క్రికెట్ బ్యాట్ ఎలా పుట్టింది... 400 ఏళ్ళ చరిత్రలో ఎలా మారుతూ వచ్చింది?

క్రికెట్ బ్యాట్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, అక్షయ్ యగ్డే
    • హోదా, బీబీసీ కోసం

‘‘నాకు స్ప్రింగ్ బ్యాట్ చూపించండి. రికీ పాంటింగ్ వాడే లాంటిది కావాలి.’’ 15 ఏళ్ల క్రితం క్రికెట్ బ్యాట్‌లు అమ్మే షాపులకు వెళ్లి ఇలా చాలా మందే అడిగే ఉంటారు.

అయితే, రికీ పాంటింగ్ బ్యాట్‌లో ఎలాంటి స్ప్రింగూ లేదు. కానీ, 2003 వరల్డ్ కప్ ఫైనల్‌లో బ్యాట్‌తో స్వైర విహారం చేసిన తర్వాత, ఆయన బ్యాట్‌లో స్ప్రింగ్ ఉందనే వదంతులు వ్యాపించాయి.

దీనికి ముందు, అంటే 1996 వరల్డ్ కప్‌లో సనత్ జయసూర్య కూడా తన బ్యాట్‌తో మెరుపులు మెరిపించారు. అప్పుడు కూడా ఇలాంటి పుకార్లు వచ్చాయి. సచిన్, ధోనీలు వాడే హెవీ బ్యాట్‌తో మొదలుపెట్టి, మాథ్యూ హేడెన్ మంగూస్ బ్యాట్, డెన్నిస్ లిల్లీ అల్యూమినియం బ్యాట్ వరకూ.. ఐసీసీ వరల్డ్ కప్ లాంటి టోర్నమెంట్ల సమయంలో బ్యాట్లపై చాలా చర్చ జరుగుతుంటుంది.

క్రికెట్‌లో ప్లేయర్లు, టీమ్‌లు, రన్లు మాత్రమే కాదు. బ్యాట్‌లపైనా ప్రేక్షకులు వీరాభిమానం పెంచుకుంటారు. అందుకే క్రికెట్ బ్యాట్ల గురించి మనం తెలుసుకోవడం చాలా ముఖ్యం.

కళాకారులు తమ బ్రష్‌లను ఎలా ఇష్టపడతారో, రచయితలు పెన్నులపై ఎలా ప్రేమ పెంచుకుంటారో అలానే ప్రతి బ్యాటర్‌కూ ఫేవరెట్ బ్యాట్ ఉంటుంది.

చిన్న పిల్లలకు కొనిచ్చే ప్లాస్టిక్ బ్యాట్ అయినా లేదా మార్కెట్‌లో రూ.100 లేదా రూ.200కు దొరికే చెక్క బ్యాట్ అయినా లేదా ప్రొఫెషనల్ క్రికెట్‌లో ఉపయోగించే బ్యాట్ అయినా ప్రతి ఒక్కరూ తమకు నప్పే బ్యాట్‌ను ఎంచుకుంటారు.

ఇంతకీ అసలు క్రికెట్ బ్యాట్‌లు ఎలా పుట్టాయి? మొదట్లో ఎలాంటి బ్యాట్లను క్రికెటర్లు వాడేవారు. తర్వాతి కాలంలో ఇవి ఎలా మారుతూ వచ్చాయి.

క్రికెట్ బ్యాట్

ఫొటో సోర్స్, getty Images

తొలి క్రికెట్ ఇలా...

17వ శతాబ్దంలోనూ బ్యాట్‌ను ఉపయోగించినట్లు చరిత్ర చెబుతోంది.

1624లో ససెక్స్, ఇంగ్లండ్‌ల మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్‌లో ప్లేయర్ జస్పెర్ వినాల్‌కు చాలా పెద్ద దెబ్బ తగిలింది.

నేటి క్రికెట్‌లో ‘లాస్ ఆఫ్ క్రికెట్ రూల్ 37’ ప్రకారం.. ఒకసారి బాల్‌ను కొట్టిన తర్వాత ఫీల్డర్లకు అడ్డుపడకూడదు. ఒకవేళ అతడు కావాలనే ఫీల్డర్లకు అడ్డుపడితే అతడిని అవుట్ అయినట్లుగా ప్రకటిస్తారు. కానీ, ఈ రూల్ 1624లో లేదు. కాబట్టి బాల్‌ను రెండు మూడు సార్లు కొట్టేందుకు బ్యాటర్లు ప్రయత్నించేవారు.

నాటి మ్యాచ్‌లో బ్యాటర్‌కు చాలా దగ్గరగా వినెల్ నిలబడ్డాడు. ఎందుకంటే బ్యాటర్ కొట్టిన వెంటనే బాల్‌ను క్యాచ్ పట్టుకోవాలని అతడు భావించాడు. అయితే, అదే సమయంలో ఆ బాల్‌ను మరోసారి కొట్టేందుకు బ్యాటర్ ప్రయత్నించాడు. ఫలితంగా వినాల్ తలపై పెద్ద దెబ్బ తగిలింది. దీంతో అతడు మరణించాడు.

క్రికెట్ బ్యాట్

ఫొటో సోర్స్, Getty Images

హాకీ స్టిక్ లాంటి బ్యాట్

సర్రే కౌంటీ క్రికెట్ క్లబ్ ఆర్కైవ్‌లలో ఓ పురాతన క్రికెట్ బ్యాట్ ఉంది. నేడు మనం ఉపయోగిస్తున్న క్రికెట్ బ్యాట్‌కు పూర్వం అలాంటి బ్యాట్లే ఉపయోగించి ఉండొచ్చని క్రికెట్ చరిత్రకారుల అభిప్రాయ పడుతున్నారు. ఆ బ్యాట్‌ను 1729లో తయారు చేసినట్లు రికార్డుల్లో ప్రస్తావించారు. అయితే, ఇది ఆధునిక క్రికెట్ బ్యాట్ కంటే హాకీ స్టిక్‌కు దగ్గరగా ఉంటుంది. కానీ, ఇది ఎందుకు అలా ఉండేది?

ఆ కాలంలో క్రికెట్‌లో అండర్-ఆర్మ్ బౌలింగ్ ఎక్కువగా ప్రాచుర్యంలో ఉండేది. అంటే బాల్‌ను కొట్టడానికి బాగా నడుం వంచి ఆడాల్సి వచ్చేది. అందుకే హాకీ స్టిక్ లాంటి బ్యాట్ ఉపయోగించేవారు.

కానీ, 1770లలో క్రికెట్ నిబంధనల్లో మార్పు వచ్చింది. అప్పుడే బాల్‌ను కాస్త ఎక్కువ ఎత్తులో వేయడం మొదలుపెట్టారు. అంటే బాల్ బౌన్స్ అయి నడుముకు దగ్గరగా వేయడం ప్రారంభించారు.

అలా స్వీప్, ఇతర పాత బ్యాటింగ్ పద్ధతులు నెమ్మదిగా మారడం ప్రారంభించాయి. ఈ మార్పులను బ్యాటర్లు కూడా అనుకరించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత బ్యాట్ తయారుచేసే విధానం కూడా మారింది. దీంతో వికెట్ల ముందు నిలబడి బ్యాటర్లు షాట్లు కొట్టే పద్ధతి వచ్చింది.

ప్రస్తుతంతో పోలిస్తే, అప్పట్లో బ్యాట్ కాస్త బరువుగా ఉండేది. ఎందుకంటే అండర్-ఆర్మ్ బౌలింగ్‌లో బాల్ చాలా నెమ్మదిగా వచ్చేది. దీన్ని కాస్త బరువైన బ్యాట్‌తో గట్టిగా కొట్టేవారు.

అయితే, 1820లలో బౌలింగ్‌లో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. రౌండ్-ఆర్మ్ బౌలింగ్‌తో కొత్త కొత్త టెక్నిక్‌లు కూడా వచ్చాయి.

క్రికెట్ బ్యాట్

ఫొటో సోర్స్, Getty Images

స్టంప్‌లను కవర్ చేసేంత బ్యాట్

ఇంగ్లండ్‌లోని మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) నిబంధనలను నేటికీ అంతర్జాతీయ క్రికెట్‌లో పాటిస్తున్నారు. కాలానికి అనుగుణంగా ఎంసీసీ నిబంధనలు మారుతూ వచ్చాయి.

తొలినాటి రోజుల్లో బ్యాట్ పరిమాణం, పొడవు, ఆకారాలలో ఎలాంటి నిబంధనలూ ఉండేవి కాదు.

1771 సెప్టెంబరులో థామస్ వైట్ అనే క్రికెటర్ సర్రేలోని ఒక కౌంటీ మ్యాచ్‌లో వికెట్లను మొత్తం కప్పేసేంత బ్యాట్‌తో ఆడారు. దీని వల్ల అసలు స్టంప్‌లు ఎక్కడున్నాయో బౌలర్లకు కనిపించేదికాదు. అప్పట్లో దీనితో పెద్ద వివాదమే చెలరేగింది.

ఆ తర్వాత 1774లో బ్యాట్ సైజ్‌పై నిబంధనలు తీసుకొచ్చారు. అయితే, ఆ తర్వాత కాలంలో వీటిలో చాలా మార్పులు వచ్చాయి.

1830ల వరకూ ఒకే చెక్కతో బ్యాట్లను తయారుచేసేవారు. అయితే, బౌలింగ్‌లో వేగం పెరగడంతో తరచూ బ్యాట్‌లు విరిగిపోయేవి. దీంతో బ్యాట్ల డిజైన్లలోనూ మార్పులు వచ్చాయి. బ్యాట్ బ్లేడ్‌ను, హ్యాండింల్‌ నుంచి వేరుగా చేయడం మొదలుపెట్టారు.

1835లో బ్యాట్ 38 అంగుళాలకు మించి పొడవు ఉండకూడదనే నిబంధనను తీసుకొచ్చారు. బ్యాట్ పొడవును నిర్దేశించడంలో ఇది కీలకంగా మారింది.

క్రికెట్ బ్యాట్

ఫొటో సోర్స్, Getty Images

బరువైన బ్యాట్

1864లో ఓవర్-ఆర్మ్ బౌలింగ్‌ను క్రికెట్‌లో ప్రవేశపెట్టారు. దీంతో బౌలింగ్ వేగం చాలా పెరిగింది. దీన్ని తట్టుకునేందుకు మరింత గట్టిగా ఉండటంతోపాటు, కాస్త తేలిగ్గా ఉండేలా బ్యాట్‌ను తయారుచేయడం మొదలుపెట్టారు.

1930లలోనూ బ్యాట్ డిజైన్‌లలో చాలా మార్పులు తీసుకొచ్చారు. అప్పటికి కూడా చాలా మంది మంచి గ్రిప్‌తోపాటు తేలిగ్గా ఉండే బ్యాట్‌లను ఇష్టపడేవారు. దీని వల్ల బ్యాట్‌పై వీరికి చక్కగా గ్రిప్ ఉండేది.

అప్పట్లో వన్ డే మ్యాచ్‌లలో 110 ఓవర్లు ఉండేవి. దీంతో ఎక్కువసేపు క్రీజులో ఉండేందుకు ప్రయత్నించేవారు. సగటు 2.5 రన్ రేట్‌తో 300 రన్లు కొట్టినా మంచి స్కోర్‌గా భావించేవారు. అప్పట్లో బ్యాట్‌లతో పెద్దపెద్ద షాట్‌లు కొట్టేకంటే ఎక్కువసేపు నిలబడటంపైనే దృష్టిసారించేవారు.

1960లలో పరిమిత ఓవర్ల మ్యాచ్‌లను తీసుకొచ్చారు. దీంతో క్రికెట్ బ్యాట్ డిజైన్లలో మరోసారి విప్లవాత్మక మార్పులు వచ్చాయి.

1970లలో జాన్ న్యూబెరీ, గ్రే నికోల్స్ లాంటి ప్లేయర్లు కొత్త బ్యాట్‌లతో ప్రయోగాలు మొదలుపెట్టారు.

దీని వల్ల ఒకవైపు బ్యాట్ ఆకారం మారింది. మరోవైపు బ్యాటింగ్ టెక్నిక్‌లలోనూ మార్పులు వచ్చాయి.

ఉదాహరణకు గ్రే నికోలిస్ బ్యాట్‌ను తీసుకోండి. అతడు మధ్యలో కాస్త మందం తక్కువగా, అంచుల్లో మరింత మందంగా ఉండే బ్యాట్‌ను వాడేవారు. దీని వల్ల బ్యాట్ కాస్త తేలిగ్గా అయ్యేది. అదే సమయంలో గట్టిగా కొట్టడానికి వీలుపడేది. దీని వల్ల బాల్ మరింత దూరం వెళ్లేది. దీన్ని అప్పట్లో ‘సూపర్ స్కూప్’గా పిలిచేవారు.

బరువును మధ్య నుంచి బాల్ ఎక్కువగా తాకే ‘స్వీట్ స్పాట్’కు మార్చడంతో బౌండరీలు ఎక్కువగా కొట్టొచ్చని ఇప్పటికీ చాలా మంది నమ్ముతుంటారు.

ఇప్పటికే చాలా కంపెనీలు బరువుల్లో మార్పులు చేస్తూ ‘స్వీట్ స్పాట్’ల సంఖ్యను పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.

క్రికెట్ బ్యాట్

డెన్నిస్ లిల్లీ అల్యూమినియం బ్యాట్

ఆ తర్వాత కాలంలోనూ క్రికెట్ బ్యాట్ డిజైన్లలో చాలా మార్పులు వచ్చాయి. వీటిలో కొన్ని వివాదాలకు కూడా కారణమయ్యాయి.

1979లో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ డెన్నిస్ లిల్లీ.. బ్రిస్బేన్ గ్రౌండ్‌లోకి అల్యూమియం బ్యాట్‌తో అడుగుపెట్టారు. అయితే, మొదట్లో దీనిపై ఎవరూ అభ్యంతరం వ్యక్తంచేయలేదు.

అయితే, అదే ఏడాది మరో సిరీస్‌లోనూ లిల్లీ మెటల్ బ్యాట్‌ను తీసుకొచ్చారు. కానీ, అప్పుడు మాత్రం అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.

ఇలాంటి మెటల్ బ్యాట్‌తో ఆడితే బాల్ ఆకారం మారిపోతోందని ఇంగ్లండ్ కెప్టెన్ మైక్ బ్రియర్లీ అభ్యంతరం చెప్పారు. మరోవైపు ఆ తర్వాత ఆస్ట్రేలియా కెప్టెన్ చాపెల్ కూడా ఆ బ్యాట్‌ను ఉపయోగించొద్దని లిల్లీకి చెప్పారు. కానీ, వారి వాదనను లిల్లీ పట్టించుకోలేదు.

దీంతో క్రికెట్ సంస్థలు మరో కొత్త నిబంధన తీసుకొచ్చాయి. కేవలం చెక్క బ్యాట్‌లను మాత్రమే ఉపయోగించాలని సూచించాయి.

2005లో మరో వివాదం చెలరేగింది. ఈ సారి దీనికి ఆస్ట్రేలియా క్రికెటర్ రికీ పాంటింగ్ కేంద్ర బిందువయ్యారు. గ్రాఫైట్ స్ట్రిప్‌తో కూకాబుర్రా కంపెనీ తయారుచేసిన బ్యాట్‌ను ఉపయోగించారు.

దీనిపై వివాదం చెలరేగడంతో ఐసీసీ, ఎంసీసీ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. అయితే, అసలు గ్రాఫైట్ స్ట్రిప్ వాడితే ఏం అవుతుందో మాత్రం ఇప్పటికీ స్పష్టతలేదు. కానీ, 2006 నుంచి ఇలాంటి బ్యాట్లను ఉపయోగించడంపై నిషేధం విధించారు.

క్రికెట్ బ్యాట్

ఫొటో సోర్స్, Getty Images

మాథ్యూ హేడెన్ మంగూస్ బ్యాట్

మీరు ఐపీఎల్‌ను మొదట్నుంచీ ఫాలో అయితే, ఆస్ట్రేలియా క్రికెటర్ మాథ్యూ హేడెన్ ప్రత్యేకమైన మంగూస్ బ్యాట్‌ను చూసే ఉంటారు. 2010లో ఆయన చెన్నై సూపర్ కింగ్స్ కోసం ఆడేటప్పుడు ప్రత్యేకమైన బ్యాట్‌ను తీసుకొచ్చారు. దీన్ని మంగూస్ బ్యాట్‌గా చెప్పేవారు.

పొడుగ్గా, బలంగా ఉండే మాథ్యూ కాస్త చిన్న మంగూస్ బ్యాట్‌తో ఆడటం అప్పట్లో వివాదానికి కారణమైంది. ఈ బ్యాట్ హాండిల్ సాధారణ బ్యాట్ కంటే 43 శాతం పొడుగ్గా ఉండేది. కానీ, బ్లేడ్ మాత్రం మూడు రెట్లు చిన్నగా ఉండేది. దీని వల్ల షాట్‌లు మెరుగ్గా కొట్టొచ్చని కొందరు చెప్పేవారు.

ఇదే బ్యాట్‌తో దిల్లీ డేర్‌డెవిల్స్‌పై 43 బాల్స్‌లోనే అతడు 93 రన్లు కొట్టాడు. దీంతో అందరి దృష్టీ మంగూస్ బ్యాట్‌పై పడింది. అప్పట్లో ఇది షాపుల్లోనూ దొరికేది.

2012లో ఐపీల్ నుంచి హేడెన్ పదవీ విరమణ తీసుకున్నారు. అయితే, అతడితోపాటు కలిసి ఆడిన సురేశ్ రైనా దీనిపై స్పందిస్తూ.. ‘‘ఆగ్రేసివ్‌గా ఆడేందుకు ఆ బ్యాట్ పనికొస్తుంది. కానీ, డిఫెన్సివ్‌గా ఆడటానికి పనికిరాదు’’ అని అన్నారు. కానీ, ఆ తర్వాత కాలంలో మార్కెట్ నుంచి ఈ బ్యాట్ నెమ్మదిగా మాయమైంది.

క్రికెట్‌లోకి దిగ్గజ వ్యాపారవేత్తలు అడుగుపెట్టడంతో బ్యాట్లలో రంగురంగులవి కూడా వచ్చాయి. బిగ్ బ్యాష్ లీగ్‌లో కొంతమంది ప్లేయర్లు బ్లాక్ బ్యాట్లు ఉపయోగించారు. వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్ కూడా గోల్డ్ బ్యాట్ ఉపయోగించి వార్తల్లో నిలిచారు.

వీడియో క్యాప్షన్, ఉమ్రాన్ మాలిక్: బుల్లెట్‌ లాంటి బంతుల వెనుక రహస్యమిదే

ఏ చెక్క ఉపయోగిస్తారు?

1800ల నుంచీ బ్యాట్లను ఇంగ్లిష్ వుడ్‌తో తయారుచేస్తున్నారు. వీటిని ఇంగ్లిష్ విల్లో బ్యాట్స్‌గా పిలుస్తారు. ఇవి దృఢంగా ఉండటంతోపాటు తేలిగ్గా ఉంటాయి. బలమైన బాల్ తాకిడిని కూడా ఇవి తట్టుకోగలవు.

ఇప్పటికీ చాలా మంది క్రెకటర్లు ఇంగ్లిష్ విల్లో బ్యాట్‌లను ఉపయోగిస్తున్నారు.

అయితే, ఇంగ్లండ్ నుంచి భిన్న ప్రాంతాలకు క్రికెట్ విస్తరించినప్పుడు అక్కడ దొరికే స్థానిక చెక్కలతోనూ బ్యాట్‌లను తయారుచేయడం మొదలుపెట్టారు.

అయితే, ఇప్పటికీ చాలా దేశాలు ఇంగ్లిష్‌ విల్లోనే దిగుమతి చేసుకుని బ్యాట్‌లు తయారుచేస్తున్నాయి. ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ లాంటి దేశాలు సొంతంగా ఈ చెట్లను పెంచేందుకు ప్రయత్నించాయి. కానీ, పెద్దగా ఫలితం లేదు.

భారత్, పాకిస్తాన్‌లలోనూ క్రికెట్‌ను అమితంగా అభిమానిస్తుంటారు. ఇక్కడ కశ్మీర్ విల్లోతో బ్యాట్లను తయారుచేస్తుంటారు.

ఇంగ్లిష్ విల్లోతో పోలిస్తే కశ్మీర్ విల్లో కాస్త బరువుగా ఉంటుంది. కానీ, స్థానికులు ఎక్కువగా కశ్మీర్ విల్లోకే మొగ్గు చూపుతుంటారు. ఎందుకంటే దీని ధర కాస్త తక్కువగా ఉంటుంది.

ఇటీవల కాలంలో బాంబూ బ్యాట్స్ కూడా ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అయితే, ప్రొఫెషన్ క్రికెట్‌లో ఈ బ్యాట్‌లు ఉపయోగించేందుకు అనుమతులు లేవు.

పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకొని ఇంగ్లిష్ విల్లోకు బదులుగా బాంబూను ఉపయోగించాలని పర్యావరణ ప్రేమికులు పిలుపునిస్తున్నారు. ఈ ఎదురుకర్రలు విరివిగా, తక్కువ ధరకే దొరుకుతుంటాయి.

అలా క్రికెట్‌లో వచ్చే మార్పులకు అనుగుణంగా బ్యాట్‌లు కూడా మారుతూ వచ్చాయి. దిగ్గజ క్రికెటర్ డాన్ బ్రాడ్‌మన్ ఒకసారి మాట్లాడుతూ.. వెయ్యి రన్లు కొట్టాక తన బ్యాట్ మారుస్తుంటానని చెప్పారు. దక్షిణాఫ్రికా క్రికెటర్ గిబ్స్ అయితే, ఒకే సీజన్‌లో 47 బ్యాట్లను ఉపయోగించినట్లు ద గార్డియన్‌తో చెప్పారు.

వీడియో క్యాప్షన్, Farmers Cricket Team: పంచె కట్టి... బ్యాట్ పట్టి.. పరుగులు కొల్లగొట్టి

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)