సెక్స్ సమ్మతి వయసు తగ్గించాలా? వద్దా? లా కమిషన్ తాజా రిపోర్టులో ఏముంది?

జంట

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, అభినవ్ గోయల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

'పరస్పర అంగీకారంతో సెక్స్ చేసే వయస్సును 18 నుంచి 16 ఏళ్లకు తగ్గించాలి' అని కొంతకాలంగా డిమాండ్ వినిపిస్తోంది. ఈ అంశంపై 22వ లా కమిషన్ కేంద్ర న్యాయశాఖకు తాజాగా ఒక నివేదిక సమర్పించింది.

భారత్‌లో ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నవారు లైంగిక సంబంధం పెట్టుకుంటే, ఇరువురి సమ్మతి ఉన్నప్పటికీ అది నేరమే అవుతుంది.

ఉదాహరణకు 17 ఏళ్ల అమ్మాయి, 22 ఏళ్ల యువకుడితో ప్రేమలో పడి, ఇరువురు సమ్మతితో లైంగిక సంబంధం పెట్టుకుంటే అది యువతిపై అత్యాచారం కిందకే వస్తుంది.

2012 సంవత్సరంలో తీసుకొచ్చిన పోక్సో చట్టం ఇదే చెబుతోంది. ఈ చట్టంలో 'సమ్మతి'కి చోటు లేదు. లైంగిక హింస నుంచి మైనర్లను రక్షించడమే దీని ఉద్దేశం.

పోక్సో కింద మాత్రమే కాకుండా భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ) ప్రకారం కూడా దేశంలో ఎవరైనా 18 ఏళ్లలోపు వ్యక్తితో శారీరక సంబంధం కలిగి ఉంటే దాన్ని అత్యాచారంగా పరిగణిస్తారు.

రెండు చట్టాల్లో తేడా ఏంటంటే పోక్సోలో ఐపీసీ కంటే కఠిన నిబంధనలున్నాయి.

''ఐపీసీలో అమ్మాయికి 16 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉంటే సమ్మతి పరిగణనలోకి వస్తుంది, అయితే దానికి పోక్సోలో స్థానం లేదు'' అని సుప్రీంకోర్టు న్యాయవాది నితిన్ మెష్రామ్ చెప్పారు

పోక్సో కింద దోషులకు 20 ఏళ్ల జైలుశిక్ష నుంచి మరణశిక్ష కూడా పడే అవకాశం ఉందంటున్నారు నితిన్.

జంట

ఫొటో సోర్స్, Getty Images

ఇప్పుడెందుకు ఈ చర్చ?

సమ్మతి వయసును తగ్గించాలా? వద్దా? అనే అంశంపై 22వ లా కమిషన్ కేంద్ర న్యాయశాఖకు నివేదిక సమర్పించింది. సమ్మతి వయస్సులో ఎటువంటి మార్పు ఉండకూడదని ఈ నివేదికలో తెలిపింది.

సమ్మతి వయస్సును 18 నుంచి 16 ఏళ్లకు తగ్గించకూడదని, ఇదే జరిగితే లైంగిక వేధింపుల నుంచి రక్షించేందుకు ఉన్న చట్టాన్ని దుర్వినియోగం చేస్తారని కమిషన్ తన నివేదికలో పేర్కొంది.

కర్ణాటక హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రితురాజ్ అవస్తీ నేతృత్వంలోని కమిటీ ఈ నివేదికను న్యాయ శాఖకు సమర్పించింది. అయితే, నివేదికలో కొన్ని ముఖ్యమైన సిఫార్సులు కూడా చేసింది.

కోర్టు

ఫొటో సోర్స్, Getty Images

కోర్టుల సూచనలతో..

పోక్సో చట్టం పరిధిలో అంగీకార శృంగార సంబంధాల కేసులనూ చేర్చడంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ గత ఏడాది జరిగిన ఒక కార్యక్రమంలో ఆందోళన వ్యక్తం చేశారు.

''పోక్సో చట్టం ప్రకారం 18 ఏళ్ల లోపు వ్యక్తుల మధ్య జరిగే అన్నిరకాల లైంగిక చర్యలు (మైనర్ల మధ్య సమ్మతి ఉన్నప్పటికీ) నేరంగా పరిగణిస్తారని మీకు తెలుసు. వారి మధ్య సమ్మతి చెల్లుబాటు కాదని చట్టం చెబుతోంది'' అని చంద్రచూడ్ గుర్తుచేశారు.

“అటువంటి కేసుల్లో న్యాయమూర్తులకు క్లిష్టమైన ప్రశ్నలు ఎదురవడాన్ని చూశాను. ఈ అంశంపై మరింత ఆందోళన వ్యక్తమవుతోంది. కౌమారదశలో ఉన్నవారిపై ఆరోగ్య నిపుణులు చేసిన పరిశోధనలను దృష్టిలో ఉంచుకుని శాసన వ్యవస్థ ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి'' అని సూచించారు సీజేఐ.

అంతేకాదు 'ఏకాభిప్రాయ లైంగిక సంబంధాల వయస్సు'ను మరోసారి పరిశీలించాలని 2022 నవంబర్‌లో లా కమిషన్‌ను కర్ణాటక హైకోర్టు కోరింది.

16 ఏళ్లు పైబడిన మైనర్ బాలికలు అబ్బాయిలతో ప్రేమలో పడటం, ఇల్లు వదిలి వెళ్లిపోవడం, లైంగిక సంబంధాలు పెట్టుకోవడం వంటి కేసుల్లో పోక్సోతో పాటు ఐపీసీ నిబంధనలూ వర్తిస్తాయని వీటిని పరిగణనలోకి తీసుకోవాలని కోర్టు తెలిపింది.

బాలిక 16 ఏళ్ల కంటే ఎక్కువ వయసు ఉండి, సమ్మతితో లైంగిక సంబంధం పెట్టుకున్న కేసుల విషయంలో పోక్సో చట్టంలో సవరణలు సూచించాలని 2023 ఏప్రిల్‌లో మధ్యప్రదేశ్ హైకోర్టు లా కమిషన్‌కు విజ్ఞప్తి చేసింది.

ఇలాంటి కేసుల్లో పోక్సో కింద కనీస శిక్ష విధించాలని ఎలాంటి ఒత్తిడి చేయరాదని కోర్టు వ్యాఖ్యానించింది. దీనిద్వారా సమ్మతి నిరూపణ అయితే ఆ వ్యక్తి నిర్దోషిగా విడుదలయ్యే హక్కును పొందవచ్చు.

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

లా కమిషన్ ఏం సిఫార్సులు చేసింది?

చట్టానికి సంబంధించిన విషయాలపై సలహాలు, సూచనలు ఇవ్వడానికి, రాజ్యాంగంపై అవగాహన ఉన్న వ్యక్తులతో కమిషన్‌ను నియమిస్తుంది కేంద్ర ప్రభుత్వం. దీనిని లా కమిషన్ అంటారు .

స్వతంత్ర భారతదేశంలో ఇప్పటివరకు 22 లా కమిషన్లు ఏర్పడ్డాయి.

లైంగిక సంబంధాలలో సమ్మతి వయస్సుపై 22వ లా కమిషన్ తాజాగా పలు సిఫార్సులు చేసింది. వాటిని ప్రభుత్వం ఆమోదించవచ్చు, మార్పులు చేయవచ్చు.

ప్రస్తుతం ఉన్న బాలల రక్షణ చట్టాలు, కోర్టు తీర్పులు, బాలల దోపిడీ, అక్రమ రవాణా, వ్యభిచారం వంటి చర్యలను సమీక్షించిన తర్వాత పోక్సో చట్టంలోని సమ్మతి వయస్సును మార్చడం సరికాదని లా కమిషన్ తన నివేదికలో పేర్కొంది.

పోక్సో చట్టం ప్రకారం లైంగిక సంబంధాలకు సమ్మతి వయస్సు 18 సంవత్సరాలు ఉండి తీరాల్సిందేనని కమిషన్ స్పష్టంచేసింది.

అయితే, న్యాయస్థానాలకు న్యాయ విచక్షణాధికారం ఇవ్వాలని ఒక ముఖ్యమైన సూచన కూడా ఇచ్చింది.

అంటే 16 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తి ఏకాభిప్రాయంతో లైంగిక సంబంధం పెట్టుకుంటే POCSO కింద విధించే శిక్షను కోర్టు రద్దు చేయవచ్చు.

“లా కమిషన్ పోక్సో చట్టంలో మినహాయింపులు సూచించింది. అంటే ఒక కేసులో అమ్మాయి వయస్సు 16 నుంచి 18 ఏళ్ల మధ్య ఉండి లైంగిక సంబంధం ఏకాభిప్రాయమని రుజువైతే, కోర్టు దానిని అత్యాచారం కేటగిరీగా పరిగణించకపోవచ్చు. ఈ మినహాయింపును చట్టంలో చేర్చినట్లయితే, అటువంటి కేసుల్లో నిందితులను నిర్దోషిగా విడుదల చేసే అధికారం కోర్టుకు ఉంటుంది" అని సుప్రీంకోర్టు న్యాయవాది కామినీ జైస్వాల్ అన్నారు.

''గతంలో జువైనల్ జస్టిస్ చట్టాన్ని కూడా సవరించినట్లు న్యాయవాది చెప్పారు. ఇప్పుడు మైనర్‌కు అతను ఏం నేరం చేస్తున్నాడో అవగాహన ఉంటే, అలాంటి కేసులలో కోర్టు కేసు విచారణను జువైనల్ నుంచి పెద్దలకు మార్చవచ్చు. అటువంటి పరిస్థితిలో మైనర్ వయస్సు మారదు, కానీ సాధారణ చట్టం ప్రకారం శిక్ష విధిస్తారు'' అని తెలిపారు.

జువైనల్ జస్టిస్ యాక్ట్ మాదిరి, పోక్సో చట్టంలోనూ మినహాయింపులను పొందుపరిస్తే శిక్షను తగ్గించవచ్చని జైస్వాల్ అన్నారు.

ప్రేమికులు

ఫొటో సోర్స్, Getty Images

షరతులతో కూడిన మినహాయింపులు

లా కమిషన్ తన నివేదికలో పోక్సో చట్టంలోని సెక్షన్ 4లో కొన్ని సవరణలు సిఫార్సు చేసింది.

పిల్లలకు, నిందితులకు మధ్య వయసు వ్యత్యాసం మూడేళ్లకు మించని కేసుల్లో మాత్రమే మినహాయింపును ఉపయోగించాలని, నిందితుడికి మునుపటి నేర చరిత్ర లేనపుడే పరిశీలించాలని నివేదిక సూచించింది.

దీంతో పాటు ఇలాంటి కేసుల్లో నేరం తర్వాత నిందితుడు మంచి ప్రవర్తనతో ఉంటారు అనుకుంటేనే వర్తింపజేయాలి. నిందితుడు లేదా అతని తరపున ఎవరైనా తప్పుడు వాంగ్మూలం ఇవ్వాలని బాధిత చిన్నారిపై ఒత్తిడి చేశారని నిరూపణ అయితే మినహాయింపు ఉండకూడదు.

సంఘటన తర్వాత బాధిత వ్యక్తికి ఇబ్బందికరంగా చుట్టుపక్కల (సామాజికంగా లేదా సాంస్కృతికంగా) పరిస్థితులు మారినా లేదా వారిని అశ్లీల వస్తువుగా పరిగణించినా అప్పుడు శిక్ష మినహాయింపు ఉండకూడదు.

లైంగిక సంబంధం కారణంగా బిడ్డ పుట్టిన విషయాలను పరిగణనలోకి తీసుకోవాలని, ఇరువురు ఒకవేళ పెళ్లి చేసుకుంటే వారు సంతోషంగా ఉన్నారా? లేదా అని పరిగణించాలని కమిషన్ పేర్కొంది.

అయితే కేవలం బిడ్డ పుట్టడం, పెళ్లి అనేవి సబ్ సెక్షన్ (5) నిబంధనలకు లోబడి ఉంటాయని కమిషన్ సూచించింది.

అయితే, సమ్మతితో శృంగార వయస్సును 16 ఏళ్లకు తగ్గించకూడదన్న నిర్ణయాన్ని కొందరు వ్యతిరేకిస్తున్నారు. ఇది పిల్లల హక్కులను ఉల్లంఘిస్తుందని వారంటున్నారు.

“ఇది గిరిజన సమాజంపై అతిపెద్ద ప్రభావాన్ని చూపుతుంది. ఎందుకంటే 16 నుంచి 18 ఏళ్ల వయస్సు గల పిల్లలు 'ఏకాభిప్రాయంతో లైంగిక సంబంధం' పెట్టుకున్న కేసులు ఆయా ప్రాంతాల నుంచే ఎక్కువ నమోదవుతున్నాయి. అలాంటి వారిపై పోక్సో ప్రయోగిస్తున్నారు. గిరిజన సమాజంలో లైంగిక సంబంధాలను అంత సీరియస్‌గా పరిగణించరు'' అని సుప్రీంకోర్టు న్యాయవాది నితిన్ అంటున్నారు.

“దేశంలో అమ్మాయిల వివాహ కనీస వయస్సు 18 సంవత్సరాలుగా నిర్ణయించారు. ఒక అమ్మాయి అంతకుముందు సెక్స్ చేస్తే, అది పోక్సో కింద నేరంగా పరిగణిస్తున్నారు. అటువంటి పరిస్థితిలో ఇది హక్కుల ఉల్లంఘనే'' అన్నారు నితిన్.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)