ఎనిమిది మంది భారత మాజీ నేవీ అధికారులకు ఖతార్‌లో మరణ శిక్ష.. అసలేం జరిగింది?

ఫొటో సోర్స్, ANI
ఎనిమిది మంది భారత పౌరులకు ఖతార్ న్యాయస్థానం మరణశిక్ష విధించడంపై భారత ప్రభుత్వం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.
ఈ నిర్ణయం విషాదకరమని, ఈ విషయంలో చట్టపరంగా ఉన్న అన్ని అవకాశాలపై దృష్టి సారిస్తామని తెలిపింది.
మరణ శిక్ష పడిన ఎనిమిది మంది భారత నావికాదళ మాజీ అధికారులు నిరుడు ఆగస్టు నుంచి ఖతార్ జైలులోనే ఉన్నారు. అయితే వారిపై ఉన్న అభియోగాల గురించి ఖతార్ ప్రభుత్వం ఎలాంటి బహిరంగ ప్రకటన చేయలేదు.
ఖతార్ న్యాయస్థానం తీర్పు వెల్లడించిన నేపథ్యంలో భారత విదేశీ వ్యవహారాల శాఖ దీనిపై స్పందించింది.
“అల్ దహ్రా ఉద్యోగులైన ఎనిమిది మంది భారతీయులపై ‘కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్‌స్టాన్స్ ఆఫ్ ఖతార్’ తీర్పు ఇచ్చిందన్న ప్రాథమిక సమాచారం అందింది” అని ప్రకటనలో తెలిపింది.
“వారికి మరణశిక్ష విధిస్తూ కోర్టు ఇచ్చిన తీర్పు దిగ్భ్రాంతిని కలిగించింది. మేం వారి కుటుంబ సభ్యులు, లీగల్ టీంతో సంప్రదింపులు జరుపుతున్నాం. ఈ విషయాన్ని అత్యంత ప్రాధాన్యం కలిగిన అంశంగా తీసుకుని, ఖతార్ అధికార యంత్రాంగాన్ని సంప్రదిస్తాం. ప్రస్తుతానికి దీనిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయబోవడం లేదు” అని పేర్కొంది.
కొన్ని నెలలుగా ఈ మాజీ అధికారులను విడిపించాలని భారత ప్రభుత్వంపై ఒత్తిడి వస్తూనే ఉంది. తీర్పు నేపథ్యంలో ఈ విషయాన్ని ‘అత్యధిక ప్రాధాన్యం’ ఉన్న అంశంగా చూస్తున్నామని విదేశీ వ్యవహారాల శాఖ చెప్పింది.

ఫొటో సోర్స్, Getty Images
గూఢచర్యం అభియోగాలు
2022 సెప్టెంబరులో ఖతార్ ప్రభుత్వం ఈ ఎనిమిది మందిని అరెస్టు చేసింది. ఈ ఏడాది మార్చిలో వారిపై గూఢచర్యం అభియోగాలు నమోదు చేసింది.
వీరు గతంలో ఖతార్ ప్రైవేటు సెక్యూరిటీ సంస్థ ‘జహీరా అల్ అలామి’లో పని చేశారు.
ఈ సంస్థ ఖతార్ నావికాదళానికి సంబంధించిన సబ్‌మెరైన్ కార్యక్రమం కోసం పనిచేసేది.
రాడార్ దృష్టిని తప్పించుకునే అత్యున్నత ఇటాలియన్ టెక్నాలజీతో కూడిన జలంతర్గాముల కొనుగోలు ఈ కార్యక్రమం ఉద్దేశం.
ఈ సంస్థలో 75 మంది భారత పౌరులు ఉద్యోగాలు చేసేవారు. వీరిలో అత్యధికులు భారత నావికాదళ మాజీ అధికారులు.
2022 మే 31 నుంచి సంస్థ కార్యకాలాపాలను నిలిపివేస్తున్నట్లు నిరుడు మే నెలలోనే సంస్థ ప్రకటించింది.
మీడియా కథనాల ప్రకారం జహీరా అల్ అలామి సంస్థ అధినేత ఖమిస్ అల్ అజామీతోపాటు ఎనిమిది మంది భారత ఉద్యోగులపై వచ్చిన ఆరోపణల్లో కొన్ని సాధారణమైనవైతే, మరికొన్ని ప్రత్యేకమైనవి.
గూఢచర్యం అభియోగాలపై అరెస్టైన ఈ ఎనిమిది మందిని సంస్థ నుంచి తొలగించారు. వారి వేతనాలను కూడా సెటిల్ చేశారు.
2022 మేలో సంస్థను మూసివేయాలని, పనిచేస్తున్న దాదాపు 70 మంది ఉద్యోగులను 2023 మేలోగా దేశం విడిచి వెళ్లాలని ఖతార్ ప్రభుత్వం ఆదేశించింది.

ఫొటో సోర్స్, HINDUSTAN TIMES
గూఢచర్యం ఆరోపణలు?
మీడియా కథనాల ప్రకారం- ఇప్పుడు మరణ శిక్ష పడ్డ భారతీయులు ఖతార్‌కు సంబంధించిన కీలకమైన సమాచారాన్ని ఇజ్రాయెల్‌కు చేరవేశారని ఆరోపణలు ఉన్నాయి.
భారత మీడియా, ప్రపంచ మీడియా కథనాల ప్రకారం- ఈ మాజీ నేవీ అధికారులు అత్యాధునిక ఇటాలియన్ జలాంతర్గాముల కొనుగోలుకు సంబంధించిన ఇంటెలిజెన్స్ సమాచారాన్ని ఇజ్రాయెల్‌కు చేరవేశారని ఖతార్ ప్రభుత్వం ఆరోపిస్తోంది.
ఇజ్రాయెల్ కోసం వీరు గూఢచర్యం చేశారని, ఇందుకు తమ వద్ద ‘ఎలక్ట్రానిక్ ఆధారం’ ఉందని ఖతార్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ చెప్తోంది.
అరెస్టైన మాజీ అధికారులు జహీరా అల్ అలామి సంస్థ తరపున ఖతార్ నౌకాదళానికి పలు రకాల శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు.
ఖతార్, భారత్ మధ్య ఒప్పందంలో భాగంగా అప్పట్లో ఈ నియామకాలు జరిగాయి.

ఫొటో సోర్స్, Getty Images
జహీరా అల్ అలామి ఏం చేస్తుంది?
ఖతార్ రక్షణ శాఖ, భద్రత, ఇతర ప్రభుత్వ ఏజెన్సీలకు తాను స్థానిక వ్యాపార భాగస్వామినని ‘జహీరా అల్ అలామీ’ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. రక్షణ పరికరాల నిర్వహణ, మరమ్మతులలో తాము నిష్ణాతులమని చెప్పింది.
వెబ్‌సైట్‌లో సంస్థ సీనియర్ అధికారుల వివరాలు, వారి పదవుల గురించిన పూర్తి సమాచారాన్ని పొందుపర్చింది. ఈ జాబితాలో చాలా మంది భారతీయులు ఉన్నారు.
ఖతార్‌లో రక్షణ పరికరాల నిర్వహణ, మరమ్మతుల్లో ఈ సంస్థ అగ్రగామి అని దీని లింక్డ్ఇన్ పేజీలో ఉంది.
ఇవి కూడా చదవండి..
- పులి గోరును ధరించిన ‘బిగ్‌బాస్’ పోటీదారును ఎందుకు అరెస్ట్ చేశారు?
- రాజస్థాన్: కోటా కోచింగ్ సెంటర్లకు కఠినమైన నిబంధనలు... విద్యార్థుల ఆత్మహత్యలను ఇవి అడ్డుకోగలవా?
- ‘ప్రతి భారత సైనికుడూ మాల్దీవుల నుంచి వెళ్లిపోవాలి’ – బీబీసీ ఇంటర్వ్యూలో మాల్దీవుల కొత్త అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జూ
- భారత్, చైనా: సరిహద్దుకు అటూఇటూ మళ్ళీ సేనల మోహరింపు... నాలుగేళ్ళుగా శీతాకాలంలో ఎందుకీ టెన్షన్స్?
- భారత్-కెనడా దౌత్య వివాదంలో జోక్యం చేసుకున్న బ్రిటన్, అమెరికా... వియాన్నా ఒప్పందాన్ని ఇండియా ఉల్లంఘించిందా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














