ఏషియన్ గేమ్స్: ఈ ఫోటోను చైనా ఎందుకు సెన్సార్ చేసింది?

ఫొటో సోర్స్, REUTERS
- రచయిత, డెరెక్ కై
- హోదా, బీబీసీ న్యూస్, సింగపూర్
ఇద్దరు చైనా క్రీడాకారిణులు హగ్ చేసుకున్న ఫోటోను సోషల్‌మీడియాలో చైనా సెన్సార్ చేసింది.
ఈ ఫొటో తియానన్మెన్ స్క్వేర్ నరమేధాన్ని గుర్తు చేస్తోందనే కారణంతో ఈ చర్య తీసుకున్నారు.
మహిళా రేసర్లు లిన్ యువీ, వూ యన్నీ హగ్ చేసుకున్నప్పుడు వారిద్దరు ధరించిన దుస్తులపై ఉన్న నెంబర్లు ‘‘64’’గా కనిపించాయి. ఈ సంఖ్య 1989 జూన్ 4న జరిగిన తియాన్మెన్‌స్క్వేర్ ఘటనను గుర్తు చేసినట్లయింది.
చైనాలో తియానన్మెన్ స్క్వేర్ ఘటన గురించి చర్చించడంపైనా నిషేధం ఉంది. ఇంటర్నెట్‌లో దీనిపై ఏ చిన్న అంశం కనిపించినా అధికారులు తొలగిస్తుంటారు.
1989లో బీజింగ్‌లో అనేక మంది ప్రజాస్వామ్య అనుకూల ఆందోళనకారులను భద్రతాదళాలు కాల్చిచంపాయి.
ఆ రోజు భద్రతాదళాలు ఎంతమందిని కాల్చిచంపారనేది ఇప్పటికీ అస్పష్టంగానే ఉంది. కానీ కొన్ని వందలమంది నుంచి కొన్ని వేలమందిని దాకా చంపి ఉంటారని మానవ హక్కుల సంఘాలు అంచనా వేస్తున్నాయి.

ఆసియా క్రీడలలో 100 మీటర్ల హర్డిల్స్‌లో లిన్ బంగారు పతకాన్ని గెలచుకున్న తరువాత ఈ ఇద్దరు క్రీడాకారిణులు కౌగిలించుకున్నారు. ఇందులో లిన్ తన లైన్ నెంబర్ 6ను ధరించగా, వూ యన్నీ 4వ నెంబరు ధరించినట్టు ఫోటోలో కనిపిస్తోంది.
లిన్‌ను చైనా అతిపెద్ద సోషల్‌మీడియా వేదిక వైబోలో ప్రజలు అభినందించారు. కాకపోతే ఈ ఫోటో స్థానంలో బూడిద రంగు చతురస్రాలు కనిపిస్తుంటాయి.
అయితే చైనాలో ఈ ఫోటో ఇంటర్‌నెట్ నుంచి పూర్తిగా తొలగించలేదు. ఇప్పటికీ కొన్ని చైనా వ్యాసాలలో ఈ క్రీడాకారిణుల ఫోటో కనిపిస్తోంది.
ఆసియా క్రీడలలో ఇప్పటిదాకా చైనా దాదాపు 300 పతకాలదాకా గెలిచింది. చైనాలోని హాంగ్జౌ సిటిలో ఈ క్రీడలు అక్టోబరు 8వరకు కొనసాగుతాయి.
తియానన్మెన్ స్క్వేర్ సంఘటనల గురించి చర్చించడం చైనాలో ఇప్పటికీ చాలా సున్నితమైన అంశమే. ఈ సంఘటన గురించి కొద్దిగా తెలిసి ఉండటం నుంచి అసలేమీ తెలియకుండానే అక్కడి యువతరం పెరుగుతోంది.
తియానన్మెన్ స్క్వేర్ నరమేథానికి సంబంధించిన పోస్టులను ఇంటర్‌నెట్ నుంచి ప్రభుత్వం ఎప్పటికప్పుడు తొలగిస్తుంటుంది. ఇంటర్‌నెట్‌ను చైనా ప్రభుత్వం సునిశితంగా నియంత్రిస్తుంటుంది.
కిందటేడాది చైనాలో ఓ ప్రసిద్ధ వ్యక్తి తియానన్మెన్ స్క్వేర్ నరమేథానికి 33 ఏళ్ళు నిండిన సందర్భంగా చేసిన ప్రత్యక్ష ప్రసారం అర్ధాంతరంగా ముగిసింది.
దీనికి కారణం ఆయన తన ప్రేక్షకులకు ట్యాంక్‌ను గుర్తుకు తెచ్చేలా ఉన్న కేకును ప్రదర్శించడమే.
తియానన్మెన్ స్క్వేర్ ఊచకోత జరిగినప్పుడు ఒక వ్యక్తి తన షాపింగ్ బ్యాగులతో ట్యాంకులను అడ్డుకుని ట్యాంక్‌మెన్‌గా ప్రసిద్ధి చెందారు.
దీంతో ఈ కేకు ఆయనను గుర్తుకు తెచ్చేలా ఉందంటూ ఈ ప్రదర్శనను అర్ధాంతరంగా ముగించారు.
ఇవి కూడా చదవండి:
- కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలకు ఎవరు బాధ్యులు? తల్లిదండ్రులా? కోచింగ్ సెంటర్లా? – బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- నాందేడ్: ‘డాక్టర్లు లేరు, మెషీన్లు ఆగిపోయాయి.. పిల్లలు చనిపోయాక మా సంతకాలు తీసుకున్నారు’
- బంగారం కొనాలా? బంగారం బాండ్లు కొనాలా? ఏది లాభం?
- ఇందూరు సభ: ‘మీకో రహస్యం చెప్పనా’ అంటూ కేసీఆర్‌పై ప్రధాని మోదీ ఆ వ్యాఖ్యలు ఎందుకు చేశారు?
- దేవ్ రతూడి: సైకిల్‌పై పాలు అమ్మిన ఈ భారతీయుడు, చైనా సినిమాల్లో విలన్‌గా ఎలా సక్సెస్ అయ్యాడు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















