నార్గెస్ మొహమ్మదీ: 13 సార్లు అరెస్టులు.. 31 ఏళ్ల జైలు శిక్ష...అయినా పోరాటం ఆపని మహిళకు నోబెల్ శాంతి బహుమతి

నార్గెస్ మొహమ్మదీ

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, నార్గెస్ మొహమ్మదీకి నోబెల్ శాంతి పురస్కారం లభించింది
    • రచయిత, రఫీ బర్గ్
    • హోదా, బీబీసీ న్యూస్ ఆన్‌లైన్ మిడిల్ ఈస్ట్

ఇరాన్‌లో జైలు జీవితం అనుభవిస్తున్న మానవ హక్కుల కార్యకర్త, 51 ఏళ్ల నార్గెస్ మొహమ్మదీ నోబెల్ శాంతి పురస్కారానికి ఎంపికయ్యారు.

మానవ హక్కుల పరిరక్షణ కార్యకర్తగా నార్గెస్ మొహమ్మదీ చేస్తున్న పోరాటం దశాబ్ధాలుగా కొనసాగుతోంది.

కఠినమైన చట్టాలు, శిక్షలు ఉండే ఇరాన్‌లో మహిళల పట్ల వివక్షకు, అణిచివేతకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న నార్గెస్‌ను నోబెల్ కమిటీ ‘ఫ్రీడమ్ ఫైటర్’గా వర్ణించింది.

ప్రపంచంలోనే ఉరిశిక్షల అమలు శాతం ఎక్కువగా ఉండే ఇరాన్‌లో ఈ శిక్షని పూర్తిగా రద్దు చేయాలని ఆమె పోరాటం చేస్తున్నారు.

నార్గెస్ మొహమ్మదీ 2010 నుంచి జైలులోనే ఉన్నారు. ఇరాన్‌లోని ఎవిన్ కారాగారంలో శిక్షను అనుభవిస్తున్నారు. ఇప్పటివరకు 13 సార్లు అరెస్టయ్యారు. న్యాయస్థానం ఐదుసార్లు దోషిగా తేల్చి 31 ఏళ్ల జైలు శిక్షను విధించింది.

ఆమె భర్త, రాజకీయ కార్యకర్త అయిన తఘీ రహ్మానీ ప్యారీస్‌లో పిల్లలతో కలిసి ఉంటున్నారు. వీరికి ఇద్దరు సంతానం. కొన్నేళ్లుగా నార్గెస్, రహ్మానీలు ఒకరినొకరు కలుసుకోలేదు.

తన భార్యకు నోబెల్ శాంతి పురస్కారం లభించడం పట్ల రహ్మానీ స్పందించారు. బీబీసీ పర్షియన్‌తో ఆయన మాట్లాడుతూ, “మహిళా ప్రతినిధిగా దేశంలోని మహిళల స్వేచ్ఛాయుత జీవనం, హక్కుల కోసం నా భార్య మొదలుపెట్టిన పోరాటం ఇప్పటికీ కొనసాగుతోంది. నా భార్యకు పురస్కారం లభించడం పట్ల మాకు సంతోషంగా ఉంది” అన్నారు.

ఎవిన్ కారాగారం

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, నార్గెస్‌ను ఉంచిన ఇరాన్‌లోని ఎవిన్ కారాగారం

ఆగని పోరాటం..

నార్గెస్ మొహమ్మదీకి అవార్డు ప్రకటించిన సందర్భంలో నోబెల్ కమిటీ అధ్యక్షులు మాట్లాడుతూ మహిళల అణివేచితకు, వివక్షకు వ్యతిరేకంగా ఆమె పోరాటం చేశారని అన్నారు.

నార్గెస్ మొహమ్మదీ ఎన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ మౌనంగా ఉండలేదు. గతేడాది ఆమె టెహరాన్‌లోని ఎవిన్ కారాగారం నుంచి ఆమె రాసిన లేఖలో ఆమె ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు చేస్తున్న మహిళల అణచివేత గురించి వివరంగా రాశారు. పోరాటం చేస్తున్న మహిళలు మానసికంగా, శారీరకంగా ఎలా వేధింపులకు గురవుతున్నారో తెలిపారు.

సెప్టెంబరు 2022 సంవత్సరంలో 22 ఏళ్ల మాషా అమినీ అనే యువతిని హిజాబ్ ధరించనందుకు అరెస్ట్ చేశారు. ఆ తరువాత ఆమె కస్టడీలోనే చనిపోయింది. ఈ సంఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు మొదలయ్యాయి.

నార్గెస్ మొహమ్మదీ ‘వైట్ టార్చర్’ పేరిట పుస్తకాన్ని ప్రచురించారు. ఆ పుస్తకంలో తనతోపాటు 12 మంది మహిళా ఖైదీల అనుభవాలను గురించి రాశారు.

“ఉరిశిక్ష అమానవీయమైన, క్రూరమైన శిక్ష. దీనిని పూర్తిగా రద్దు వరకు నేను పోరాటం ఆపను” అని పుస్తకంలో పేర్కొన్నారు.

నార్గెస్ మొహమ్మదీ

ఫొటో సోర్స్, Getty Images

రెండవ ఇరాన్ మహిళ..

20 ఏళ్ల క్రితం ఇరాన్‌కు చెందిన మానవ హక్కుల పరిరక్షణ కార్యకర్త షిరిన్ ఎబదికి నోబెల్ శాంతి పురస్కారం అందజేశారు. షిరిన్ డిఫెండర్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ సెంటర్ పేరిట సంస్థను స్థాపించారు. నార్గెస్ ఈ పురస్కారం పొందిన రెండో ఇరాన్ మహిళగా నిలిచారు. ప్రస్తుతం నార్గెస్ ఈ సంస్థ ఉపాధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు.

మానవ హక్కుల పరిరక్షణ కోసం ఆమె చేసిన కృషిని గుర్తిస్తూ చాలా అవార్డులు పొందారు. నోబెల్ పురస్కారంతో అంతర్జాతీయ స్థాయిలో ఆమెకు గుర్తింపు లభించింది. అయితే ఇరాన్ మాత్రం అవార్డు ప్రకటించడాన్ని తప్పుబట్టింది.

వీడియో క్యాప్షన్, కోమాలోకి వెళ్లిన పదహారేళ్ల అర్మితా గెరావండ్

ఇవి కూడా చదవండి..

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)