శ్రీదేవి ఉప్పు తినకపోవడం వల్లే చనిపోయారా? బోనీ కపూర్ ఏమన్నారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, బీబీసీ మరాఠీ టీమ్
- హోదా, ..
నటి శ్రీదేవి మరణం ఇప్పటికీ చాలా మందికి మిస్టరీనే. అయితే, ఆమె మృతి వెనుక కారణాలపై తాజా ఇంటర్వ్యూలో ఆమె భర్త, సినీ ప్రముఖుడు బోనీ కపూర్ మాట్లాడారు.
బాలీవుడ్‌లో అత్యంత విజయవంతమైన అతికొద్ది మంది నటీమణుల్లో శ్రీదేవి కూడా ఒకరు. ఆమె కోట్ల మంది హృదయాలను గెలుచుకున్నారు.
2018లో ఒక పెళ్లి వేడుక కోసం శ్రీదేవి దుబాయ్ వెళ్లారు. అక్కడే హోటల్‌లోని బాత్‌టబ్‌లో ఆమె శవమై కనిపించారు. ఇది జరిగి అయిదేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ శ్రీదేవి మరణం మిస్టరీగానే మిగిలిపోయింది. దీనిపై మీడియాలో చాలా చర్చ జరిగింది.
శ్రీదేవి మృతిపై మరోసారి చర్చ జరుగుతోంది. దీనికి కారణం బోనీ కపూర్ తాజా ఇంటర్వ్యూనే. ‘ద న్యూ ఇండియన్’ వెబ్‌సైట్‌తో తాజాగా ఆయన మాట్లాడారు.
శ్రీదేవి ఆహారపు అలవాట్ల గురించి బోనీ కపూర్ ఈ ఇంటర్వ్యూలో ప్రధానంగా ప్రస్తావించారు. ‘‘ఆమెది సహజ మరణం కాదు. ప్రమాదవశాత్తు సంభవించిన మరణం అది. దీని తర్వాత నేను చాలా ఆరోపణలను ఎదుర్కోవాల్సి వచ్చింది’’ అని బోనీ చెప్పారు.
‘‘ఈ అంశంపై దుబాయ్‌లో నన్ను దాదాపు 48 గంటలు విచారించారు. ఎందుకంటే ఇండియన్ మీడియా నుంచి తమపై చాలా ఒత్తిడి ఉందని వారు చెప్పారు. ఆ విచారణలో నేను చెప్పినవే మళ్లీ ఇప్పుడు చెబుతున్నాను. ఇందులో కొత్తగా చెప్పేవేమీ లేవు’’ అని బోనీ అన్నారు.
‘‘శ్రీదేవి మృతి తర్వాత నేను లై డిటెక్టర్ టెస్టుకు కూడా హాజరయ్యాను. పోస్టుమార్టం నివేదిక కూడా నీటిలో మునిగిపోవడం వల్ల ప్రమాదవశాత్తు మరణించారని స్పష్టంచేసింది’’ అని బోనీ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
శ్రీదేవికి కళ్లు తిరుగుతుండేవి: బోనీ కపూర్
శ్రీదేవి అలా ప్రమాదవశాత్తు చనిపోవడం వెనుక ఉప్పు తీసుకోకపోవడమూ ఒక కారణం అయ్యుండొచ్చని బోనీ అన్నారు.
‘‘ఆమె ఉప్పు తీసుకొనేది కాదు. దీని వల్ల ఆమె తల తిరుగుతూ ఉండేది. అసలు ఎవరూ ఉప్పును తీసుకోవడం ఆపేయకూడదు. ఎందుకంటే ఉప్పు తీసుకోకపోతే కళ్లు తిరుగుతాయి. శ్రీదేవికి కూడా అలానే జరుగుతుండేది. ఒకసారి ఇలా కళ్లు తిరగడంతోనే తను మూర్ఛపోయింది. కింద పడినప్పుడు ఒక పన్ను కూడా విరిగిపోయింది’’ అని బోనీ చెప్పారు.
‘‘స్క్రీన్‌పై అందంగా కనిపించేందుకు శ్రీదేవి కఠినమైన ఆహార నియమాలు పాటించేది. చాలా కఠినంగా ఉండేది. ఆకలితో పడుకునేది. ఆమెకు చాలా ఆకలి వేసేది. కానీ, తను ఆహారం తీసుకునేది కాదు’’ అని బోనీ చెప్పారు.
‘‘ముఖ్యం ఉప్పు తీసుకోకపోవడంతో కొన్నిసార్లు ఆమెకు కడుపులో వికారంగా అనిపించేది, కళ్లు తిరిగేవి. మా పెళ్లి తర్వాత చాలాసార్లు ఆమెకు ఇలా అయ్యింది. ఆమె రక్తపోటు తక్కువగా ఉందని వైద్యులు పదేపదే హెచ్చరించేవారు’’ అని బోనీ తెలిపారు.
‘‘చాలా మంది మంది మహిళలు ఉప్పు తీసుకుంటే లావైపోతామని అనుకుంటారు. కానీ, అలా ఉప్పు తినడం పూర్తిగా మానేయకూడదు. నేనైతే సలాడ్ తీసుకునేటప్పుడు కూడా కొంచెం ఉప్పు వేసుకోవాలని సూచిస్తాను’’ అని బోనీ కపూర్ అన్నారు.
‘‘ఒకానొక సమయంలో శ్రీదేవి 45 కేజీల వరకూ బరువు తగ్గిపోయింది. ‘ఇంగ్లిష్ వింగ్లిష్’ సినిమాలో ఆ మార్పు మీరు గమనించొచ్చు’’ అని బోనీ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
అక్కినేని నాగార్జున కూడా అదే చెప్పారు: బోనీ కపూర్
ఇదే విషయాన్ని ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున కూడా తనతో చెప్పారని బోనీ కపూర్ వివరించారు.
‘‘శ్రీదేవి చనిపోయిన తర్వాత సంతాపం తెలిపేందుకు నాగార్జున మా ఇంటికి వచ్చారు. ఒక షూటింగ్ జరిగేటప్పుడు శ్రీదేవి చాలా కఠినమైన ఆహార నియమాలు పాటిస్తుండటం చూశానని ఆయన నాతో అన్నారు’’ అని బోనీ చెప్పారు.
‘‘శ్రీదేవి మృతి వల్ల పంకజ్ పరాశార్ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. కానీ, ఆ సినిమా గురించి నాకు తెలుసు. దాన్ని చేయొద్దని నేను శ్రీదేవికి చెప్పాను. కానీ, ఏదైనా సినిమా ఒప్పుకున్నప్పుడు కఠినమైన ఆహార నిబంధనలు పాటిస్తూ, ఉప్పు కూడా తను పక్కన పెట్టేస్తుందని నాకు తెలుసు’’ అని బోనీ అన్నారు.
‘‘ఉప్పును పూర్తిగా తగ్గించుకోవద్దని మా ఫ్యామిలీ డాక్టర్ కూడా ఆమెకు చెప్పారు. నేను కూడా ఆమెకు చాలాసార్లు చెప్పారు. ‘సాల్ట్ ఫ్రీ సూప్’, ‘సాల్ట్ ఫ్రీ ఫుడ్’ అని నేను జోక్ చేసేవాడిని. కానీ, ఆమె నా మాటలు పట్టించుకునేది కాదు. మొత్తానికి అలా జరిగింది’’ అని బోనీ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఉప్పు తీసుకోవడం మానేస్తే ఏం జరుగుతుంది?
ఈ విషయంపై మరిన్ని వివరాలు తెసుకునేందుకు డాక్టర్ మంజర్ నజీమ్‌తో బీబీసీ మాట్లాడింది.
‘‘శరీరానికి సాల్ట్ అందకపోయినా లేదా సోడియం స్థాయులు పూర్తిగా పడిపోయినా కళ్లు తిరగడం, మూర్ఛ పోవడం లేదా బ్లాక్ అవుట్ లాంటివి జరుగుతుంటాయి. అయితే, దీని వల్ల చనిపోతారని చెప్పే ఆధారాలేమీ లేవు’’ అని ఆయన అన్నారు. కానీ, కఠినమైన ఆహార నియమాలు పాటించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలని ఆయన చెప్పారు.
2020 అక్టోబరులో బెంగాలీ నటి మిష్టి ముఖర్జీ కిడ్నీలు విఫలం కావడంతో చనిపోయారు. కీటో డైట్ తీసుకోవడమే దీనికి కారణమని ఆమె ప్రతినిధులు మీడియాతో చెప్పారు.
‘‘నేను ఎప్పుడైనా స్నేహితులను కలిసినప్పుడు ఎవరైనా కఠినమైన ఆహార నియమాలు పాటిస్తుంటే రక్తపోటు పరీక్షించుకోవాలని చెబుతాను. ఏదైనా మరీ అతిగా చేయకూడదు. ఎందుకంటే మన ఆరోగ్యం అనేది మన చేతుల్లోనే ఉంటుంది’’ అని నజీమ్ అన్నారు.
బాల నటిగా శ్రీదేవి సినీ ప్రయాణం మొదలు
1963 ఆగస్టు 13న తమిళనాడులో శ్రీదేవి జన్మించారు. దక్షిణాది సినిమాల్లో బాల నటిగా ఆమె మొదట గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత హీరోయిన్‌గానూ విమర్శకుల ప్రశంసలు పొందారు. 1978లో ‘సోల్వా సావన్’తో ఆమె హిందీ ప్రయాణం మొదలైంది.
2020లో విడుదలైన ‘మామ్’ ఆమె 300వ సినిమా. 1986లో ఒకే ఏడాదిలో హిందీలో ఆమె పది సినిమాల్లో నటించారు. మరోవైపు ఒకే ఏడాదిలో ఆమె డజనుకుపైగా షూటింగ్‌లలో పాల్గొనేవారు.
హిందీలో ‘చాల్‌బాజ్’ సినిమాకుగాను ఉత్తమనటిగా తొలి ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకున్నారు. అయితే, అంతకుముందు తెలుగు, తమిళ్ సినిమాల్లో ఉత్తమ నటిగా చాలా అవార్డులు అందుకున్నారు.
‘చాందినీ’, ‘మిస్టర్ ఇండియా’ ‘ఖుదా గవా’, ‘సద్మా’, ‘నగీనా’ లాంటి సినిమాలు ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి.
తెలుగులో పదహారేళ్ల వయసు, కార్తీక దీపం, ప్రేమాభిషేకం, ఆఖరి పోరాటం, జగదేక వీరుడు అతిలోక సుందరి, క్షణక్షణం, వసంత కోకిల, దేవత లాంటి సినిమాల్లో శ్రీదేవి నటన ప్రేక్షకులను మెప్పించింది.
తెలుగు, తమిళ్, హిందీతోపాటు మలయాళం, కన్నడ భాషల్లోనూ ఆమెకు మంచి గుర్తింపు ఉంది.
నిర్మాత బోనీ కపూర్‌ను 1996లో శ్రీదేవి పెళ్లి చేసుకున్నారు. ఆమెకు ఇద్దరు కుమార్తెలు. వీరిలో జాన్వీ కపూర్ ప్రస్తుతం సినిమాల్లో నటిస్తున్నారు.
2013లో శ్రీదేవికి ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది. మొత్తంగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును ఐదుసార్లు ఆమె అందుకున్నారు.
1990లలో శ్రీదేవి హవా కొనసాగింది. అయితే, 2012లో ‘ఇంగ్లిష్ వింగ్లిష్’తో మళ్లీ ఆమె రెండో ప్రస్థానాన్ని మొదలుపెట్టారు.
ఇవి కూడా చదవండి:
- కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలకు ఎవరు బాధ్యులు? తల్లిదండ్రులా? కోచింగ్ సెంటర్లా? – బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- నాందేడ్: ‘డాక్టర్లు లేరు, మెషీన్లు ఆగిపోయాయి.. పిల్లలు చనిపోయాక మా సంతకాలు తీసుకున్నారు’
- బంగారం కొనాలా? బంగారం బాండ్లు కొనాలా? ఏది లాభం?
- ఇందూరు సభ: ‘మీకో రహస్యం చెప్పనా’ అంటూ కేసీఆర్‌పై ప్రధాని మోదీ ఆ వ్యాఖ్యలు ఎందుకు చేశారు?
- దేవ్ రతూడి: సైకిల్‌పై పాలు అమ్మిన ఈ భారతీయుడు, చైనా సినిమాల్లో విలన్‌గా ఎలా సక్సెస్ అయ్యాడు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















