పారిస్‌పై నల్లుల దండయాత్ర, భయపడిపోతున్న జనం, ఎక్కడ చూసినా నల్లులే..

నల్లులు
    • రచయిత, హ్యూ స్కోఫీల్డ్
    • హోదా, బీబీసీ న్యూస్

పారిస్‌తో పాటు ఫ్రాన్స్‌లోని ఇతర నగరాల్లో నల్లులు బెడద విపరీతంగా పెరిగింది. నల్లుల భయం, వచ్చే ఏడాది ఫ్రాన్స్‌లో జరిగే ఒలింపిక్స్ క్రీడల సమయంలో ఆరోగ్యం, భద్రతా అంశాలపై ప్రశ్నల్ని లేవనెత్తింది.

ఫ్రాన్స్‌తో పాటు అంతర్జాతీయ మీడియాలో ఈ అంశం గురించి విస్తృత చర్చ జరుగుతోంది.

అయితే, ఇందులో సగం మాత్రమే నిజం. మిగతా సగం కాదు.

ఇందులో నిజం ఏంటంటే, గత కొన్ని వారాలుగా నల్లులు కనిపించడం బాగా పెరిగిపోయింది. కొన్నేళ్లుగా ఈ ధోరణి కనిపిస్తోంది.

‘‘ఏటా వేసవి చివర్లో నల్లుల సంఖ్య పెరగడం కనిపిస్తుంది’’ అని మార్సెయిల్ మెయిన్ హాస్పిటల్‌లోని ఎంటమాలజిస్ట్, నిపుణుడు జీన్ మిచెల్ బెరెంగర్ అన్నారు.

‘‘సాధారణంగా ప్రజలు జులై, ఆగస్టులలో ప్రయాణాలు చేస్తుంటారు. తిరిగి లగేజ్‌లలో వాటిని తెస్తుంటారు.

ప్రతీ సీజన్‌లో ఏటికేడు నల్లుల సంఖ్య పెరుగుతూనే ఉంది. నిరుటి కంటే ఈసారి ఎక్కువగా కనిపిస్తున్నాయి’’ అని ఆయన వివరించారు.

పారిస్‌లో నల్లుల బెడద గురించి అక్కడి ప్రజల్లో దీర్ఘకాలికంగా ఉన్న భయాలకు కొత్త భయాలు కూడా తోడయ్యాయి.

సినిమా హాళ్లు, రైళ్లలోనూ నల్లులు, ప్రజల్ని కుడుతున్నట్లు వార్తలు వచ్చాయి.

నల్లుల నివారణకు చర్యలు తీసుకోవాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్ ప్రభుత్వం పిలుపునిచ్చింది.

నల్లుల సమస్యను వారు ఎంత తీవ్రంగా పరిగణలోకి తీసుకున్నారు? 2024 ఒలింపిక్స్‌కు ముందు పారిస్ ప్రతిష్టను ఎలా కాపాడుకుంటారు అనే దానికి ఈ చర్యలే ఇదే కొలమానం.

నల్లుల భయాన్ని ఒక సోషల్ మీడియా చిత్రీకరణగా అక్కడి ప్రభుత్వం భావించడం లేదు.

నల్లులకు సంబంధించిన భయానక కథనాలు ఇంటర్నెట్‌లో వేగంగా కనిపిస్తున్నాయి.

సినిమా హాళ్లకు ప్రజలు రావడం తగ్గిపోతుండటం గురించి హాళ్ల యజమానులు ఆందోళన చెందుతున్నారు. థియేటర్లలోని సీట్లపై గుర్తు తెలియని పురుగులు ఉన్నట్లు వీడియోలు వ్యాప్తి చెందడం హాళ్ల యజమానుల్లో భయాన్ని మరింత పెంచింది.

మెట్రో రైళ్లలో కూడా ప్రజలు కూర్చోవడానికి బదులుగా నిల్చొని ప్రయాణించడానికే మొగ్గు చూపుతున్నారు.

నల్లులు

ఫొటో సోర్స్, SPL

కొన్ని దశాబ్దాలుగా కనుమరుగయ్యాయి అనుకున్న నల్లులు ఇప్పుడు మళ్లీ విజృంభిస్తున్నాయి.

దీనికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో ప్రపంచీకరణ (కంటైనర్ ట్రేడ్, పర్యటకం, వలస) అనేది చాలా ముఖ్యమైనది. నల్లుల విషయంలో వాతావరణ మార్పులను కారణంగా చెప్పలేం. నల్లలు అనేవి ఇంట్లో ఉండే జీవులు. ఇవి మనుషులు వెళ్లిన ప్రతీచోటకూ వెళ్తాయి.

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత, డీడీటీ అనే క్రిమిసంహారక మందులను విపరీతంగా వాడటం వల్ల నల్లుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది.

కానీ, తర్వాత డీడీటీతో పాటు, ఇతర రసాయనాలు మానవులపై చూపే ప్రభావాల కారణంగా వాటిని నిషేధించారు.

నల్లులు పోవాలంటే బొద్దింకలు పెంచాలా?

బొద్దింకలు తగ్గిపోవడం కూడా నల్లులు పెరగడానికి కారణంగా చెప్పొచ్చు. బొద్దింకలకు నల్లులే ఆహారం.

ఇప్పుడు నల్లుల నివారణకు ఇంట్లో బొద్దింకలను పెంచాలా? అని మీరు భయపడొద్దు. అలా చేయాలని ఎవరూ సూచించడం లేదు.

నిజానికి నల్లులు అనేవి భయం కలిగించేవే. శారీరకంగా కంటే మానసికంగా ఇవి మరింత ప్రమాదకరం. నల్లులు తిరిగి కనిపిస్తున్నప్పటికీ, ఇవి ఒకరి నుంచి మరొకరికి వ్యాధులను ప్రసారంచేయవు. కానీ, నల్లుల కాటు అసహ్యకరమైనది.

నల్లులు తరచుగా కుబుసం (శరీరం పైపొర) వదులుతాయి. జీర్ణమైన రక్తాన్ని నల్లటి చుక్కలుగా వ్యర్థాల రూపంలో వదిలేస్తాయి.

నల్లలు ఆహారం లేకుండా సంవత్సరం పాటు జీవించగలవు.

నల్లుల బెడదను ఎదుర్కోవడానికి ముందుగా సూపర్ స్పైడర్లను గుర్తించాలని ఎంటమాలజిస్ట్ బెరెంగర్ అన్నారు.

సూపర్ స్పైడర్ల సంఖ్య చాలా తక్కువగా ఉన్నప్పటికీ వారి వల్ల వచ్చే సమస్యలు ఎక్కువ.

సూపర్ స్పైడర్ల ఫ్లాట్లలో వందలాది నల్లలు పాకుతూ కనబడతాయి. దుస్తుల్లో, అల్మారాల్లో ఉంటారు. వాటి గుడ్లు అంతటా కనిపిస్తాయి.

‘‘సూపర్ స్పైడర్లలో ఏ ఒక్కరూ తమ ఇంటి నుంచి బయటకు వెళ్లినా... ప్రతీసారి వారితో పాటు నల్లులు కూడా బయటకు వెళ్తాయి. అలా వాటి వ్యాప్తి జరుగుతుంది. నల్లుల బెడద తగ్గేలా సూపర్ స్పైడర్లకు అవసరమైన సహాయం చేయాలి’’ అని బెరెంగర్ వివరించారు.

మిగ్యుల్ హెర్నాండేజ్ యూనివర్సిటీలో పారాసిటాలజీ ప్రొఫెసర్లు అయిన లూక్రెసియా అకోస్టా సోటో, ఫెర్నాండో జార్జ్ బోర్నే లినారెస్‌లు నల్లులకు సంబంధించిన పలు సూచనలు చేశారు. అవేంటంటే..

నల్లులు

ఫొటో సోర్స్, Getty Images

1. నల్లులు కుడితే ఏమవుతుంది?

నల్లులు రక్తాన్ని పీల్చేటప్పుడు, అది గడ్డకట్టకుండా నిరోధించేందుకు వాటి లాలాజలాన్ని లోపలికి పంపిస్తాయి. ఇవి కుట్టడం వల్ల కొందరికి ఎలాంటి రియాక్షన్లు ఉండవు. కానీ కొందరిలో తీవ్రమైన అలర్జీలను కలిగిస్తాయి. ఇతర కీటకాలు కుట్టినప్పుడు ఏర్పడే దద్దుర్ల వంటివి నల్లి కాటు వల్ల కూడా ఏర్పడతాయి.

నల్లులు కుట్టడం వల్ల 1 సెం.మీ పరిమాణంలో ఉండే దద్దుర్లుతో పాటు దురద, మంట కలుగుతాయి. శరీరంపై ఎరుపు రంగు మచ్చలు ఏర్పడతాయి. ముఖ్యంగా ముఖం, చేతులు, మెడపై దాడి చేయడం వల్ల ఇవి ఏర్పడతాయి.

దురద కారణంగా తరచుగా రుద్దడం వల్ల ఏర్పడే గాయాలు ఇన్‌ఫెక్షన్లుగా మారతాయి. ఇవి తీవ్రంగా మారి, చికిత్స చేయడం కూడా కష్టమవుతుంది.

ఇవి బాధితులకు మానసిక క్షోభను కలిగిస్తాయి. వారు నిద్రలేమి, మానసిక ఒత్తిడికి గురవుతుంటారు.

2. నల్లులు ఉన్నట్టు గుర్తించడమెలా?

నల్లులు కుట్టిన తొమ్మిది రోజుల తర్వాత చర్మంపై గాయాలు, వాటి తాలూకు లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాల నుంచి బయటపడటానికి చాలా రోజులు పడుతుంది.

నల్లి కుట్టినట్టు అనుమానం వస్తే, ఆ ప్రదేశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. ముఖ్యంగా గోడ పగుళ్లలో, పరుపులపై, ఫర్నీచర్‌ను నిశితంగా గమనించాలి.

అక్కడ కనిపించే ఆనవాళ్లను పరిగణనలోకి తీసుకోవాలి.

అవి దాక్కునే ప్రాంతాల్లో నల్లటి మచ్చలు ఉంటాయి.

పరుపులపై, బెడ్‌షీట్లపై తుప్పులాంటి ఎరుపు రంగు మరకలు ఏర్పడుతుంటాయి.

నల్లుల సంఖ్య చాలా ఎక్కువగా ఉన్నప్పుడు దుర్వాసనతో పాటు వాటి మ్యూకస్ స్రావాలు కనిపిస్తుంటాయి.

నల్లుల ఉనికిని ఇలా నిర్ధారించవచ్చు

రాత్రివేళల్లో నల్లులు చురుగ్గా ఉంటాయి. ఆ సమయంలో అవి కనబడుతుంటాయి.

పాలిపోయిన పసుపు రంగులో ఉండే శరీరం పైపొరను నల్లులు వదిలివేస్తుంటాయి.

పొదిగిన లేదా పొదగని గుడ్లు కనబడతాయి.

నల్లులు

ఫొటో సోర్స్, Getty Images

3. నల్లులు కుడితే ఏం చేయాలి?

దురదను తగ్గించడానికి వెంటనే చికిత్స తీసుకోవడంతో పాటు ఇన్‌ఫెక్షన్ సోకకుండా పరిశుభ్రతను పాటించాలి. చాలా మందికి ఇది సరిపోతుంది. కాకపోతే, దురద లేదా లక్షణాలు తీవ్రంగా ఉంటే ప్రత్యేక వైద్య నిపుణుడిని సంప్రదించడం మంచిది.

తీవ్రమైన లక్షణాలు కనిపించిన వారు కార్టికోస్టెరాయిడ్స్, యాంటీహిస్టామైన్స్ లేదా యాంటీబయాటిక్స్ వాడాల్సి రావొచ్చు. వైద్యులను సంప్రదించిన తర్వాతే మందులు వేసుకోవాలి.

4. నల్లులు ఎక్కడ నుంచి వస్తాయి?

ప్రస్తుతం, ప్రపంచవ్యాప్తంగా అంటువ్యాధుల సంఖ్య పెరిగిపోతోంది. వాటి నియంత్రణ కష్టమవుతోంది. ఇళ్లు, పక్షి గూళ్లు, గబ్బిలాల గుహలు వంటివి నల్లులకు మంచి ఆవాసాలుగా ఉన్నాయి. ఈ ఆవాసాల్లో నల్లులకు వెచ్చని ఆశ్రయం లభించడంతో పాటు వాటికి ఆహారం కూడా అందుబాటులో ఉంటుంది.

ఇళ్ల గోడల్లోని పగుళ్లు, ఫర్నీచర్, వాల్ పేపర్ల వెనకాల, చెక్క పలకలు లేదా ఫొటోలు, దుప్పట్లు, పరుపుల కింద నల్లులు దాక్కుంటాయి. వీటికి నిశాచర లక్షణాలు ఉంటాయి. కాబట్టి పగటిపూట దాక్కొని, రాత్రివేళల్లో ప్రజలు నిద్రిస్తోన్న సమయాల్లో యాక్టివ్‌గా మారతాయి.

హోటళ్లు, ఎక్కువగా అతిథులు వస్తూ పోతూ ఉండే ఇళ్లు, ఆసుపత్రుల్లో ఇవి ఎక్కువగా ఉండే ప్రమాదం ఉంది.

నల్లులు

ఫొటో సోర్స్, REUTERS

5. నల్లులను నిర్మూలించడం చాలా కష్టం, ఎందుకు?

నల్లులు ఆహారం లేకుండా ఆరు నెలల వరకు జీవించగలవు. మనుషులను కుట్టకుండా 12 నెలల వరకు బతకగలవు.

ఇళ్లలో తేమ అధికంగా ఉండటం, గాలి ప్రసరణ లేకపోవడం, అపరిశుభ్రత, గృహోపకరణాల నిల్వ తదితర కారకాల వల్ల మన ఇళ్లు నల్లులకు ఆవాసాలుగా మారుతుంటాయి.

అంటువ్యాధుల గురించి ప్రజల్లో ఉన్న మూఢనమ్మకాలతో ప్రజలు కీటకాల నియంత్రణ విధానాలు పాటించడం లేదు. దీనివల్ల అవి పునరుజ్జీవం పొందడంతో పాటు నిరోధకతను సంపాదిస్తున్నాయి.

నల్లులు

6. వాటిని ఎలా నివారించవచ్చు?

నల్లుల నివారణకు ఉత్తమమైన మార్గం ఏంటంటే, ముందుగానే వాటి ప్రవేశాన్ని నిరోధించడం. నల్లులు రాకుండా ఉండాలంటే పరిశుభ్రత పాటించడం మొదటి మెట్టు. కానీ ఇటీవలి కాలంలో నర్సింగ్ హోమ్స్, ఆసుపత్రులు, క్రూయిజ్ షిప్స్, సినిమా హాళ్లు, సబ్ వే, విమానాల్లో ఇవి కనిపిస్తున్నాయి. వాటిని నివారించడానికి పరిశుభ్రత ఒక్కటే సరిపోదు.

వాటిని నియంత్రించాలంటే, ముందుగా మనం నల్లులు ఉన్న ప్రదేశాలను గుర్తించాలి. ఇంట్లో తయారు చేసిన మందులను వాటిపై ఉపయోగించకూడదని చెబుతుంటారు. వాటి వాడకం వల్ల నల్లులు అప్రమత్తమై ఇళ్లలోని ఇతర ప్రదేశాలను వెతుక్కుంటాయి. వీటిని నివారించడానికి, కీటకాల నివారణ నిపుణులతో ఒకటికి రెండుసార్లు ఇంటిని శుద్ధి చేయించడం ముఖ్యమని చాలా సందర్భాల్లో తేలింది.

వీడియో క్యాప్షన్, పారిస్‌పై నల్లుల దండయాత్ర

నల్లుల నియంత్రణ కోసం పైరిత్రిన్స్, పైరేథ్రాయిడ్స్, డెసికాంట్స్ (బోరిక్ యాసిడ్), బయో కెమికల్ సబ్‌స్టాన్సెస్ (వేప నూనె), పైరోల్స్ నియోనికోటికోనాయిడ్స్ (నికోటిన్ సింథటిక్ రూపాలు), కీటకాల పెరుగుదల నిరోధించే మందులు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి.

ఇళ్లలో పురుగుమందుల వినియోగాన్ని తగ్గించాలంటే... ఫర్నీచర్ లేదా సీలింగ్‌లలో ఉండే పగుళ్లను మూసివేయడం, 60 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద పరుపులను శుభ్రం చేయడం లాంటివి చేయాలి.

నల్లులు పెద్ద సంఖ్యలో ఉంటే మాత్రం పురుగు మందులను తప్పనిసరిగా వినియోగించాలి. పరుపులు, ఫర్నీచర్ వంటి వాటిని పూర్తిగా తడి లేకుండా ఆరిన తర్వాతే వినియోగించాలి.

ఒకసారి నల్లులను పూర్తిగా తొలిగించాక మళ్లీ అవి రాకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా సెకండ్ హ్యాండ్ ఫర్నీచర్ కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సెకండ్ హ్యాండ్ వస్తువుల్లో దాక్కొని ఉండే ఈ నల్లులు మళ్లీ ఇళ్లంతా వ్యాపించి కొత్త ప్రదేశాల్లో వాటి జనాభాను వృద్ధి చేస్తాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)