స్వలింగ వివాహాల చట్టబద్ధతపై సుప్రీంకోర్టు తీర్పులోని ముఖ్యాంశాలివే...

ఫొటో సోర్స్, Getty Images
స్వలింగ వివాహాలను చట్టబద్ధమైనవిగా గుర్తించడం పార్లమెంట్, రాష్ట్ర శాసన సభల పని అని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు.
స్వలింగ సంపర్కుల వివాహాలను చట్టబద్ధం చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై మంగళవారం తీర్పు వెలువరిస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు.
స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్‌కు ఎలాంటి వ్యాఖ్యానాలను జోడించలేమని, ఆ పని చట్ట సభలు చేస్తాయని ఆయన అన్నారు.
సాధారణ జంటల మాదిరిగానే స్వలింగ సంపర్కులు కూడా సమాన వివాహ హక్కులు కలిగి ఉండాల్సిన అవసరం ఉందని చీఫ్ జస్టిస్ అన్నారు. స్వలింగ జంటలు ఈ హక్కులు పొందలేకపోతే అది ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందని అభిప్రాయపడ్డారు.
వివాహం చేసుకోని జంటలు, క్వీర్ కపుల్స్ పిల్లలను దత్తత తీసుకోవచ్చని ఐదుగురు సభ్యుల ధర్మాసనంలోని ఇద్దరు న్యాయమూర్తులు స్పష్టం చేశారు. అయితే, ప్రభుత్వం దీనికి కొన్ని నిబంధనలు విధించవచ్చని చెప్పారు. ఈ ఇద్దరు న్యాయమూర్తులలో చీఫ్ జస్టిస్ డి.వై. చంద్రచూడ్ కూడా ఉన్నారు.
అయితే, ప్రస్తుత దత్తత చట్టాలలో ఎల్జీబీటీ కమ్యూనిటీని చేర్చడం కోసం మార్పులు చేయడం కుదరదని మిగిలిన ముగ్గురు న్యాయమూర్తులు జస్టిస్ ఎస్.రవీంద్రభట్, జస్టిస్ హిమ కోహ్లి, జస్టిస్ పీఎస్ నరసింహ స్పష్టం చేశారు.
స్వలింగ జంటల సహజీవనాన్ని అనుమతించే విషయంలో కేంద్ర, రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాలలోని ప్రభుత్వాలు వారి పట్ల వివక్ష చూపరాదని ప్రధాన న్యాయమూర్తి అన్నారు.
పెళ్లి అనేది లేకుండా ఎల్జీబీటీక్యూ ప్లస్ కమ్యూనిటీ సభ్యులు ఒక భాగస్వామిని ఎంచుకోవడానికి, వారితో కలిసి జీవించడానికి సంపూర్ణ హక్కులు ఉంటాయన్నారు ప్రధాన న్యాయమూర్తి. అలాంటి జంటలు తమ హక్కులను వినియోగించుకునేందుకు ప్రభుత్వం సహకరించాలని స్పష్టం చేశారు.

స్వలింగ సంపర్కులు పట్టణాలలో, ఉన్నత వర్గాలలోనే కాదు, గ్రామీణ ప్రాంతాలలో, సమాజంలోని అనేక వర్గాలలో ఉంటారని, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ధోరణేనని చీఫ్ జస్టిస్ అన్నారు.
ఇద్దరు ట్రాన్స్‌జెండర్లు వివాహం చేసుకోవాలనుకున్నప్పుడు వారిద్దరిలో ఒకరు ట్రాన్స్ మ్యాన్, ట్రాన్స్ వుమన్‌గా ప్రకటించుకుంటే, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ద్వారా వారిద్దరూ పెళ్లి చేసుకోవచ్చని జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. అలాగే స్త్రీ పురుషుల వివాహాలలోనే పిల్లలు భద్రంగా, సురక్షితంగా ఉంటారు అనడానికి ఆధారాల్లేవని సీజేఐ అభిప్రాయపడ్డారు.
స్వలింగ జంటల వివాహాలను చట్టబద్ధం చేసే బాధ్యత చట్ట సభలదే తప్ప కోర్టులది కాదన్న ప్రధాన న్యాయమూర్తి అభిప్రాయంతో తాను ఏకీభవిస్తున్నట్లు ధర్మాసనంలోని ఐదుగురు న్యాయమూర్తుల్లో ఒకరైన జస్టిస్ సంజయ్ కౌల్ అన్నారు.
స్వలింగ సంపర్కుల జంటలకు కొన్ని చట్టపరమైన హక్కులు, ప్రయోజనాలను కల్పించే అంశాన్ని పరిశీలించేందుకు గానూ ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వ ప్రతిపాదనలను తాము రికార్డుల్లోకి తీసుకుంటున్నామని సుప్రీంకోర్టు తెలిపింది.
సుప్రీంకోర్టు జడ్జిమెంట్‌లో కీలక అంశాలు
ఐదుగురు జడ్జిలు ఆమోదించిన అభిప్రాయాలు
1. వివాహాన్ని రాజ్యాంగం ప్రాథమిక హక్కుగా గుర్తించడం లేదు.
2. స్వలింగ సంపర్కంలో ఉన్నవారి హక్కులను రక్షించడంలో, వారి సమస్యలను పరిష్కరించడం కోసం క్యాబినెట్ సెక్రటరీ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేస్తామన్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ప్రతిపాదనను అంగీకరిస్తున్నాం.
3.స్పెషల్ మ్యారేజ్ యాక్ట్, ఫారిన్ మ్యారేజ్ యాక్ట్‌లను సవాల్ చేయడం కుదరదు.
4. వివక్షను తొలగించడానికి యాంటీ డిస్క్రిమినేషన్ లా తీసుకురావాలి.
5. పుట్టుకతో ఆడ లేదా మగ అయి ఉండి, లింగమార్పిడి చేయించుకున్న తర్వాత ఒకరు ఆడ, మరొకరు మగవారిగా వ్యవహరిస్తూ లైంగిక సంబంధం కలిగి ఉంటే, అలాంటి వారు ప్రస్తుత చట్టాలను అనుసరించి వివాహం చేసుకోవచ్చని పునరుద్ఘాటించింది.
ముగ్గురు జడ్జిల మద్దతున్న అభిప్రాయాలు
1.అవివాహిత, ఎల్జీబీటీ కమ్యూనిటీ కోసం దత్తత చట్టాలను మార్చడం కుదరదు.
2. ఎల్జీబీటీ కమ్యూనిటీలోని వారి వివాహాలకు చట్టబద్ధత కల్పించడం కుదరదు.
ఇద్దరు జడ్జిల మద్ధతున్న అభిప్రాయాలు
1.అవివాహ జంటలు, ఎల్జీబీటీక్యూ ప్లస్ జంటలు పిల్లలను దత్తత తీసుకోవచ్చు. అయితే ప్రభుత్వం వారిపై కొన్ని నిబంధనలు విధించవచ్చు.
2. సెక్సువల్ ఓరియంటేషన్ ఆధారంగా జంటలు కలిసి జీవించడాన్ని వ్యతిరేకించరాదు..

ఫొటో సోర్స్, Getty Images
18 పిటీషన్లు.. సుదీర్ఘ వాదనలు
స్వలింగ సంపర్కుల జంటలు, సామాజిక కార్యకర్తల నుంచి వచ్చిన మొత్తం పద్దెనిమిది పిటిషన్లను సుప్రీం కోర్టు పరిగణనలోకి తీసుకుంది.
తమ వివాహాలకు గుర్తింపు లేకపోవడంతో, తాము రెండో తరగతి పౌరుల్లా మిగిలిపోతున్నామని పిటిషనర్లు కోర్టుకు నివేదించారు.
ఈ నేపథ్యంలో పిటిషన్లపై ఐదుగురు సభ్యుల ధర్మాసనం విచారణ జరపడంతో అందరి దృష్టి దీనిపై పడింది. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో ఈ పిటీషన్లపై సుదీర్ఘ వాదనలు జరిగాయి. ప్రజల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని, వీటిని లైవ్ స్ట్రీమింగ్ కూడా చేశారు.
స్వలింగ సంపర్కుల వివాహాలను అనుమతించే విషయంలో ఈ తీర్పు దేశ చరిత్రను తిరగరాస్తుందని చాలా మంది భావించారు.
మతంతో ముడిపడి ఉన్న ‘పర్సనల్ లా’ విషయంలో కోర్టు జోక్యం చేసుకోదని, కానీ ఎల్జీబీటీక్యూ ప్లస్ వ్యక్తులను చట్టపరిధిలోకి తెచ్చేందుకు, కులాంతర, మతాంతర వివాహాలను అనుమతించే ప్రత్యేక చట్టాలను సవరించే అంశాన్ని పరిశీలిస్తామని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నాయకత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
చట్టబద్ధత లేక ఇబ్బందులు..
విచారణ ముందుకు సాగే కొద్దీ, ఇది ఎంత సంక్లిష్టమైన అంశమో స్పష్టత వచ్చింది. స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పించేందుకు కేవలం ఒక ప్రత్యేక చట్టాన్ని సవరిస్తే సరిపోదని, దానితో పాటు విడాకులు, దత్తత, వారసత్వం, భరణం లాంటి అంశాలకు సంబంధించిన మరో 35 చట్టాల్లో కూడా సవరణలు చేయాల్సిన అవసరముందని ఐదుగురు సభ్యుల ధర్మాసనం భావించింది.
కానీ ఈ 35 చట్టాల్లోని చాలా అంశాలు మతాలకు చెందిన పర్సనల్ చట్టాల పరిధిలోని అంశాలతో ముడిపడి ఉన్నాయి. ఫలితంగా ఇదొక సంక్లిష్ట వలయం లాంటిదనే అభిప్రాయం ఏర్పడింది.
పిటీషనర్ల తరపు న్యాయవాదులు తమ వాదనల్లో, వివాహమనేది ఇద్దరు వ్యక్తుల కలయికే కానీ, ఒక మహిళ, ఒక పురుషుడు కలిసి ఉండటం మాత్రమే కాదని తెలిపారు. తమకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకునే హక్కు భారత రాజ్యంగం పౌరులందరికీ కల్పిస్తోందని, వ్యక్తుల లైంగికత ఆధారంగా వివక్ష చూపకూడదని గుర్తు చేశారు.
అలానే స్వలింగ సంపర్క జంటలు వివాహానికి గుర్తింపు లేని కారణంగా వారు బ్యాంకుల్లో జాయింట్ అకౌంట్లు తెరవలేరని, ఇద్దరూ కలిసి ఇంటిని కొనలేరని, పిల్లల్ని దత్తత తీసుకోలేరని న్యాయస్థానం ఎదుట నివేదించారు. వైవాహిక జీవితంలో దొరికే గౌరవాన్ని ఒకరకంగా వాళ్లకు దూరం చేయడమే అని వాదించారు.
వ్యతిరేకించిన ప్రభుత్వం..
ఎల్జీబీటీక్యూ ప్లస్ వివాహాల చట్టబద్ధత కల్పించాలన్న ఈ పిటీషన్లను ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది.
ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన వాదనలు వినిపించారు. ఈ వివాహానికి సంబంధించి సామాజిక, చట్టపరమైన విషయాలను చర్చించాల్సింది కేవలం పార్లమెంటు మాత్రమేనని, కోర్టుకి ఈ విషయంలో వాదనలు వినే హక్కులు ఉండవని అన్నారు.
ప్రేమించే హక్కు, కలిసి జీవించే హక్కు కేవలం ప్రాథమిక అంశాలే కానీ, పెళ్లి చేసుకోవడమనేది సంపూర్ణ హక్కు కాదని వాదించారు. ఇది స్త్రీ, పురుషుల వివాహాలకు కూడా వర్తిస్తుందని అన్నారు. అక్రమ సంబంధాలు వంటి నిషేధిత సంబంధాల జాబితా కూడా ఉందని ఆయన గుర్తు చేశారు.
స్వలింగ వివాహాలకు చట్టబద్ద గుర్తింపు ఇవ్వడానికి బదులుగా ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదన చేసింది. కేబినెట్ సెక్రటరీ నేతృత్వంలో ఏర్పాటు చేయబోయే ఈ కమిటీ స్వలింగ సంపర్క జంటల "మానవీయ సమస్యలు" పరిష్కరిస్తుందని తెలిపారు.
ఈ కమిటీ ప్రతిపాదన “సరైన సూచన” అని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. “కొన్నిసార్లు ఆరంభాలు చిన్నవి”గా ఉన్నా, ఇప్పుడు ఉన్న పరిస్థితుల నుంచి “గణనీయమైన పురోగతి” దిశగా సాగొచ్చని అన్నారు. అంతే కాకుండా ఇప్పుడే ఒక నిర్ణయానికి వచ్చేస్తే భవిష్యత్తులో స్వలింగ సంపర్కుల హక్కుల విషయంలో ముందుకు వెళ్లడానికి, ఆ “నిర్ణయాలే అవరోధాలు”గా మారొచ్చని వారు అభిప్రాయపడ్డారు.
సుప్రీంకోర్టు తీర్పుపై ఎల్జీబీటీక్యూ ప్లస్ వర్గాలు భారీ ఆశలు పెట్టుకున్నాయి. కానీ, ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు నిరాశకు గురి చేసింది. తమ పిటీషన్ల వలన అనుకూల తీర్పులు వస్తే, తాము పెళ్లి చేసుకుంటామని వీరు గతంలో బీబీసీతో అన్నారు.
తీర్పు అనుకూలంగా వస్తే తమ జీవితాలు మారతాయని ఆశించామని, కానీ ఇప్పటికీ తమ రాజ్యాంగ హక్కులు తిరస్కరణకు గురవుతున్నాయని అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
దేశంలో 13 నుంచి 14 లక్షల మంది..
దేశంలో దాదాపుగా 13 నుంచి 14 లక్షల మంది ఎల్జీబీటీక్యూ ప్లస్ వ్యక్తులు ఉన్నారని ఒక అంచనా. గడిచిన కొన్నేళ్లుగా స్వలింగ సంపర్కుల పట్ల సమాజంలో అంగీకార ధోరణి పెరుగుతోంది.
ముఖ్యంగా 2018 డిసెంబరులో స్వలింగ సంపర్కాన్ని చట్టబద్దం చేస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత, ఈ సంఖ్యలో పెరుగుదల కనిపించింది.
కానీ ఈ మార్పులకు భిన్నంగా, లైంగికత, లైంగిక అంశాల పట్ల సమాజం సంప్రదాయ ధోరణులనే అనుసరిస్తోంది. ఈ కారణంగా ఎల్జీబీటీక్యూ ప్లస్ వ్యక్తులు సమాజంలో వివక్షను ఎదుర్కొంటున్నారని హక్కుల కార్యకర్తలు అంటున్నారు.
కోర్టు విచారణ సమయంలో, పిటీషనర్ల తరపు న్యాయవాదుల్లో ఒకరైన ముకుల్ రోహత్గీ మాట్లాడుతూ, “ఎల్జీబీటీక్యూ ప్లస్ వ్యక్తులను రాజ్యాంగానికి లోబడి, అందరితో సమానంగా అంగీకరించాల్సిన అవసరాన్ని ఈ సమాజానికి తట్టి చెప్పాలని అన్నారు. అత్యున్నత న్యాయస్థానం తీసుకునే నిర్ణయం సమాజాన్ని ఆ దిశగా ముందుకు నడిపిస్తుంది” అని విచారణ సందర్భంగా అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి..
- గాజాలో భూతల దాడులు చేసి ఇజ్రాయెల్ తన లక్ష్యాన్ని సాధించగలదా?
- టవర్ ఆఫ్ సైలెన్స్: పార్సీలు తమ బంధువుల మృతదేహాలను రాబందులకు ఎందుకు వదిలేస్తారు?
- ప్రవళిక ఆత్మహత్యపై నాయకులు, విద్యార్ధి సంఘాల వాదనేంటి, పోలీసులు ఏం చెప్పారు?
- ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఇస్లామిక్ దేశాలు ఎందుకు ఏకం కాలేకపోతున్నాయి?
- తెలంగాణ ఎన్నికలు: ఆ నియోజకవర్గాల్లో మెజారిటీ ఓటర్లు మహిళలే అయినా ఒక్కరూ ఎమ్మెల్యే కాలేకపోయారు, ఎందుకు?
- భూకంపం వచ్చిన ప్రాంతాల్లోని ఇళ్లలో నివసించడం ఎంత వరకు సేఫ్, ఎలా తెలుసుకోవాలి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














