హైదరాబాద్: నిజాం కాలంలోనే కృత్రిమ వర్షాలకు ఎందుకు ప్రయత్నించారు... అప్పుడేం జరిగింది?

హైదరాబాద్ చివరి నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ అసఫ్ జాహీ 7

ఫొటో సోర్స్, KEYSTONE/HULTON ARCHIVE/GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, హైదరాబాద్ చివరి నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ అసఫ్ జాహీ 7
    • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఈ ఏడాది జూన్‌లో ఐఐటీ కాన్పుర్ పరిశోధక బృందం ఆర్టి‌‍ఫిషియల్ రెయిన్స్ కురిపించింది. ఈ ప్రక్రియ విజయవంతం అయినట్లు ఐఐటీ కాన్పుర్ ప్రకటించింది.

ఇప్పుడంటే టెక్నాలజీ పెరిగింది కాబట్టి కృత్రిమ వర్షాలు కురిపించడం వంటివి సాధారణంగా కనిపిస్తుంటాయి.

కానీ, దాదాపు ఏడు దశాబ్దాల కిందటే హైదరాబాద్ వేదికగా కృత్రిమ వర్షాలు కురిపించే ఆలోచనలు జరిగాయని మీకు తెలుసా?

ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హయాంలో కృత్రిమ వర్షాలు కురిపించే విషయంపై మేధో మథనం జరిగినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి.

1948 డిసెంబరులో వివిధ రంగాలకు సంబంధించిన సమగ్ర సమాచార నివేదికలను హైదరాబాద్ ప్రభుత్వ వి‌‍భాగాలు విడుదల చేశాయి.

1948 సెప్టెంబరులో ఆపరేషన్ పోలో పేరిట సైనిక చర్య ద్వారా హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో కేంద్ర ప్ర‌భుత్వం కలిపింది. అదే సమయంలో నివేదికలు విడుదలయ్యాయి.

బహుశా, హైదరాబాద్ స్టేట్ పరిధిలో ఉన్న వనరులు, ఆర్థిక వ్యవ‌హారాలపై అవగాహన కోసం ఈ నివేదికలు రూపొందించి ఉండొచ్చని చరిత్ర పరిశోధకుడు, సాగునీటి రంగ నిపుణులు బీవీ సుబ్బారావు బీబీసీతో అన్నారు.

ఈ నివేదికలపై నిజాం ప్ర‌భుత్వ ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ ఆర్థిక సలహాదారు విడుదల చేసినట్లుగా ఉంది.

‘‘ద హైదరాబాద్ గవర్నమెంట్ బులిటెన్ ఆన్ ఎకనమిక్ అఫైర్స్ విత్ కాన్ఫరెన్స్ సప్లిమెంట్’’ వాల్యూమ్ నం.9 పేరిట ఒక పుస్తకం కూడా ఉంది. దీనిలో కృత్రిమ వర్షాలపై ప్రత్యేక ప్రస్తావన ఉంది.

హైదరాబాద్ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, హైదరాబాద్ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్

ఆ నివేదికలో ఏముంది?

ఆ నివేదికలో కృత్రిమ వర్షాలు సాధ్యం కాదన్నట్లుగా రాసి ఉంది.

‘‘కృత్రిమ వర్షాలు కురిపించే ప్రయత్నాలు పూర్తిగా విజయవంతం కాలేదు. ఇండియా, ఆస్ట్రేలియా, యూఎస్ఏలో కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి’’ అని బులిటెన్‌లో రాసి ఉంది.

‘‘1948 జనవరి నుంచి ఏప్రిల్ మధ్య కాలానికి సంబంధించి యూఎస్ఏకు చెందిన ఓ నివేదిక అందింది. యూఎస్ వెథర్ బ్యూరో, యూఎస్ ఎయిర్ ఫోర్స్ కృత్రిమ వర్షాలు కురిపించేందుకు కొన్ని ప్రయోగాలు చేశాయి. దీనికి సంబంధించి ఆర్థిక ప్రయోజనాలను బేరీజు వేశారు. దాదాపు 40 క్లౌడ్ సీడింగ్ ఆపరేషన్లు జరిగినట్లు తెలుస్తోంది. వీటి ఫలితాలు నిరాశాజనకంగా వచ్చాయి’’ అని బులిటెన్‌లో ఉంది.

అయితే, యూఎస్ నివేదిక ప్రకారం కృత్రిమ వర్షాలు కురిపించడానికి ఎంచుకున్న పద్ధతులు నిస్సారమైనవి.

శీతాకాలంలో ఏర్పడిన మబ్బులపై కృత్రిమ వర్షాలు కురిపించడం సాధ్యం కాదు.

ప్రస్తుతం ఒహాయో రాష్ట్రంలోని విల్మింగ్టన్‌లో వేసవిలో ఏర్పడే మబ్బులతో కృత్రిమ వర్షాలు కురిపించే ప్రయత్నాలు జరుగుతున్నాయని యూఎస్ నివేదికలో ఉన్నట్లు నిజాం ప్ర‌భుత్వ బులిటెన్‌లో ఉంది.

కృత్రిమ వర్షాలు

కృత్రిమ వర్షాలపై ప్రత్యేక సమావేశం

నిజాం ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ వేదికగా కృత్రిమ వర్షాలపై ప్రత్యేకంగా రౌండ్ టేబుల్ సమావేశం కూడా జరిగిందని చెప్పారు బీవీ సుబ్బారావు.

‘‘రౌండ్ టేబుల్ సమావేశం జరిగినట్లుగా డాక్యుమెంట్ ఒకటి ఉంది. నిజాం ప్రభుత్వ హయాంలో నీటి పారుదల వ్యవస్థపై అధ్యయనం చేస్తున్న క్రమంలో ఈ ఆసక్తికర వి‌షయం నాకు తెలిసింది. 1946 సమయంలో నిజాం ప్రభుత్వం ఆర్టిఫిఫియల్ రెయిన్స్ కురిపించడంపై చర్చించింది. ఇందుకు ఒక రౌండ్ టేబుల్ సమావేశం జరిపి, ఫ్రాన్స్ నుంచి కొందరు ఇంజినీర్లను ఆహ్వానించారు. ఇందులో హైదరాబాద్ రాష్ట్రంలో కృత్రిమ వర్షాలు కురిపించడంపై చర్చించారు’’ అని సుబ్బారావు చెప్పారు.

ఇతర దేశాల్లో ఆశించిన ప్రయోజనం కలగకపోవడంతో ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లి ఉండక పోయుండొచ్చని ఆయన బీబీసీతో అన్నారు. అందుకే 1948 నాటి నివేదికలో కృత్రిమ వర్షాలు విజయవంతం కాలేదని రాసుకొచ్చారని చెప్పారు.

కృత్రిమ వర్షాలు

ఫొటో సోర్స్, Getty Images

అసలు కృత్రిమ వర్షం ఎందుకు?

హైదరాబాద్ దక్కన్ పీఠభూమి ప్రాంతంలో ఉంది.

అప్పట్లో కర్ణాటక, మహారాష్ట్రలలోని కొన్ని ప్రాంతాలతోపాటు తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో కరవు పరిస్థితులు తీవ్రంగా ఉండేవని బీవీ సుబ్బారావు బీబీసీకి చెప్పారు.

‘‘కులీ కుతుబ్ షా సమయంలోనే గొలుసుకట్టు చెరువుల నిర్మాణం జరిగింది.

ప్రస్తుత హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ పరి‌‍ధిలో దాదాపు నాలుగువేల చెరువులు ‌ఉండాలి. అప్పట్లో నిర్మించిన గొలుసుకట్టు చెరువులు నిండాలంటే మూడు సంవత్సరాలు పడుతుందని అంచనా వేశారు. కానీ, కరవు పరిస్థితుల కారణంగా చెరువులు నిండేవి కావు. అందుకు ప్రత్యామ్నాయంగానే కృత్రిమ వర్షాల ఆలోచన ఏడో నిజాం చేసి ఉంటారు’’ అని సుబ్బారావు చెప్పారు.

కృత్రిమ వర్షాలు

ఫొటో సోర్స్, Getty Images

కృత్రిమ వర్షాలు అంటే..

వాతావరణంలో వస్తున్న మార్పులు రుతువుల గమనంపై ప్రభావం చూపుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి.

దీనివల్ల సరైన సమయంలో వర్షాలు పడక వ్యవసాయ రంగంపై ప్రతికూల ప్ర‌‍‌‍‌‍భావం చూపుతున్నాయి. ఇది కరవు పరిస్థితులకు దారి తీస్తోంది.

కృత్రిమ వర్షాలను క్లౌడ్ సీడింగ్ అని కూడా అంటారు. విమానం సాయంతో సిల్వర్ అయోడైడ్ కణాలను మేఘాలపై పడేలా చేస్తారు. దీనివల్ల మేఘాలు కరిగి వర్షిస్తాయని శాస్ర్తవేత్తలు చెబుతున్నారు.

భారతదేశంలో కృత్రిమ వర్షాలు కురిపించే ప్రక్రియ 1955లోనే మొదలైందని పుణెలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటిరియోలజీ సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ తారా ప్రభాకరన్ బీబీసీతో చెప్పారు.

‘‘ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ వర్షాలు కురిపించే విధానం 1940లోనే మొదలైంది.

అప్పటికే సిల్వర్ అయోడైడ్ వినియోగం మొదలైందని అధ్యయనాలు చెబుతున్నాయి. 1955లో దిల్లీలో రెయిన్ అండ్ క్లౌడ్ ఫిజిక్స్ సెంటర్ దిల్లీలో ఏర్పాటైంది. 1967లో క్లౌడ్ సీడింగ్ పై అధ్యయనాలు జరిగాయి. మన దేశంలో ఎన్నో ఏళ్ల నుంచి కృత్రిమ వర్షాలపై అధ్యయనాలు జరుగుతున్నాయి. అలాగే కృత్రిమ వర్షాలు కూడా కురిపించారు’’ అని తారా ప్రభాకరన్ చెప్పారు.

కృత్రిమ వర్షాలు

ఫొటో సోర్స్, Getty Images

అసలు కృత్రిమ వర్షాలు ఎలా కురుస్తాయి?

కృత్రిమ వర్షాలు కురిపించే విషయంపై శాస్త్రీయ ఆధారాలు ఉన్నప్పటికీ, సందేహాలు అంతే స్థాయిలో ఉన్నాయి.

అయితే, కృత్రిమ వర్షాలు కురిపించడం సాధ్యమే అని చెబుతున్నారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన వాతావరణ శాస్త్ర వి‌‍భాగం ఆచార్యుడు శ్రీనివాస్ పెంటకోట.

‘‘ఇప్పటికే కొన్ని కొండ ప్రాంతాల్లో నీటి ఆవిరి నుంచి నీటిని ఒడిసి పట్టే విధానాలు మనకు అందుబాటులో ఉన్నాయి. మైదాన ప్రాంతాల్లో మేఘాలపై విమానాల సాయంతో కొన్ని రసాయనాలు జల్లి వర్షాలు కురిపించవచ్చు. అదే సమయంలో బలమైన గాలులు లేకుండా చూసుకోవాలి. లేకపోతే మనం చల్లిన కెమికల్స్ మేఘాలపై కాకుండా దూరంగా పడే వీలుంటుంది’’ అని శ్రీనివాస్ పెంటకోట బీబీసీతో అన్నారు.

కృత్రిమ వర్షాలు అనేవి ఆయా రసాయనాల వల్లనే కురిసాయో.. లేదో తెలుసుకునేందుకు వర్షపునీరు తీసుకుని కెమికల్ అనాలసిస్ చేస్తే తెలిసిపోతుందని ఆయన చెప్పారు. అయితే, సిల్వర్ అయోడైడ్ వల్ల పర్యావరణానికి ఎటువంటి నష్టం ఉండదని శ్రీనివాస్ తెలిపారు.

వీడియో క్యాప్షన్, ‘నాకు లొంగిపోవటం మినహా దారి లేదు’

ఉమ్మడి ఏపీలోనూ కృత్రిమ వర్షాలు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ కృత్రిమ వర్షాలు కురిపించినట్లు అప్పటి ప్రభుత్వాలు ప్రకటించుకున్నాయి. 2004 అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మేఘ మథనం ప్రాజెక్టు చేపట్టారు.

ఈ ప్రాజెక్టు సాయంతో కృత్రిమ వర్షాల కురిపించడం ప్రధాన ఉద్దేశం.

అలాగే 1993లోనూ కోట్ల విజయభాస్కరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కృత్రిమ వర్షాలపై ఆలోచన వచ్చిందని బీవీ సుబ్బారావు చెప్పారు.

‘‘అప్పట్లో శంకర్ రావు చిన్న నీటి వనరుల పారుదల శాఖ మంత్రిగా ఉన్నారు.

నీటి నిల్వల పథకం అమలుపై అధ్యయనానికి ఆయన సారథ్యంలో కొద్దిమంది ఇంజినీర్ల బ్రందం గుజరాత్‌లోని మాండవి ప్రాంతంలో పర్యటించింది. అక్కడ వివేకానంద రూరల్ డెవలప్ మెంట్ ట్రస్టు అధ్యక్షుడు కృత్రిమ వర్షాలు కురిపించవచ్చనే సలహా ఇచ్చారు.

ఆ తర్వాత హైదరాబాద్ వచ్చాక ఒక చర్చ జరిగింది కానీ ప్రాజెక్టును ప్రభుత్వం ఆచరణలోకి తీసుకురాలేదు’’ అని ఆయన చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)