భారత్‌లో గత ఏడాది 1.68 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోయారు... ప్రపంచంలో ఒకే ఒక శాతం వాహనాలున్న దేశంలో ఇన్ని ప్రమాదాలా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, నిఖిల హెన్రీ
- హోదా, బీబీసీ న్యూస్, దిల్లీ
భారత్‌లో నిరుడు జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 1,68, 491 మంది చనిపోయినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాహనాల్లో కేవలం ఒక్క శాతం వాహనాలు మాత్రమే ఉన్న భారత్‌లో, ప్రమాదాల కారణంగా చనిపోతున్న వారి సంఖ్య మాత్రం అత్యధికంగా ఉంటోంది.
2022లో నమోదైన మరణాల సంఖ్య అంతకుముందు ఏడాదితో పోలిస్తే 9.4 శాతం పెరిగిందని భారత రవాణా శాఖ తెలిపింది.
అలా ప్రమాదాల్లో చనిపోతున్న ప్రతి పది మందిలో ఏడుగురు వేగం కారణంగానే చనిపోతున్నారని రవాణా శాఖ పేర్కొంది.
నైపుణ్యం లేని డ్రైవింగ్, రోడ్లు, వాహనాల నిర్వహణ సరిగ్గా లేకపోవడం వల్ల ఇండియాలో రోడ్డు ప్రమాదాలు సర్వసాధారణ విషయంగా మారిపోయాయి.
దేశంలో రోజుకు 462 మంది, గంటకు 19 మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నట్లు రవాణా శాఖ మంగళవారం విడుదల చేసిన నివేదిక చెబుతోంది.
అలాగే, గతేడాది జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 4,43,000 మంది గాయాలపాలయ్యారు. 2021 నుంచి 2022 మధ్య కాలంలో ప్రమాద ఘటనలు 11.9 శాతం మేర పెరిగాయి. ఈ ప్రమాదాల్లో ఎక్కువ శాతం వెనక నుంచి మరో వాహనాన్ని ఢీకొట్టినవి, లేదా ఢీకొట్టి అక్కడి నుంచి పరారైన (హిట్ అండ్ రన్) ఘటనలే ఎక్కువ.
దేశంలో మధ్యప్రదేశ్‌లో అత్యధికంగా రోడ్డు ప్రమాద ఘటనలు నమోదయ్యాయని, దక్షిణాది రాష్ట్రం తమిళనాడు ఆ తర్వాతి స్థానంలో ఉన్నట్లు రవాణా శాఖ నివేదికలో తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
అయితే, 2020లో కోవిడ్ - 19 విజృంభించినప్పుడు మాత్రం ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గింది.
కోవిడ్ సమయంలో రోడ్డు ప్రమాదాలు, మరణాల సంఖ్య భారీగా తగ్గిందని, మరీముఖ్యంగా మార్చి, ఏప్రిల్ నెలల్లో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించినప్పుడు ప్రమాదాల సంఖ్య భారీగా పడిపోయినట్లు రవాణా శాఖ పేర్కొంది. అయితే, ఆ తర్వాత ఆ సంఖ్య మళ్లీ పెరిగింది.
రోడ్ల డిజైన్‌ను మెరుగుపరచడం, రహదారులపై నిఘా పెంచడం, ట్రాఫిక్ ఉల్లంఘనలకు కఠిన జరిమానాలు విధించడం వంటి చర్యలతో ఈ సమస్యను అరికట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు రవాణా శాఖ తెలిపింది.
ప్రమాదాలను అరికట్టేందుకు ప్రభుత్వ చర్యలు ఒక్కటే సరిపోవని, పౌరులు కూడా ట్రాఫిక్ నిబంధనలను మరింత సీరియస్‌గా పాటించాల్సిన అవసరం ఉందని రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గత నెలలో మనీకంట్రోల్ వెబ్‌సైట్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
''సూటిగా చెప్తున్నా. ప్రమాదాల సంఖ్య తగ్గకపోవడం అసంతృప్తి కలిగిస్తోంది. ఎందుకంటే, అవి తగ్గాలంటే ముందు మనుషుల ప్రవర్తనలో మార్పు రావాల్సిన అవసరం ఉంది'' అని ఆయన అన్నారు.
ప్రపంచ బ్యాంకు అధ్యయనం ప్రకారం రోడ్డు ప్రమాదాల కారణంగా ఏటా జీడీపీకి 5 శాతం నుంచి 7 శాతం వరకూ నస్టం కలుగుతున్నట్లు అంచనా.
ప్రమాద బాధితుల్లో దాదాపు సగం మంది పాదచారులు, సైక్లిస్టులు, బైకుల వినియోగదారులేనని, వారిలోనూ 84 శాతం మంది 18 నుంచి 60 ఏళ్లలోపు వయసు వారేనని ఈ అధ్యయనం తెలిపింది.
ఇవి కూడా చదవండి:
- అఫ్గానిస్తాన్: అంతర్యుద్ధం, పేదరికంతో అల్లాడుతున్న తాలిబాన్ల పాలనలో క్రికెట్ ఎలా వికసించింది?
- చిత్తూరు: భార్యతో ఉన్నప్పుడు పురుషుడు.. బాయ్‌ఫ్రెండ్‌ను కలిస్తే మహిళ
- ఐఫోన్ హ్యాకింగ్ ఆరోపణలు: యాపిల్ వివరణపై కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ ఏమన్నారు?
- ఖతార్ మరణశిక్ష నుంచి 8 మంది మాజీ నేవీ అధికారులను కాపాడటానికి భారత్ ముందున్న ఆప్షన్లు ఇవే
- ఉల్లిలో ఉండే పోషకాలు ఏమిటి? ఇది ఎక్కడ పుట్టింది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














