గర్భవతిని కాకుండానే నా బిడ్డకు ఎలా పాలిచ్చానంటే...

ఫొటో సోర్స్, PRESS ASSOCIATION
- రచయిత, గియులియా గ్రాంచి
- హోదా, బీబీసీ బ్రెజిల్
లైబ్రేరియన్ అలిన్ తవెల్లా, ఆమె జీవిత భాగస్వామి కమీలా సౌజా 13 ఏళ్లుగా కలిసి ఉంటున్నారు. కామిలా సౌజా జర్నలిస్ట్‌గా పనిచేస్తున్నారు. పుట్టబోయే బిడ్డ కోసం ముందుగానే వీరెంతో ప్లాన్ చేసుకున్నారు.
అలిన్ 2022లో కృత్రిమ గర్భధారణ పద్ధతుల ద్వారా గర్భవతి అయ్యారు.
ఇదే సమయంలో తన జీవిత భాగస్వామికి చేదోడుగా ఉండేందుకు కమీలా పుట్టబోయే బిడ్డకు తను కూడా పాలు ఇవ్వాలని భావించారు. అందుకోసం, గర్భవతి కాకుండానే పాలు ఇచ్చేందుకు తోడ్పడే వైద్య చికిత్స చేయించుకోవాలనుకున్నారు.
ఇలా తన జీవిత భాగస్వామికి సహాయపడాలనుకున్నారు. ‘‘దీని గురించి నాకు కాస్త తెలుసు. అంతకుముందు దీని కోసం మా స్నేహితురాలు ప్రయత్నించింది.
కానీ, తన కేసులో ఇది ఫలించలేదు. అవకాశం ఉన్నప్పుడు ఎందుకు ప్రయత్నించకూడదని నాకనిపించింది.
మాతృత్వ బాధ్యతలు ఒకరినొకరు పంచుకోవాలనే ఆలోచన నుంచి నేను స్ఫూర్తి పొందాను. ఒకవేళ ఇలా పంచుకోలేనప్పుడు ఇది చాలా భారంగా మారుతుంది’’ అని కమీలా సౌజా తెలిపారు.
తనకు సాయపడే వైద్య నిపుణులను కమీలా కలిశారు. తన పరిస్థితిని వివరించారు. గర్భవతిని కాకుండా బిడ్డకు పాలివ్వాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈ పాలు కూడా తన భాగస్వామి ఇచ్చే పాల లాగే బిడ్డకు మంచి పోషణ ఇవ్వాలని అనుకున్నారు.
‘‘ఎలాంటి ఆశలు లేకుండానే నేను ఈ ప్రక్రియను ప్రారంభించాను. కానీ, వారిచ్చిన ట్రీట్‌మెంట్ చాలా బాగా పనిచేసింది. ట్రీట్‌మెంట్ ప్రారంభించిన తర్వాత తొమ్మిది రోజులకు నా చనుమొనల నుంచి పాల చుక్కలు వచ్చాయి. అందరికీ ఇలా జరగదు’’ అని కమీలా సంతోషం వ్యక్తం చేశారు.
చనుబాలు ఎలా ఉత్పత్తి చేయొచ్చు?
గర్భధారణ సమయంలో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్ల స్థాయిలు పెరిగి, బిడ్డ పుట్టడానికి ముందు పాల ఉత్పత్తిని నిరోధిస్తాయి.
బిడ్డ పుట్టిన సమయంలో ఈ హార్మోన్లకు ప్రధాన సోర్స్ అయిన ప్లాసెంటాను తొలగిస్తారు.
దీంతో చనుమొనలలో పాల ఉత్పత్తికి ప్రధాన కారకమయ్యే ప్రొలాక్టిన్ అనే హార్మోన్, శరీరంలో తన పనిని స్వేచ్ఛగా సాగిస్తుంది.
పేరెంట్స్ కాబోయే ఇద్దరు తల్లులకు, పిల్లల్ని దత్తత తీసుకునే వారికి, లాక్టేషన్‌ను ఇవ్వడం ద్వారా పాల ఉత్పత్తిని చేపట్టవచ్చు. దీనికి గర్భం దాల్చాల్సినవసరం లేదు.
గర్భం దాల్చిన వ్యక్తుల్లో ఎలాంటి జీవపరమైన ప్రక్రియ అవసరమో అలాగే దీన్ని కూడా చేపడతారు.
ఒకవేళ మీ వద్ద ఈ ప్రక్రియకు నెలల సమయం ఉంటే, ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్‌లతో కూడిన హార్మోనల్ థెరపీని డాక్టర్లు సూచించవచ్చు.
గెలక్టాగోగ్‌తో కూడిన మెడికేషన్ ద్వారా చనుమొనలలో పాల ఉత్పత్తిని పెంచవచ్చు.
చాలా మంది వాడేది డోంపెరిడోన్. వాంతులు, వికారం వంటి లక్షణాలకు వాడే డోంపెరిడోన్ వల్ల శరీరంలో ప్రొలాక్టిన్ స్థాయిలు కూడా పెరుగుతాయి. చనుబాల ఉత్పత్తికి కూడా ఇది ఉపయోగపడుతుంది. వైద్య కారణాల వల్ల కొందరు ఈ హార్మోన్లను వాడరు.

ఫొటో సోర్స్, Getty Images
పాలు చప్పరిచడం
ఈ విధానంలో అత్యంత ముఖ్యమైన భాగం పుట్టిన బిడ్డ పాలను చప్పరించడం. హార్మోన్లు లేకుండానే ఇది మంచి ఫలితాలను ఇస్తుందని బ్రెస్ట్‌ఫీడింగ్ స్పెషలిస్ట్, పిడియాట్రిషియన్ హోనోరినా డె అల్వైదా అన్నారు.
ఎలక్ట్రిక్ బ్రెస్ట్ పంపు అనేది పుట్టిన బిడ్డ రొమ్ము పాలను చప్పరించేలా చేసేందుకు ఉపయోగపడే అత్యంత ప్రభావంతమైన పద్ధతి అని కూడా ఒక పిడియాట్రిషియన్ వివరించారు.
పాలను ఉత్పత్తి చేసే ప్రొలాక్టిన్ విడుదల అయ్యేందుకు చప్పరించడం(అది బిడ్డ చేసినా లేదా ఎలక్ట్రిక్ పంపు ద్వారా చేసినా) అత్యంత అవసరం.
ఆక్సిటోసిన్ అనే ‘‘ప్రేమ హార్మోన్’’ పాలు చనుమొనల దగ్గరకి వచ్చేలా సహకరిస్తుంది.
గర్భధారణ సమయంలో రొమ్ములో కలిగే మార్పుల ద్వారా జన్మనిచ్చే తల్లి ఉత్పత్తి చేసినన్ని పాలను, వైద్య చికిత్స చేసుకున్న తల్లులు ఉత్పత్తి చేయకపోవచ్చని ప్రసూతి విభాగపు నర్సు, లాక్టేషన్ కన్సల్టెంట్ రెనాటా ఇయాక్ చెప్పారు.
కమీలా, అలిన్ విషయానికి వస్తే.. వీరిద్దరూ నాలుగేళ్ల నికోలాకు తల్లులు. గర్భం దాల్చని తల్లి కమీలా నుంచే పాలు ఆ బాబుకు సరిపోతున్నాయి.
బాబును కనే సమయంలో అలిన్ పలు ఇబ్బందులను ఎదుర్కొనడం వల్ల, ఆమె చనుమొనలలో పాల ఉత్పత్తి అంత ఎక్కువగా లేదు.
‘‘ట్రాన్స్‌లాక్టేషన్’’ అనే విధానాన్ని కూడా ఇయాక్ వివరించారు. దీని ద్వారా బ్రెస్ట్ మిల్క్ ట్యూబ్‌ను బిడ్డకు జన్మనివ్వని తల్లి రొమ్ము వద్ద ఉంచుతారు.
శిశువు చనుమొనలను చప్పరించినప్పుడు, రొమ్ము ప్రేరణకు గురవుతుంది. ఆ సమయంలో మరిన్ని పాలను ఉత్పత్తి చేయాలనే మెసేజ్‌ను మెదడు అర్థం చేసుకుంటుంది.
వైద్యుల సంరక్షణలోనే ఈ ప్రక్రియ చేపట్టాలని, ఎలాంటి ప్రమాదం ఉండదని ఈ ప్రసూతి విభాగాల నర్సు చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ట్రాన్స్‌జెండర్లు, నాన్-బైనరీ ప్రజలు కూడా పిల్లలకు పాలు ఇవ్వొచ్చు
ట్రాన్స్‌సెక్సువల్ పురుషులకు పూర్తిగా క్షీర గ్రంధులను తొలగించనంత వరకు పిల్లలకు పాలు ఇచ్చే సామర్థ్యం ఉంటుందని డాక్టర్ హోనోరినా డె అల్వైదా చెప్పారు.
‘‘మగ రొమ్ము నిర్మితమయ్యేందుకు క్షీర గ్రంధిలో కొంత భాగం భద్రపరుస్తూ ఉంటారు. మిగిలిన రొమ్ము కణజాలానికి ఆధారంగా ట్రాన్స్ మ్యాన్‌లు ఎక్కువ లేదా తక్కువ స్థాయిలో పాల ఉత్పత్తి చేయగలుగుతారు.
మగ హార్మోన్ల వినియోగం ఎలా ఉందనే దాన్ని కూడా అంచనావేయాలి. టెస్టోస్టెరాన్ గర్భం దాల్చే సామర్థ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది’’ అని అన్నారు.
ట్రాన్స్ మెన్‌లలో లాక్టేషన్‌ను ఎక్కించే ప్రతిపాదనను పరిశీలించే సమయంలో చాలా అంశాలు పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
కేవలం వారి శారీరక సమస్యలను మాత్రమే కాక, రొమ్ము కణజాలాన్ని చూడాలి. ప్రతి ఒక్క వ్యక్తి వ్యక్తిగత కోరికలను కూడా పరిగణనలోకి తీసుకోవాలన్నారు.
పుట్టినప్పుడు మగవారిగా ఉండి, ఆ తర్వాత మహిళలుగా మారిన ట్రాన్స్ వుమెన్ బిడ్డకు పాలివ్వడం కాస్త సవాలుతో కూడుకున్న విషయమే. కానీ, ఇవ్వొచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఈ మార్పిడి ప్రక్రియలో స్త్రీ హార్మోన్లు ఈ వ్యక్తులు పొందితే, వారిలో రొమ్ము కూడా అభివృద్ధి చెందుతుంది.
‘‘ఫెమినైజేషన్(హార్మోన్ థెరపీ) ప్రాసెస్‌లో ఎంత ఎక్కువ సేపు గడిపితే, అంత ఎక్కువగా రొమ్ములు అభివృద్ధి చెందుతాయి. ఇది నెమ్మదిగా సాగే ప్రక్రియ. దీనికి కాస్త సమయం పడుతుంది.
ఫెమినైజేషన్ చేయించుకున్న కొన్నేళ్ల తర్వాత చాలా మంది ట్రాన్స్ ఉమెన్‌లకు రొమ్ములు పూర్తిగా అభివృద్ధి చెందుతాయి’’ అని డాక్టర్ చెప్పారు.
నాన్ బైనరీ పర్సన్ జెనీఫర్. తనకు తాను ట్రాన్స్ సెక్సువల్ స్పెక్ట్రమ్‌గా ఆమె చెప్పుకుంటారు.
మహిళగా మారేందుకు హార్మోనలైజేషన్ ప్రక్రియ ప్రారంభించినప్పుడు, అదే నెలలో తన జీవిత భాగస్వామి గర్భవతి అని తెలిసింది.
‘‘పాలను ఉత్పత్తి చేసే ట్రీట్‌మెంట్‌ను నేను ప్రారంభించినప్పుడు, అది పనిచేస్తుందని నాకు తెలియదు. ఎందుకంటే, నా క్షీర గ్రంధులు అప్పుడే అభివృద్ధి చెందడం ప్రారంభమయ్యాయి.
అప్పటికే నా జీవిత భాగస్వామి ఆరు నెలల గర్భవతి. నా వద్ద తక్కువ సమయం మాత్రమే ఉంది’’ అని జెనీఫర్ చెప్పారు.
జెనీఫర్ లాంటి కొన్ని కేసులలో బ్రెస్ట్‌ఫీడింగ్ కోసం లాక్టాగోగ్ అనే వైద్య చికిత్సను ఉపయోగించారు. అంటే, తాత్కాలికంగా వీరికి స్త్రీ హార్మోన్లు పెరిగే డోసును ఇస్తారు.
ఈ ప్రాసెస్‌లో జెనీఫర్ రొమ్ములలో పాల ఉత్పత్తి అయ్యాయి. ‘‘పాలివ్వడమంటే కేవలం అనుబంధాన్ని, పుట్టిన పాప పనులను పంచుకోవడమే కాదు. నా కుటుంబంలో ఇది చాలా బాగా పనిచేసింది. పదేళ్లుగా నా జీవిత భాగస్వామి పాలు ఇస్తున్నారు. ఇప్పటికే ముగ్గురు పిల్లలున్నారు. పిల్లల్ని కూడా ఊహించని నేను, నా బిడ్డకు పాలిచ్చే అద్భుతమైన అనుభూతిని పొందుతున్నాను’’ అని జెనీఫర్ చెప్పారు.

ఫొటో సోర్స్, PERSONAL FILE
ఈ చనుబాలు సరైనవేనా?
గర్భవతి కాని వారి నుంచి వచ్చే పాలలో కూడా పోషకాలు మెండుగానే ఉంటాయి.
‘‘పాలిచ్చే సమయంలో స్త్రీ రొమ్ములలో అతి ముఖ్యమైన భాగమైన చనుమొనలు ‘ఆడిటర్’ మాదిరి పనిచేస్తాయి. అంటే, బిడ్డ లాలాజలానికి చెందిన లక్షణాలను ఇది గుర్తించి, బిడ్డ ఏం చేస్తుందో పాలను అందించే వ్యక్తికి తెలియజేస్తుంది’’ రెనాటా ఇయాక్ చెప్పారు.
గర్భవతి కానీ ట్రాన్స్‌జెండర్ మహిళలు, నాన్ బైనరీ పేరెంట్లు ఈస్ట్రోజెన్ ఆధారిత హార్మోన్ థెరపీ ద్వారా ఉత్పత్తి అయ్యే పాలు పోషకాలతో ఉంటాయని, నవజాత శిశువులకు వీటిని పట్టించవచ్చని జర్నల్ ఆఫ్ హ్యుమన్ బ్రెస్ట్‌ఫీడింగ్‌లో ప్రచురితమైన తాజా అధ్యయనంలో తెలిసింది.
ఇవి కూడా చదవండి:
- భారత్‌లో గత ఏడాది 1.68 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోయారు... ప్రపంచంలో ఒకే ఒక శాతం వాహనాలున్న దేశంలో ఇన్ని ప్రమాదాలా?
- గాజా రిపోర్టర్: 'కళ్ళతో చూడలేని వాటిని చూడాల్సి వస్తోంది... కెమేరా వెనుక నిలబడి చాలా సార్లు ఏడ్చాను'
- ఇజ్రాయెల్-గాజా: కుటుంబంలో నలుగురు పిల్లలు సహా 11మందిని కోల్పోయిన ఓ తండ్రి వేదన ఇది
- కేజ్రీవాల్ అరెస్టయితే ఆమ్ ఆద్మీ కథ ముగిసినట్లేనా... 5 ప్రశ్నలు-జవాబులు
- ఐఫోన్ హ్యాకింగ్ ఆరోపణలు: యాపిల్ వివరణపై కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ ఏమన్నారు?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














