మలేరియా జ్వరానికి కొత్త వ్యాక్సీన్ ఎలా పనిచేస్తుందంటే..

మలేరియా

ఫొటో సోర్స్, UNIVERSITY OF OXFORD

    • రచయిత, ఆన్ సోయ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మలేరియా బారిన పడి ప్రపంచవ్యాప్తంగా ఏటా కొన్ని లక్షల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు.

అయితే, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేసిన ఓ కొత్త వ్యాక్సీన్, మలేరియా నివారణలో గొప్ప ముందడుగు అని నిపుణులు చెబుతున్నారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ఆమోదం పొందిన ఈ వ్యాక్సీన్, ఆఫ్రికన్ దేశాల్లో లక్షల మంది చిన్నారుల ప్రాణాలు కాపాడగలదని భావిస్తున్నారు.

ఆఫ్రికాలో పిల్లల ప్రాణాలకు అతి పెద్ద ముప్పుగా పరిణమించిన మలేరియా నుంచి రక్షించే టీకా వచ్చింది.

దీన్ని అభివృద్ధి చేయడానికి కొన్ని దశాబ్దాలు పట్టింది. మూడేళ్ల వయసు పిల్లలపై గత మూడేళ్లుగా ఈ వ్యాక్సీన్ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి.

మలేరియా

ఫొటో సోర్స్, Getty Images

600 మంది పిల్లలపై ట్రయల్స్

ఆఫ్రికాతో పాటు అనేక దేశాల్లో మలేరియా సర్వసాధారణం. కాబట్టి ఈ వ్యాక్సీన్ ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు.

ఆరుగురు పిల్లల తల్లి అయిన ఎమ్వాంజానీ... తన ఆఖరు బిడ్డను వ్యాక్సీన్ అధ్యయనంలో భాగంగా జరిగే క్లినికల్ ట్రయల్స్‌లో చేర్పించారు.

‘‘నా మేనల్లుడిని కోల్పోయాను. మలేరియా సోకి చనిపోయినప్పటికి వాడి వయసు నాలుగేళ్లే. అందుకే మలేరియా వ్యాక్సీన్ ట్రయల్ గురించి వినగానే అందులో పాల్గొనాలనుకున్నాం. ఎందుకంటే అది మాకు ఉపయోగపడుతుంది’’ అని ఎమ్వాంజానీ అన్నారు.

టాంజానియాలోని బగమోయోలో ఆరు వందల మంది పిల్లలు క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గొన్నారు. ఈ పిల్లల తల్లిదండ్రులందరికీ మలేరియా గురించి చెప్పేందుకు ఏదో ఒక విషాదగాథ ఉంది.

మలేరియా

ఫొటో సోర్స్, KATIE EWER

అంచనాలకు మించి ఫలితాలు

ప్రపంచవ్యాప్తంగా మలేరియా బారిన పడి చనిపోతున్నవారి సంఖ్య దాదాపు ఆరు లక్షలు. వారిలో ఎక్కువ మంది ఐదేళ్ల లోపు ఆఫ్రికన్ చిన్నారులే.

అయితే కొత్త వ్యాక్సీన్‌ వచ్చినా కూడా, మలేరియా నివారణకు ఇప్పటి వరకూ పాటిస్తూ వస్తున్న పద్ధతులను కొనసాగించాలని నిపుణులు ప్రజలకు సూచిస్తున్నారు.

మలేరియా సోకిన వ్యక్తిని కుట్టిన దోమ.. మరో వ్యక్తిని కుట్టినపుడు ఆ వ్యక్తి రక్తంలోకి మలేరియా పరాన్నజీవి చేరుతుంది. అలా మలేరియా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది.

రక్తంలోకి చేరిన మలేరియా క్రిమి, కాలేయాన్ని ప్రభావితం చేయడానికి ముందే ఆర్21 వ్యాక్సీన్ ఆ క్రిమిని టార్గెట్ చేస్తుంది. తద్వారా అది తీవ్రమైన జబ్బుగా, ప్రాణాంతకంగా మారకుండా చూస్తుంది.

ఈ పరిశోధనలో చివరి దశ ఫలితాలు అంచనాలను మించిపోయాయి.

‘‘ఒక సంవత్సరంలో ఈ టీకా మూడు డోసులు ఇచ్చిన తర్వాత, అది 75 శాతం సమర్థవంతంగా పనిచేసినట్టు మేం ఫలితాల్లో గమనించాం.

మలేరియా నివారణ కోసం డబ్లుహెచ్‌వో నిర్దేశించిన కనీస పరిమితికి మించిన ఫలితమిది. అందుకే మాకు చాలా ఉత్సాహంగా ఉంది’’ అని ప్రధాన పరిశోధకులు ఎల్లీ ఒలోటు అన్నారు.

అయితే ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఆఫ్రికా వ్యాప్తంగా గ్రామాలకూ, పట్టణాలకూ ఈ టీకాలను అందించాలి.

ఎమ్వాంజనీ లాంటి కుటుంబాలకు ఈ వ్యాక్సీన్ మలేరియా నుంచి ఉపశమనాన్నివ్వడమే కాకుండా, ఆమె బిడ్డల ప్రాణాలను కాపాడుతుందని ఆశిస్తున్నారు.

వీడియో క్యాప్షన్, ఇది లక్షలాది మంది ప్రాణాలు కాపాడుతుందన్న WHO

10 కోట్ల డోసుల వ్యాక్సీన్లకు ఒప్పందాలు

ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేసిన ఈ కొత్త, చౌకగా దొరికే వ్యాక్సీన్‌ను భారీ స్థాయిలో ఉత్పత్తి చేయవచ్చని డబ్ల్యూహెచ్‌వో సిఫార్సు చేసింది.

మలేరియాకు డబ్ల్యూహెచ్‌వో ఆమోదం పొందిన రెండో వ్యాక్సీన్ ఇది.

ఏడాదికి 10 కోట్ల డోసులకు పైగా ఈ వ్యాక్సీన్‌ను తయారు చేసేందుకు ఇప్పటికే ఒప్పందాలు కుదిరాయి.

మానవాళికి శాపంగా పరిణమించిన మలేరియా ఎక్కువగా శిశువులు, చిన్నారుల ప్రాణాలను తోడేస్తుంది.

మలేరియాపై పోరాడే సమర్థవంతమైన టీకాల తయారీకి వందేళ్లకు పైగా శాస్త్రీయ కృషి చేయాల్సి వచ్చింది.

దాదాపు రెండేళ్ల క్రితం మలేరియాకు తొలి వ్యాక్సీన్ వచ్చింది. జీఎస్‌కే అభివృద్ధి చేసిన ఆర్‌టీఎస్,ఎస్ అనే వ్యాక్సీన్‌కు డబ్ల్యూహెచ్‌వో ఆమోదం తెలిపింది.

మలేరియా

ఫొటో సోర్స్, Getty Images

ప్రభావంలో రెండు టీకాలు ఒకటే

కొత్త టీకా తయారీ గురించి మాట్లాడుతూ ఇదొక గొప్ప సంతోషకరమైన క్షణమని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనోమ్ గాబ్రియేసుస్ అన్నారు.

‘‘మలేరియా నుంచి కాపాడే సురక్షితమైన, ప్రభావవంతమైన టీకా గురించి నేను కలగనేవాడిని. కానీ, ఇప్పుడు మన ముందు రెండు టీకాలు ఉన్నాయి’’ అని ఆయన హర్షం వ్యక్తం చేశారు.

ఈ రెండు టీకాల ప్రభావం ఒకేలా ఉంటుందని, ఒకదానికంటే మరొకటి మెరుగ్గా పనిచేస్తుందని చెప్పే ఆధారాలేమీ లేవని అన్నారు.

ఈ రెండింటి మధ్య ప్రధాన తేడా ఏంటంటే ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ టీకాను భారీ మొత్తంలో ఒకేసారి తయారు చేయవచ్చని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద టీకా తయారీదారు అయిన భారత్‌లోని ‘సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా’ ఇప్పటికే ఏడాదికి 10 కోట్ల డోసుల ఆర్‌21 టీకాను తయారు చేయడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటివరకు ఆర్‌టీఎస్, ఎస్ టీకాలు 1.80 కోట్ల డోసులు మాత్రమే ఉన్నాయి.

ఆర్‌21 టీకా ప్రతీ డోసుకు 2-4 డాలర్లు మాత్రమే ఖర్చు అవుతుందని, ప్రతీ వ్యక్తికి 4 డోసుల టీకా అవసరమని డబ్ల్యూహెచ్‌వో చెప్పింది. ఆర్‌టీఎస్,ఎస్ టీకాతో పోలిస్తే ఇది సగం ధర మాత్రమే.

కొత్త వ్యాక్సీన్‌ను తయారు చేయడం మరింత సులభమని తెలిపింది.

వీడియో క్యాప్షన్, డెంగీ రెండోసారి సోకితే ఎందుకింత ప్రాణాంతకంగా మారుతోంది?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)