ఇజ్రాయెల్-గాజా: 'ఇది కచ్చితంగా ఊచకోతే, దీనికి మూల్యం చెల్లించుకోవాల్సిందే...' హమాస్ దాడులపై ప్రత్యక్ష సాక్షుల ఆవేదన

ఫొటో సోర్స్, Getty Images
ఐజాక్ హిల్స్ అనే పాలస్తీన పౌరుడు శనివారం ఉదయం అలా నిద్రలో నుంచి లేచాడో లేదో భారీ రాకెట్ కాల్పుల శబ్దాలు వినిపించడం మొదలుపెట్టాయి.
ఆయన ఇజ్రాయెల్ సరిహద్దులోని సెక్యురిటీ ఫెన్సింగ్ సమీపంలో గల గాజాలో నివసిస్తున్నారు. 45 నిమిషాల పాటు ఆయుధాలు ప్రయోగించిన శబ్దంతో ఐజాక్ ఇల్లు ప్రతిధ్వనించింది.
సోషల్ ప్రాజెక్టులపై పనిచేసే ఐజాక్‌కు ఏం జరుగుతుందో తెలియలేదు. అదంతా చూసి ఇజ్రాయెల్ మళ్లీ గాజాపై దాడి చేస్తుందనుకున్నారు.
"గత నాలుగు యుద్ధాలలో మేం అనుభవించిన దాని గురించి ఆలోచిస్తున్నా. అది మళ్లీ రాకూడదనుకుంటున్నా" అని ఐజాక్ అంటున్నారు.
రాకెట్ల దాడి చూసి తన కుటుంబంలోని 12 మందిని తీసుకొని అక్కడి సిటీ సెంటర్లో ఉన్న తన కార్యాలయంలో తలదాచుకున్నారు ఐజాక్.
ఇంటి నుంచి బయటికి అడుగుపెట్టగానే వీధుల్లో తన పక్కింటి వాళ్లు చాలామంది కనిపించారు. అందరి కళ్లల్లోనూ అదే భయం చూశారాయన.

ఫొటో సోర్స్, Getty Images
‘తలుచుకుంటేనే నాకు భయమేస్తోంది’
పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ ఇజ్రాయెల్‌లోకి రాకెట్స్ ప్రయోగించిందని, మిలిటెంట్లు కంచెను దాటుకుని ఇజ్రాయెల్‌లోకి చొరబడ్డారని వారికి ఇంకా తెలియదు.
హమాస్ దాడికి దిగిన కొద్ది గంటల్లోనే, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, తమ దేశం యుద్ధంలోకి దిగినట్లు ప్రకటించారు. గాజా పక్కన నివసిస్తున్న ఇజ్రాయెల్ పౌరులకు కొన్ని గంటల ముందు దీని గురించి తెలుసు.
అడెలె రీమర్ (68) ఒక ఇంగ్లిష్ టీచర్. ఆమె 1975లో అమెరికా నుంచి ఇజ్రాయెల్ వచ్చారు. ఆమె ఇప్పుడు గాజాకు తూర్పున ఉన్న కమ్యూనిటీ సెటిల్‌మెంట్ (కొత్తగా ఏర్పడ్డ నివాసం)లో ఉన్నారు.
ఆమె తన ప్రాణాలను కాపాడుకోవడానికి అక్కడ దాచుకున్నారు. కానీ అదే సమయంలో ఆ గది తలుపు పక్కనే ఎవరినో కొడుతుండటం విన్నారామె.
"నేను రాకెట్‌ల శబ్దం విన్న గంట తర్వాత నా ఇంటి వెలుపల మిలిటెంట్లు చేస్తున్న శబ్దాలు వినిపించాయి" అని అడెలె ఫోన్‌లో బీబీసీతో తెలిపారు.
"వారు లోపలికి రావడానికి ప్రయత్నించారు. కానీ వారికి సాధ్యం కాలేదు. నా దగ్గర ఎలాంటి ఆయుధాలు లేవు. అక్కడేం జరిగిందో తలుచుకుంటనే భయమేస్తోంది" అని ఆమె అన్నారు.
ఆ తర్వాత మిలిటెంట్లు ఇతర ఇళ్లపై దాడికి దిగారని అడెలె తెలిపారు.
"నా పక్కింటి వారికి ఏం జరిగిందో అడగాలంటేనే భయమేస్తోంది" ఆమె తన పరిస్థితిని వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
'ఇది ఊచకోతే'
రఫాకు దక్షిణంగా ఉన్న సుఫా పట్టణంలో (గాజా సమీపంలో) నివసిస్తున్నారు ఇయాల్ .
"నాకు చాలా కోపం వస్తోంది. బాధేస్తోంది" అని ఇయాల్ ఫోన్‌లో బీబీసీతో అన్నారు. 'ఇది ఊచకోతే' అని అతనంటున్నారు.
''రాకెట్ల దాడులు 6 గంటల ప్రాంతంలో మొదలయ్యాయి. రాకెట్లు ప్రయోగిస్తున్నట్లు హెచ్చరిక సైరన్లు విన్నాం. షెల్టర్లలో తలదాచుకున్నాం. తరువాత మాకు కాల్పుల శబ్ధం వినిపించింది. మిలిటెంట్లు సమీపించేశారు. మేం రోజంతా షెల్టర్ నుంచి బయటికి రాలేదు'' అని భయపడుతూ చెప్పారు ఇయాల్.
సంఘటనా స్థలానికి చేరుకోవడానికి ఇజ్రాయెల్ భద్రతా దళాలకు చాలా సమయం పట్టిందని ఇయల్, అడెలె అంటున్నారు.
అయితే, దాడులకు ప్రతిస్పందించడానికి ఇజ్రాయెల్ దళాలకు ఎంత సమయం పట్టిందనేది బీబీసీ ఖచ్చితంగా నిర్ధరించలేకపోయింది.
అయితే గాజా నుంచి దాడులు జరిగిన కొన్ని గంటల వరకు ఇజ్రాయెల్ ఏం చేయలేకపోవడంపై సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి.
షాక్‌లో పాలస్తీనియన్లు
ఇజ్రాయెల్‌లో దాడికి గురైన ప్రాంతాల్లో చాలా ఫోన్ లైన్‌లు పని చేయడం లేదు. ఇంటర్నెట్ వ్యవస్థ దెబ్బతింది.
ఫోన్ ద్వారా బీబీసీ వారిని సంప్రదించడంతో చాలామంది కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎక్కువసేపు మాట్లాడలేకపోయారు.
హమాస్ ఆపరేషన్ చాలామంది పాలస్తీనియన్లను ఆశ్చర్యానికి గురిచేసింది. దీన్ని అసాధారణ సంఘటనగా భావిస్తున్నారు.
ఉదయం ఏం జరిగిందో ప్రజలకు చాలావరకు తెలియదని గాజాలోని బీబీసీ అరబిక్ రిపోర్టర్ అద్నాన్ అల్-బుర్ష్ అంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
'ప్రపంచం అర్థం చేసుకోవాలి'
"గాజా నుంచి క్షిపణులు ప్రయోగించినపుడు పెద్ద పెద్ద శబ్దాలను విన్నాం" అని అద్నాన్ తెలిపారు.
పాలస్తీనా మిలిటెంట్లు ఇజ్రాయెల్‌లోకి చొరబడ్డారని హమాస్ సోషల్ మీడియా ఖాతాలు చూసి కొంతమంది ప్రజలు తెలుసుకున్నారని వివరించారు.
ఇజ్రాయెల్ నుంచి బలమైన సైనిక ప్రతిస్పందన ఉండొచ్చంటున్నారు గాజాలోని పాలస్తీనియన్లు. అయితే, అన్నింటికీ సిద్దంగానే ఉన్నామని వారు బీబీసీతో తెలిపారు.
"మేం చాలాకాలంగా బాధపడుతున్నామని ప్రపంచం అర్థం చేసుకోవాలి. ఎలాంటి ప్రతిచర్య జరిగినా, దానికి మేం సిద్ధంగా ఉన్నాం" అని ఐజాక్ చెప్పారు.
"నాకిప్పుడు చనిపోతానన్న బాధ లేదు" అని పాలస్తీనా ఉద్యమకారిణి నదియా అబు షాబాన్ గాజా నుంచి ఫోన్‌లో బీబీసీతో అంటున్నారు.
ఈ ఆపరేషన్ తమ విజయమని హమాస్ ఇప్పటికే ప్రకటించుకుంది. అంతేకాదు గాజా అంతటా జరుగుతున్న 'ప్రార్థన'లను అక్కడి మసీదులు ప్రసారం చేశాయి.
దాడుల స్థాయిని అంత తేలికగా మర్చిపోలేమని చాలామంది ఇజ్రాయెల్‌లు బీబీసీతో చెప్పారు.
"పిల్లలు, పెద్దలు అందరూ గాయపడ్డారు, కొందరిని చంపేశారు, కిడ్నాప్ చేశారు. హమాస్ నాయకులు ఈ భయంకరమైన మారణకాండకు మూల్యం చెల్లించాలి" అని సుఫా నివాసి ఇయల్ చెప్పారు.
ఇవి కూడా చదవండి
- కతియా: మిస్టరీగా మారిన శ్మశాన వాటిక, అక్కడ దెయ్యాలు ఉన్నాయని గ్రామస్తులు ఎందుకు భయపడ్డారు?
- శ్రీలంక క్రికెటర్ ధనుష్క గుణతిలక కండోమ్ లేకుండా సెక్స్ చేశారనే కేసులో కోర్టు ఏం చెప్పిందంటే..
- రాణిని చంపేందుకు ప్రోత్సహించిన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్, జస్వంత్ సింగ్‌కు 9 ఏళ్ల జైలు శిక్ష
- నార్గెస్ మొహమ్మదీ: 13 సార్లు అరెస్టులు.. 31 ఏళ్ల జైలు శిక్ష...అయినా పోరాటం ఆపని మహిళకు నోబెల్ శాంతి బహుమతి
- వరల్డ్ కప్ 2023: ఇండియా - పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడు? లైవ్ ఎక్కడ వస్తుంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















