మీ నోరు కంపు కొడుతోందా? ముందు ఈ 4 అపోహలు తొలగించుకోండి

హెల్త్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, క్లౌడియా హ్యామండ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

చాలా ఏళ్ల కిందట నేను రేడియోలో పనిచేసేటప్పుడు నా సహచరులు నాకో పని అప్పగించారు. నోటి దుర్వాసనకు చికిత్స చేసే ఓ క్లినిక్‌కు వెళ్లాలి. అక్కడ నా నోటి నుంచి చెడువాసన వస్తోందేమో పరీక్షించుకుని, ఆ తర్వాత డాక్టర్‌ను ఇంటర్వ్యూ చేయాలి.

ఈ పని నాకు నిజంగానే అప్పగించారా? లేక నా సహచరులు నాకేమైనా చెప్పదలుచుకున్నారా? అని దారి పొడవునా ఒకటే ఆలోచన.

అదృష్టవశాత్తూ నా నోటి నుంచి దుర్వాసన రావడం లేదు. కానీ, నోటి దుర్వాసన అనేది ఓ సాధారణ సమస్య. దీనిపై అనేక అపోహలు ఉండటం వలన సకాలంలో చికిత్స తీసుకోలేకపోతున్నారు.

నోటిదుర్వాసన ఉన్నవారు ముందుగా ఈ నాలుగు అపోహలను పోగొట్టుకోవాలి.

హెల్త్

ఫొటో సోర్స్, Getty Images

1. నోటి దుర్వాసనను గుర్తించడం ఎలా?

నోటి దుర్వాసనను హాలిటోసిస్ అని పిలుస్తారు.

మీరు నోటి నుంచి వదిలే గాలి ద్వారా నోటి దుర్వాసన ఉందో లేదో తెలుసుకోవచ్చు. కాకపోతే దుర్వాసన ఉందో లేదో తెలుసుకోవడానికి వదిలే గాలి, మాట్లాడేటప్పుడు విడిచే గాలి సమాన స్థాయిలో ఉండకపోవడమే ఇందులోని సమస్య.

గాలి వదలడం ద్వారా నోరు దుర్వాసన వస్తుందో లేదో తెలుసుకోవాలనుకుంటే, నాలుక వెనుక భాగంలో ఏర్పడే వాయువులు ఆ సమయంలో బయటకు రాకపోవడం వలన అసలు మీకు ఈ సమస్య ఉందో లేదో కచ్చితంగా తెలియకపోవచ్చు.

మీ నోటి దుర్వాసనకు నాలుక వెనుకభాగంలో ఏర్పడే వాయువులే కారణం.

మీకు నోటి దుర్వాసన ఉందో లేదో చెప్పడానికి డాక్టర్లు కొన్ని పద్ధతులు అనుసరిస్తారు.

కేవలం ఐదు సెంటిమీటర్ల దూరంలో తమ ముందు పేషెంట్‌ను గాలి వదలమని చెబుతారు. నాలుక పై పొరలను పరీక్షించడం రెండవది. పళ్ల మధ్య ఉన్న వ్యర్థాలను దారంతో బయటకు లాగి పరీక్షించడం. రోగి లాలాజలాన్ని రాగి గిన్నెలో సేకరించి ఇంక్యూబేటర్లో 37 డిగ్రీల వద్ద ఐదు నిమిషాలపాటు వేడి చేసి పరీక్షించడం లాంటి మార్గాలు అనుసరిస్తారు.

చాలా మంది తమ నోటి నుంచి దుర్వాసన వస్తుందని అనుకుంటారు కానీ, అన్నివేళలా ఇది నిజం కాదు.

హాలిటోసిస్ బారిన ఎంతమంది పడ్డారని చెప్పడం కష్టం. కానీ, దాదాపు 22 నుంచి 50 శాతం మంది ప్రజలు ఈ సమస్యతో బాధపడుతున్నారు.

హెల్త్

ఫొటో సోర్స్, Getty Images

2. నోటి దుర్వాసన ఒంట్లో వ్యాధులకు సూచికా?

చాలా సందర్భాల్లో నోటిలో విడుదలయ్యే సల్ఫర్, ఇతర వాయువుల వల్ల దుర్వాసన వస్తుంది. హైడ్రోజనల్ సల్ఫైడ్ మీ నోరు కుళ్లిన కోడిగుడ్ల కంపు కొట్టేలా చేస్తుంది. ఈథైల్ మార్సప్టన్ అయితే చెడిపోయిన క్యాబేజీ వాసన వచ్చేలా చేస్తుంది. మానవుల మూత్రం కంపు కొట్టడానికి కూడా వాయువులే కారణం.

మీరేదైనా తిన్న తరువాత ఈ వాయువులు, బ్యాక్టరీయా నాలుక వెనుకభాగంలో పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతాయి. కానీ, ఈ దుర్వాసన తాత్కాలికమే. ఉల్లిపాయలు, వెల్లుల్లి తినడం, ధూమపానం వలన ఈ సమస్య తలెత్తవచ్చు.

దుర్వాసనకు దంత సమస్యలు, చిగుళ్ల వాపు, ఇన్ఫెక్షన్, నాలుకపై పాచి పేరుకుపోవడం అనేవి తరచూ కనిపించే కారణాలు.

నోటి చెడువాసన విషయంలో చాలా మందికి అపోహలు ఉన్నాయి. మీ మలం నుంచి చెడువాసన వస్తుంటే మీకేదో సమస్య ఉందని, తీవ్ర అనారోగ్యం ఉందని భావిస్తుంటారు.

ముక్కు,చెవి, గొంతు, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, పేగులలో ఏదో సమస్య ఉండటం వలన నోటి దుర్వాసన వస్తోందనుకుంటారు. అయితే, ఈ అవయవాలకు సంబంధించి తీవ్రమైన అనారోగ్యానికి నోటి దుర్వాసన ఒక్కటే సూచిక కాదు.

హెల్త్

ఫొటో సోర్స్, Getty Images

3. మౌత్‌వాష్‌తో దుర్వాసనను అడ్డుకోవచ్చా?

నోటి నుంచి దుర్వాసన వస్తోందని భావిస్తే చాలా మంది మౌత్‌వాష్ వాడతారు. ఇవి రకరకాల ఫ్లేవర్లలో లభిస్తుంటాయి. కానీ చాలా మంది మింట్, లేదా లవంగం రుచికి ప్రాధాన్యం ఇస్తుంటారు. మౌత్‌వాష్‌లు దుర్వాసనకు తాత్కాలికంగా తెరవేస్తాయి.

చాలా మౌత్‌వాష్‌లు నోటిదుర్వాసనకు కారణమయ్యే బాక్టీరియాలను హతమారుస్తాయి. అయితే, మౌత్‌వాష్ నిరంతరాయంగా వాడొచ్చా లేదా అనే చర్చ నడుస్తోంది. ఎందుకంటే మౌత్‌వాష్‌లలో కొద్ది మొత్తం ఆల్కహాల్‌ ఉంటుంది.

ఆల్కహాల్ శరీరంలో నీరు తగ్గిపోయేలా చేస్తుంది. శరీరం నీటిని కోల్పోతే నోటి దుర్వాసన ఇంకా పెరుగుతుంది.

నాలుకబద్దతో నాలుకను శుభ్రం చేసుకోవడం మరో పద్ధతి. అయితే ఈ పద్ధతిలో వచ్చే ఫలితాలు దీర్ఘకాలం ఉండవని యూకే సైంటిఫిక్ జర్నల్ కోహెరిన్‌లో ప్రచురితమైన సర్వే విశ్లేషించింది. ఈ పద్ధతి మీ నాలుకను దెబ్బతీయవచ్చని, నాలుకను శుభ్రం చేసుకునే సమయంలో జాగ్రత్తగా ఉండాలి.

మీరు ఏదైనా టూత్ బ్రష్ వాడుతుంటే అది మెత్తగా ఉండేలా చూసుకోండి.

హెల్త్

ఫొటో సోర్స్, Getty Images

4. నోటిలోని బ్యాక్టీరియాలన్నీ చెడ్డవేనా?

ఇదో పెద్ద అపోహ. ప్రతి మనిషి నోటిలో 100 నుంచి 200 రకాల బ్యాక్టీరియాలు భారీ సంఖ్యలో ఉంటాయి.

మనిషి శరీరంలో లక్షల సంవత్సరాల నుంచి నివసించే ఈ బ్యాక్టిరీయాలు మనిషి జీవితంలోనూ, ఆరోగ్యంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నాయి. మన నోటి నుంచి అన్నిరకాల బ్యాక్టీరియాలను తొలగించాలనుకుంటే అది మేలు కంటే కీడే ఎక్కువ చేస్తుంది.

నోటిలో మంచి బ్యాక్టిరీయాలను ఉంచి, హానికారక బ్యాక్టిరీయాలను ఎలా తొలగించాలనే విషయమై సైంటిస్టులు పరిశోధనలు చేస్తున్నారు.

దంతక్షయానికి కారణమయ్యే బాక్టీరియాలను నిర్మూలించే విషయంలో ఫేజ్ 1, 2 పరీక్షలు విజయవంతమయ్యాయి. కానీ, ప్రజలు ఆస్పత్రులలో దుర్వాసనపై పరీక్షలు చేయించుకోవడంకన్నా, ఇంటికి తీసుకువెళ్లి సొంతంగా వాడే ఉత్పత్తులపై దృష్టిసారించారు.

నోటి దుర్వాసన పోవాలంటే ఇలా చేయండి

నోటి దుర్వాసనకు సంబంధించిన నాలుగు ముఖ్యమైన అపోహల గురించి తెలుసుకున్నాం కదా. ఇక ఈ సమస్యకు పరిష్కారాలేమిటో చూద్దాం.

రోజూ రెండుసార్లు పళ్లు తోముకోవాలి. నీరు ఎక్కువగా తాగాలి. సిగరెట్‌కు, పొగాకుకు దూరంగా ఉండాలి. సమతుల ఆహారం తీసుకోవాలి.

నోటి దుర్వాసన మిమ్మల్ని బాధిస్తుంటే దంతవైద్యులను సంప్రదించండి. మీకు చిగుళ్ల వ్యాధి ఉన్నట్టుగా డాక్టర్లు చెప్పవచ్చు.

రోజంతా తరచూ మంచినీరు తాగడమనేది మిమ్మల్ని నోటి దుర్వాసనతోపాటు డీహైడ్రేషన్ నుంచి కూడా బయటపడేస్తుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)