అమెరికా ప్రజల ఆయుర్దాయం ఎందుకు తగ్గిపోతోంది? అక్కడేం జరుగుతోంది?

వృద్ధ మహిళ

ఫొటో సోర్స్, GETTY IMAGES

అమెరికాలో గత వందేళ్లలో మొట్టమొదటిసారి, ప్రజల ఆయుర్దాయం బాగా తగ్గిపోయింది.

ప్రస్తుతం సగటు అంచనా వయసు అమెరికాలో 76 ఏళ్లుగా ఉంది.

గత రెండు మూడేళ్ల క్రితం వరకు కూడా ఇది సుమారు 79 ఏళ్లు. మెరుగైన వైద్య సంరక్షణ, ఔషధాలతో 1900 ప్రారంభం నుంచి అమెరికా ప్రజు ఆయుర్దాయం పెరుగుతూ వచ్చింది.

కొన్నేళ్లుగా మాత్రం వారి ఆయుర్దాయం తగ్గిపోతోంది.

కరోనావైరస్ మహమ్మారి వల్ల ఇలా జరుగుతూ ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతోపాటు మరిన్ని ఆందోళనకర అంశాలు కూడా ఉన్నాయి. ఇవి యువతపై ప్రభావం చూపుతున్నట్లు కనిపిస్తున్నాయి.

అమెరికాలో ప్రజల ఆయుర్దాయం తగ్గిపోయేందుకు కారణాలు నిలుస్తున్న వాటిని ఇక్కడ తెలుసుకుందాం.

ఆదాయ అసమానతలు

చాలా దేశాల్లో 2020లో కరోనా వైరస్ మహమ్మారి అనేది రాజకీయ అంశంగా మారింది. అమెరికాలో ఇది మరింత రాజకీయమైంది. అమెరికాలో కొంతమంది ప్రజలు వ్యాక్సీన్ వేసుకోవడంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ.. కరోనాకు సంబంధించిన నియంత్రణ చర్యలను వ్యతిరేకించారు.

కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలయ్యాక మూడేళ్లలో జనాభా పరంగా ఇతర దేశాలతో పోలిస్తే అమెరికాలోనే ఎక్కువ మంది మరణించారు.

ఇప్పటివరకు అమెరికాలో కరోనా వల్ల మరణించిన వారి సంఖ్య 10 లక్షలు దాటింది.

గత కొన్నేళ్లలో అమెరికాలో అత్యధిక మరణాలు సంభవించడానికి ఇది అతిపెద్ద కారణాల్లో ఒకటిగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

కానీ, దీంతో పాటు ఇతర కారణాలు కూడా ప్రజల ఆయుర్దాయాన్ని తగ్గిస్తున్నాయి.

ఆదాయమనేది ప్రజల ఆయుర్దాయాన్ని నేరుగా ప్రభావితం చేస్తుందని శాన్‌ఫ్రాన్సిస్కోలోని ప్రెసిడియో గ్రాడ్యుయేట్ స్కూల్‌కు చెందిన ప్రొఫెసర్ జెరెమీ నేయ్ చెప్పారు.

అమెరికాలో ఆదాయ అసమానతల అంశంపై జెరెమీ నేయ్ పరిశోధనలు చేస్తున్నారు.

‘‘ఆదాయం, ఇల్లు, విద్య, హింసాత్మక నేరాలు వంటి అంశాలు మన ఆయుర్దాయంపై ప్రభావం చూపుతుంటాయి. ఒకవేళ మీరు అణచివేత, హింస ఉన్న ప్రాంతంలో నివసిస్తుంటే, మీరు 65 ఏళ్ల వరకే జీవించొచ్చు. ఒకవేళ మీరు మంచి ప్రాంతంలో నివసిస్తుంటే, 85 ఏళ్ల వరకు బతికే అవకాశం ఉంటుంది. అంటే ఇవి మీ వయసును 20 ఏళ్లు పెంచొచ్చు లేదా తగ్గించొచ్చు. ఈ కారణంతో, గత 40 ఏళ్లలో అమెరికాలో పలు ప్రాంతాల్లోని ప్రజల అంచనా వయసులో 20 ఏళ్ల తేడా వచ్చింది ’’ అని తెలిపారు.

అందుబాటులో ఉన్న వైద్య సేవల్లో మార్పుల వల్ల కూడా అమెరికాలో పలు ప్రాంతాల్లోని ప్రజల ఆయుర్దాయంలో తేడాలు కనిపిస్తున్నట్లు జెరెమీ నేయ్ నమ్ముతున్నారు.

అమెరికాలో పేద ప్రజలకు వైద్య సేవలను అందించేందుకు 60 ఏళ్ల క్రితమే మెడికైడ్ ప్రోగ్రామ్ ప్రారంభమైంది.

20 ఏళ్ల క్రితం అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కాలంలో, ఈ స్కీమ్ ప్రయోజనాలు మరింత మందికి అందించేలా దీన్ని విస్తరించారు.

కానీ, ఈ స్కీమ్ అమలుకు సంబంధించి నిర్ణయం తీసుకునే అధికారం మాత్రం రాష్ట్రాలకే ఉంటుంది.

అయితే, ఈ స్కీమ్ తీసుకొచ్చిన మార్పులను అమలు చేసేందుకు అమెరికాలో 10 రాష్ట్రాలు నిరాకరించాయి.

‘‘ప్రతి లక్ష మందిలో 200 మంది ప్రాణాలను కాపాడుతూ ఈ ప్లాన్‌ను విజయవంతంగా రాష్ట్రాలు అమలు చేశాయి. అంతేకాక, మరణాల రేటును 50 శాతం తగ్గించాయి. ఇది జాతీయస్థాయి పథకం. ఈ పథకాన్ని అమలు చేయని రాష్ట్రాల ప్రజల సగటు వయసుపై తీవ్ర ప్రభావం పడుతుంది’’ అని జెరెమీ నేయ్ బీబీసీతో అన్నారు.

అమెరికా ప్రజల నిరసనలు

ఫొటో సోర్స్, GETTY IMAGES

పేద కమ్యూనిటీల్లో ప్రజల సగటు వయసు తక్కువగా ఉన్నట్లు పలు పరిశోధన గణాంకాలు చెబుతున్నాయి.

శ్వేతజాతి అమెరికన్లతో పోలిస్తే నల్లజాతి అమెరికన్లు, లాటిన్ అమెరికా మూలాలున్న హిస్పానిక్ సముదాయాల్లోని ప్రజల సగటు వయసు తక్కువగా ఉన్నట్లు ఈ పరిశోధనలు కనుగొన్నాయి.

‘‘ఆదాయం, జాతి అనేవి కూడా ఆయుర్దాయంతో సంబంధాన్ని కలిగి ఉంటాయి. తెల్ల జాతీయులతో పోలిస్తే నల్ల జాతీయుల ఆదాయాలు తక్కువగా ఉంటాయి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువగా ఆదాయ అసమానతలున్నాయి.

తెల్ల జాతీయులతో పోలిస్తే నల్ల జాతీయులు ఐదేళ్లు తక్కువ కాలం జీవిస్తున్నారు. కరోనా మహమ్మారితో అమెరికాలోని ప్రజల ఆయుర్దాయం తగ్గిపోయింది. కరోనా వల్ల మాత్రమే కాకుండా, నల్ల జాతీయుల ఆయుర్దాయం సాధారణంగానే తక్కువగా ఉంటుంది’’ అని జెరెమీ నేయ్ చెప్పారు.

నేరాలు - శిక్షలు

ప్రజల ఆయుర్దాయం తగ్గిపోయేందుకు మరో కారణం నేరాలు, శిక్షలు.

సమాజంలో ఆదాయ అసమానతలు దీనిపై పెద్ద ఎత్తున ప్రభావం చూపుతున్నట్లు జెరెమీ నేయ్ చెప్పారు.

ఉదాహరణకు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకొని, వ్యాయాలు చేసే ఫ్లోరిడా రాష్ట్రంలోని ప్రాంతాల్లో ప్రజల ఆయుర్దాయం అత్యధికంగా ఉంటుంది.

కానీ రాష్ట్రంలోని యూనియన్ కౌంటీలో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. రాష్ట్రంలోని అతిపెద్ద జైలు అక్కడే ఉంది. చిన్న వయసులోనే చాలా మంది జైలులో ప్రాణాలు విడుస్తున్నారు.

ప్రజల ఆయుర్దాయం తగ్గడానికి యుద్ధం కూడా ఒక కారణంగా నిలుస్తోంది. గత 20 ఏళ్లలో ఇరాక్, అఫ్గానిస్తాన్‌లలో అమెరికా సుదీర్ఘకాలంగా యుద్ధాలు చేసింది.

అంతకుముందు వియత్నాంతో జరిపిన 20 ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో 58 వేల మంది అమెరికన్లు చనిపోయారు. అమెరికా సమాజంలో ఇది తీవ్ర ప్రభావాన్ని చూపింది.

ఏటా అమెరికాలో వందల మంది ప్రజలు చనిపోవడానికి మరో అతిపెద్ద కారణం కూడా ఉంది. అదే- తుపాకులతో విచక్షణరహిత కాల్పులు.

అమెరికా పోలీసులు

ఫొటో సోర్స్, GETTY IMAGES

పెరిగిన ఆయుధాల విక్రయాలు

అమెరికాలో విచక్షణరహిత కాల్పుల ఘటనల్లో చాలా మంది చనిపోతున్నారు. గత కొన్నేళ్లలో కాల్పుల ఘటనలలో మరణించిన వారి సంఖ్య మరింత పెరిగింది.

ఏడాది నుంచి 17 ఏళ్ల మధ్య వయసున్న వారు ఎక్కువగా చనిపోయేందుకు కారణం రైఫిల్స్, రివాల్వర్లని అమెరికాలోని ఇంజ్యూరి ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించిన డాక్టర్ మార్క్ రోజెన్‌బర్గ్ తెలిపారు.

గత కొన్ని దశాబ్దాలలో ఈ ఆయుధాల విక్రయాలు బాగా పెరగడమే కాల్పుల ఘటనలు పెరగడానికి గల కారణాల్లో ఒకటి.

అమెరికాలో లక్షల ఆయుధాలు సామాన్య ప్రజల వద్ద ఉన్నాయి.

‘‘ప్రజలు గన్‌లను వారి ఇళ్లలోనే ఉంచుకుంటుంటారు. కొన్నిసార్లు ఈ గన్‌లు చిన్న పిల్లల చేతిలోకి వెళ్లి, ప్రమాదవశాత్తు పేలుతున్నాయి. దీని వల్ల కుటుంబంలో ఎవరైనా చనిపోవడం లేదా గాయాల పాలవ్వడం జరుగుతుంది’’ అని రోజెన్‌బర్గ్ చెప్పారు.

‘‘చాలా మంది యువత అక్రమంగా ఆయుధాలను కొనుగోలు చేస్తున్నారు. వీరిలో చాలా మంది పేదరికం, మానసిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్యలు తీవ్రమైనప్పుడు, వారు ఇతరులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరపడం లేదా వారికి వారే కాల్చుకుని చనిపోవడం చేస్తున్నారు.

ప్రజలు వారి భద్రత కోసం ఇంట్లో ఆయుధాలను ఉంచుకుంటున్నారు. కానీ, ఇవే వారికి, సమాజానికి ప్రమాదకరంగా మారుతున్నాయి. ఎన్ని గన్‌లు ఎక్కువగా ఉంటే, అన్ని నేరాలు పెరుగుతాయి’’ అని రోజెన్‌బర్గ్ అన్నారు.

మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, తెల్ల జాతీయులతో పోలిస్తే నల్లజాతి ప్రజలే ఎక్కువగా ఈ కాల్పుల ఘటనలకు బాధితులు అవుతున్నారు.

‘‘అట్లాంటాలో హింసాత్మక ఘటనల వల్ల మరణించిన 18 నుంచి 24 మధ్య వయసున్న వారిలో తెల్ల జాతీయులతో పోలిస్తే నల్లజాతీయులే రెండింతలు ఎక్కువగా ఉన్నారు. ఇది దేశంలో న్యాయ వ్యవస్థపై పలు ప్రశ్నలను లేవనెత్తుతోంది’’ అని డాక్టర్ మార్క్ రోజెన్‌బర్గ్ తెలిపారు.

ఇది యువతపై ఎక్కువగా ప్రభావం చూపుతుంది.

ఆయుర్దాయం 65 ఏళ్లున్న ఒక వ్యక్తి 20 ఏళ్లకే మరణిస్తే, ఆయన 45 ఏళ్ల జీవితం కోల్పోయినట్లే కదా అని మార్క్ రోజెన్‌బర్గ్ అన్నారు.

ప్రజల ఆయుర్దాయాన్ని ఆయుధాలు ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయో అర్థం చేసుకునేందుకు ఇదొక కొలమానంగా చెప్పారు.

యువత

ఫొటో సోర్స్, BBC THREE

డ్రగ్స్ మితిమీరి తీసుకోవడం

డ్రగ్స్ అత్యధిక మోతాదులో తీసుకోవడం వల్ల దేశంలో గత సంవత్సరం లక్షా 80 వేల మంది మందికి పైగా మరణించినట్లు అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ తన రిపోర్టులో తెలిపింది.

2020 సంవత్సరంతో పోలిస్తే ఇది 50 శాతానికి పైగా అధికం.

1980 నుంచి అమెరికాలో విస్తృతంగా వ్యాపిస్తున్న ఎయిడ్స్, డ్రగ్స్ వ్యసన ప్రభావంపై వెస్ట్ వర్జినియా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన ప్రొఫెసర్ జుడిట్ ఫీన్‌బర్గ్ పరిశోధన చేశారు.

1980ల కాలంలో మాదక ద్రవ్యాల వ్యసనం కేవలం పెద్ద పెద్ద నగరాల్లోనే ఉండేది. కానీ ప్రస్తుతం అమెరికా వ్యాప్తంగా మాదక ద్రవ్యాల వ్యసనం విస్తరించింది.

చిన్న పట్టణాల కార్మికుల్లో కూడా ఈ వ్యసనం విస్తరించడం ప్రారంభమైంది. వీరు హెరాయిన్ లాంటి మాదక ద్రవ్యాలను తీసుకోవడమే కాకుండా.. తరచూ వచ్చే నొప్పి నివారణ కోసం డాక్టర్లు రాసిన మెడిసిన్లనూ తీసుకుంటున్నారు.

కానీ, ఇది మరింత ప్రమాదకరంగా మారుతుందని జుడిట్ ఫీన్‌బర్గ్ తెలిపారు. రోగులను సరిగ్గా చూడకుండానే ఈ మెడిసిన్లను వారికి సూచిస్తున్నారని అన్నారు.

వెస్ట్ వర్జినియాలో దక్షిణ ప్రాంతంలో కార్మిక్ అనే ఒక చిన్న పట్టణం ఉందని, అక్కడ 392 మంది నివసిస్తున్నారని జుడిట్ చెప్పారు.

ఆ ప్రాంతంలో ఉన్న ఒక మందుల షాపులో ఒపియాడ్స్ తేలిగ్గా దొరుకుతున్నాయని తెలిపారు.

ఈ షాపుకి బయట పెద్ద క్యూ ఉంటుందని, ఈ ప్రాంతం వారే కాక, దగ్గర్లోని నగరాల ప్రజలు కూడా అక్కడికి వచ్చి ఒపియాడ్స్‌ను తేలిగ్గా కొనుగోలు చేస్తుంటారని తెలిపారు.

392 మంది నివసించే ఈ పట్టణంలోని దుకాణం గత నాలుగేళ్లలో సుమారు 1.25 కోట్ల ఒపియాడ్స్‌ను సరఫరా చేసింది.

‘‘ వివిధ రాష్ట్రాల గణాంకాలను చూసుకుంటే, వెస్ట్ వర్జినియాలో గత పదేళ్లలో ఈ ఒపియాడ్స్ వల్ల అత్యధిక సంఖ్యలో మరణించారు. దీని వల్ల లక్ష మందిలో 90 మంది చనిపోయారు. అమెరికన్ల ఆయుర్దాయంపై ఒపియాడ్ మహమ్మారి ప్రభావం చూపుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు’’ అని అన్నారు.

గుండె జబ్బులు

ఫొటో సోర్స్, KATERYNA KON/SCIENCE PHOTO LIBRARY

క్యాన్సర్, గుండె జబ్బులు

కరోనా మహమ్మారి వల్ల మూడేళ్లలో అమెరికాలో 10 లక్షల మందికి పైగా మరణించారు. కానీ, ఇతర వ్యాధులు కూడా ప్రజల ఆయుర్దాయంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి.

‘‘క్యాన్సర్, గుండె వ్యాధుల వల్ల మరణాలు బాగా పెరిగాయి. కానీ, వీటి గురించి ఎక్కువగా మాట్లాడటం లేదు. డ్రగ్ అత్యధిక మోతాదులో తీసుకోవడం, ఆత్మహత్యలు, ఆల్కాహాల్ వల్ల కంటే ఎక్కువగా ఈ వ్యాధుల వల్ల మరణిస్తున్నారు’’ అని హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన హెల్త్ ఎకనామిక్స్ ప్రొఫెసర్ ఎలిన్ మారా చెప్పారు.

క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధుల వల్ల అమెరికాలో ప్రతి సంవత్సరం ఆరు లక్షల మంది కంటే ఎక్కువగా చనిపోతున్నారు. ఈ సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

ఆయుర్దాయం తగ్గేందుకు ఊబకాయంతో సంబంధమున్నట్లు చెబుతుంటారు. అయితే దీనిలో నిజమెంతో ఎలిన్ మారా వివరించారు.

‘‘ఊబకాయం సమస్యలను పెంచుతోంది. కానీ, చాలా సార్లు దీనిపై దృష్టి సారిస్తూ, ఇతర సమస్యలను పట్టించుకోవడం లేదు. పలు రాష్ట్రాల్లో మరణాల రేటును నేను అధ్యయనం చేశాను. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఊబకాయం అత్యధికంగా ఉన్న రాష్ట్రాలలో మరణాల రేటు అత్యధికంగా ఉన్నట్లు కనిపించడం లేదు.

గుండె సంబంధిత సమస్యలతో బాధపడే రోగులకు ఊబకాయం మరింత ప్రమాదాన్ని పెంచుతోంది. కానీ, ఆయుర్దాయాన్ని తగ్గించేందుకు ఇది కారణమవుతుందని చెప్పడం కష్టం’’ అని ఎలిన్ మారా అన్నారు.

వైద్య సేవలు అందరికీ ముఖ్యంగా పేదలకు అందుబాటులో ఉండటం లేదని ప్రొఫెసర్ జెరెమీ నేయ్ చెప్పారు. ఇది ప్రజల ఆయుర్దాయాన్ని తగ్గించేందుకు ప్రధాన కారణంగా నిలుస్తున్నాయని అన్నారు. ఎలిన్ మారా కూడా ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

‘‘మెడికైడ్ లాంటి ప్రోగ్రామ్‌లు ప్రజల జీవితాన్ని కాపాడుతున్నాయనేందుకు ఎన్నో ఆధారాలున్నాయి. కానీ, మరణాలు అత్యధికంగా ఉన్న రాష్ట్రాలు ఈ స్కీమ్‌ను అమలు చేయడం లేదు’’ అని చెప్పారు.

గుండె పోటు వస్తే, ఎమర్జెన్సీకి వెళ్లాల్సి వస్తుందని ప్రజలు ఇంకా భయపడుతున్నారని ఎలిన్ మారా అన్నారు.

ఔషధాల ధరలు అత్యధికంగా ఉంటే, అవి తీసుకోవడాన్ని కూడా ప్రజలు తగ్గిస్తున్నారు. ఇది వారికి ప్రాణాంతకంగా మారుతోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)