కిబ్బుట్జ్ బీరి: ఇజ్రాయెల్ తమను కాపాడగలదన్న ఈ ప్రాంత ప్రజల నమ్మకం కూడా ధ్వంసమైందా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, లూసీ విలియమ్‌సన్
- హోదా, బీబీసీ న్యూస్, బీరి
గాజాకి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే కిబ్బుట్జ్ బీరి వాసులు ఇజ్రాయెల్ - హమాస్ వివాదానికి ఎప్పుడూ దూరంగానే ఉండేవారు. కానీ ఇప్పుడు, ఖాళీగా కనిపిస్తున్న అక్కడి వీధులు వారి ఆగ్రహానికి నిదర్శనంగా మారాయి.
అక్టోబర్ 7న హమాస్ బందీలుగా మారిన గిలాడ్ కార్న్‌గోల్డ్ కుటుంబం నివాసముండే ఇంటిని ఇప్పుడు చూస్తే, అసలు అక్కడ కుటుంబం ఉండేదని కూడా అనిపించదు. ఆ ఇంట్లో ఏడుగురు ఉండేవారు.
మెషీన్ గన్ కాల్పులతో గోడలకు తూట్లు పడిపోయాయి. గదులు కూలిపోయాయి. మంటలు వ్యాపించి అక్కడంతా కాలిపోయింది. బుల్లెట్లు ఇనుప తలుపులను కూడా చీల్చిపడేశాయి.
మేము ఇంటి లోపలికి వెళ్లేప్పుడు ''ఇక్కడ చూడండి'' అంటూ ఉబికివస్తున్న కన్నీళ్లను ఆపుకున్నారు గిలాడ్. ''చూడండి వాళ్లకు మేమంటే ఎంత ద్వేషమో'' అన్నారు.
కిబ్బుట్జిమ్‌లు ఇజ్రాయెల్‌లోని వ్యవసాయ కమ్యూనిటీలు. వారిదో ప్రత్యేకమైన జీవన విధానం. సోషలిస్టు విధానాలు, విప్లవ భావాలు కలిగిన అసాధారణమైన, విజయవంతమైన ప్రజాస్వామ్య ప్రయోగం కిబ్బుట్జిమ్.

కుటుంబాల బాధలు
ఇంట్లోని సెక్యూరిటీ రూమ్ తలుపులు తుపాకీ తూటాలను తట్టుకున్నా, బయటి వైపు ఉన్న స్టీల్ షట్టర్లు మాత్రం ఎగిరిపోయాయి. ఇప్పుడు ఆయనకు కుటుంబం కూడా లేకుండా పోయింది.
బందీల్లో ఆయన కొడుకు, కోడలు, ఎనిమిదేళ్ల మనవడు, మూడేళ్ల మనవరాలు ఉన్నారు.
అది తన కోడలు తల్లిదండ్రులకు చెందిన ఇల్లు. దాడి జరిగిన తర్వాత గిలాడ్ ఆ ఇంటికి మొదటిసారి వచ్చారు. ''వాళ్లు కొత్త ఇల్లు నిర్మించినా, కిబ్బుట్జ్‌ను పునర్నిర్మించడానికి కొన్నితరాలు పడుతుంది'' అని ఆయన బీబీసీతో చెప్పారు.
''ఎక్కువ మంది ఇక్కడకు ఇక తిరిగిరారని నేను అనుకుంటున్నా'' అన్నారు.
ఇక్కడ కేవలం ఇళ్లు మాత్రమే ధ్వంసం కాలేదు, ఇక్కడి ప్రజలను ప్రభుత్వం కాపాడుతుందన్న నమ్మకం కూడా ధ్వంసమైంది. హమాస్ ఆధీనంలోని ప్రాంతానికి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఈ ప్రాంతం ఉందని తెలిసి కూడా ఇజ్రాయెల్ విధ్వంసమే లక్ష్యంగా ముందుకెళ్తోంది.
''అదొక భ్రమ'' అని గిలాడ్ నిట్టూర్చారు. ''ఇది 25 ఏళ్ల సుదీర్ఘ భ్రమ. ఇక్కడ సురక్షితంగా, ధైర్యంగా ఉన్నామని అనుకున్నాం. ఈ దాడి తర్వాత అర్థమైంది. ఇప్పటికైనా మేల్కొని ప్రత్యామ్నాయాలు వెతకాలి'' అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
నమ్మకం తిరిగొస్తుందా..
ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహుపై ఒత్తిళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఇజ్రాయెల్ తన పౌరులను రక్షించగలదనే నమ్మకాన్ని నిలబెట్టుకునే సామర్థ్యం తమకు ఉందని నిరూపించుకోవడమే ఇప్పుడు ప్రధాని నెతన్యాహు, ఇజ్రాయెల్ సైన్యం ముందున్న అతిపెద్ద సవాల్.
దానితో పాటు, హమాస్ చెరలో బందీలుగా ఉన్న 200 మందికి పైగా ఇజ్రాయెల్ పౌరులను విడిపించాలంటూ ప్రజల నుంచి కూడా ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. వారిలో గిలాడ్ కొడుకు, కోడలు, మనవడు, మనవరాలు కూడా ఉన్నారు.
బందీల విడుదల కోసం జరుగుతున్న రహస్య చర్చల ప్రకారం, ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న పాలస్తీనియన్ ఖైదీలందరినీ విడుదల చేస్తేనే బందీలను వదిలేస్తామని హమాస్ ప్రతిపాదిస్తోంది.
వాళ్లని విడిపించేందుకు అవసరమైనవన్నీ చేయాలని గిలాడ్‌తో సహా బందీల బంధువుల్లో చాలామంది కోరుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
నేపథ్యం చాలా ముఖ్యం
ఇజ్రాయెల్‌పై దాడికి కారకుడు హమాస్ నాయకుడు యహ్యా సిన్వార్. 12 ఏళ్ల కిందట ఖైదీల మార్పిడి ఒప్పందంలో భాగంగానే ఆయన విడుదలయ్యారు.
దీంతో బందీలను విడిపించేందుకు ఇజ్రాయెల్ భవిష్యత్తుతో జూదమాడాల్సిన ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు ప్రధాని బెంజమిన్ నెతన్యాహు.
హమాస్‌ను నాశనం చేయడం, బందీలను రక్షించడం అనే రెండింటీకి సమప్రాధాన్యం ఇస్తున్నామని ఇజ్రాయెల్ ప్రభుత్వం చెబుతోంది. అయినప్పటికీ, గాజాలో బాంబు దాడుల కారణంగా తమవారికి హాని జరుగుతుందేమోనన్న ఆందోళనతో బందీల కుటుంబాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
గత వారం బందీల బంధువులతో నెతన్యాహు మాట్లాడుతూ ''ఒత్తిడే ఇక్కడ ప్రధానం. ఒత్తిడి ఎంత పెరిగితే అవకాశాలు అంత మెరుగవుతాయి'' అని ఆయన అన్నారు. కానీ, చాలా కుటుంబాలు సమాధాన పడే స్థితిలో లేవు.
అదో కాళరాత్రి
గత వారం గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులను ఉధృతం చేయడంతో తనతో పాటు, తన కుటుంబ సభ్యులు రాత్రంతా మేల్కొనే ఉన్నామని, అక్కడ బందీలుగా ఉన్న వారి గురించి ఏదైనా తెలుస్తుందేమోనని ఎదురుచూస్తూ ఉన్నామని గిలాడ్ చెప్పారు.
''అదో కాళరాత్రి'' అని గిలాడ్ అన్నారు.
ప్రజల సెంటిమెంట్ కూడా బందీల కుటుంబాలకు అనుకూలంగా మారుతున్నట్లు కనిపిస్తోంది. మీడియాలో విస్తృత ప్రచారం తర్వాత బందీల కుటుంబాల నిరసన ప్రదర్శనలకు ప్రజల నుంచి మద్దతు పెరుగుతోంది.
గాజాపై దండయాత్రకు ముందు ఇజ్రాయెలీ వార్తా పత్రిక నిర్వహించిన సర్వేలో మూడింట ఒక వంతుకంటే తక్కువ మంది మాత్రమే దాడిని సమర్థించారు. అయితే, అంతకుముందు వారం నిర్వహించిన సర్వేలో మూడింట రెండొంతుల మంది గాజాపై దాడిని సమర్థించారు.
అదే సమయంలో హమాస్ ఇద్దరిద్దరు చొప్పున నలుగురు బందీలను విడుదల చేసింది. బయటకి చెప్పకపోయినా ఇంకా ఎక్కువ మందిని విడుదల చేయొచ్చని ఇజ్రాయెలీలు భావించారు.
కానీ మొదట్లో, బందీలను విడుదల చేయాలంటే పాలస్తీనియన్ ఖైదీలను విడుదల చేయాలన్న విషయంలో ప్రజల అభిప్రాయాల్లో స్పష్టమైన తేడా కనిపించింది.
నెతన్యాహు నేతృత్వంలోని ఇజ్రాయెల్ ప్రభుత్వం యుద్ధం మొదలుపెట్టిన తర్వాత అనూహ్యంగా దేశప్రజల్లో ఐక్యత పెరిగింది. అయితే, ఆ యుద్ధ లక్ష్యాలను సాధించేందుకు అనుసరించే పద్ధతులు అందరినీ ఏకతాటిపైకి చేరుస్తాయా? అనేదే ప్రశ్న.

ఫొటో సోర్స్, Getty Images
గడచిపోతున్న రోజులు
బందీలకు గుర్తుగా ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్‌లో వారి కుటుంబాలు ఏర్పాటు స్మారక స్థలంలోని గడియారం బందీలను తీసుకెళ్లి ఎన్ని గంటలు అవుతుందో సూచిస్తోంది. గడియారంలో అంకెలు మెరుస్తూ కనిపిస్తున్నాయి. పగలు ప్రసంగాలు, రాత్రిళ్లు కొవ్వొత్తుల ప్రదర్శనలు జరుగుతున్నాయి.
హమాస్ బందీలుగా తీసుకెళ్లిన వారి ఫోటోలతో చుట్టూ ఉన్న గోడలు నిండిపోయాయి.
ఒక్కసారిగా ఇజ్రాయెల్ ఊహించలేనంతగా మారిపోయింది.
గాజాపై ఇజ్రాయెల్ నిరంతర బాంబు దాడుల శబ్దాలు నిమిషం, లేదంటే రెండు నిమిషాలకోసారి బీరీలోని ఖాళీ వీధుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి.
కిబ్బుట్జ్‌లో ధ్వంసమైన తన ఇంటి తోటలోని ఊయల, మసి పొరల కింద చెక్కు చెదరకుండా ఉన్న తన మనవడి ఫుట్‌బాల్‌ను చూస్తూ గడుపుతున్నారు గిలాడ్.
ఆ ఇల్లు ప్రస్తుతం గత జ్ఞాపకాలన్నింటినీ ఖననం చేసిన సమాధిగా మారిపోయింది.
ఇది కూడా చదవండి:
- హమాస్‌ను ఉగ్రవాద సంస్థగా భారత్ ఎందుకు ప్రకటించలేదు?
- పాలస్తీనా ప్రత్యేక దేశంగా ఎందుకు మారలేదు? 4 ప్రధాన కారణాలు ఇవే...
- ఇజ్రాయెల్‌కు మద్దతుగా అమెరికా యుద్ధానికి దిగుతుందా?
- ఆ ఇద్దరు పదేళ్లుగా హమాస్ బందీలు... వర్ణ వివక్ష కారణంగానే ఇజ్రాయెల్ వారిని విడిపించడం లేదా?
- 'అది సొరంగాల సాలెగూడు'.. హమాస్ చెర నుంచి విడుదలైన మహిళ వ్యాఖ్యలు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















