వరల్డ్ కప్ 2023: ఇండియా - పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడు? లైవ్ ఎక్కడ వస్తుంది?

ఫొటో సోర్స్, Getty Images
ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్-2023కు ఆతిథ్యం ఇచ్చేందుకు భారత్ సిద్ధంగా ఉంది.
46 రోజులపాటు ఈ టోర్నమెంట్ జరగబోతోంది. దీనిలో పది దేశాల క్రికెట్ జట్లు పాలుపంచుకోబోతున్నాయి.
ఈ మ్యాచ్‌లు ఎప్పుడు జరుగుతాయి? వీటిని లైవ్ చూడటం ఎలా? టిక్కెట్లు ఎక్కడ ఇస్తారు? లాంటి ప్రశ్నలకు ఇప్పుడు సమాధానాలు తెలుసుకుందాం. వరల్డ్ కప్-2023 గురించి ఇతర విశేషాలనూ చూద్దాం.

ఫొటో సోర్స్, GETTY IMAGES
ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ మ్యాచ్‌లు ఎప్పుడు, ఎక్కడ జరుగుతాయి?
అక్టోబరు 5 నుంచి ఈ వరల్డ్ కప్ టోర్నమెంటు మొదలవుతుంది. ఫైనల్ మ్యాచ్ నవంబరు 19న జరగబోతోంది. దీనికి గుజరాత్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక కానుంది.
ఈ టోర్నమెంటుకు ఆతిథ్యమిస్తున్న భారత్ తొలి మ్యాచ్ ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ మ్యాచ్ అక్టోబరు 8న చెన్నై వేదికగా జరగుతుంది.
మొత్తంగా 46 రోజులపాటు జరిగే ఈ టోర్నమెంట్ కోసం పది నగరాల్లోని స్టేడియంలను ఎంపికచేశారు. అవి తెలంగాణ, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, దిల్లీ, తమిళనాడు, ఉత్తర్ ప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాకట, పశ్చిమ బెంగాల్‌లలో ఉన్నాయి.
- హైదరాబాద్ - రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం
- అహ్మదాబాద్ – నరేంద్ర మోదీ స్టేడియం
- ధర్మశాల – హెచ్‌పీసీఏ స్టేడియం
- దిల్లీ – అరుణ్ జైట్లీ స్టేడియం
- చెన్నై – ఎంఏ చిదంబరం స్టేడియం
- లఖ్‌నవూ – బీఆర్ఎస్ఏబీవీ క్రికెట్ స్టేడియం
- పుణె – ఎంసీఏ ఇంటర్నేషనల్ స్టేడియం
- బెంగళూరు – ఎం చిన్నస్వామి స్టేడియం
- ముంబయి – వాంఖడే స్టేడియం
- కోల్‌కతా – ఈడెన్ గార్డెన్స్

ఫొటో సోర్స్, Getty Images
వెస్టిండీస్, జింబాబ్వేలకు ఎందుకు చోటు దక్కలేదు? జట్లను ఎలా ఎంపిక చేశారు?
రెండుసార్లు వరల్డ్ కప్‌ను గెలుచుకున్న వెస్టిండీస్‌కు ప్రస్తుతం వరల్డ్ కప్‌లో ఆడే అవకాశం దక్కలేదు. 1975, 1979లలో ఈ కప్‌ను వెస్టిండీస్ సొంతం చేసుకుంది. అయితే, ప్రస్తుతం ఈ జట్టు టాప్-8లో చోటు సంపాదించలేకపోయింది. స్కాట్లాండ్, నెదర్లాండ్స్, జింబాబ్వే లాంటి జట్ల చేతిలో వెస్టిండీస్ ఘోర పరాజయాలను చవిచూసింది.
ఐసీసీ వరల్డ్ కప్ కోసం ఎంపిక చేసిన పదిలోని ఎనిమిది జట్లను నేరుగా ఎంపిక చేశారు. మిగతా రెండు జట్ల కోసం జూన్-జులైల మధ్య క్వాలిఫైయర్స్ మ్యాచ్‌లు నిర్వహించారు.
ఈ రెండు స్థానాల కోసం నేపాల్, శ్రీలంక, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, జింబాబ్వే, ఐర్లాండ్, ఒమన్, స్కాట్లండ్, వెస్టిండీస్ తలపడ్డాయి.
ఈ పది జట్లను రెండు గ్రూపులుగా విడగొట్టారు. అనంతరం వీటి మధ్య మ్యాచ్‌లను నిర్వహించారు. చివర్లో శ్రీలంక, నెదర్లాండ్స్ మాత్రమే ఎంపిక అయ్యాయి.
ఒకప్పుడు తిరుగులేని జట్లుగా పేరొందిన వెస్టిండీస్, జింబాబ్వే నేడు కనీసం అర్హత కూడా సాధించలేకపోయాయి.

ఫొటో సోర్స్, Getty Images
భారత్ - పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడు?
- అక్టోబరు 8: ఆస్ట్రేలియాతో భారత్ మ్యాచ్
- అక్టోబరు 11: అఫ్గానిస్తాన్‌తో
- అక్టోబరు 14: పాకిస్తాన్‌తో (అహ్మదాబాద్ వేదికగా)
- అక్టోబరు 19: బంగ్లాదేశ్‌తో
- అక్టోబరు 22: న్యూజీలాండ్‌తో
- అక్టోబరు 29: ఇంగ్లండ్‌తో
- నవంబరు 2: శ్రీలంకతో
- నవంబరు 5: దక్షిణాఫ్రికాతో
- నవంబరు 12: నెదర్లాండ్స్‌తో..

ఫొటో సోర్స్, PANKAJ NANGIA
భారత్ జట్టులో ఎవరెవరు ఉన్నారు?
ఈ టోర్నమెంట్ కోసం 15 మంది ప్లేయర్లతో జట్టును ఎంపిక చేశారు. దీనికి రోహత్ శర్మ కెప్టెన్‌కాగా, హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్.
శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకుర్, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, కుల్‌దీప్ యాదవ్‌లు ఈ జట్టులో ఉన్నారు.
ఈ జట్టును ఎంపిక చేసిన సెలక్షన్ కమిటీకి అజిత్ అగార్కర్ చైర్మన్. కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌లతో సమావేశం అనంతరం ఈ జట్టును ప్రకటించారు.
క్రికెట్ వరల్డ్ కప్ లైవ్ ఎక్కడ వస్తుంది?
భారత్‌లోని స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ టీవీ చానెల్స్‌లో ఈ మ్యాచ్‌లు చూడొచ్చు. డీడీ స్పోర్ట్స్, డీడీ నేషనల్‌లోనూ ఈ మ్యాచ్‌లు వస్తాయి.
ఇక ఆన్‌లైన్ విషయానికి వస్తే ‘డిస్నీ ప్లస్ హాట్‌స్టార్’లో ఈ మ్యాచ్‌లను లైవ్ చూడొచ్చు.
విపరీతంగా పోటీ పెరుగుతున్న నేపథ్యంలో.. తమ మొబైల్ యాప్‌లో ఉచితంగానే ఈ మ్యాచ్‌లను చూడొచ్చని ఇప్పటికే హాట్‌స్టార్ ప్రకటించింది.
ఏ టీమ్ ఎన్నిసార్లు ఈ కప్ గెలుచుకుంది?
1975 నుంచి వన్ డే క్రికెట్ వరల్డ్ కప్‌ను మొత్తంగా 12సార్లు నిర్వహించారు. గరిష్ఠంగా ఆస్ట్రేలియా ఐదుసార్లు ఈ కప్ గెలుచుకుంది.
1987లో తొలిసారి ఆస్ట్రేలియా తొలిసారి ఈ కప్ గెలుచుకుంది. ఆ తర్వాత 1999, 2003, 2007, 2015లలోనూ ఈ కప్‌ను ఆస్ట్రేలియా సొంతం చేసుకుంది.
వెస్టిండీస్, భారత్ ఈ కప్‌ను రెండేసిసార్లు గెలుచుకున్నాయి. 1975, 1979లలో వెస్టిండీస్ ఈ కప్ గెలుచుకోగా.. భారత్ తొలిసారి 1983లో ఈ కప్ గెలుచుకుంది. ఆ తర్వాత 2011లో మరోసారి ఈ కప్ భారత్‌కు సొంతమైంది.
పాకిస్తాన్, శ్రీలంక, ఇంగ్లండ్ ఈ కప్‌ను ఒక్కోసారి గెలుచుకున్నాయి.
వరల్డ్ కప్-2027 ఎక్కడ నిర్వహిస్తారు?
వచ్చే వరల్డ్ కప్‌ను ఆఫ్రికాలో నిర్వహించబోతున్నట్లు ఇప్పటికే ఐసీసీ ప్రకటించింది.
అంటే దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియాలు సంయుక్తంగా ఈ కప్‌కు ఆతిథ్యం ఇవ్వబోతున్నాయి.
2003 తర్వాత మళ్లీ ఈ కప్‌కు ఆఫ్రికా ఆతిథ్యమివ్వడం ఇదే తొలిసారి.
ఇవి కూడా చదవండి:
- కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలకు ఎవరు బాధ్యులు? తల్లిదండ్రులా? కోచింగ్ సెంటర్లా? – బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- నాందేడ్: ‘డాక్టర్లు లేరు, మెషీన్లు ఆగిపోయాయి.. పిల్లలు చనిపోయాక మా సంతకాలు తీసుకున్నారు’
- బంగారం కొనాలా? బంగారం బాండ్లు కొనాలా? ఏది లాభం?
- ఇందూరు సభ: ‘మీకో రహస్యం చెప్పనా’ అంటూ కేసీఆర్‌పై ప్రధాని మోదీ ఆ వ్యాఖ్యలు ఎందుకు చేశారు?
- దేవ్ రతూడి: సైకిల్‌పై పాలు అమ్మిన ఈ భారతీయుడు, చైనా సినిమాల్లో విలన్‌గా ఎలా సక్సెస్ అయ్యాడు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















