చైనాతో నేపాల్ 12 ఒప్పందాలు... భారత్ మీద ప్రభావం ఉంటుందా?

ప్రచండ

ఫొటో సోర్స్, X/CMPRACHANDA

    • రచయిత, బీబీసీ హిందీ
    • హోదా, టీం

నేపాల్ ప్రధాన మంత్రి పుష్ప కమల్ దాహాల్ ప్రచండ ఇటీవల చైనా పర్యటించారు.

చైనీస్ ప్రీమియర్ లీ చియాంగ్ ఆహ్వానం మేరకు సెప్టెంబర్ 23న బీజింగ్ వెళ్లిన ప్రచండ, 30వ తేదీ వరకు అక్కడే ఉన్నారు.

నేపాల్ ప్రధాన మంత్రిగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రచండ తొలిసారి చైనా పర్యటనకు వెళ్లారు. అంతకుముందు ఈ ఏడాది మే 31 నుంచి జూన్ 3 వరకు ఆయన భారత్‌లో పర్యటించారు.

2008లో నేపాల్‌లో రాచరిక వ్యవస్థ ముగిసిన తర్వాత మొట్టమొదటి ప్రధాన మంత్రిగా ప్రచండ పదవీ బాధ్యతలు చేపట్టారు. ప్రధాన మంత్రి హోదాలో తొలిసారి చైనాలో పర్యటించారు.

ప్రచండ ప్రధాని కాకముందు, రాచరిక వ్యవస్థ మనుగడలో ఉన్నప్పుడు నేపాల్ ప్రధానిగా ఎవరు బాధ్యతలు స్వీకరించినా తొలిసారి భారత్‌లో పర్యటించేవారు. ఈ సంప్రదాయాన్ని ప్రచండ కొనసాగించలేదు.

చైనా విప్లవ నేత మావో జెడాంగ్‌‌ నుంచి స్ఫూర్తి పొందినట్లు భావిస్తారు ప్రచండ.

చైనా, నేపాల్

ఫొటో సోర్స్, X/CMPRACHANDA

నేపాల్, చైనా మధ్య ఒప్పందాలు

ప్రధాన మంత్రి హోదాలో ప్రచండ చైనాలో పర్యటించడం ఇది మూడోసారి. నేపాల్ - చైనా బిజినెస్ సమ్మిట్‌లో ఆయన మాట్లాడుతూ ''నేనెప్పుడు చైనా వచ్చినా ఇక్కడ కనిపించే మార్పులు ఆశ్చర్యానికి గురిచేస్తాయి. చైనాలో ప్రతిసారీ మార్పు కనిపిస్తుంది. మౌలిక సదుపాయల కల్పన, మానవ వనరుల అభివృద్ధి, పేదరిక నిర్మూలన, విద్య, వైద్య సేవలు, శాస్త్ర, సాంకేతిక విజ్ఞాన రంగాల్లో ఈ మార్పులు కనిపిస్తాయి. చైనా అద్భుత ప్రగతి సాధించడం నిజంగా అపూర్వం'' అని ఆయన అన్నారు.

ప్రచండ పర్యటనలో భాగంగా చైనాతో 12 ఒప్పందాలపై నేపాల్ సంతకాలు చేసింది. వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుదల దిశగా రెండు దేశాలు 12 ఎంవోయూలు చేసుకున్నాయి.

వ్యవసాయం, వాణిజ్యం, మౌలిక సదుపాయాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ, డిజిటల్ ఎకానమీ, కొన్ని సంస్థాగత సంస్కరణలకు సంబంధించి పరస్పర సహకారానికి ఇరుదేశాలు అంగీకారం తెలిపాయి.

నేపాల్, చైనా మధ్య రోడ్ల విస్తరణకు సంబంధించిన అంశంపై కూడా చైనా - నేపాల్ ఒప్పందానికి వచ్చాయి.

ద్వైపాక్షిక సంబంధాలను సమగ్రంగా సమీక్షించడంతో పాటు ప్రస్తుత సంబంధాలపై రెండు దేశాలు సంతృప్తి వ్యక్తం చేసినట్లు నేపాల్ తెలిపింది.

జిన్‌పింగ్ ప్రభుత్వ కొత్త విధానాలు గ్లోబల్ సెక్యూరిటీ ఇనిషియేటివ్ (జీఎస్‌ఐ), గ్లోబల్ సివిలైజేషన్ ఇనిషియేటివ్ (జీసీఐ)లను స్వాగతించాలని చైనా ఒత్తిడి తీసుకురాగా, వాటిని ప్రచండ దాటవేసినట్లు ఉందని పీటీఐ తెలిపింది.

సంతకాలు చేసిన ఒప్పందాలివే..

  • ప్లానింగ్ కమిషన్ ఆఫ్ నేపాల్, నేషనల్ డెవెలప్‌మెంట్ ఆఫ్ రిఫార్మ్ కమిషన్ ఆఫ్ చైనా పరస్పర సహకారానికి అంగీకరిస్తూ ఒప్పందం కుదిరింది.
  • డిజిటల్ ఎకానమీ బలోపేతానికి సహకారంపై ఒప్పందం.
  • గ్రీన్, కర్బన ఉద్గారాలు తగ్గించడానికి సంబంధించిన ఒప్పందం.
  • వ్యవసాయం, మత్స్యసంపద ఒప్పందం.
  • చైనా, నేపాల్ మధ్య వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయడం, చెల్లింపులకు సంబంధించి జాయింట్ టెక్నికల్ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటుకు ఒప్పందం.
  • హిల్సా సిమ్‌కొట్ రోడ్డు ప్రాజెక్ట్, నేపాల్ - చైనా పవర్ గ్రిడ్ అనుసంధాన ప్రాజెక్టులపై ఒప్పందం.
చైనా, నేపాల్

ఫొటో సోర్స్, X/CMPRACHANDA

చైనా వెళ్లకముందు ప్రచండ ఏమన్నారు?

చైనా వెళ్లకముందు దైనిక్ కాంతిపూర్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో భద్రతకు సంబంధించిన గ్రూపు(సెక్యూరిటీ గ్రూప్)లో చేరే అవకాశాలను ప్రచండ తోసిపుచ్చారు.

చైనా జీఎస్‌ఐ, జీసీఐ, జీడీఐ ( గ్లోబల్ డెవెలప్‌మెంట్ ఇనిషియేటివ్)లను తీసుకొచ్చింది. జీడీఐలో చేరేందుకు ఎలాంటి ఇబ్బందీ లేదని ఆయన అన్నారు.

''భద్రతకు సంబంధించిన విషయాల్లో చేరబోయేది లేదు'' అని ఆయన చెప్పారు. ఎవరికీ తలవంచకుండా ఉండడమే మా విధానం. మా విదేశాంగ విధానం అలీన విధానం. అమెరికా నేతృ‌త్వంలోని భద్రతా గ్రూపుల్లో చేరలేదంటే, మరే ఇతర దేశాల గ్రూపుల్లోనూ చేరే అవకాశం లేదనే అర్థమని అన్నారు.

అయితే. లీ చియాంగ్, ప్రచండ సమావేశం తర్వాత విడుదల చేసిన ప్రకటనలో జీఎస్‌ఐ, జీడీఐ, జీసీఐ గురించి ప్రస్తావించలేదు.

ఇరుదేశాల మధ్య జరిగిన ఒప్పందాల్లో, ప్రచండ చైనా పర్యటనకు ముందు ప్రధాన ఒప్పందంగా భావించిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (బీఆర్‌ఐ) ప్రస్తావన లేదని కాఠ్‌మాండు పోస్ట్ తెలిపింది.

అయితే, ఒప్పందాల గురించి చైనా ఎలాంటి ప్రకటనా చేయలేదు. నేపాల్ ప్రకటించిన విషయాలే ఇప్పటి వరకూ బయటికొచ్చాయి.

నేపాల్ సార్వభౌమాధికారాన్ని కాపాడడంలో, దేశ అభివృ‌ద్ధిలో చైనా సహకారం కొనసాగుతుందని ప్రచండకు లీ చియాంగ్ భరోసానిచ్చారు.

రోడ్లు, రైల్వే, విమానయానం, విద్యుత్, టెలీకమ్యూనికేషన్, మల్టీడైమెన్షనల్ కనెక్టివిటీ నెట్‌వర్క్స్‌ రంగాల్లో నేపాల్‌కు సాయం చేసేందుకు చైనా సిద్ధంగా ఉందని చైనీస్ ప్రీమియర్ చెప్పారు.

గతంలోనూ ఇరుదేశాల మధ్య మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించిన ఒప్పందాలున్నాయి.

చైనా కంపెనీ సీఏఎంసీఈ సాయంతోనే నేపాల్‌లోని పొఖారా విమానాశ్రయం నిర్మితమైంది. ఈ ప్రాజెక్టు 2017 జులైలో మొదలైంది. దీని కోసం నేపాల్‌కు చైనా రుణం కూడా ఇచ్చింది. ఈ విమానాశ్రయం అభివృద్ధికి కొత్త మోడల్‌గా ప్రాచుర్యం పొందింది.

ప్రచండ

ఫొటో సోర్స్, X/CMPRACHANDA

ఇండియా, చైనా సంబంధాల ప్రభావం ఉంటుందా?

చైనా కమ్యూనిస్టు పార్టీ అనుకూల సంస్థగా భావించే గ్లోబల్ టైమ్స్‌ ఇంటర్వ్యూలో నేపాల్ ప్రధాని ప్రచండ మాట్లాడారు.

ఈ ఇంటర్వ్యూలో భారత్, చైనాలతో సంబంధాలపై ఆయన్ను ప్రశ్నించారు.

భారత్, చైనా సంబంధాల నేపథ్యంలో చాలా మంది ఆందోళన వ్యక్తం చేశారని, ఈ పరిస్థితిని నేపాల్ ఎలా తీసుకుంటుందని అడిగారు.

అందుకు ఆయన సమాధానమిస్తూ '' ఇండియా, చైనాతో నేపాల్ సంబంధాలు అలీన విదేశాంగ విధాన సూత్రాలు, శాంతియుత సహజీవనం, పొరుగుదేశాలతో సత్సంబంధాల ప్రాతిపదికన ఉంటాయి. రెండుదేశాలతోనూ నేపాల్ స్వతంత్రంగా సంబంధాలు నెరుపుతుంది.

ఒక దేశంతో సంబంధాలు మరో దేశాన్ని ప్రభావితం చేయవు. అలాగే, మేం కూడా ఒకరికి వ్యతిరేకంగా మరొకరికి అనుకూలంగా వ్యవహరించేది లేదు.

ఇద్దరూ మాకు మంచి మిత్రులు. అభివృద్ధిలో ప్రధాన భాగస్వాములు. రెండు దేశాలతోనూ ద్వైపాక్షిక సంబంధాలను కొనసాగిస్తాం. ఎవరితోనైనా సమస్యలు తలెత్తితే ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకుంటాం'' అని చెప్పారు.

1962లో ఇండియా, చైనా యుద్ధ సమయంలోనూ నేపాల్ తటస్థంగా వ్యవహరించింది. రెండు దేశాల్లో ఒకరికి మద్దతు తెలిపేందుకు నిరాకరించింది.

''రెండు దేశాలతోనూ నేపాల్ సంబంధాలు సుస్పష్టం. ఎప్పటిలాగే ఉంటాయి. ఇరుదేశాలతో స్నేహపూర్వక సంబంధాలను కోరుకుంటున్నాం. అలాగే, ఈ రెండు పొరుగు దేశాల మధ్య స్నేహపూర్వక, పరస్పర సహకార సంబంధాలు చూడాలనుకుంటున్నాం.

ఇండియా, చైనా సంబంధాల వల్ల నేపాల్‌కి ప్రయోజనకరమే. రెండుదేశాల మధ్య సత్సంబంధాలను, సాన్నిహిత్యాన్ని పెంచేందుకు వ్యక్తిగతంగా ప్రయత్నించేందుకు కట్టుబడి ఉన్నా.

ఇరుదేశాల ప్రయోజనాలనూ నేపాల్ గౌరవిస్తుంది. మూడు దేశాలకు ప్రయోజనం చేకూర్చే అభివృద్ధి మోడల్‌ కోసం పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాం'' అని ప్రచండ అన్నారు.

ప్రచండ, జిన్‌పింగ్

ఫొటో సోర్స్, X/CMPRACHANDA

చైనా - నేపాల్ రైల్ ప్రాజెక్ట్

చైనా - నేపాల్ రైల్వే ప్రాజెక్టును మీ హయాంలోనే ప్రారంభిస్తారా? అని గ్లోబల్ టైమ్స్ ప్రచండను ప్రశ్నించింది.

''చైనా నేపాల్ రైల్వే ప్రాజెక్టుపై నేపాలీ ప్రజలు చాలా ఆశలు పెట్టుకున్నారు. వీలైనంత త్వరంగా ఈ ప్రాజెక్టును ప్రారంభించాలని నేపాల్ ప్రజలు కోరుకుంటున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే రవాణా సౌకర్యాలు మెరుగవడంతో పాటు వాణిజ్య అవకాశాలు కూడా పెరుగుతాయి'' అని ప్రచండ చెప్పారు.

''అయితే, ఎంత త్వరగా ఈ ప్రాజెక్టును ప్రారంభించగలమనే దానిపైనే ఆందోళనంతా. అందుకు పెద్దమొత్తంలో వనరులు అవసరమవుతాయి. నేపాల్ ఒంటరిగా అంత వ్యయాన్ని భరించే పరిస్థితిలో లేదు. అందువల్ల నిధుల కోసం ఇతరులపై ఆధారపడాల్సి వస్తోంది'' అన్నారు.

నిధుల గురించి ఆయన మాట్లాడుతూ, '' ఈ ప్రాజెక్టుకి ఇచ్చే రుణానికి సంబంధించిన నిబంధనలు నేపాలీ ఆర్థిక వ్యవస్థకు ఇబ్బంది లేకుండా ఉండాలని కోరుకుంటున్నాం. దీనిపై అధ్యయనం చేస్తున్నాం. త్వరలోనే నివేదిక అందుతుంది. ఇది నా హయాంలోనే మొదలవుతుందని ఆశిస్తున్నా. ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ నేపాల్ - చైనా రైల్వే ప్రాజెక్ట్. ఇది నా హయాంలో ప్రారంభమవడమేమీ ప్రధానం కాదు, ఈ రైల్వే ప్రాజెక్ట్‌తో చైనా నేపాల్ ఆకాంక్షలు నెరవేరడమే ముఖ్యం'' అన్నారు.

చైనా, నేపాల్

ఫొటో సోర్స్, X/CMPRACHANDA

నిపుణలు ఏమంటున్నారు?

చైనా - నేపాల్ జరిగిన ఒప్పందాలు నేపాల్ ప్రకటన ద్వారా బయటికొచ్చినవే. అయితే, ఇరుదేశాల ఉమ్మడి ప్రకటనపై ఇంకా చర్చలు జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు.

''తదుపరి ప్రకటన కేవలం ఫార్మాలిటీనే. అంతకుమించి నాకేమీ కనిపించడం లేదు'' అని చైనాలో నేపాల్ అంబాసిడర్ మహేంద్ర బహదూర్ పాండే ఖట్మాండు పోస్టుతో చెప్పారు.

''చైనా వంటి అగ్రరాజ్యంతో ఎలా వ్యవహరించాలనే విషయంలో ఇంకా వెనకబడి ఉన్నామని ఇది తెలియజేస్తోంది. చైనా ముందు మనల్ని మనం చూపించుకునేందుకు ఒక ప్రణాళిక గానీ, ఒక వ్యూహంగానీ ఉన్నట్లు నాకు అనిపించలేదు'' అని ఆయన చెప్పారు.

''ఇవాళ జరిగిన ఒప్పందాలన్నీ ఫార్మాలిటీ మాత్రమే. ఈ పర్యటనకు మేం సిద్ధంగా లేము. ఏయే రంగాల్లో చైనాతో పరస్పరం సహకారం అవసరం? గత ఒప్పందాలు ఏమయ్యాయి?'' అని ఆయన అన్నారు.

''భౌగోళిక-రాజకీయ ప్రయోజనాలను కొనసాగించే విషయంలో నేపాల్ ప్రస్తుతం సవాళ్లు ఎదుర్కొంటోంది. రాజ్యాంగాన్ని అనుసరిస్తూనే అలీన విదేశాంగ విధానాన్ని అమలు చేసేందుకు కష్టపడుతోంది'' అని నేషనల్ ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్ మాజీ చీఫ్ గణేష్ అధికారి ఖట్మాండు పోస్టుతో చెప్పారు.

''ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా నేపాల్ విదేశాంగ విధానం కూడా బలంగా ఉండాలి. అది కేవలం కాగితాలపై మాత్రమే కాదు, వాస్తవంగా కూడా'' అని ఆయన అన్నారు.

''ద్వైపాక్షిక సామర్థ్యాలను పెంచుకోకపోతే ఎవరూ మనల్ని నమ్మే పరిస్థితి ఉండదు. అందరినీ సంతోషపరచలేమని మన నాయకులు అర్థం చేసుకోవాలి. నేపాల్ విదేశాంగ విధానంలోనే ఈ గందరగోళం ఉంది. అది చైనా పర్యటనలో స్పష్టంగా కనిపిస్తోంది'' అని ఆయన చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)