేపు కూర్చోవడం వలన నా పిరుదులు వాచాయి. మళ్ళీ అవి ఎర్రగా, గట్టిగా అయ్యాయి.

దీంతో నాకు జ్వరమొచ్చినట్టుగానూ, అలసటగా అనిపించింది. నేను ఇక మంచం దిగలేననుకున్నాను.

నేను ఓహియోలో ఉన్నప్పుడు వెనిజులా నుంచి హెన్రీ లియోకు కాల్ చేశాడు. కానీ నేనా ఫోన్‌లో మాట్లాడాలనుకోలేదు. నేనీ స్థితిలో ఉండటానికి అతనే కారణమని తెలుసుకునేవరకు నేను మాట్లాడలనుకోలేదు. కానీ అతను మాత్రం ‘ఇది మనిద్దరి నిర్ణయం’ అని చెప్పాడు.

నేను చాలా విషయాలకు అంగీకరించాల్సి వచ్చింది. ఎందుకంటే అతను లియోకు తండ్రి. నేను చాలా నేర్చుకున్నాను. కానీ ఈ ప్రక్రియలో నా గుర్తింపును కోల్పోయాను.

నేను ఎక్కువగంటలు కూర్చుని ప్రయాణం చేయలేక మియామికి విమానంలో తిరిగొచ్చాను. నేను తిరిగొచ్చేటప్పుడు ఓ ఫ్రెండ్ డాక్టర్ నాయర్ నారాయణన్ ఫోన్ నెంబరు ఇచ్చారు. ఆయన బయోపాలిమర్స్‌లో నిపుణుడని చెప్పారు. కాకతాళీయంగా ఆయన కూడా మియామిలోనే ఉంటున్నారు. ఇలాంటి కేసులకోసం ఆయన కూడా ఎదురుచూస్తున్నారు.

నేనా డాక్టర్ దగ్గరకు వెళ్ళాను. ఆయన కొన్ని టెస్టులు చేయించుకు రమ్మన్నారు. ఆపరేషన్‌కు ముందు నేను చచ్చిపోతామోనని భయమేసింది.

నేనీ ఆపరేషన్ కోసం పెద్దమొత్తంలో అప్పు చేయవలసి వచ్చింది. ఎందుకంటే నా సమస్యకు ఇన్సురెన్స్ కవరేజీ లేదు.

ఎట్టకేలకు ఆ డాక్టర్ నాకు ఓపెన్ సర్జరీ చేశారు. చర్మాన్ని కోసి మొత్తం బయోపాలిమర్స్‌ను బయటకు తీశారు. లోపల కండరాలకు అతక్కుపోయిన కొన్ని గుండ్రటి పాలిమర్స్‌ను ఆయన కనుగొన్నారు.

దీన్నుంచి కోలుకోవడానికి చాలా కాలం పట్టింది. పైగా ఒకటే నొప్పి. మొదటి మూడు వారాలైతే కనీసం కూర్చోలేని పరిస్థితి. దీంతో మూత్రవిసర్జన కూడా నుంచునే చేయాల్సి వచ్చేది.

నా కుమారుడు లియో నాకు చికిత్సలోనే కాదు ప్రతివిషయంలోనూ సాయమందించాడు. రెండునెలలపాటు నేను డ్రైవ్ చేయలేకపోయాను. వాడిని ఎక్కడా బయటకు తీసుకువెళ్ళలేకపోయాను.

నేను ఇంటినుంచే పనిచేయడం మొదలుపెట్టాను. ఎంతసేపు కంప్యూటర్ ముందు నిలబడిగలిగితే అంతసేపు నుంచునే పనిచేశాను.

సర్జరీ కారణంగా నాకు పెద్ద మచ్చలు మిగిలాయి. అవెప్పుడూ నేనేం అనుభవించానో తెలియజేస్తుంటాయి.

నేనిప్పుడు బయోపాలిమర్స్ వలన కలిగే నష్టాలపై చైతన్యం కలిగించాలని భావిస్తున్నాను.

ఎవరైతే బయోపాలిమర్స్ ను ఇంజెక్ట్ చేయించుకోవాలనుకుంటున్నారో దయచేసి ఆ పనిచేయకండి. మిమ్మల్ని మీరు బాధపెట్టుకోకండి.

ఎవరైతే వీటివలన నొప్పి అనుభవిస్తున్నారో వారికి ప్రత్యామ్నాయ మార్గాలు కూడా ఉన్నాయని చెపుతున్నాను.

ఎట్టి పరిస్థితులలోనూ ఆశవదులుకోకండి.

యదిరా పెరేజ్

ఫొటో సోర్స్, YADIRA PEREZ

ఫొటో క్యాప్షన్, బయోపాలిమర్స్ తొలగింపు గురించి యాదిరాకు వివరిస్తున్న డాక్టర్ నారాయణన్

బయోపాలిమర్స్ లక్షణాలు ఏమిటి?

నాయర్ నారాయణన్.. యాదిరా ఇంప్లాంట్స్‌ను తొలగించిన వైద్యుడు. బయోపాలిమర్స్ దేనితోనైనా తయారు చేయవచ్చని చెప్పారు.

నారాయణన్ మియామిలోని తన ఆస్పత్రిలో ఇటీవలే ఓ పేషెంట్‌కు చికిత్స అందించారు. ఆ పేషెంట్ పిరుదలలోకి ఇంప్లాంట్స్ పేరుతో మోటార్ అయిల్ ఇంజన్ ఎక్కించారు.

బయోపాలిమర్స్ కలిగించే ప్రతికూల ప్రభావాలను ఆయన వివరించారరు.

కాళ్ళలో నెప్పులు. లేదా నడవలేకపోవడం

మొద్దుబారడం

కండరాలు, కీళ్ళ నెప్పులు

ఎక్కువసేపు కూర్చోలేకపోవడం, పడుకోలేకపోవడం

మానసిక గంరదగోళం

చర్మం రంగుమారడం,

యాదిరా ఎదుర్కొన్న కష్టాలకు కారణం ‘యాడ్జువంట్-ఇండ్యుస్డ్ ఇన్ఫ్లమేటరీ ఆటోఇమ్యూన్ సిండ్రోమ్, లేదా ఆసియా సిండ్రోమ్’ అని చెప్పారు. ఇది బయటి పదార్థాలు శరీరంలోకి వస్తే రోగనిరోధక వ్యవస్థ తీవ్రంగా ప్రతిస్పందిస్తుందని చెప్పారు.

‘‘ నా థియరీ ప్రకారం మన రోగనిరోధ వ్యవస్థను స్పందించమని శరీరం చెపుతుంది. అయితే ఇది ఇంప్లాంట్స్ ఉన్న ప్రాంతాలలో కాకుండా మిగిలిన చోట్ల తీవ్రంగా స్పందించడం వలన సమస్యలు తలెత్తుతాయి’’ అని చెప్పారు.

ఇది కేవలం థియరీయేనని, ఎందుకంటే బయోపాలిమర్స్ పై చెప్పుకోదగ్గ పరిశోధనలు జరగలేదన్నారు.

సిలికాన్ శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తుందని ఇప్పటిదాకా నిరూపితం కాలేదు.

యాదిరాలాంటి అందమైన అమ్మాయికి కాస్మొటిక్ సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం లేదు. నా దగ్గరకు లాటిన్ మహిళలు ప్రత్యేకించి వెనిజులావాళ్ళు ఎక్కువ వస్తున్నారు అని చెప్పారు.

ఇటువంటివారికోసం అమెరికన్ సొసైటీ ఆప్ ప్లాస్టిక్ సర్జన్లు ఓ గ్రూపు ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.

ఇవికూడా చదవండి :

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)