కామసూత్రలోనే వాత్సాయనుడు స్వలింగ సంపర్కం గురించి రాశారా? భారత చరిత్రలో ఈ లైంగికత మూలాలు ఎక్కడ ఉన్నాయి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సౌతిక్ బిశ్వాస్
- హోదా, బీబీసీ న్యూస్
స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పించేందుకు సుప్రీం కోర్టు మంగళవారం నిరాకరించడంతో లక్షల మంది ఎల్‌జీబీటీక్యూ ప్రజలు, యాక్టివిస్టులు నిరాశకు గురయ్యారు.
ప్రస్తుతం భారత్‌లో ఈ జంటలను గుర్తించనప్పటికీ, ఈ బంధాలు శతాబ్దాల నుంచి కొనసాగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
రచయిత, యాక్టివిస్టు, ప్రొఫెసర్ రూత్ వనిత దిల్లీ యూనివర్సిటీలో చదువుకున్నారు, అక్కడే ఆమె పాఠాలు కూడా చెప్పారు. అయితే, ఆమె ఇక్కడ పనిచేసిన కాలంలో (1970ల నుంచి 1996 వరకూ) ‘‘స్వలింగ సంపర్కుల ప్రేమ, బంధాల గురించి పాఠ్యాంశాల్లో ఎక్కడా ప్రస్తావన కూడా లేదు’’ అని ఆమె వివరించారు.
ఆ సమయంలోనే మహిళా హక్కుల ఉద్యమాల్లో ఆమె చురుగ్గా పాల్గొనేవారు. అయితే, ఆనాటి ఫెమినిస్టు రాజకీయాలతోపాటు లెఫ్ట్ వింగ్, రైట్ వింగ్‌లలోనూ వీటి ప్రస్తావన కనిపించేదికాదని ఆమె చెప్పారు.
‘‘మహిళా హక్కుల బృందాల్లో చాలా మంది లెస్బియన్‌లే ఉండేవారు. కానీ, వారు బహిరంగంగా దీని గురించి చర్చించేందుకు ముందుకు వచ్చేవారు కాదు’’ అని ప్రస్తుతం మోంటానా యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న వనిత 2004లో ఒక వ్యాసంలో రాశారు.
దీనికి 14 ఏళ్ల తర్వాత భారత సుప్రీం కోర్టు ఒక చరిత్రాత్మక తీర్పును ఇచ్చింది. స్వలింగ సంపర్కం ఇక్కడ నేరంకాదని చెబుతూ, ‘వలస పాలన కాలంనాటి ఐపీసీలోని సెక్షన్ 377కు మద్దతు పలుకుతూ 2013లో ఇచ్చిన తీర్పు’ను తిరగరాసింది. స్వలింగ సంపర్కుల సెక్స్‌ను ‘అసహజమైన నేరం’గా సెక్షన్ 377 పరిగణించేది.
అయితే, వలసవాద కాలంనాటి ఆ సెక్షన్‌ను కొట్టివేయడంతో పశ్చిమ దేశాల ‘లిబరలిజం’ దిశగా భారత్ అడుగులు వేస్తోందని ఆనాడు కొందరు ఆందోళన వ్యక్తంచేశారు. అయితే, చరిత్రను పరిశీలిస్తే, దీనికి భిన్నమైన వాదన కనిపిస్తుందని ప్రొఫెసర్ వనిత అంటారు.
చరిత్రకారుడు సలీమ్ కిడ్వాయ్‌తో కలిసి ఆమె ‘‘సేమ్-సెక్స్ లవ్ ఇన్ ఇండియా: రీడింగ్స్ ఫ్రమ్ లిటరేచర్ అండ్ హిస్టరీ’ పేరుతో 15 భారత భాషల్లోనున్న సాహిత్యాన్ని ఆంగ్లంలోకి అనువదించారు. ప్రాచీన కాలంలో భారత్‌లో స్వలింగ సంపర్క సంబంధాలను దీనిలో లోతుగా విశ్లేషించారు కూడా.
‘‘ప్రాచీన, మధ్య యుగాల్లో భిన్న రూపాల్లో స్వలింగ సంపర్కుల మధ్య ప్రేమ, స్నేహం చిగురించేవని ఈ కథనాలు, విశ్లేషణలు చూస్తే తెలుస్తుంది. అంతేకాదు, ఆ కాలంలో వీరిపై వివక్ష కూడా ఉండేది కాదు’’ అని ప్రొఫెసర్ వనిత రాసుకొచ్చారు.

ఫొటో సోర్స్, RAHUL BAXI
ఈ వాదనతో 2018లో బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చరిత్రకారిణి రాణా సఫ్వీ కూడా ఏకీభవించారు. ‘‘భారత్‌లో అన్ని రూపాల్లోని ప్రేమకూ చోటుండేది. మీరు ప్రాచీన యుగాన్ని లేదా మధ్య యుగాన్ని ఏదైనా తీసుకోండి. అన్నిచోట్లా స్వలింగ సంపర్కానికి సమాజంలో చోటు ఉండేది. ఖజురాహో దేవాలయాలు, మొఘల్ సాహిత్యం.. ఇలా అన్నిచోట్లా స్వలింగ సంపర్కానికి సంబంధించిన చిహ్నాలు, బొమ్మలు కనిపిస్తాయి’’ అని ఆమె చెప్పారు.
ఇదే విషయంతో మంగళవారంనాటి తీర్పు సమయంలో న్యాయమూర్తులు కూడా ఏకీభవించారు. ‘‘స్వలింగ సంపర్కం అనేది భారత్‌కు కొత్తదేమీ కాదు. ప్రాచీన కాలం నుంచీ ఇది ఇక్కడే ఉంది’’ అని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. మరోవైపు
స్వలింగ సంపర్కాన్ని కేవలం సెక్స్ కోణంలోనే మాత్రమే చూసేవారు కాదని, వీరి మధ్య ప్రేమ, భావోద్వేగపరమైన మద్దతు లాంటి వాటికి కూడా సమాజంలో చోటు ఉండేదని జస్టిస్ ఎస్‌కే కౌల్ చెప్పారు.
భారత్‌లోని స్వలింగ సంపర్క సంబంధాలపై, ముఖ్యంగా హిందూ సమాజంలోని ఈ సంబంధాలపై సమర్పించిన పరిశోధన పత్రంలో ‘‘బ్రిటిష్ కాలంలోనే ఈ పరిస్థితులు చాలా మారాయి’’ అని ప్రొఫెసర్ వనిత రాశారు. ‘‘బ్రిటిష్ పాలనా కాలంలో భారతీయులు కూడా విక్టోరియన్ ఆదర్శాల్లో ఒకటైన మోనోగమీకి దగ్గరయ్యారు. దీనికి విరుద్ధంగా ఉండే అన్నింటినీ తిరస్కరించడం మొదలుపెట్టారు’’ అని ఆమె వివరించారు.
మరోవైపు దేవాలయాలపై బొమ్మలు, మతపరమైన సాహిత్యంలో వర్ణనలను పరిశీలిస్తే, ప్రాచీన భారత దేశంలోనూ స్వలింగ సంపర్కానికి చోటు ఉండేదని స్పష్టంగా తెలుస్తుందని రచయిత దేవదత్ పట్నాయక్ కూడా రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
4వ శతాబ్దంనాటి శృంగార సాహిత్యం వాత్సాయన కామసూత్రలో ‘‘ఒకరి శ్రేయస్సును మరొకరు కోరుకునే ఇద్దరు పురుషులు కూడా ఒక్కటి కావచ్చు’’ అని రాసివుందని ప్రొఫెసర్ వనిత తన వ్యాసంలో రాశారు. ‘‘కులాంతర, వర్గాంతర వివాహాలను కూడా వారి తల్లిదండ్రులు ఆమోదించేవారు. ఎందుకంటే పూర్వపు జన్మలో వీరు భార్యాభర్తలై ఉండొచ్చని అనుకునేవారు’’ అని వనిత రాశారు. దీని ద్వారా స్వలింగ సంపర్కాన్ని కూడా వారు పూర్వజన్మల కోణంలో చూసి ఉండొచ్చని తెలుస్తోందని ఆమె అన్నారు.
1988లో ఒక వార్తాపత్రిక ఆధునిక భారతంలో తొలి స్వలింగ సంపర్క వివాహంగా భావించే ఒక జంట ఫోటోలను ప్రచురించింది. మధ్య ప్రదేశ్‌లో ఆ పెళ్లి జరిగింది. దీనిలో ఇద్దరు మహిళా పోలీసులు లీలా నామ్‌దేవ్, ఊర్మిళా శ్రీవాస్తవ తమ బంధాన్ని పెళ్లి వరకూ తీసుకెళ్లినట్లు చూడొచ్చు.
ఆ ఇద్దరు పోలీసులనూ విధుల నుంచి బహిష్కరించారు. అయితే, వారికి స్నేహితులు, కుటుంబం నుంచి మద్దతు ఉండేది. వీరికి పొరుగున ఉండే ఒక టీచర్ ఆనాడు పాత్రికేయులతో మాట్లాడారు. ‘‘అసలు పెళ్లంటే ఏమిటి? రెండు మనసులు ఒక్కటి కావడం. అసలు ఏ గ్రంథంలో కేవలం ఒక మహిళను ఒక పురుషుడే పెళ్లి చేసుకోవాలని చెప్పారు?’’ అని ఆమె ప్రశ్నించారు.
ఆ తర్వాత ఇలాంటి పెళ్లిళ్లు చాలా మీడియాలో చూశానని, ఇలాంటి పెళ్లిళ్లు చేసుకున్న వారిలో ఎక్కువ మంది హిందూ మహిళలే ఉంటున్నట్లు తన పరిశీలినలో తేలిందని ప్రొఫెసర్ వనిత తన వ్యాసంలో రాసుకొచ్చారు. ‘‘వీరు ఎక్కువగా చిన్నచిన్న పట్టణాల్లో జీవించే దిగువ మధ్యతరగతికి చెందినవారు. వీరిలో చాలా మందికి ఇంగ్లిష్‌పై కొంత అవగాహన మాత్రమే ఉంటుంది. అయితే, వీరిలో చాలా మంది చదువుకోవడం, ఉద్యోగాలు చేయడం లాంటివి చేసేవారు’’ అని ఆమె చెప్పారు. అయితే, ఈ పెళ్లిళ్లకు చట్టబద్ధత లేదనే విషయాన్ని మనం గుర్తించాలి.

అదే సమయంలో కొన్ని స్వలింగ సంపర్కుల జంటలు ప్రాణాలను తీసుకున్న వార్తలు కూడా కనిపించేవి. సమాజంలో వీరి బంధాలకు ఆమోదం లేకపోవడమే దీనికి ప్రధాన కారణమని ప్రొఫెసర్ వనిత అభిప్రాయపడ్డారు.
‘‘1980ల నుంచి మొదలుపెట్టి కొన్ని వందల జంటలు, ముఖ్యంగా మహిళలు, ఆత్మహత్యలు చేసుకున్నాయి. ఎందుకంటే పెళ్లి చేసుకునేందుకు, కలిసి జీవించేందుకు కుటుంబాలు వీరికి అనుమతించేదికాదు. అదే సమయంలో కొన్ని జంటలు హిందూ పద్ధతిలో తమ వివాహాలు చేసుకున్నవి కూడా ఉన్నాయి. ఆ కాలంలో ప్రపంచంలో మరెక్కడా ఇలాంటి వివాహాలకు గుర్తింపు లేనప్పుడే ఇక్కడ ఆ వివాహాలు జరిగాయి’’ అని ఆమె చెప్పారు.
‘‘ఈ దిగువ మధ్యతరగతి చెందిన జంటలు భారత్‌లో వివాహాల్లో సమానత్వం కోసం పాటుపడిన తొలి ఉద్యమకారులుగా చెప్పుకోవాలి’’ అని ఆమె అన్నారు.
స్వలింగ సంపర్క వివాహాలకు చట్టబద్ధత కల్పించే అంశం పార్లమెంటు పరిధిలో ఉందని సుప్రీం కోర్టు మంగళవారం నాటి తీర్పులో చెప్పింది. అయితే, ప్రభుత్వం ఈ వివాహాలకు చట్టబద్ధత కల్పించేందుకు బదులుగా, స్వలింగ సంపర్కులకు సామాజిక, చట్టపరమైన హక్కుల కోసం ఒక కమిటీని ఏర్పాటుచేస్తామని వివరించింది.
‘‘నేను కాస్త నిరాశకు గురయ్యాను. కానీ, మరీ అంత ఆశ్చర్యపోలేదు. ఎందుకంటే ఇక్కడ రాజకీయ పార్టీల తరహాలోనే ప్రజల్లోనూ భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అయితే, నేడు స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పించేందుకు పిటిషన్లు దాఖలు చేస్తున్నవారిలో అన్ని వర్గాలకు చెందినవారూ ఉంటున్నారు’’ అని వనిత అన్నారు.
2001 నుంచి 34 దేశాలు స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పించాయి. వాటి సరసన భారత్ చేరేందుకు మరికొంత సమయం వేచి ఉండాల్సి రావచ్చు. ఈ ఉద్యమ విజయం అనేది ప్రజల అభిప్రాయాలను మార్చేలా కృషి చేయడంపైనే ఆధారపడి ఉంటుంది. అయితే, ప్రస్తుతానికి వివక్షను నిషేధించే నిబంధనలతో తొలి అడుగులు వేయొచ్చు.
ఇవి కూడా చదవండి:
- ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఇస్లామిక్ దేశాలు ఎందుకు ఏకం కాలేకపోతున్నాయి?
- ఇజ్రాయెల్ తెల్ల భాస్వరంతో గాజాపై దాడులు చేసిందా... ఈ స్మోక్ స్క్రీన్ ఆపరేషన్ ఎంత ప్రమాదకరం?
- ఫిల్లీస్ లాతోర్: ప్రమాదకరమైన ఆపరేషన్లు చేసిన లేడీ సీక్రెట్ ఏజెంట్
- నైట్‌క్లబ్స్, జూ, డ్రగ్స్ స్టోర్...ఒక జైలులో ఉండకూడని సౌకర్యాలన్నీ ఇక్కడ ఉంటాయి....
- ఇజ్రాయెల్‌పై మెరుపుదాడిలో హమాస్ మాస్టర్ మైండ్స్ వీరే
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















