ఆ ముగ్గురు ఆడపిల్లలను తల్లిదండ్రులే ఎందుకు చంపేశారు?

చనిపోయిన ముగ్గురిలో ఇద్దరు బాలికలు

ఫొటో సోర్స్, PRADEEP SHARMA/BBC

ఫొటో క్యాప్షన్, చనిపోయిన ముగ్గురిలో ఇద్దరు బాలికలు
    • రచయిత, ప్రదీప్ శర్మ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

పంజాబ్‌లోని జలంధర్‌లో ముగ్గురు అక్కాచెల్లెళ్ల శవాలను పోలీసులు కనుగొన్న తరువాత వీరి హత్యల వెనుక తల్లిదండ్రుల హస్తం ఉందని తెేలడంతో, వారిని అరెస్ట్ చేశారు.

కాన్పూర్ గ్రామంలోని నాలుగో వార్డులో వలస వచ్చిన ఓ కూలీ కుటుంబం నివసిస్తోంది. వీరికి ఉన్న ఐదుగురు సంతానంలో నలుగురు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నారు.

ముగ్గురు పిల్లలు తప్పిపోయారంటూ గత రాత్రి పోలీసులకు ఫిర్యాదు అందింది. కానీ మరుసటిరోజు ఉదయం ఇంటి వద్దే వీరి శవాలను కనుక్కున్నట్లు పోలీసులు చెప్పారు.

ఈ బాలికల తల్లిదండ్రులు సుశీల్ మండల్, మంజుదేవి తమ నేరాన్ని అంగీకరించారని, వీరిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు.

మృతి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లను అమృతకుమారి (9), సాక్షికుమారి (7), కంచన్ కుమారి (4)గా గుర్తించారు.

ప్రస్తుతం మృతుల తల్లిదండ్రులను అరెస్ట్ చేసి, శవాలను పోస్టుమార్టానికి పంపారు.

పోలీసులకు ఫిర్యాదు చేసిన భూ యజమాని

ఫొటో సోర్స్, PRADEEP SHARMA/BBC

ఫొటో క్యాప్షన్, పోలీసులకు ఫిర్యాదు చేసిన ఇంటి యజమాని సురీందర్ సింగ్

పిల్లలు కనిపించకపోవడంపై తండ్రి ఏమన్నాడు?

ఈ బాలికలను చంపి ఇనప్పెట్టెలో పెట్టేశాక, నిందితులు తాముంటున్న ఇంటిని ఖాళీ చేయాల్సి ఉంది.

ఈ ఇంటిని పడగొట్టి కొత్తది కట్టాలనే ఉద్దేశంతో వీరిని ఖాళీ చేయాలని ఇంటి యజమాని ఎప్పటి నుంచో అడుగుతున్నారు.

ఈ ఇంటి యజమాని సురీందర్ సింగ్ ఈ ఇంటిని కేవలం రెండు నెలల కాలానికి మాత్రమే అద్దెకు ఇచ్చినట్టు చెప్పారు. ఈ ఇంటి పరిస్థితి బాగా లేకపోవడంతో కొత్తది కట్టాలనే ఆలోచనలో ఉన్నారాయన.

పిల్లలు కనిపించడం లేదని తెలిసినప్పటి నుంచి పిల్లల తండ్రిని అడుగుతూనే ఉన్నా అతను తాగిన మత్తులో ఉన్నాడే కానీ తమకేమీ చెప్పలేదని ఆయన వివరించారు.

‘‘మేం ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశాం. పోలీసులు అర్ధరాత్రి వచ్చి మమ్మల్ని విచారించడం మొదలుపెట్టారు. అప్పుడు కూడా అతనేమీ చెప్పలేదు. కానీ తెల్లారాక తన పిల్లలను ఎవరో చంపి పెట్టెలో పెట్టి తాళం వేశారని చెప్పాడు’’ అని సురీందర్ సింగ్ తెలిపారు.

కాన్పూర్ గ్రామంలో సంచలనం రేపిన సంఘటన
ఫొటో క్యాప్షన్, కాన్పూర్ గ్రామంలో సంచలనం రేపిన సంఘటన

ఆ పిల్లలు ఇక్కడే అటూ ఇటూ తిరుగుతూ, కనిపించింది ఏరుకుని తింటూ ఉండేవారు. కొన్నిసార్లు ఎవరైనా విసిరేసిన ఆహారాన్ని కూడా తినేవారు. దీన్నిబట్టి వారి కడుపు నిండలేదని అర్థమవుతూ ఉండేదని సురీందర్ సింగ్ చెప్పారు.

‘‘ ఆదివారం రాత్రి 11 నుంచి 11.30 గంటల సమయంలో పిల్లలు తప్పిపోయినట్టుగా తెలిసింది. పోలీసు అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని కెమెరాలను పరిశీలిస్తే- పిల్లలు ఎక్కడికి వెళ్ళినట్టుగా కనిపించలేదు’’ అని రూరల్ ఎస్‌ఎస్పీ ముఖ్వీందర్ సింగ్ బుల్లార్ చెప్పారు.

‘‘వారు రాత్రంతా పిల్లల కోసం వెతికినా ఉపయోగం లేకపోయింది. ఉదయం 6.30 గంటలకు పోలీసులు మరోసారి పిల్లల ఇంటికి వెళ్ళినప్పుడు వారి శవాలు పెట్టెలో కనిపించాయి’’ అని ఆయన తెలిపారు.

నిందితులను గుర్తించినట్లు ప్రకటిస్తున్నఎస్ఎస్‌పీ

ఫొటో సోర్స్, PRADEEP SHARMA/BBC

ఫొటో క్యాప్షన్, నిందితులను గుర్తించినట్లు ప్రకటిస్తున్నఎస్ఎస్‌పీ ముఖ్విందర్ సింగ్ బుల్లర్

పోలీసులు ఎలా కనుక్కున్నారు?

‘‘దీని గురించి పిల్లల తండ్రిని ప్రశ్నించాం. బహుశా వారు ఆడుకుంటూ పెట్టెలోకి వెళ్ళి ఉంటారని చెప్పాడు. కానీ ఇరుగుపొరుగువారు అలా జరిగి ఉండకపోవచ్చనే సందేహాలు వ్యక్తం చేశారు. మేం కూడా అలాగే భావించాం’’ అని ఎస్ఎస్పీ వివరించారు.

‘‘మేము పిల్లల తల్లిదండ్రులు సుశీల్ ‌మండల్, మంజుదేవీని ప్రశ్నించినప్పుడు ఐదుగురు పిల్లలను పెంచడం కష్టంగా మారిందని, అందుకే ఆ రోజు ఉదయం 7 గంటలకు పొలాల్లో చల్లే మందును పాలల్లో కలిపి పిల్లలకు ఇచ్చామని, అది తాగాక వారు స్పృహ తప్పడంతో వారిని పెట్టెలో పెట్టి తాళం వేసి, పనికి వెళ్ళిపోయినట్టు తండ్రి అంగీకరించాడు’’ అని పోలీసులు తెలిపారు.

వీడియో క్యాప్షన్, ఈ ముగ్గురు ఆడపిల్లలను తల్లిదండ్రులే ఎందుకు చంపేశారు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)