భారత్-కెనడా దౌత్య వివాదంలో జోక్యం చేసుకున్న బ్రిటన్, అమెరికా... వియాన్నా ఒప్పందాన్ని ఇండియా ఉల్లంఘించిందా?

భారత్, కెనడా

ఫొటో సోర్స్, MONEY SHARMA/AFP VIA GETTY IMAGE

గత కొన్ని వారాలుగా భారత్, కెనడాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల్లోకి అమెరికా, బ్రిటన్‌లు ప్రవేశించాయి.

ఇండియాలో కెనడా దౌత్యవేత్తల సంఖ్యను తగ్గించాలని పట్టుదలగా ఉండొద్దని భారత్‌కు అమెరికా, బ్రిటన్‌ దేశాలు సూచించాయి.

ఈ ఏడాది జూన్‌లో కెనడాలోని వాంకోవర్‌లో భారత సంతతికి చెందిన కెనడా పౌరుడు, సిక్కు వేర్పాటువాద నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు గురయ్యాడు.

దీనికి భారత ఏజెన్సీలే కారణమని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు. అయితే ట్రూడో ఆరోపణలను భారత్ తిరస్కరించింది.

అంతేకాదు కెనడాలో ఖలిస్తాన్ అనుకూల కార్యకలాపాలను నిలిపివేయాలని ఆ దేశాన్ని డిమాండ్ చేసింది.

తాజాగా ఇండియాలోని 41 మంది దౌత్యవేత్తలను కెనడా రీకాల్ చేయాల్సి రావడంతో తీవ్రత పెరిగింది.

దీంతో బ్రిటన్, అమెరికా రంగంలోకి దిగాయి. ఇదే సందర్భంలో వియన్నా ఒప్పందం కూడా తెరపైకి వచ్చింది.

అంతేకాదు డిప్లొమాటిక్ ఇమ్యునిటీ అంశాన్ని కూడా బ్రిటన్, అమెరికా దేశాలు గుర్తుచేశాయి.

విదేశీ దౌత్యవేత్తలకు ఇచ్చే అధికారాలను 'డిప్లొమాటిక్ ఇమ్యునిటీ' అంటారు. దీనికి స్థానిక చట్టాల నుంచి కూడా మినహాయింపులు ఉంటాయి.

మరోవైపు భారత్‌తో తమ సంబంధాలను చెడగొట్టుకోవాలని అమెరికా గానీ, బ్రిటన్ గానీ కోరుకోవడం లేదని విశ్లేషకులు చెబుతున్నారు.

పెరుగుతున్న చైనా ఆధిపత్యం తగ్గించే క్రమంలో వారు ఆసియాలో ఇండియాను ముఖ్యమైన మిత్రదేశంగా చూస్తున్నారని తెలిపారు.

అమెరికా ప్రెసిడెంట్ బైడెన్

ఫొటో సోర్స్, Getty Images

అమెరికా ప్రకటనలో ఏముంది?

"పరస్పర విభేదాలను పరిష్కరించడానికి దౌత్యవేత్తలు హాజరుకావడం చాలా ముఖ్యం. ఇండియాలో కెనడా దౌత్యవేత్తల ఉనికిని తగ్గించాలనే దృక్పథం వద్దని మేం భారత ప్రభుత్వానికి సూచించాం. అంతేకాదు నిజ్జర్ హత్యలో కెనడా చేసే విచారణకు భారత్ సహకరించాలి. దౌత్య సంబంధాలపై 1961 వియన్నా ఒప్పందానికి భారతదేశం కట్టుబడి ఉంటుందని, కెనడియన్ దౌత్యవేత్తలకు అన్ని సౌకర్యాలు అందజేస్తుందని మేం ఆశిస్తున్నాం" అని అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ శుక్రవారం ప్రకటనలో తెలిపింది.

ఇదే సమయంలో భారత్‌ మీద కెనడా చేస్తున్న ఆరోపణలపై అమెరికా సీరియస్‌గా ఉందని తెలిపారు.

బ్రిటన్ ప్రధాని రిషి సునక్

ఫొటో సోర్స్, REUTERS

బ్రిటన్ ఏం చెప్పింది?

దౌత్యవేత్తల వివాదంపై బ్రిటన్ విదేశాంగ శాఖ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది.

"పరస్పర విభేదాలను పరిష్కరించడానికి దౌత్యవేత్తలు ఇరు దేశాల రాజధానులలో ఉండటం అవసరం. ఇరువురి మధ్య చర్చలు కొనసాగాలి" అని తన ప్రకటనలో పేర్కొంది.

"కెనడియన్ దౌత్యవేత్తల విషయంలో భారత ప్రభుత్వ నిర్ణయంతో మేం ఏకీభవించడం లేదు. 1961 వియన్నా కన్వెన్షన్‌కు ఇరుపక్షాలు కట్టుబడి ఉంటాయని మేం ఆశిస్తున్నాం. దౌత్యవేత్తల ఏకపక్ష తొలగింపు వియన్నా సూత్రాలకు అనుగుణంగా లేదు" అని తెలిపింది.

అంతేకాదు నిజ్జార్ హత్యకు సంబంధించిన స్వతంత్ర దర్యాప్తులో కెనడాకు సహకరించాలని భారత్‌కు చెబుతూనే ఉంటామని బ్రిటన్ మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో పేర్కొంది.

కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో

ఫొటో సోర్స్, REUTERS

అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనే: ట్రూడో

దౌత్యవేత్తల విషయంలో భారత తీరుపై కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో శుక్రవారం విమర్శలు గుప్పించారు.

ఈ వారంలో భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలు అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధంగా ఉన్నాయని, దౌత్యవేత్తలకు 'డిప్లొమాటిక్ ఇమ్యునిటీ' ఉపసంహరించడం వియన్నా ఒప్పందం ఉల్లంఘనేనని ఆరోపించారు.

"కెనడా, భారతదేశంలో నివసిస్తున్న పదిలక్షల మంది జీవితాలను భారత ప్రభుత్వం ఇబ్బందుల్లోకి నెట్టింది" అని ఒక టెలివిజన్ సందేశంలో ట్రుడో అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

41 మంది కెనడా దౌత్యవేత్తలు భారతదేశం నుంచి బయలుదేరినట్లు కెనడా విదేశాంగ మంత్రి మెలోనీ జోలీ గురువారం ప్రకటించారు.

21 మంది దౌత్యవేత్తలు మినహా మిగతా వారందరి భద్రతను అక్టోబర్ 20 నాటికి రద్దు చేస్తామని భారత్ చెప్పిందని మెలోనీ చెప్పారు.

'21 మంది దౌత్యవేత్తలు ఇప్పటికీ భారతదేశంలో ఉన్నారు. అయితే మిగిలిన వారిని రీకాల్ చేయడంతో సిబ్బంది కొరత ఉంది. ఈ కారణంగా బెంగళూరు, ముంబయి, చండీగఢ్‌లలోని కొన్ని కాన్సులేట్‌ల పనితీరును నిలిపివేయాల్సి వస్తుంది' అని మెలోనీ చెప్పారు.

భారత ప్రధాని మోదీ

ఫొటో సోర్స్, ANI

భారత్ ఏమని బదులిచ్చింది?

వియన్నా ఒప్పందాన్ని ఏ విధంగానూ ఉల్లంఘించడం లేదని, భారత్‌లో కెనడా దౌత్యవేత్తల సంఖ్య ఎక్కువగా ఉందని భారత విదేశాంగ శాఖ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది .

"దౌత్యవేత్తలకు సంబంధించి కెనడా ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనను మేం గమనించాం. ఇండియాలో అధికంగా ఉన్న కెనడియన్ దౌత్యవేత్తల సంఖ్య, దేశ అంతర్గత వ్యవహారాలలో వారు తరచుగా జోక్యం చేసుకోవడం తదితరాల దృష్ట్యా ఇరు దేశాల మధ్య దౌత్యవేత్తలు సమానంగా ఉండటం చాలా ముఖ్యం" అని తెలిపింది.

నెలరోజులుగా దీనిపై కెనడాతో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పింది. ఈ నేపథ్యంలో వియన్నా కన్వెన్షన్‌లోని ఆర్టికల్ 11.1ని ప్రస్తావించింది భారత్.

దీంతో వియన్నా ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు కెనడా చేస్తున్న ఆరోపణలను భారత్ తిరస్కరిస్తున్నట్లు ఆ ప్రకటనలో తెలిపింది.

అసలు విషయమేంటి?

దౌత్యవేత్తల సంఖ్యలో సమానత్వం ఉండాలని దిల్లీలోని తన హైకమిషన్ నుంచి కొందరు ఉద్యోగులను రీకాల్ చేయాలని కెనడాను భారత్ రెండు వారాల కిందట కోరింది.

లేకుంటే వారికి దౌత్యపరమైన ఇమ్యునిటీ ఉపసంహరిస్తామని తెలిపింది. దీంతో శుక్రవారం 41 మంది కెనడా దౌత్యవేత్తలు, వారి కుటుంబాలు భారతదేశం విడిచి వెళ్లినట్లు సమాచారం.

కెనడాలో దాదాపు 20 లక్షల మంది నివసిస్తున్నారు, వీరి మూలాలు భారతదేశంలో ఉన్నాయి. ఇది కెనడా జనాభాలో 5 శాతం.

కెనడా విద్యాసంస్థల్లో చదువుతున్న విదేశీయుల్లో అత్యధికులు భారతీయులే. కెనడా జారీ చేసిన స్టడీ పర్మిట్లలో 40 శాతం భారత విద్యార్థులవే.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)