గాజాపై ఇజ్రాయెల్ అణుదాడి చేస్తుందా, అరబ్ దేశాలు ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి?

ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు

ఫొటో సోర్స్, GETTY IMAGES

హమాస్‌ మిలిటెంట్ గ్రూప్‌ను కూకటివేళ్లతో సహా నాశనం చేసేందుకు మెరుపుదాడులు కొనసాగుతోన్న ఈ సమయంలో, ఓ ఇజ్రాయెల్ మంత్రి చేసిన ప్రకటన ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా అరబ్ దేశాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

హమాస్‌కు వ్యతిరేకంగా ‘గాజా స్ట్రిప్’పై అణు ఆయుధాల వాడటం ఒక ఆప్షన్ అని మితవాద పార్టీకి చెందిన సభ్యుడు, ఇజ్రాయెల్ ప్రభుత్వ మంత్రి అమిచాయ్ ఎలియాహు అన్నారు.

ఎలియాహు ఇజ్రాయెల్ ప్రభుత్వంలో సాంస్కృతిక శాఖ మంత్రి.

ఎలియాహు చేసిన ప్రకటనపై అరబ్ ప్రపంచంలో చాలా దేశాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ఐక్యరాజ్యసమితి అణు ఆయుధాల పర్యవేక్షణ సంస్థ ఐఏఈఏని కోరాయి.

సిరియా, లెబనాన్, సౌదీ అరేబియా వంటి దేశాలు ఈ ప్రకటనను తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ ప్రకటనతో ఇజ్రాయెల్ ప్రభుత్వం తీవ్ర ఇరకాటంలో పడింది.

మరోవైపు ఇజ్రాయెల్ ప్రభుత్వం మంత్రి ఎలియాహును కేబినెట్ సమావేశంలో పాల్గొనడకుండా తప్పించింది.

ఎలియాహు ప్రకటనపై ఇజ్రాయెల్ ప్రభుత్వం తనకు సంబంధం లేనట్లు స్పష్టం చేసింది.

గాజాపై న్యూక్లియర్ బాంబు వేయగలమంటూ ఇజ్రాయెల్ ప్రభుత్వానికి చెందిన మంత్రి చేసిన ప్రకటనను తాము తీవ్రంగా ఖండిస్తున్నామంటూ సిరియా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.

ఇజ్రాయెల్ దాడులు

ఫొటో సోర్స్, GETTY IMAGES

వివాదాస్పదంగా మారిన ప్రకటన

పాలస్తీనియన్ మిలిటెంట్ గ్రూప్ హమాస్‌కు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ జరుపుతోన్న యుద్ధంలో గాజా స్ట్రిప్‌పై న్యూక్లియర్ బాంబు దాడులు చేయడం ఒక మార్గమని ఇజ్రాయెల్ మంత్రి ఎలియాహు అన్నారు.

ఈ ప్రకటన వచ్చిన వెంటనే, ఎలియాహును ఇజ్రాయెల్ కేబినెట్ సమావేశాల్లో పాల్గొనకుండా నిషేధం విధించారు.

గాజా స్ట్రిప్‌పై న్యూక్లియర్ దాడి ఒక ఆప్షన్‌నా అనే ప్రశ్నపై ఒక రేడియో ఇంటర్వ్యూలో ఎలియాహు ఈ అభిప్రాయాన్ని తెలియజేశారని న్యూస్ ఏజెన్సీలు రిపోర్టు చేశాయి.

ఈ ప్రకటన బయటికి రాగానే, అధికార కూటమి, విపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.

ప్రభుత్వం నుంచి ఆయన్ను తొలగించాలని డిమాండ్లు వెల్లువెత్తాయి.

ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు, రక్షణ మంత్రి యోవ్ గలాంట్ కూడా ఈ ప్రకటనపై మండిపడ్డారు.

ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు

నెతన్యాహు స్పష్టత

యుద్ధం సమయంలో నిర్ణయాలు తీసుకునే భద్రతా కేబినెట్‌లో ఎలినాహు భాగం కాదని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు స్పష్టం చేశారు.

హమాస్‌కు వ్యతిరేకంగా జరుగుతోన్న యుద్ధంలో కేబినెట్‌కు ఎలాంటి ఆదేశాలు, సలహాలు ఇచ్చే అధికారం ఆయనకు లేదన్నారు.

తన ప్రకటనపై వివాదం చెలరేగడంతో ఎలియాహు తన ప్రకటనను వెనక్కి తీసుకున్నారు. మాట వరసకు, ఆవేశంలో అన్నానని క్లారిటీ ఇచ్చారు.

ఇజ్రాయెల్ దాడులు

ఫొటో సోర్స్, GETTY IMAGES

‘ఇజ్రాయెల్ న్యూక్లియర్ ప్రోగ్రామ్‌ను బయటపెట్టాలి’

ఇజ్రాయెల్ ప్రభుత్వ స్పందనను, మంత్రి ఎలియాహు స్పష్టతను అరబ్ దేశాలు పట్టించుకోవడం లేదు. ఇజ్రాయెల్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి.

ఈ ప్రకటనలు ఇజ్రాయెల్ వాస్తవాలు దాస్తుందని ధ్రువీకరిస్తున్నాయని సిరియా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి సిరియన్ న్యూస్ ఏజెన్సీ సనా(ఎస్ఏఎన్ఏ)కి తెలిపారు. అంతర్జాతీయ నియంత్రణ వ్యవస్థకు వెలుపల వారి వద్ద ఈ ఆయుధాలు ఉన్నాయని అన్నారు.

అమెరికా, దాని మిత్ర దేశాల నుంచి వీటిని పొందుతుందని ఆరోపించారు.

భద్రతకు, ఈ ప్రాంత స్థిరత్వానికి, ప్రజల ప్రాణాలకు తీవ్ర ముప్పుగా ఈ ప్రకటనలున్నాయని అధికార ప్రతినిధి ఆందోళన వ్యక్తం చేశారు.

ఇజ్రాయెల్ న్యూక్లియర్ ప్రోగ్రామ్‌ను బయట పెట్టేందుకు ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ(ఏఐఈఏ) అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకుని, తమ బాధ్యతను నిర్వర్తించాలని సిరియా విదేశాంగ మంత్రిత్వశాఖ కోరుతోంది.

కట్టుబాట్లకు లొంగని ఈ వికృత పాలనను భద్రతా ప్రక్రియ కిందకు తీసుకురావాలని అభ్యర్థించింది.

గాజా

ఫొటో సోర్స్, GETTY IMAGES

పేలుళ్లు రెండు న్యూక్లియర్ బాంబు దాడులకు సమానం

లెబనాన్ హిజ్బొల్లా గ్రూప్, ఇజ్రాయెల్ ఆర్మీకి మధ్య ఇటీవల ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ సమయంలో ఇరాన్ హిజ్బొల్లాకు మద్దతు ఇచ్చింది.

లెబనాన్ ఏఐ మయాదీన్ టీవీ కూడా ఇజ్రాయెల్ మంత్రి ఎలియాహు ప్రకటనను ప్రసారం చేసింది.

అనూహ్యమైన ఉగ్రవాద కార్యకలాపాలను చేపట్టేందుకు ఇజ్రాయెల్ ప్రయత్నిస్తుందనడాన్ని ఈ ప్రకటన ప్రతిబింబిస్తుందని టీవీ చానల్ చెప్పింది.

ఈ ప్రాంతానికి, ప్రపంచ మొత్తానికి ఈ ప్రకటన ముప్పును కలిగిస్తుందని పేర్కొంది.

పాలస్తీనా విదేశాంగ మంత్రిత్వ శాఖ జారీ చేసిన ప్రకటనను ఈ చానల్ ప్రసారం చేసింది.

ఇజ్రాయెల్ మంత్రి ప్రకటనను పాలస్తీనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఖండించింది. దీన్ని అనాగరిక జాత్యహంకార ప్రకటనగా అభివర్ణించింది.

యూరో మెడిటరేనియన్ హ్యుమన్ రైట్స్ మానిటర్ విడుదల చేసిన డేటాను కూడా ఈ చానెల్ ప్రసారం చేసింది.

నవంబర్ 2న విడుదల చేసిన ఈ డేటాలో గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ 25 వేల టన్నులకు పైగా పేలుళ్లు జరిపిందని తెలిపింది. ఇవి రెండు న్యూక్లియర్ బాంబులకు సమానమని పేర్కొంది.

ఈ భీకర దాడుల నుంచి విముక్తి కల్పించాలని ఇజ్రాయెల్ నేతలను, సైన్యాధికారులను లెబనాన్ నేతలు కోరుతున్నారు.

సౌదీ అరేబియా

ఫొటో సోర్స్, GETTY IMAGES

సౌదీ అరేబియా ఏం చెప్పింది?

ఇజ్రాయెల్ మంత్రి ఎలియాహు ప్రకటనను సౌదీ అరేబియా కూడా ఖండించింది.

ఇజ్రాయెల్ ప్రభుత్వంలో తీవ్రవాదం, అనాగరికత ఓ స్థాయిలో ఉందో మంత్రి ఈ ప్రకటన తెలియజేస్తుందని సౌదీ అరేబియా మంత్రిత్వ శాఖ చెప్పినట్లు టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ న్యూస్‌పేపర్ తెలిపింది.

‘‘ఎలియాహును కేవలం సస్పెండ్ మాత్రమే చేశారు. వెంటనే ఆయన్ను తొలగించలేదు. మానవత్వం, చట్టం, నైతికత విలువలపై ఇజ్రాయెల్ ప్రభుత్వానికి ఎటువంటి గౌరవం లేదని దీని ద్వారా స్పష్టమవుతుంది’’ అని సౌదీ అరేబియా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఇజ్రాయెల్ మంత్రి ప్రకటనపై పాకిస్తాన్ కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

‘‘పాలస్తీనాకు వ్యతిరేకంగా న్యూక్లియర్ దాడి జరుపుతామంటూ ఇజ్రాయెల్ మంత్రి బెదిరింపుల ప్రకటనను విని మేం చాలా షాకయ్యాం’’ అని పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అన్నారు.

‘‘ఇది నరహత్య ఉద్దేశ్యాన్ని ప్రతిబింబిస్తుంది. ప్రాంతీయ శాంతికి, భద్రతకు, స్థిరత్వానికి ఇజ్రాయెల్ దురాక్రమణ కలిగించే ముప్పుపై ప్రపంచానికి ఈ ప్రకటన ఒక హెచ్చరిక’’ అని పాకిస్తాన్ పేర్కొంది.

ఇజ్రాయెల్ మంత్రి ప్రకటనను ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్(ఓఐసీ) కూడా వ్యతిరేకిస్తోంది.

ఇరాన్

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఇరాన్ ఏమంటోంది?

ఇరాన్ వార్తాపత్రికలు ఈ వార్తను మొదటి పేజీలో ప్రచురించాయి.

ఇజ్రాయెల్ అణు నిరాయుధీకరణ చేపట్టాలని పిలుపునిచ్చారు ఇరాన్ విదేశీ మంత్రి హుస్సేన్ అమిర్-అబ్దుల్లాహియాన్.

‘‘ఇజ్రాయెల్ మంత్రి న్యూక్లియర్ బాంబు బెదిరింపులు ఇజ్రాయెల్ ఓడిపోయిందనే దానికి సంకేతం. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి, అంతర్జాతీయ అణు శక్తి ఏజెన్సీ వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలి’’ అని ఇరాన్ విదేశాంగ మంత్రి ఎక్స్ ప్లాట్‌ఫామ్‌లో కోరారు.

ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి నాసర్ కనానీ కూడా ఇదే రకమైన ప్రకటన చేశారు.

ఇజ్రాయెల్ మంత్రి ప్రకటన మొత్తం ప్రపంచానికి ఒక హెచ్చరిక అని చెప్పారు. కనానీ ఈ ప్రకటనను తీవ్రంగా ఖండించారు.

‘‘ఈ ముప్పు తీవ్రతను అంతర్జాతీయ సమాజం పరిగణనలోకి తీసుకోవాలి. ఎందుకంటే, అణువ్యాప్తి నిరోధక, నిరాయుధీకరణ ఒప్పందాలను ఇది సవాలు చేస్తోంది’’ అని తెలిపారు.

ఇరాన్ వార్తాపత్రికలు కూడా ఈ ప్రకటనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి.

ఇరాన్ డైలీ జవాన్ ఈ వార్తను మొదటి పేజీలో ప్రచురించింది.

ఖతార్ కూడా దీనిపై మండిపడింది.

మానవ, నైతిక విలువలను, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తోన్న యుద్ధం నేరానికి సంబంధించిన కేసు ఇదని ఖతార్ తెలిపింది.

మంత్రిని కేవలం సస్పెండ్ చేసిన ఇజ్రాయెల్ ప్రభుత్వం, ఆయన విషయంలో చాలా మెతక ధోరణిని ప్రదర్శించిందని ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ చెప్పింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)