ఖతార్ మరణశిక్ష నుంచి 8 మంది మాజీ నేవీ అధికారులను కాపాడటానికి భారత్ ముందున్న ఆప్షన్లు ఇవే

ఫొటో సోర్స్, GETTY IMAGES
- రచయిత, రాఘవేంద్ర రావ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఖతార్ దేశం భారత్‌కు చెందిన 8 మంది మాజీ నేవీ ఆఫీసర్లకు మరణ శిక్ష విధించడంతో, వారిని రక్షించడానికి భారత ప్రభుత్వ ఏం చేయబోతోంది అన్నది చర్చనీయాంశంగా మారింది. వీరిలో విశాఖపట్నానికి చెందిన పాకాల సుగుణాకర్ కూడా ఉన్నారు.
ఖతార్ తీర్పుతో భారత్ దిగ్భ్రాంతికి గురైందని, తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నదానిపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది.
వారిని విడిపించేందుకు అన్ని చట్టపరమైన అవకాశాలను అన్వేషిస్తున్నట్లు వెల్లడించింది.
విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ఈ 8 మంది భారతీయుల కుటుంబాలను సోమవారం కలిశారు.
"కుటుంబ సభ్యుల ఆందోళనను, బాధను అర్థం చేసుకోగలం. వారి విడుదలకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తుంది’’ అని ఆయన భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు.

ఫొటో సోర్స్, ANI
ప్రధాని మోదీకి నమ్మకస్తుడైన దౌత్యవేత్తకు బాధ్యతలు
8 మంది భారతీయ నేవీ మాజీ అధికారులను శిక్ష నుంచి తప్పించే ప్రయత్నాలను ప్రధాని నరేంద్ర మోదీ తనకు ఎంతో విశ్వాసపాత్రుడైన దౌత్యవేత్త దీపక్ మిత్తల్‌కు అప్పగించారని వార్తలు వచ్చాయి.
మిట్టల్ 1998 బ్యాచ్‌కు చెందిన ఇండియన్ ఫారన్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి. ప్రస్తుతం ఆయన ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంవో)లో పని చేస్తున్నారు.
గతంలో ఖతార్‌లో భారత రాయబారిగా పని చేసిన ఆయనకు, అక్కడి ప్రభుత్వంలోని ఉన్నత స్థాయి వ్యక్తులతో మంచి సంబంధాలు ఉన్నాయని చెబుతారు.
ఈ బాధ్యతలు మిత్తల్‌కు అప్పగించడానికి ప్రధాన కారణం అదేనని భావిస్తున్నారు. సంబంధాలు నెరపడంలో మిత్తల్‌కు మంచి అనుభవం ఉందని అంటారు.
2019లో కుల్‌భూషణ్ జాదవ్ కేసు సందర్భంగా ఆయన పేరు బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది.
ది హేగ్‌లోని ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ (ఐసీజే)లో కుల్‌భూషణ్ జాదవ్ కేసు విచారణ సందర్భంగా, పాకిస్తాన్ సీనియర్ అధికారులు కరచాలనం చేయబోతే, ఆయన చేయి ఇవ్వకుండా నమస్తే అంటూ రెండు చేతులు జోడించారు.
ఈ ఘటనతో మిత్తల్ గురించి చాలా మందికి తెలిసింది.
ఏప్రిల్ 2020లో మిత్తల్ ఖతార్‌లో భారత రాయబారిగా నియమితులయ్యారు.
2021లో తాలిబాన్ అగ్రనేత షేర్ మొహమ్మద్ అబ్బాస్ స్టానెక్జాయ్‌తో మిత్తల్ చర్చలు జరిపారు.
అఫ్గానిస్తాన్‌లో తాలిబన్లు అధికారం చేపట్టిన తర్వాత భారత్‌తో అధికారిక దౌత్య చర్చలు జరపడం అదే తొలిసారి.

ఫొటో సోర్స్, GETTY IMAGES
భారత్ ముందున్న ఆప్షన్లు ఏంటి?
ఖతార్‌లో మరణశిక్ష ఎదుర్కొంటున్న ఆ ఎనిమిది మందిని కాపాడుకునేందుకు ఖతార్‌తో ఉన్న సత్సంబంధాలను ఉపయోగించుకోవడమే భారత్‌కు ఉన్న అత్యుత్తమ మార్గమని నిపుణులు చెబుతున్నారు.
దిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో పశ్చిమాసియా అధ్యయన కేంద్రంలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న ఏకే మహాపాత్ర ఈ అంశంపై బీబీసీతో మాట్లాడారు.
"భారత్‌కు దౌత్యపరమైన ఆప్షన్లు ఉన్నాయి. ఖతార్ శత్రు దేశమేమీ కాదు. భారత్‌తో ఆర్ధిక, స్నేహ సంబంధాలున్నాయి. భారతదేశానికి సరఫరా అయ్యే గ్యాస్‌లో 40 శాతం ఖతార్ నుంచి వస్తుంది. దాదాపు 6-7 లక్షల మంది భారతీయులు అక్కడ పనిచేస్తున్నారు. భారతీయ కంపెనీలు అక్కడ పెట్టుబడులు పెట్టాయి. కాబట్టి, వీరిని విడిపించడం కోసం ఖతార్‌తో శత్రుత్వం తెచ్చుకుని వీటన్నింటినీ పణంగా పెట్టలేం" అని మహాపాత్ర అన్నారు.
"భారత ప్రభుత్వం ముందు దౌత్యస్థాయిలో సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఖతార్ ఇంకా ఈ శిక్షల గురించి ఎక్కువ సమాచారం ఇవ్వలేదు" అని ఆయన అన్నారు.
ప్రాంతీయ స్థాయిలో ఒత్తిడి చేసేందుకు భారత్ ప్రయత్నించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
"ఖతార్‌తో ఒమన్, కువైట్ వంటి అరబ్ దేశాలకు మంచి సంబంధాలున్నాయి. కాబట్టి ఈ దేశాలతో మాట్లాడటం ద్వారా ఖతార్‌పై భారత్ ఒత్తిడి తీసుకురావచ్చు. అలాగే, అమెరికా వైపు నుంచి కూడా ఒత్తిడి చేయించవచ్చు. ఖతార్‌పై అమెరికాకు పట్టు ఉంది. ఇప్పటికీ ఖతార్‌లో అమెరికా నేవీ స్థావరం ఒకటి ఉంది’’ అని మహాపాత్ర వివరించారు.

ఫొటో సోర్స్, IGOR KOVALENKO/ANADOLU AGENCY VIA GETTY IMAGES
ఖతార్ అమీర్ వీరికి క్షమాభిక్ష పెట్టగలరా?
మరణశిక్ష పడిన ఈ ఎనిమిది మంది భారతీయులకు ఇప్పటికీ ఉన్నత న్యాయస్థానాల్లో అప్పీలు చేసుకునే అవకాశం ఉంది. ఇందుకోసం భారత ప్రభుత్వం వారికి పూర్తి సహాయాన్ని అందిస్తోంది.
అయితే, ఈ అప్పీళ్ల ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.
కోర్టు చర్యలు తీసుకున్న తర్వాత కూడా ఈ ఎనిమిది మందిని రక్షించడంలో భారత్ ప్రయత్నాలు ఫలించకపోతే, ఖతార్ అమీర్ పెట్టే క్షమాభిక్ష మాత్రమే వారిని కాపాడగలదని నిపుణులు అంటున్నారు.
ఖతార్‌తో భారత్‌కు ఉన్న సత్సంబంధాలు, ముఖ్యంగా వాణిజ్య సంబంధాల కారణంగా, వీరికి అమీర్ నుంచి క్షమాభిక్ష పొందడం భారత ప్రభుత్వానికి పెద్ద కష్టం కాకపోవచ్చని భావిస్తున్నారు.
రాజకీయ వ్యూహకర్త, కాలమిస్టు బ్రహ్మ చెలాని దీనిపై ఎక్స్‌లో స్పందించారు.
"కేసు రాజకీయ స్వభావాన్ని బట్టి, వారి తలరాత ఖతార్ అమీర్ చేతిలో ఉంది. ఆయన ఏ ఖైదీకైనా క్షమాభిక్ష పెట్టగలడు, శిక్షలను మార్చగలడు. ఎనిమిది మందిని ఉరితీస్తే అది భారత్‌తో ఖతార్ సంబంధాలకు కోలుకోలేని నష్టం కలిగిస్తుంది" అని ఆయన అన్నారు.
ఖతార్‌లో ప్రజాస్వామ్యం లేదు కాబట్టి, అక్కడి రాజు ఏ నిర్ణయమైనా తీసుకోగలడని ప్రొఫెసర్ ఏకే మహాపాత్ర కూడా అన్నారు.
‘‘రాజు తలుచుకుంటే మరణశిక్షను జైలు శిక్షగా మార్చవచ్చు. ఆయన అనుమతితో తర్వాత వారిని భారత్‌కు తీసుకురావచ్చు’’ అని ఆయన అన్నారు.
జోర్డాన్, లిబియాలలో భారత రాయబారిగా పనిచేసిన అనిల్ త్రిగుణాయత్ కూడా ఈ అభిప్రాయంతో ఏకీభవించారు.
‘‘నా దృష్టిలో ప్రధానమైన ఆప్షన్ ద్వైపాక్షిక చర్చలు. ఖతార్‌తో భారతదేశానికి ఉన్న సంబంధాలను పరిగణనలోకి తీసుకుంటే, ఖతార్ అమీర్ వీరికి క్షమాభిక్ష ప్రసాదించవచ్చు. అయితే, ఇది చివరి ప్రయత్నం కావాలి’’ అని అనిల్ త్రిగుణాయత్ అన్నారు.
ఖైదీల బదిలీపై భారత్, ఖతార్‌ల మధ్య ఒప్పందం ఉంది. ఖతార్ అమీర్ భారతదేశ పర్యటన సందర్భంగా ఈ ఒప్పందం కుదిరింది.
‘‘అప్పీల్‌కు వెళితే కోర్టు ఈ వ్యక్తుల శిక్షను జీవిత ఖైదుగా మార్చే అవకాశం ఉంది. ఆ తర్వాత వారిని ఖతార్ నుండి భారత దేశానికి ట్రాన్స్‌ఫర్ చేయడం గురించి ఆలోచించవచ్చు’’ అని త్రిగుణాయత్ అన్నారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
ఐసీజేలో న్యాయ పోరాటం?
ఈ సమస్యకు దౌత్యపరమైన పరిష్కారం దొరక్కపోతే భారత్‌కు మరో ఆప్షన్ కూడా ఉందని ప్రొఫెసర్ మహాపాత్ర అన్నారు.
"కుల్ భూషణ్ జాదవ్ విషయంలో చేసినట్లే అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయ పోరాటం చేయవచ్చు" అని ఆయన చెప్పారు.
అంతర్జాతీయ న్యాయస్థానానికి వెళ్లడం భారతదేశానికి ఉన్న చివరి ఆప్షన్ అని అనిల్ త్రిగుణాయత్ అన్నారు.
"ఈ ఆప్షన్‌ను ఉపయోగించాల్సిన అవసరం రాదని నేను అనుకుంటున్నాను. అన్నీ చర్చల మీద ఆధారపడి ఉంటాయి" అని ఆయన చెప్పారు.
అక్కడి చట్టాల ప్రకారం అప్పీలు చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ముందు అప్పీల్ ఆప్షన్ ఉపయోగించుకోవడం మంచిదని త్రిగుణాయత్ అన్నారు.
దౌత్యం మాత్రమే దీనికి పూర్తి పరిష్కారం కావొచ్చని అనిల్ త్రిగుణాయత్ చెప్పారు.
‘‘ ఖతార్ కూడా భారతదేశం తమకు అతి పెద్ద చమురు కొనుగోలుదారు అని గుర్తించాల్సి ఉంటుంది’’ అని ఆయన అన్నారు. భారత్, ఖతార్‌ల మధ్య పెద్దగా రాజకీయ విభేదాలు లేవని ప్రస్తావించారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
'భారత్‌కు ఖతార్ ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటోంది'
పర్షియన్ గల్ఫ్‌లో గ్యాస్ నిల్వలు అధికంగా ఉన్న దేశం ఖతార్. అమెరికాకు సన్నిహిత దేశం కూడా. అయితే, అదే సమయంలో ఈ దేశానికి హమాస్‌తో మంచి సంబంధాలు ఉన్నాయన్నది కూడా గుర్తు పెట్టుకోవాలి.
ఇజ్రాయెల్, హమాస్ మధ్య ఘర్షణలో ఖతార్ మధ్యవర్తిత్వం కారణంగా ఇద్దరు అమెరికన్ బందీల విడుదల సాధ్యమైంది.
అంటే, ఖతార్‌కు, ఇజ్రాయెల్ మధ్య సంబంధాలు బాగా లేవని స్పష్టమవుతోంది.
ప్రస్తుతం ఈ ఎనిమిదిమంది భారతీయులపై వచ్చిన ఆరోపణల మీద ఖతార్ ఎలాంటి ప్రకటనలు చేయలేదు. వీరు ఖతార్‌లో ఉంటూ ఇజ్రాయెల్ కోసం గూఢచారులుగా పని చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో భారతీయులకు విధించిన మరణశిక్షకు, ఇజ్రాయెల్ పట్ల భారత్ వైఖరికి ఏమైనా సంబంధం ఉందా అన్న చర్చ కూడా జరుగుతోంది.
"ఇజ్రాయెల్, పాలస్తీనాల పట్ల భారత్ వైఖరి విషయంలో ఒక మెసేజ్ పంపాలని ఖతార్ ప్రయత్నిస్తోంది. ఖతార్‌పై ఎప్పుడూ ఉగ్రవాద దాడి జరగలేదు కాబట్టి భారత్ వైఖరి ఆ దేశానికి అంత త్వరగా అర్ధం కాదు. అందుకే ఆ దేశం దీన్ని ఒక అవకాశంగా తీసుకుంది. దీనిని ఇస్లామిక్ కోణంలో చూస్తోంది.’’ అని మహాపాత్ర అన్నారు.
అయితే, ఈ కేసు సంవత్సరం నుంచి కొనసాగుతోంది కాబట్టి, ఈ కేసుకు, భారత్-ఇజ్రాయెల్ సంబంధాలకు సంబంధం ఉంటుందని తాను భావించడం లేదని త్రిగుణాయత్ అన్నారు.
ఈ విషయంలో ఖతార్‌తో భారతదేశం ఘర్షణాత్మక వైఖరి తీసుకోకపోవడమే మంచిదని మహాపాత్ర అభిప్రాయపడ్డారు. ఎందుకంటే ఇందులో అనేక ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయి.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















