ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఇస్లామిక్ దేశాలు ఎందుకు ఏకం కాలేకపోతున్నాయి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ప్రియాంకా ఝా
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చాలాసార్లు యుద్ధం స్థాయికి వెళ్లాయి. ఇజ్రాయెల్ దేశంగా ఏర్పడినప్పటి నుంచీ పాలస్తీనా వివాదం నలుగుతూనే ఉంది. కాలం గడిచేకొద్దీ ఈ వివాదానికి పరిష్కారం లభించకపోగా, సమస్య మరింత జఠిలమైంది.
ఇజ్రాయెల్ విషయంలో అరబ్ ఇస్లామిక్ దేశాలు తనవైపు నిలుస్తాయని పాలస్తీనా ఆశిస్తోంది. అయితే, ఇక్కడ ప్రతి దేశానికీ సొంత ప్రయోజనాలు ఉంటాయని, వాటికి అనుగుణంగా ఆయా దేశాలు ముందుకు వెళ్తాయని గుర్తుపెట్టుకోవాలి.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), మొరాకో, బహ్రెయిన్, సూడాన్‌లు అబ్రహామిక్ ఎకార్డ్స్ ద్వారా ఇజ్రాయెల్‌ను గుర్తించి, అధికారికంగా దౌత్య సంబంధాలను ఏర్పరుచుకున్నప్పుడు తుర్కియే అధ్యక్షుడు తయ్యిప్ ఎర్దోవాన్ విమర్శలు చేశారు. అయితే, అప్పటికే ఇజ్రాయెల్‌తో తుర్కియే దౌత్య సంబంధాలను ఏర్పరచుకుంది.
1949 నుంచీ తుర్కియే, ఇజ్రాయెల్‌ల మధ్య దౌత్య సంబంధాలు ఉన్నాయి. నిజానికి ఇజ్రాయెల్‌ను గుర్తించిన తొలి ముస్లిం మెజారిటీ దేశం తుర్కియేనే.

ఫొటో సోర్స్, Getty Images
2005లో పెద్ద సంఖ్యలో వ్యాపారవేత్తలను వెంట పెట్టుకొని ఎర్దోవాన్ రెండు రోజుల ఇజ్రాయెల్ పర్యటనకు కూడా వెళ్లొచ్చారు.
ఆ పర్యటనలో భాగంగా ఇజ్రాయెల్ ప్రధాని ఏరియెల్ షరాన్ తో ఎర్దోవాన్ సమావేశమయ్యారు. ఇరాన్ ‘న్యూక్లియర్ ప్రోగ్రామ్’తో ఇజ్రాయెల్‌కు మాత్రమే కాదు, ప్రపంచం మొత్తానికీ ముప్పేనని ఆనాడు ఎర్దోవాన్ వ్యాఖ్యానించారు.
అయితే, 2010లో ‘మావీ మరమార్’ ఘటన తర్వాత ఇజ్రాయెల్, తుర్కియేల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఆనాడు ఇజ్రాయెల్ కమాండోలు ఒక తుర్కియే నౌకలోకి వెళ్లి పది మందిని హత్య చేశారు.
అయినప్పటికీ రెండు దేశాల మధ్య మంచి వ్యాపార సంబంధాలు ఉన్నాయి. 2019లో రెండు దేశాల ద్వైపాక్షిక వాణిజ్యం ఆరు బిలియన్ డాలర్లు (రూ.49.86 వేల కోట్లు)కు పెరిగింది.
ఇజ్రాయెల్ విషయంలో తర్కియే స్పందనలు తమ దేశ స్వప్రయోజనాలపై ఎలాంటి ప్రభావం చూపకుండా ఉంటాయి.
మరోవైపు సౌదీ అరేబియా కూడా పాలస్తీనా హక్కుల గురించి తరచూ మాట్లాడుతుంటుంది. కానీ, పశ్చిమ దేశాలకు కోపం తెప్పించే రీతిలో సౌదీ ధోరణి ఉండదు.
ఇజ్రాయెల్, గాజాలలో తాజా హింసకు హమాస్‌దే బాధ్యతని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఇప్పటికే వ్యాఖ్యలు చేసింది. మరోవైపు ఇరాన్ బహిరంగంగా హమాస్‌కు మద్దతు పలుకుతోంది. తప్పంతా ఇజ్రాయెల్ దేనని అంటోంది. ఇక్కడ ఇరాన్ కూడా తమ ప్రయోజనాలకు అనుగుణంగానే వ్యవహరిస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
హమాస్ విషయంలో
హమాస్, సౌదీ అరేబియాల మధ్య సంబంధాలు చాలా ఒడిదొడుకులకు లోనయ్యాయి. 1980ల నుంచి కొన్ని సంవత్సరాల వరకూ సౌదీ అరేబియాతో హమాస్‌కు మంచి సంబంధాలే ఉన్నాయి.
2019లో హమాస్ మద్దతుదారులు సౌదీలో అరెస్టు అయ్యారు. అనంతరం అరెస్టులను ఖండిస్తూ హమాస్ ఒక ప్రకటన విడుదల చేసింది. తమ మద్దతుదారులను సౌదీలో హింసిస్తున్నారని కూడా దీనిలో ఆరోపణలు చేసింది.
మరోవైపు 2000ల నుంచీ ఇరాన్‌కు హమాస్ దగ్గరవుతూ వచ్చింది. హమాస్.. సున్నీ ఇస్లామిక్ సంస్థ. ఇరాన్ షియా ముస్లిం దేశం. అయితే, ఇస్లామిక్ రాజకీయాల వల్ల ఈ రెండూ దగ్గరయ్యాయి. అయినప్పటికీ దీని వల్ల హమాస్‌కు పెద్దగా ఎలాంటి ప్రయోజనమూ చేకూరలేదని గల్ఫ్ దేశాలకు భారత రాయబారిగా పనిచేసిన తల్మీజ్ అహ్మద్ చెప్పారు.
ఇరాన్‌కు దగ్గర కావడంతో సౌదీకి హమాస్ దూరమైంది. దీనికి కారణం సౌదీ, ఇరాన్‌ల మధ్య శత్రుత్వమే. ఇక్కడ ఏదో ఒక దేశంతోనే హమాస్ దగ్గరగా ఉండగలదు.
పశ్చిమాసియాలో ఇజ్రాయెల్‌ను ఇరాన్ స్థాయిలో వ్యతిరేకించే మరో దేశం లేదు. కాబట్టి సహజంగానే ఇరాన్‌కు హమాస్ దగ్గరైంది.
అయితే, ఇటు సౌదీ, అటు ఇరాన్ రెండు దేశాలతోనూ హమాస్ సంబంధాలు ఒడిదొడుకులకు లోనయ్యాయి.
2011లో మొదలైన అరబ్ స్ప్రింగ్ (అరబ్ రివల్యూషన్)తో సిరియాలో బసర్ అల్-అస్సాద్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు వీధుల్లోకి వచ్చారు. కానీ, అస్సాద్‌కు ఇరాన్ అండగా నిలిచింది. ఇది హమాస్‌కు రుచించలేదు.
ఈ పరిణామాల నడుమ హమాస్, ఇరాన్‌ల మధ్య విభేదాలు వచ్చాయి. మరోవైపు అరబ్ స్ప్రింగ్ విషయంలో ఈజిప్టుపై సౌదీ అనుసరించిన తీరు కూడా హమాస్‌కు నచ్చలేదు.
ఈజిప్టులో ఎన్నికైన ప్రభుత్వాన్ని సౌదీ వ్యతిరేకించింది. దీనితో హమాస్ విభేదించింది. ఇరాన్‌కు హమాస్‌ను మరింత దగ్గర చేసిన కారణాల్లో ఇదీ ఒకటి.
2019 జులైలో హమాస్ ప్రతినిధులు ఇరాన్ చేరుకుని, ఆ దేశ అత్యన్నత నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీని కలిశారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇస్లామిక్ దేశాలు దాడిపై ఎలా స్పందించాయి?
హమాస్ దాడులను ఖండిస్తూ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘ఇళ్ల నుంచి ఇజ్రాయెల్ ప్రజలను బందీలుగా తీసుకొని వెళ్లినట్లు వస్తున్న వార్తలను చూసి మేం నిర్ఘాంతపోయాం. ఇవి ఉద్రిక్త పరిస్థితులను మరింత తీవ్రంచేసే చర్యలు’’ అని యూఏఈ విదేశాంగ శాఖ ప్రకటనలో వ్యాఖ్యానించింది.
బహ్రెయిన్ కూడా తాజా దాడులను ఖండించింది. ‘‘ఈ దాడితో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత ప్రమాదకర స్థాయికి వెళ్లాయి. ఇవి సామాన్య ప్రజల ప్రాణాలను మరింత ముప్పులోకి నెడుతున్నాయి’’ అని బహ్రెయిన్ విదేశాంగ శాఖ వ్యాఖ్యలు చేసింది.
ఈ రెండు దేశాల తాజా స్పందనలు ఇదివరకటి స్పందనల కంటే చాలా భిన్నంగా ఉన్నాయి. ఒకప్పుడు ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా అరబ్ దేశాలన్నీ ఒకే మాటపై స్పందించేవి.
తాజా దాడుల విషయంలో సౌదీ అరేబియా కాస్త ఆచితూచి స్పందించింది. ‘ఇజ్రాయేలీ ఆక్యుపేషన్’ లాంటి పదాలను ప్రస్తావిస్తూ, పాలస్తీనా వైపు నిలబడుతున్నట్లు సౌదీ చెప్పింది. అయితే, ప్రజల ప్రాణాలను దృష్టిలో ఉంచుకొని రెండు వైపులా వెంటనే ఘర్షణలకు ముగింపు పలకాలని సౌదీ కోరింది.
కువైత్, ఒమన్, ఖతర్‌లు.. ఇజ్రాయెల్ చర్యలను ఖండించాయి. పాలస్తీనా హక్కుల కోసం మరోసారి పునరుద్ఘాటించాయి. ఈస్ట్ జెరూసలేం రాజధానిగా పాలస్తీనా ప్రత్యేక దేశంగా గుర్తించాలని డిమాండ్ చేశాయి. ప్రస్తుత పరిస్థితికి ఇజ్రాయెల్‌దే సంపూర్ణ బాధ్యతని చెప్పాయి.
మరోవైపు పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, మలేసియా కూడా పాలస్తీనాకు మద్దతు పలికాయి.
అబ్రహామిక్ ఎకార్డ్స్‌లో భాగంగా ఇజ్రాయెల్‌తో సంబంధాలను కలుపుకున్న దేశాల్లో మొరాకో కూడా ఒకటి. తాజా దాడులపై మొరాకో కూడా ఆచితూచి స్పందించింది. ‘‘గాజాలో పరిస్థితి నానాటికీ మరింత దిగజారడంపై మేం ఆందోళన చెందుతున్నాం. ప్రజలపై ఎక్కడ దాడులు జరిగినా మేం ఖండిస్తాం’’ అని మొరాకో వ్యాఖ్యలు చేసింది.
తుర్కియే కూడా ఇజ్రాయెల్‌ను విమర్శిస్తూ ప్రకటన చేసింది. కానీ, ఇదివరకటంత ఘాటుగా ఆ ప్రకటన లేదు. ఇదివరకు ఇజ్రాయెల్‌ను నాజీ జర్మనీతో ఎర్దోవాన్ పోల్చారు. కానీ, ప్రస్తుతం అంత పదునైన పదాలు కనిపించలేదు.

ఫొటో సోర్స్, Getty Images
అమెరికాతో శత్రుత్వం కష్టమే
ఇజ్రాయెల్, అమెరికాల మధ్య దశాబ్దాల నుంచీ మంచి సంబంధాలు ఉన్నాయి. ఇజ్రాయెల్‌ను దేశంగా గుర్తించిన తొలి దేశం అమెరికానే.
ప్రస్తుతం హమాస్‌పై యుద్ధం ప్రకటిస్తూ తమ యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలను ఇజ్రాయెల్‌కు అమెరికా పంపించింది. గాజా యుద్ధంలో ఇజ్రాయెల్‌కు సైనిక, రాజకీయ సాయం పూర్తిగా అందిస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పునరుద్ఘాటించారు.
ప్రపంచంలో యూదులు మెజారిటీ గల ఏకైన దేశం ఇజ్రాయెల్. ఇది చిన్న దేశం అయినప్పటికీ, సైనిక శక్తిలో మొదటి వరుసలో ఉంటుంది.
మధ్యధరా ప్రాంతంలోని ఇజ్రాయెల్ చుట్టూ ఈజిప్టు, జోర్డాన్, లెబనాన్, సిరియా, ఇరాక్, తుర్కియే, ఇరాన్, కువైత్, మొరాకో, సౌదీ అరేబియా, పాలస్తీనా, సూడాన్, ట్యునీషియా లాంటి చాలా ముస్లిం దేశాలు ఉన్నాయి.
వీటిలో చాలా దేశాలకు ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ (ఓఐసీ)లో సభ్యత్వముంది. అమెరికాతోనూ వీటికి మంచి సంబంధాలు ఉన్నాయి.
ఓఐసీలోని 56 దేశాల్లో సగం కంటే ఎక్కువ దేశాలకు అమెరికాతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని దిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ వెస్ట్ ఏసియన్ అఫైర్స్ ప్రొఫెసర్ ఏకే పాషా చెప్పారు.
‘‘తుర్కియే, పాకిస్తాన్, ఇండోనేసియా, బంగ్లాదేశ్, జోర్డాన్, మోరాకో.. ఇలా చాలా దేశాలకు అమెరికాతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఇజ్రాయెల్ విషయంలో ఓఐసీ రెండుగా విడిపోయింది. ఇందులో ఇరాక్, ఇరాన్, అల్జీరియా, లిబియా లాంటి దేశాలతో ఒక గ్రూపు ఉంది. ఈ గ్రూపు హమాస్‌కు మద్దతు పలుకుతూ ఇజ్రాయెల్‌పై కాస్త తీవ్రంగా స్పందించాలని డిమాండ్ చేస్తుంటుంది’’ అని అన్నారు.
అయితే, ఇజ్రాయెల్‌కు మద్దతు ప్రకటించే విషయంలో పశ్చిమ దేశాలన్నీ ఏకతాటిపై ఉంటాయని జామియా మిలియా యూనివర్సిటీలోని వెస్ట్ ఆసియా అఫైర్స్ నిపుణురాలు సుజాతా ఐశ్వర్య చెప్పారు.
‘‘అబ్రహామిక్ ఎకార్డ్స్ పేరుతో చాలా ముస్లిం దేశాలతోనూ ఇజ్రాయెల్ సంబంధాలను మెరుగుపరుచుకుంటోంది. ఇక్కడ పాలస్తీనాకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తే, తాను ఒంటరిని అయిపోతానని తుర్కియేకు కూడా తెలుసు. అందుకే తుర్కియే కూడా ఆచితూచి స్పందిస్తుంటుంది’’ అని ఆమె అన్నారు.
ప్రస్తుతం రష్యాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడంలో భాగంగా ఐరోపా దేశాలు ఇజ్రాయెల్ గ్యాస్‌ను తుర్కియే మీదుగా తమ దేశాల్లోకి తీసుకురావాలని భావిస్తున్నాయి. అయితే, దీనిపై ఇంకా ఒప్పందమేమీ కుదర్లేదు.
మరోవైపు తుర్కియేలో ప్రస్తుతం ద్రవ్యోల్బణం మునుపెన్నడూలేని రీతిలో గరిష్ఠానికి పెరిగిందని, ఇలాంటి సమయంలో పెట్టుబడుల కోసం ఇజ్రాయెల్ లాంటి దేశాలపై తుర్కియే ఆధారపడుతోందని అల్-జజీరాలో ఒక కథనం కూడా ప్రచురించారు.
సెక్యూరిటీ విషయంలోనూ తుర్కియేకు ఇజ్రాయెల్ అవసరముంది. ప్రస్తుతం సిరియాలో పరిస్థితి దారుణంగా ఉంది. ఇలాంటి సమయంలో ఇజ్రాయెల్ లాంటి సైనికంగా శక్తిమంతమైన దేశం తుర్కియేకు అవసరం. అదే సమయంలో పశ్చిమాసియాలో ఇరాన్ ప్రాబల్యానికి చెక్ పెట్టేందుకు తుర్కియే లాంటి పెద్దదేశం ఇజ్రాయెల్‌కూ అవసరమే.

ఫొటో సోర్స్, Getty Images
ఇస్లామిక్ దేశాల మధ్య సయోధ్య కుదురుతుందా?
ఇలాంటి పరిస్థితుల్లో ఇస్లామిక్ దేశాలు తమ మధ్య ఉండే విభేదాలను పక్కనపెట్టి పాలస్తీనా కోసం ఏకతాటిపైకి వస్తాయా? ఈ దేశాలన్నీ కలిసి ఇజ్రాయెల్‌ను ఆపగలవా? అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.
‘‘1967 యుద్ధానికి ముందు, పాలస్తీనా, ఇజ్రాయెల్‌ల సమస్య ఒక అరబ్ సమస్య. కానీ, 1967లో అరబ్-ఇజ్రాయెల్ యుద్ధంలో ఇజ్రాయెల్ విజయంతో.. ఇది కేవలం ఇజ్రాయెల్-పాలస్తీనాల మధ్య సమస్యగా మారింది. దీన్ని ఎవరైనా పరిష్కరించుకోగలరు అంటే అది కేవలం ఇజ్రాయెల్, పాలస్తీనానే’’ అని తల్మీజ్ అహ్మద్ అన్నారు.
‘‘ఇక్కడ ఇస్లామిక్ దేశాల ప్రకటనలు పైపైకి ప్రదర్శన కోసమే. ముఖ్యంగా తుర్కియే విషయానికి వస్తే, అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ ఎన్నికైన తర్వాత ఇజ్రాయెల్‌తో సంబంధాలను ఎర్దోవాన్ చాలా మెరుగుపరుచుకున్నారు’’ అని చెప్పారు.
‘‘ఇక్కడ ఇజ్రాయెల్‌కు తుర్కియే లేదా సౌదీ అరేబియా నుంచి ఏమీకాదు. ఎవరైనా ఈ వివాదంలో జోక్యం చేసుకున్నారంటే అది అమెరికానే’’ అని తల్మీజ్ అన్నారు.
‘‘కానీ, సౌదీ లాంటి దేశాల్లో సాధారణ ప్రజలు పాలస్తీనాకు గట్టి మద్దతు ఇస్తున్నారు. కాబట్టి ప్రజల నుంచి సౌదీ రాజ కుటుంబానికి కాస్త ఒత్తిడి ఉండొచ్చు. అందుకే అలాంటి ప్రకటనలు విడుదల చేస్తున్నారు. ఇక ఇరాన్ తనని తాను విప్లవ దేశంగా ప్రకటించుకుంటుంది. కాబట్టి పాలస్తీనా, హమాస్‌కు మద్దతుగా ఇరాన్ ప్రకటనలు విడుదల చేస్తుంది’’ అని తల్మీజ్ అహ్మద్ చెప్పారు.
పాలస్తీనాకు ఇరాన్ ముఖ్యం..
పాలస్తీనా హక్కులకు మద్దతు పలకడం అనేది ఇరాన్ విదేశాంగ విధానంలో భాగం. గాజా నుంచి ఇజ్రాయెల్‌పై దాడి తర్వాత ఇరాన్‌లో సంబరాలు కూడా జరుపుకున్నారని వార్తలు వచ్చాయి.
అయితే, గాజా దాడుల్లో తమ పాత్ర ఉందనే వార్తలను ఇరాన్ ఖండించింది.
ప్రస్తుతం సౌదీ అరేబియా, ఇజ్రాయెల్‌ల మధ్య దౌత్య సంబంధాలు లేవు. అయితే, ఈ రెండింటికీ ఇరాన్ శత్రువు. పశ్చిమాసియాలో ఇరాన్ ప్రాబల్యానికి చెక్ పెట్టాలని రెండు దేశాలూ చూస్తున్నాయి.
అయితే, సౌదీ అరేబియా, ఇరాన్‌ల మధ్య సంబంధాలను గాడిన పెట్టేందుకు ఇటీవల చైనా ప్రయత్నాలు చేసింది. కానీ, ఇది అంత తేలిక కాదు.
ఇరాన్, సౌదీ రెండు ఇస్లామిక్ దేశాలే. కానీ, ఇరాన్‌లో షియాలది ఆధిక్యం. సౌదీలో సున్నీలది ఆధిక్యం. పశ్చిమాసియాలో సాయం కోసం కొన్ని దేశాలు సౌదీ వైపు చూస్తుంటే మరికొన్ని ఇరాన్ వైపు చూస్తున్నాయి.
‘‘ఇస్లాంలో అత్యంత పవిత్రమైన మక్కా, మదీనాలకు సంరక్షకులం తామేనని సౌదీ చెబుతోంది. పైగా ఓఐసీ ప్రధాన కార్యాలయం కూడా జెడ్డాలోనే ఉంది. అయితే, ఎప్పుడూ పాలస్తీనాకు అనుకూలంగా, ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా నడుచుకునే ఏకైక దేశం ఇరాన్ మాత్రమే’’ అని ఏకే పాషా చెప్పారు.
ఇటీవల సౌదీ అరేబియా, ఇజ్రాయెల్‌ల మధ్య దౌత్య బంధాల కోసం అమెరికా మధ్యవర్తిత్వంలో చర్చలు జరిగాయి. కానీ, హమాస్ తాజా దాడులతో ఆ ఒప్పందానికి తూట్లు పడే అవకాశముంది.
‘‘అయితే, పాలస్తీనా విషయంలో ఇరాన్ చేస్తున్న ప్రకటనలతో ప్రాంతీయంగా ఆ దేశం పేరు మరింతగా వినిపించొచ్చు. ఇది సౌదీ అరేబియాకు అంత రుచించదు. ఎందుకంటే ఇస్లామిక్ ప్రపంచానికి తామే నేతృత్వం వహిస్తున్నామని సౌదీ చెబుతుంటుంది’’ అని ఏకే పాషా చెప్పారు.
‘‘చైనా మధ్యవర్తిత్వంలో సౌదీ, ఇరాన్‌ల మధ్య కొన్ని విభేదాలు తొలగొచ్చు. కానీ, రెండు దేశాల మధ్య సంబంధాలు సాధారణం కావడం చాలా కష్టం. ఎందుకంటే ఇక్కడ యెమెన్, లెబనాన్, లిబియా లాంటి ప్రాంతాల్లో రెండు దేశాలూ పరస్పర విరుద్ధమైన వైఖరులతో వెళ్తున్నాయి. ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్‌కు దీటుగా అణ్వాయుధాల తయారీలో అమెరికా తమకు సాయం చేయాలని సౌదీ కోరుతోంది. ఇరాన్‌తో పోటీలో అసలు వెనకపడే ఆలోచనే సౌదీకి లేదు’’ అని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ఇజ్రాయెల్ బాంబ్ షెల్టర్ నుంచి తెలుగు యువకుడి అనుభవాలు: ‘‘దాడులు మామూలే కదా అనుకున్నాం, కానీ ఇంత తీవ్రంగా ఉంటాయనుకోలేదు’’
- ‘నా వక్షోజాలను సర్జరీతో వికారంగా మార్చిన డాక్టర్‌కు వ్యతిరేకంగా పోరాడాను... ఆయనకు ఏడేళ్ల జైలుశిక్ష పడేలా చేశాను’
- ప్రేమనాడులు మనలో ఎక్కడెక్కడ ఉంటాయో తెలుసా
- క్రికెట్: టీమిండియాకు స్పాన్సర్ చేశాక ఆరిపోతున్న కంపెనీలు, అసలేం జరుగుతోంది?
- రాణిని చంపేందుకు ప్రోత్సహించిన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్, జస్వంత్ సింగ్‌కు 9 ఏళ్ల జైలు శిక్ష
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















