భగత్ సింగ్ ఎవరినైనా ప్రేమించారా? ఆ ఉత్తరంలో ఏముంది?

ఫొటో సోర్స్, Harper Collins
- రచయిత, జై శుక్లా
- హోదా, బీబీసీ ప్రతినిధి
“ప్రేమ అనేది ప్రేరణ తప్ప మరొకటి కాదని నేను చెప్పగలను. ప్రేమ క్రూరమైన స్వభావం కాదు, మధురమైన భావోద్వేగం. ప్రేమ మానవ స్వభావాన్ని ఉన్నతం చేస్తుంది. నిజమైన ప్రేమ ఎప్పుడూ విఫలం కాదు.”
ప్రేమ గురించిన ఈ వాక్యాలు భగత్ సింగ్.. సుఖ్‌దేవ్‌కు రాసిన లేఖలోనివి.
భగత్ సింగ్ పార్లమెంట్ మీద బాంబు విసరడానికి ముందు సుఖ్‌దేవ్‌కు ఓ లేఖ రాశారు. అందులోనివే ఆ వాక్యాలు. దిల్లీలోని సీతారామ్ బజార్ నుంచి ఆయన ఉత్తరం రాశారు. భగత్ సింగ్ స్నేహితుడు శివ వర్మ ఈ లేఖను సుఖ్‌దేవ్‌కు అందించారు.
లాహోర్ కుట్ర కేసులో సుఖ్‌దేవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పుడు ఆయన దగ్గర నుంచి ఈ ఉత్తరాన్ని స్వాధీనం చేసుకుని కోర్టులో ప్రవేశ పెట్టారు.
సీనియర్ జర్నలిస్టు, రచయిత రాజశేఖర్ వ్యాస్ రాసిన ‘మై భగత్ సింగ్ బోల్ రహాహు’ అనే పుస్తకంలో ఇలా ఉంది.
‘‘పార్లమెంట్ మీద బాంబు విసిరే పనిపై చర్చ జరుగుతున్నప్పుడు బాంబు విసిరే బాధ్యతను విప్లవకారులకు అప్పగించడాన్ని భగత్ సింగ్ తిరస్కరించారు. ఎందుకంటే వాళ్లు స్వాతంత్య్ర పోరాటానికి అవసరం అనేది ఆయన అభిప్రాయం. అయితే ఆ సమయంలో అక్కడున్న సుఖ్‌దేవ్, భగత్ సింగ్‌ను హేళన చేశాడు. ‘నువ్వు ఆ మహిళను ప్రేమిస్తున్నావు. అందుకే భయపడుతున్నావు కదా’ అని చులకనగా మాట్లాడినట్లు ఉంది.
సుఖ్‌దేవ్ ఆరోపణలతో భగత్ సింగ్ హృదయం కరిగిపోయింది. ఆయన మళ్లీ విప్లవకారులతో సమావేశం ఏర్పాటు చేసి పార్లమెంట్ మీద తానే బాంబు విసురుతానని చెప్పాడు.

ఫొటో సోర్స్, OTHERS
సుఖ్‌దేవ్ ఆరోపణలపై భగత్ సింగ్ ఎలా స్పందించారు?
భగత్ సింగ్‌పై పరిశోధన చేసిన వారి ప్రకారం చూస్తే.. సుఖ్‌దేవ్ చేసిన ఆరోపణల మీద భగత్ సింగ్‌కి కోపం వచ్చింది. సుఖ్‌దేవ్‌తో కొన్ని రోజులు మాట్లాడలేదు.
తర్వాత ఆయన సుఖ్‌దేవ్‌కు లేఖ రాశారు. “ప్రేమ్ హమే ఊంచా ఉడతా హై” అనే పేరుతో ఈ ఉత్తరం బాగా పాపులర్ అయింది.
సుఖ్‌దేవ్‌కు రాసిన ఈ లెటర్‌లో భగత్ సింగ్, “నా మాటల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. నా స్వీయ అంగీకారాన్ని బలహీనతగా భావించారు” అని రాశారు.
“ఈ ఉత్సాహ భరిత క్షణంలో మనం చర్చించుకుంటున్న ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ఉండలేను. నాలో ఆశలు, ఆకాంక్షలు చాలా ఉన్నాయి.
జీవితంలోని ఆనందకరమైన రంగులతో మునిగిపోయాను. అవసరమైతే వీటన్నింటిని వదులుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇదే నిజమైన త్యాగం.’’ అని రాశారు.

ఫొటో సోర్స్, OTHERS
భగత్ సింగ్‌లో సున్నిత భావోద్వేగాలు
“ఇతరుల వ్యక్తిత్వంపై ఆరోపణలు చేసే ముందు, ప్రేమ ఎవరికైనా సాయపడిందా అనేది ఆలోచించాలి.
గిసెప్పీ మాజినికి( ఇటలీ ఏకీకరణ కోసం పోరాడిన విప్లవ యోధుడు) ప్రేమ తోడ్పడింది. మీరు వాళ్ల గురించి తెలుసుకోవాలి. ఆయన తొలి తిరుగుబాటు విఫలమైన తర్వాత ఆయనకు పిచ్చి పట్టేది లేదా ఆత్మహత్య చేసుకునేవాడు.
కానీ, ఆ సమయంలో ఆయన ప్రేయసి రాసిన ఉత్తరం మాజినీని బలమైన శక్తిగా మార్చింది” అని కూడా భగత్ సింగ్ ఈ లేఖలో రాశారు.
ప్రేమ ఇచ్చే స్ఫూర్తి మనిషిని దాటి ప్రపంచమంతటికీ విస్తరించాలని లేఖలో ఉంది.
ఈ ఉత్తరం చదివితే భగత్ సింగ్‌లోని సున్నితమైన భావాలను అర్థం చేసుకోవచ్చు.
విప్లవకారుడైనప్పటికీ భగత్ సింగ్‌లో భావోద్వేగాలు తీవ్రంగా ఉన్నాయని ఈ లేఖ చెబుతోంది.
ఆమెను ప్రేమిస్తున్నదీ లేనిదీ భగత్ సింగ్ ఈ లేఖలో ఎక్కడా చెప్పలేదు. అయితే విప్లవకారులు ప్రేమను నెరవేర్చుకోలేరని నొక్కి చెప్పారు.

ఏ మహిళ విషయంలో భగత్ సింగ్‌ను సుఖ్‌దేవ్ చులకన చేసి మాట్లాడారు?
‘సర్ఫరోషీకి తమన్నా- భగత్ సింగ్ కా జీవన్ ఔర్ ముకద్మా’ పేరుతో ప్రముఖ జర్నలిస్ట్ కులదీప్ నయ్యర్ ఒక పుస్తకం రాశారు.
సుఖ్‌దేవ్, భగత్ సింగ్ హృదయాన్ని గాయపరిచారని, ‘నువ్విప్పుడు పోరాటానికి పనికి రావు. ఎందుకంటే నువ్వొక అమ్మాయి చేతుల్లో బందీ అయ్యావు’ అని సుఖ్‌దేవ్ ఆరోపించారని ఆ పుస్తకంలో ఉంది.
శాండర్స్ హత్య తర్వాత భగత్ సింగ్‌ను తనతో తీసుకువెళ్లేందుకు లాహోర్ నుంచి కలకత్తా వచ్చిన దుర్గాదేవిని ఉద్దేశించి సుఖ్‌దేవ్ ఈ వ్యాఖ్యలు చేశారని ఆ పుస్తకంలో కులదీప్ నయ్యర్ రాశారు.
“దుర్గాదేవికి వివాహం అయిందనేది నిజం. ఆమెకో కుమారుడు కూడా ఉన్నాడు. అయితే ఇద్దరు పార్టీ కోసం పని చేస్తున్నారు. పార్టీలో వారి వ్యవహార శైలి సహజంగా ఉంటుంది. వాళ్లిద్దరి మధ్య ఇంకా ఏదైనా బంధం ఉందా? భగత్ సింగ్ ఎప్పుడూ ఏదీ బయటకు చెప్పలేదు.
సుఖ్‌దేవ్ లేవనెత్తిన అంశాన్ని ఇతర విప్లవకారులెవరూ ప్రస్తావించలేదు. భగత్ సింగ్‌కి తండ్రి లాంటి చంద్ర శేఖర్ ఆజాద్ కూడా. ప్రేమ అనే బాంధవ్యాన్ని విమర్శించడం లేక తక్కువ చేసి మాట్లాడటం సరైనది కాకపోవచ్చని ఆజాద్ భావించి ఉండవచ్చు” అని కులదీప్ నయ్యర్ తన పుస్తకంలో రాశారు.
“సుఖ్‌దేవ్ ఆరోపణల గురించి తాను మాట్లాడటం సరికాదని ఆజాద్ భావించి ఉండవచ్చు”
కులదీప్ నయ్యర్ దుర్గాదేవిని కలిశారు. అయితే భగత్ సింగ్‌తో ప్రేమ వ్యవహారం గురించి ప్రస్తావించినట్లు కానీ, వివరణ అడిగినట్లు కానీ నయ్యర్ ఎక్కడా పుస్తకంలో ప్రస్తావించలేదు.
పోలీసుల నుంచి తప్పించుకునేందుకు దుర్గాదేవి, భగత్‌సింగ్ లాహోర్ నుంచి కలకత్తాకు ప్రయాణించిన విషయాన్ని మాత్రమే ఆయన తన పుస్తకంలో రాశారు.

ఫొటో సోర్స్, HARPER COLLINS
భగత్ సింగ్ ప్రేమ గురించి ఆధారాలు ఏమైనా ఉన్నాయా?
భగత్ సింగ్ మేనల్లుడు వీరేంద్ర సింగ్ రాసిన “యుగద్రిష్ట భగత్ సింగ్ ఔర్ ఉన్ కే మృత్యుంజయ పుర్కే” అనే పుస్తకంలోనూ ఈ అంశం గురించి ఏమీ ప్రస్తావించలేదు,
పార్లమెంట్ మీద దాడి చేసే విప్లవకారుల బృందంలో భగత్ సింగ్ పేరు లేదని, ‘నువ్వొక పిరికివాడివి’ అని సుఖ్‌దేవ్, భగత్‌సింగ్‌ను అన్నాడని, ఈ విషయంలో వాళ్లిద్దరి మధ్య గొడవ జరిగిందని వీరేందర్ సింగ్ తన పుస్తకంలో రాశారు.
అయితే ఓ యువతిని ప్రేమిస్తూ ఉండటం వల్ల భగత్ సింగ్ చావుకు భయపడ్డారని సుఖ్‌దేవ్ ఆరోపించినట్లు ఎక్కడా పేర్కొనలేదు.
అయితే ఈ పుస్తకంలో భగత్ సింగ్ సుఖ్‌దేవ్‌కు రాసిన ఉత్తరం గురించిన ప్రస్తావన ఉంది.
భగత్ సింగ్ జీవితం మీద పరిశోధన చేసి పుస్తకం రాసిన జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ ప్రొఫెసర్ చమన్‌లాల్ బీబీసీతో మాట్లాడారు.
“ఈ ప్రేమ వ్యవహారంపై ఎలాంటి ఆధారాలు లేవు. అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. ప్రస్తుతం జీవించి ఉన్న వారిలో ఎవరైనా ఈ అంశంపై దృష్టి పెట్టాలి” అని ఆయన చెప్పారు.
“ఈ వ్యవహారం గురించి సుఖ్‌దేవ్, భగత్ సింగ్ మధ్య వివాదం ఉందని కొన్ని పుస్తకాల్లో ప్రస్తారవించారనేది వాస్తవమే. సుఖ్‌దేవ్ కొంచెం మొరటుగా ఉండే వ్యక్తి. పరుషంగా మాట్లాడతాడు.
అందుకే ఆయన అలా అని ఉండవచ్చు. అయితే దుర్గాదేవితో భగత్ సింగ్‌కు ప్రేమ వ్యవహారం ఉందనే కోణాన్ని ముడిపెట్టి సుఖ్ దేవ్ వ్యాఖ్యల్ని చూడటం సమంజసం కాదు” అని చమన్‌లాల్ చెప్పారు.
“భగత్ సింగ్ అనేకమంది మహిళలను విప్లవం వైపు వచ్చేలా ప్రభావితం చేశారు. అనుకున్నది సాధించగలిగే వ్యక్తిత్వం, తార్కికంగా ఆలోచించడం, విజ్ఞానం, తిరుగుబాటు వైఖరి లాంటివి భగత్‌సింగ్‌కు ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి.
మహిళల పట్ల ఆయన మర్యాదగా వ్యవహరించేవారు. అందుకే స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న విప్లవకారిణులు వారి అభిప్రాయాలను ఆయనతో పంచుకునేవారు. దానర్ధం ప్రతి మహిళతో ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉందని కాదు.
సుఖ్‌దేవ్ ఏదో ఊహించుకుని భగత్‌సింగ్‌ను తూలనాడి ఉండవచ్చు” అని ప్రొఫెసర్ చమన్‌లాల్ అభిప్రాయపడ్డారు.
“ భగత్‌సింగ్ తన సహచరులైన భటుకేశ్వర్‌దత్, జైదేవ్ కపూర్ చెల్లెళ్లకు కూడా లేఖలు రాశారు. ఆయన లేఖలు రాసిన వారందరితోనూ ఆయన ప్రేమాయణం నడిపారని అనుకోవాలా?” అని చమన్‌లాల్ ప్రశ్నించారు.
భగత్‌సింగ్ గురించి రాసిన అనేక మంది రచయితలు తమ పుస్తకాల్లో ఆయన ప్రేమ వ్యవహారం గురించి సంచలనాత్మకంగా ప్రస్తావించడం ద్వారా దీన్నొక విషాదంగా మార్చారాన్ని ఆయన ఆరోపించారు.

ఫొటో సోర్స్, NATIONAL BOOK TRUST
‘భగత్ సింగ్ భార్య’గా మారి, ఆయన్ని తప్పించిన దుర్గాదేవీ
1928 అక్టోబర్ 30న సైమన్ కమిషన్ లాహోర్ చేరుకుంది.
కమిషన్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల్లో లాలా లజపతిరాయ్‌కు మద్దతివ్వాలని భగత్ సింగ్ నిర్ణయించారు.
ఆందోళనకారుల మీద లాఠీచార్జ్ చేయాలని పోలీసు అధికారి జేఏ స్కాట్ ఆదేశాలిచ్చారు.
దీంతో లాలా లజపతిరాయ్‌ను పోలీసులు విచక్షణరహితంగా కొట్టారు. తీవ్రంగా గాయపడిన ఆయన 1928 నవంబర్ 17న చనిపోయారు.
1928 డిసెంబర్ 10 డిసెంబర్ రాత్రి జరిగిన విప్లవవీరుల సమావేశానికి దుర్గాదేవి నాయకత్వం వహించారు.
లాలాజీ మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని ఆ సమావేశంలో నిర్ణయించారు.
స్కాట్‌ను చంపే బాధ్యతను ఎవరు తీసుకుంటారని దుర్గాదేవి అడగ్గానే ‘నేను’ అని భగత్‌సింగ్ ముందుకొచ్చారు.
అయితే మిగతా విప్లవకారులంతా ఆ బాధ్యతను భగత్ సింగ్, రాజ్‌గురు, చంద్రశేఖర ఆజాద్, జయగోపాల్‌కు అప్పగించారు.
స్కాట్‌ను చంపేందుకు 1928 డిసెంబర్ 17న ఓ ప్రణాళికను సిద్ధం చేశారు.
అయితే జయగోపాల్ చేసిన తప్పిదం వల్ల స్కాట్‌కు బదులు అక్కడి సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ శాండర్స్‌ను హత్య చేశారు.
వాళ్లను వెంటాడిన భారతీయ హెడ్ కానిస్టేబుల్‌ను కూడా కాల్చేసిన విప్లవకారులు అక్కడ నుంచి పారిపోయారు.

“భగత్ సింగ్ పారిపోయిన తర్వాత దాక్కునేందుకు దుర్గాదేవి వద్దకు వెళ్లారు. ఆమె విప్లవకారుడు భగవతి చరణ్ వోహ్రా భార్య.
దుర్గాదేవి భగత్ సింగ్ భార్యగా నటించడం ద్వారా భగత్ సింగ్‌కు సహాయపడవచ్చని సుఖ్‌దేవ్ ప్లాన్ చేశారు” అని కులదీప్ నయ్యర్ తన పుస్తకంలో రాశారు.
“దుర్గాదేవి భర్త అప్పటికే పోలీసుల నుంచి తప్పించుకుని కాంగ్రెస్ సమావేశంలో పాల్గొనేందుకు కలకత్తా పారిపోయారు.
దుర్గాదేవి తన పేరును సుజాతగా, భగత్ సింగ్ తన పేరుని రంజీత్‌గా మార్చుకున్నారు. దుర్గాదేవి మూడేళ్ల కుమారుడు శాచీ వారితోనే ఉన్నాడు.
రాజ్‌గురు వారి సేవకుడిగా ఉండేవాడు. భగత్ సింగ్ యూరోపియన్ సంప్రదాయ దుస్తులు ధరిస్తే దుర్గాదేవి ఖరీదైన చీర, ఎత్తు మడమ చెప్పులు వేసుకున్నారు”.
“ఇద్దరు రైల్లో కూర్చున్నారు. కాన్పూర్‌లో దిగుదామని దుర్గాదేవి చెప్పడంతో ఇద్దరూ అక్కడే దిగి హోటల్‌లో ఉన్నారు. నేను నా సోదరుడితో కలిసి కలకత్తా వస్తున్నాను అంటూ దుర్గాదేవి భర్తకు టెలిగ్రామ్ ద్వారా సందేశం పంపించారు.
ఆ టెలిగ్రామ్ అందుకున్న తర్వాత భగవతి చరణ్ షాక్ తిన్నారు. ఎందుకంటే దుర్గాదేవికి సోదరులెవరూ లేరన్న విషయం ఆయనకు తెలుసు.
దుర్గాదేవితో తన రెండు రోజుల అనుబంధంతో తనలో ఏదో మార్పు వచ్చిందని భగత్ సింగ్ తెలుసుకున్నారు. తన జీవితం, నమ్మకాల గురించి భగత్ సింగ్ దుర్గాదేవికి అంతా వివరంగా చెప్పారు” అని కులదీప్ నయ్యర్ పుస్తకంలో రాశారు.
భగత్ సింగ్ వ్యక్తిత్వంలో వైవిధ్యాన్ని చూసి దుర్గాదేవి కూడా ఆశ్చర్యపోయారు. భగత్ సింగ్ కరడుగట్టిన తిరుగుబాటు దారుడు అని భావించిన దుర్గాదేవి, భగత్ సింగ్ చెప్పిన విషయాలు విన్న తర్వాత ఆయన హృదయాన్ని అర్థం చేసుకున్నారు.
“దుర్గాదేవి మొదట తన సహచరుడి భార్యగానే భగత్ సింగ్‌కు తెలుసు. అయితే లాలాజీ మరణానికి ప్రతీకారంగా స్కాట్‌ను హత్యకు ప్లాన్ చేసేందుకు జరిగిన సమావేశానికి నాయకత్వం వహించినప్పుడు ఆమెలో మరో వ్యక్తిని చూశారు.
బ్రిటీషర్లకు చిక్కకుండా అతనిని ఆమె కాపాడటంతో వారిద్దరి సాన్నిహిత్యం మరింత పెరిగింది. అది వారికి ఉత్సాహంగానూ, భయంగానూ అనిపించింది. అంతకు ముందు ఎన్నడూ లేని అనుభవం అది” అని కులదీప్ నయ్యర్ తన పుస్తకంలో రాశారు.

సుఖ్‌దేవ్ నిజంగా అలా అన్నారా?
పార్లమెంట్ మీద బాంబు ఎవరు విసరాలన్న దానిపై భగత్ సింగ్- సుఖ్‌దేవ్ మధ్య తీవ్ర వాగ్యుద్ధం జరిగిందనేది వాస్తవం.
అయితే భగత్ సింగ్ ప్రేమలో పడటం వల్లనే బాంబు వేసేందుకు ముందుకు రాలేదని సుఖ్‌దేవ్ అన్నాడన్న వ్యాఖ్యలపై విప్లవకారులతో పాటు రచయితల మధ్య కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.
రచయితలు విశ్వ ప్రసాద్ గుప్తా, మోహినీ గుప్తా రాసిన సర్దార్ భగత్ సింగ్ – పర్సన్ అండ్ థాట్ పుస్తకంలో భగత్ సింగ్, దుర్గాదేవి మధ్య ‘రొమాన్స్’ లేదని, అయితే చాలా సాన్నిహిత్యం ఉందని రాశారు.
పార్లమెంట్ మీద బాంబు విసిరే విషయంలో సుఖ్‌దేవ్, భగత్ సింగ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడని, హేళన చేశాడని కొంత మంది రచయితలు రాసినా, అందులో మహిళ ప్రస్తావన ఎక్కడా తీసుకురాలేదు.
భగత్ సింగ్ సన్నిహితుల బృందంలో ఒకడైన శివ వర్మ రాసిన సంస్మృతియా అనే పుస్తకంలోని 106,107 పేజీల్లో సుఖ్‌దేవ్- భగత్ సింగ్ మధ్య వాదన జరిగిందని పేర్కొన్నప్పటికీ అందులో దుర్గాదేవి ప్రస్తావన లేదు.
భగత్ సింగ్ తప్ప తన లక్ష్యాలను ఎవరూ నెరవేర్చలేరని సుఖ్‌దేవ్ చెప్పినట్లు ఆయన సోదరుడు మత్రదాస్ థాపర్ తన పుస్తకం మేర్ భాయ్ షహీద్ సుఖ్‌దేవ్‌లో రాశారు.
భగత్ సింగ్‌ను ఉరి తీయడానికి ముందు ఆయన దుర్గాదేవికి ఓ లేఖ రాసినట్లు భగత్ సింగ్ తోటి విప్లవకారుడు సుఖ్‌దేవ్ రాజ్ రాసిన ‘జబ్ జ్యోతి జాగీ’ అనే పుస్తకంలో ఉంది.
సుఖ్‌దేవ్, సుఖ్‌దేవ్ రాజ్ ఇద్దరూ కూడా వేరు వేరు విప్లవకారులు.
“నేను చనిపోయిన తర్వాత నువ్వు ఏడవకూడదు. ఇది రాసిన తర్వాత నా కలం ఆగిపోతుంది.
నిన్ను చూసినప్పుడు నీ చూపు నా హృదయంలో వెలుగులు నింపింది. నీకు నాకు మధ్య ఉన్న బంధం గురించి మనం నివసిస్తున్న సమాజం ఎప్పటికీ అర్థం చేసుకోలేదు.
ఎందుకంటే నువ్వు నా స్నేహితుడి భార్యవు కూడా” అని ఆయన ఆ లేఖలో రాశారు.
భగత్ సింగ్ రాసిన ఈ వాక్యాలు దుర్గాదేవి గురించి ఆయనకున్న గౌరవాన్ని సూచిస్తున్నాయని భగత్ సింగ్ సహచరుల్లో ఒకరైన సుఖ్‌దేవ్ రాజ్ చెప్పారు.
రచయిత యశ్‌పాల్ రాసిన సింహావలోకన్ పుస్తకంలోని 180వ పేజీలో, “ ఓ మహిళ ఆకర్షణలో పడిపోయి నువ్వు, నీకు అప్పగించిన బాధ్యతల్ని మర్చిపోయావు” అని సుఖ్‌దేవ్ భగత్ సింగ్‌తో అన్నట్లు ఉంది.
అయితే యశ్‌పాల్, సుఖ్‌దేవ్ రాజ్ లాంటి వాళ్లు తప్పుడు ప్రచారం చేశారని సుఖ్‌దేవ్, భగత్ సింగ్, దుర్గాదేవి మధ్య ఉన్న సంబంధంపై ప్రశ్నలు సంధించారని మత్రదాస్ ఆరోపించారు.

ఫొటో సోర్స్, NATIONAL BOOK TRUST
దుర్గాదేవి నేపథ్యం ఏమిటి?
దుర్గాబాబీగా గుర్తింపు పొందిన దుర్గాదేవి 1907 అక్టోబర్ 7న అలహాబాద్‌లో పుట్టారు.
వాళ్లది వాస్తవానికి గుజరాతీ కుటుంబం, ఆమె తండ్రి బంకా బిహరీ భట్. తల్లి యమునాదేవి.
ఆమె పూర్వీకులు గుజరాత్ నుంచి ఉత్తర్ ప్రదేశ్ వచ్చి స్థిరపడ్డారు. బంకా బిహారీ భట్ జిల్లా జడ్జిగా పని చేశారు.
ఆమెకు లాహోర్‌లో ఉంటున్న భగవత్ చరణ్ వోహ్రాతో పెళ్లయింది. ఆమెకు 11ఏళ్లకే పెళ్లయింది.
భగవతి చరణ్ పూర్వీకులు కూడా గుజరాత్ నుంచి ఉత్తర్ ప్రదేశ్‌కు అక్కడ నుంచి లాహోర్‌కు వలస వెళ్లారు.
దుర్గాదేవీ, భగతవి చరణ్ వోహ్రా దంపతులకు ఓ కుమారుడు.
మల్విందర్ జిత్ సింగ్ బరైచ్ రాసిన ‘భాయ్ అండ్ భాభీ ఆఫ్ షహీద్ భగత్‌సింగ్- ఏ బయోగ్రఫీ ఆఫ్ భగవత్ చరణ్ వోహ్రా, దుర్గాభాభీ అనే పుస్తకంలో "భగత్ సింగ్ గురించి దుర్గా భాభీ తనతో ‘‘అతను నా సోదరుడు లేదా కుమారుడు లాంటి వాడు’’ అని చెప్పారని అన్నారు.
“1921లో అతను తన గ్రామంలోని డెయిరీ నుంచి పాలు తెచ్చేవాడని, అప్పటి నుంచే అతను తనకు తెలుసని దుర్గాభాభీ చెప్పారు.
భగత్ సింగ్ తన చర్యలతో మనందరి హృదయాల్లో ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకున్నారు. 1929 ఏప్రిల్ 8న చివరిసారిగా కలిసినప్పుడు ఆయన కళ్లలో భయం కనిపించలేదు. భగత్ సింగ్‌ను ఉరితీయడం బ్రిటిష్ సామ్రాజ్యపు పునాదిని కదిలించింది.
దుర్గాదేవి భర్త భగవతి చరణ్‌కు ఎప్పుడూ అండగా నిలిచారు" అని మల్విందర్ జిత్ సింగ్ తెలిపారు.
మల్విందర్ జిత్ సింగ్‌తో మాట్లాడేందుకు బీబీసీ బృందం ప్రయత్నించింది. ఆయన కూడా భగత్ సింగ్‌పై పరిశోధన చేసి పుస్తకం రాశారు.
ఆయన ఆరోగ్యం సరిగా లేకపోవడంతో, సహోద్యోగుల ద్వారా బీబీసీతో మాట్లాడారు.
“దుర్గాదేవి భగత్ సింగ్‌ను తన తమ్ముడిగా భావించింది. అసలు ఇలాంటి వాటి గురించి మాట్లాడటం ఆపేసి భగత్ సింగ్ చేసిన త్యాగం గురించి మాట్లాడుకోవడం మంచిది” అని వాళ్లు బీబీసీతో చెప్పారు.
భగత్ సింగ్ స్థాపించిన హిందూస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ పార్టీలో విప్లవకారులందరూ దుర్గాదేవిని 'భాభీ' అని పిలిచేవారు.
విప్లవకారుల కోసం ఆమె ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి.
“విప్లవకారుల నైతిక ప్రమాణాలు ఉన్నతంగా ఉండాలి. ఎందుకంటే పోరాడే సమయంలో ఎక్కడైనా దాక్కోవాల్సి వస్తుంది.
మీకు నైతికత లేకపోతే, మిమ్మల్ని ఇంట్లో ఎందుకు ఉంచుకోవాలి? దుర్గాదేవి భర్త భగవతి చరణ్ ఇల్లు విప్లవకారులందరికీ ఎల్లప్పుడూ తెరిచి ఉండేది” అని ప్రొఫెసర్ చమన్‌లాల్ చెప్పారు.
దుర్గాదేవి కూడా విప్లవకారుల సందేశాలను తీసుకువెళ్లేవారు.
దుర్గాదేవి జ్ఞాపకాల గురించి రాసిన సుధీర్ విద్యార్థి- “ఆమె దగ్గర తుపాకులు, బాంబులు ఉండేవని చెప్పారు. ఆమె ఒకసారి బాంబులు తెచ్చేందుకు ముల్తాన్ వెళ్లారు.
తుపాకులు తెచ్చేందుకు జైపూర్ కూడా వెళ్లారు అని షహీద్ భగత్‌సింగ్- తిరుగుబాటుకు సాక్ష్యం అనే పుస్తకంలో ప్రస్తావించారు.
ఆమెకు తుపాకీ దగ్గర ఉంచుకోవడమే కాదు, దానిని ఎలా పేల్చాలో కూడా తెలుసు.
ఓ బాంబును పరీక్షిస్తుండగా దుర్గాదేవి భర్త భగవతి చరణ్ మరణించారు. భగత్ సింగ్, బతుకేశ్వర్ దత్‌ను జైలు నుండి విడుదల చేయాలని ఆమె కోరారు.
భగత్ సింగ్ ఉరిని ఆపడానికి ఆమె గాంధీజీని కూడా కలిశారు.
భర్త చనిపోయాక, దుర్గాదేవి పూర్తిస్థాయి విప్లవకారిణిగా మారారు.
చంద్రశేఖర్ ఆజాద్ స్థానంలో పని చేసేందుకు బొంబాయి వెళ్లారు.
బొంబాయి పోలీస్ కమిషనర్ లార్డ్ హాల్లేను హత్య చేయాలనుకున్నారు. ఆమె కాల్చిన తూటాలు సార్జంట్ టేలర్, అతని భార్యకు తగిలి గాయాలయ్యాయి.
పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ఆమె కొన్నిసార్లు బురఖా ధరించేవారు. ముస్లిం మహిళగా ఉండటానికి ఒక్కోసారి విసుక్కునేవారు.
ఆజాద్ మరణం తర్వాత ఆమె పోలీసుల ముందు లొంగిపోయారు.
విచారణ పేరుతో పోలీసులు ఆమెను ఆరు నెలల పాటు హంతకులు ఉన్న జైలులో ఉంచారు.
ఆమెకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో విడుదల చేశారు. అయితే ఆమె మూడేళ్లపాటు లాహోర్ వదిలి వెళ్లకూడదని ఆంక్షలు విధించారు.
ఆమె కొంతకాలం దిల్లీలో కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాల్లో పాల్గొన్నారు. తర్వాత విద్యకు సంబంధించిన కార్యక్రమాల వైపు మళ్లారు.
1999 ఆక్టోబర్ 15న ఉత్తర్ ప్రదేశ్‌లోని ఘాజియాబాద్‌లో మరణించారు.
ఇవి కూడా చదవండి:
- సారా సన్నీ: భారతదేశ చరిత్రలో తొలిసారిగా సుప్రీం కోర్టులో వాదన వినిపించిన చెవిటి లాయర్
- చెంఘిజ్ ఖాన్ వారసురాలు ప్రిన్సెస్ ఖుతులున్ ఎంత సౌందర్యవతో అంత యోధురాలు... తనను పెళ్ళి చేసుకోవాలనే యువకులకు ఆమె పెట్టిన షరతులేంటి?
- ఇండియా-యూరప్ కారిడార్ అంటే ఏంటి... ఇది చైనా 'బెల్ట్ అండ్ రోడ్'తో పోటీపడగలదా?
- బిహార్: బీసీలు ఎంత శాతం? కులాల వారీ జన గణనలో ఏం తేలింది?
- ఏలియన్లను ఎప్పుడు కనిపెడతాం? వారికి ఇంకెంత దూరంలో ఉన్నాం?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









