భారత్ నుంచి 41 మంది దౌత్యవేత్తలను వెనక్కి రప్పించిన కెనడా... దీని ప్రభావం ఎలా ఉండబోతోంది?

కెనడా ప్రధాని ట్రూడో, భారత ప్రధాని మోదీ

ఫొటో సోర్స్, GETTY IMAGES

    • రచయిత, నదైన్ యూసిఫ్
    • హోదా, బీబీసీ న్యూస్, టొరంటో

కెనడాలో సిక్కు వేర్పాటువాద నాయకుడి హత్య కారణంగా భారత్, కెనడా మధ్య వివాదం ముదిరిన నేపథ్యంలో ఇటీవల 41 మంది కెనడా దౌత్యవేత్తలు ఇండియా నుంచి వెనక్కి వెళ్లిపోయారు.

దౌత్యసిబ్బందిని కెనడా ఉపసంహరించుకోకపోతే వారి రక్షణను ఉపసంహరిస్తామని రెండు వారాల కిందట భారత్ హెచ్చరించింది. ఈ హెచ్చరికలు అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని కెనడా అధికారులు అన్నారు.

జూన్ 18న జరిగిన హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత్ హస్తం ఉందంటూ కెనడా ఆరోపించిన తరువాత ఇరుదేశాల మధ్య సంబంధాలు ఉద్రిక్తంగా మారాయి.

అయితే, ఈ విషయంలో కెనడా ఆరోపణలు అసంబద్ధంగా ఉన్నాయని భారత్ ఖండిస్తోంది.

కెనడా దౌత్యవేత్తలు, వారి కుటుంబసభ్యులు భారత్‌ను వీడినట్టు గురువారం నాడు కెనడా విదేశాంగ మంత్రి మెలనియ్ జోలీ నిర్ధరించారు. అక్టోబరు 20 నాటికి 21 మంది దౌత్యవేత్తలకు మినహా మిగిలినవారికి రక్షణను తొలగిస్తామని భారత్ చెప్పినట్టు ఆమె పేర్కొన్నారు.

ఈ విషయంపై బీబీసీ కెనడాలోని ఇండియా హైకమిషన్ కార్యాలయాన్ని సంప్రదించింది.

భారత్‌లో ఇంకా 21మంది దౌత్యవేత్తలు ఉన్నారని, సిబ్బంది కొరత కారణంగా భారత్‌లో తమ దౌత్య సిబ్బందిని పరిమితం చేసుకుంటున్నామని జోలీ చెప్పారు. దీనివలన బెంగళూరు, ముంబాయి, చండీగడ్‌లో కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని, వీటి పునరుద్ధరణకు ఎటువంటి కాలపరిమితి పెట్టుకోలేదన్నారు.

దిల్లీలోని కెనడా హైకమిషన్ వెలుపల సేవలు ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయని, ఇతరులు నిర్వహించే అప్లికేషన్ సెంటర్లు యథావిధిగా పనిచేస్తాయని అధికారులు చెప్పారు.

కెనడా హై కమిషన్

ఫొటో సోర్స్, EPA-EFE/REX

అయితే, సిబ్బంది తగ్గింపు వలన ఇమ్మిగ్రేషన్ దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ ఆలస్యమవుతుందని, కొంతకాలం పాటు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని కెనడా ఇమ్మిగ్రేషన్ మంత్రి మార్క్ మిల్లర్ చెప్పారు.

దీని ప్రభావం కెనడాలోని భారతీయులతో పాటు అక్కడ చదువుకోవాలనుకునే విద్యార్థులపై పడుతుంది. 2022లో కెనడాలో శాశ్వత, తాత్కాలిక నివాసం కోసం అందిన దరఖాస్తులలో ఎక్కువభాగం భారతీయులవే.

కెనడాలో భారత్ దౌత్యవేత్తల సంఖ్య కంటే భారత్‌లో కెనడా దౌత్యవేత్తల సంఖ్య ఎక్కువగా ఉంది. ఇరుదేశాల మధ్య వివాదం రాజుకున్నప్పటి నుంచి, రెండు దేశాల మధ్య దౌత్యవేత్తల విషయంలో సమానత్వం పాటించాలని ఇండియా కెనడాను కోరింది.

కెనడా దౌత్యవేత్తలకు రక్షణ తొలగిస్తామని భారత్ చెప్పడం ‘‘అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనే’’అని ఒట్టావోలో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో జోలి చెప్పారు.

‘‘దౌత్యవేత్తలకు రక్షణ తొలగించాలనే నిబంధనను మనం అనుమతిస్తే, ప్రపంచంలో ఏ దేశంలోనూ దౌత్యవేత్తలు సురక్షితంగా ఉండలేరు’’ అని జోలి అన్నారు.

కెనడా, భారత్

ఫొటో సోర్స్, Getty Images

కెనడాకు వలస వచ్చే, సందర్శించాలనుకునే భారతీయులకు తామిప్పటికీ స్వాగతం పలుకుతున్నామని అధికారులు తెలిపారు.

నిజ్జర్ హత్యకు, భారత్‌కు సంబంధం ఉన్నట్టు బలమైన ఆధారాలున్నాయంటూ కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో సెప్టెంబర్‌లో ప్రకటించినప్పటి నుంచి ఈ ఇరుదేశాల సంబంధాలు చరిత్రలో ఎన్నడూ లేనంతగా క్షీణించాయి.

నిజ్జర్ హత్య వెనుక భారత్ ఏజెంట్లు ఉన్నారంటూ కెనడా ఇంటెలిజెన్స్ వర్గాలు బలమైన ఆధారాలు సేకరించాయని ట్రూడో చెప్పారు. ఇది కెనడా సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడమేనన్నారు.

బ్రిటీష్ కొలంబియాలోని సర్రీలో నిజ్జర్ నిర్వహించే సిక్కు ఆలయం వెలుపల అయనను ముసుగులు ధరించిన ఇద్దరు వ్యక్తులు కాల్చి చంపారు. దీన్ని ‘‘టార్గెటెడ్ ఎటాక్’’గా కెనడా పోలీసులు చెప్పారు. విచారణ కొనసాగుతోందన్నారు.

సిక్కుల కోసం ప్రత్యేకంగా ఖలిస్తాన్ ఏర్పాటు కావాలనే ఉద్యమానికి నిజ్జర్ మద్దతు తెలుపుతున్నారు. ఈ ఉద్యమాన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. 2020లో నిజ్జర్‌ను భారత్ ఉగ్రవాదిగా గుర్తించింది.

అయితే, భారత్‌తో వివాదాన్ని కెనడా మరింతగా పెంచుకోవాలనుకోవడం లేదని ట్రూడో పదేపదే చెపుతున్నారు. నిజ్జర్ హత్య విచారణకు సహకరించాల్సిందిగా ఆయన భారత అధికారులను కోరారు.

ఇవి కూడా చదవండి: