రోజాపై బండారు వ్యాఖ్యల వివాదం: రాజకీయాల్లో మహిళలను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడాన్ని ఎలా చూడాలి?

ఫొటో సోర్స్, Facebook/Roja Selvamani
- రచయిత, శంకర్ వడిశెట్టి
- హోదా, బీబీసీ కోసం
ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆర్కే రోజా మీద తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి ఇటీవల చేసిన ‘దిగజారుడు’ వ్యాఖ్యలపై పెద్దయెత్తున చర్చ జరుగుతోంది.
"రోజా నీ బతుకు ఎవడికి తెలియదు. బ్లూ ఫిల్మ్‌లో యాక్ట్ చేసిన దానివి. అవి మా దగ్గరున్నాయి. బయటపెట్టకూడదని, ఎప్పుడూ రిలీజ్ చేయలేదు. నీ బతుకు విప్పమంటావా? రికార్డింగ్ డ్యాన్సులు, కిరాయికి డ్యాన్సులు వేసే నువ్వు అదృష్టం బాగుండి మంత్రి అయిపోతే ఇప్పుడు ఇష్టారాజ్యంగా మాట్లాడతావా" అంటూ బండారు చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అయ్యాయి.
ఈ మాటలకు రోజా కన్నీరు పెట్టుకున్నారు. రాజకీయాల్లో ఉన్న మహిళల పట్ల ఏ మాత్రం గౌరవం లేకుండా బండారు మాట్లాడారంటూ ఆమె బాధపడ్డారు.
తర్వాత బండారు మీద కేసులు నమోదయ్యాయి. గుంటూరు పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. హైకోర్టులో బండారుకు బెయిల్ వచ్చింది.
అయితే, రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు సహజమే అయినప్పటికీ మహిళల వ్యక్తిత్వాన్ని ఈ స్థాయిలో కించపరిచేలా మాట్లాడటం చర్చనీయాంశమైంది. ఇలాగైతే మహిళలు రాజకీయాల్లో రాణించడం సాధ్యమేనా, కొత్త తరం రాజకీయాల వైపు చూస్తుందా అనే ప్రశ్నలు వస్తున్నాయి.

ఫొటో సోర్స్, UGC
సినీ నటిగా కెరియర్ ప్రారంభించి ఆ తరువాత రాజకీయాల్లోకి వచ్చారు రోజా.
రాజకీయాల్లో కొనసాగుతూనే జబర్దస్త్ వంటి టీవీ షోలలో జడ్జిగా పని చేశారు.
చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నుంచి ఆమె రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2022లో ఆమె మంత్రి అయ్యారు.
బాధితుల్లో భువనేశ్వరి, రేణూదేశాయ్
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆడవాళ్లను కించపరిచేలా మాట్లాడటం, పురుష నేతలను అవమానించేందుకు వాళ్ల ఇంట్లోని ఆడవాళ్ల వ్యక్తిత్వాలను టార్గెట్ చేయడం ఇటీవల కాలంలో పెరిగింది.
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భార్య భువనేశ్వరి, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మాజీ భార్య, సినీ నటి రేణు దేశాయ్ కూడా ఇలాంటి బాధితుల్లో ఉన్నారు.
నిన్న, మొన్నటి వరకూ భువనేశ్వరి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆమె వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కొందరు వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు గతంలో వచ్చాయి. తన భార్యను అవమానించారంటూ నాడు చంద్రబాబు ప్రెస్‌మీట్‌లో ఏడ్చారు.
తన మీద వ్యక్తిగత ఆరోపణలు చేసిన వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని ఇటీవల భువనేశ్వరి అన్నారు. తాను తన భర్తకు మాత్రమే జవాబుదారీ అని, చంద్రబాబు తనను నమ్మితే చాలని ఆమె వ్యాఖ్యానించారు.
పవన్ వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేస్తూ, రేణూ దేశాయ్ పేరుని పలుమార్లు ప్రస్తావించిన సందర్భాలున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా బహిరంగ సభల్లోనే పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లను ప్రస్తావించారు.
సోషల్ మీడియాలో పవన్ ఫ్యాన్స్ కూడా ఆమెని టార్గెట్ చేసి ట్రోల్స్ చేశారు. తన బతుకు తాను బతుకుతుంటే పదేపదే పవన్ రాజకీయ వ్యవహారాల్లో తన పేరు ప్రస్తావించడం మీద గతంలో రేణూ దేశాయ్ ఆవేదన వ్యక్తంచేశారు.
మహిళలు రాజకీయాల్లో రాణించగలరా?
ప్రస్తుత ఏపీ అసెంబ్లీలో 175 మంది ఎమ్మెల్యేలకు గానూ కేవలం 14 మంది మాత్రమే మహిళా ఎమ్మెల్యేలున్నారు. వారిలో 13 మంది వైఎస్సార్సీపీ, ఒకరు టీడీపీ ఎమ్మెల్యే.
అంటే సభలో కేవలం 8 శాతం స్థానాల్లో మాత్రమే మహిళలకు అవకాశం దక్కింది. వారిలో రోజా సహా నలుగురు మంత్రులుగా ఉన్నారు.
ఉన్న కొద్దిమంది మహిళా నేతలనే టార్గెట్ చేసుకుని చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలు, దిగజారుడు ఆరోపణలు చూస్తే మహిళలు రాజకీయాల్లో రాణించడం ఎలా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
ఇలాగైతే స్త్రీలకు రాజకీయాల్లో గౌరవం ఉండదు: శాంతి, జర్నలిస్ట్
రాజకీయాల్లో విధానపరమై అంశాలకు ప్రాధాన్యం తగ్గించేసి, వ్యక్తిగత అంశాలకు ఎక్కువ సమయం కేటాయించడం సమాజానికి చేటు చేస్తుందని సీనియర్ జర్నలిస్ట్ , ఎన్ఏజే కార్యదర్శి ఓ.శాంతి అన్నారు.
"విలువలు దిగజారిపోతున్నాయని అంతా మాట్లాడుతారు. కానీ, ఎవరూ వాటిని పాటించాలనే స్పృహలో ఉండటం లేదు. అదే ఇప్పటి సమస్యలకు మూలం. మహిళల మీద బరితెగించి మాట్లాడుతున్నారు. అలా పార్టీల్లో మహిళల మీద దాడి జరుగుతున్నప్పుడు ఇతరుల నుంచి ఆశించిన ఖండన కనిపించడం లేదు. రోజాకు మద్దతుగా వైసీపీ నేతలు ఎందుకు మాట్లాడటం లేదు. టీడీపీలో కూడా బండారు దిగజారుడుతనాన్ని ఎందుకు ఖండించడం లేదు. ఇరు పక్షాలు ఎవరికి అవకాశం వస్తే వాళ్లు మహిళలను కించపరచడానికి వెనుకాడటం లేదు" అని అభిప్రాయపడ్డారు.
ఇలాంటి వ్యాఖ్యలను నియంత్రించకపోతే రాజకీయాల్లో మహిళలకు గౌరవం ఉండదని, కొత్త తరం రాజకీయాల వైపు చూడాలన్నా భయపడే స్థితి వస్తుందని బీబీసీతో శాంతి అన్నారు.

ఫొటో సోర్స్, facebook/Rojaselvamani
నాయకత్వ స్థానంలోని వారు బాధ్యతగా వ్యవహరించాలి: రమాదేవి, ఐద్వా
మహిళల పట్ల ఇష్టారాజ్యంగా వ్యాఖ్యలు చేసే వారిని నియంత్రించాల్సిన అవసరం ఉందని ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి రమాదేవి అన్నారు.
అధికార పక్షంలో ఉన్న వారి మీద చేసే విమర్శలకు ఒకలా, విపక్షంలో ఉన్న మహిళల పట్ల చేసే హీనమైన వ్యాఖ్యలకు మరోలా స్పందించడం సమంజసం కాదని ఆమె అభిప్రాయపడ్డారు.
"రాష్ట్ర మంత్రి హోదాలో ఉన్న రోజా మీద సీనియర్ నాయకుడిగా ఉన్న బండారు సత్యనారాయణ వ్యాఖ్యలు దారుణం. దుర్మార్గం. అందరూ ఖండించాలి. తగిన చర్యలు తీసుకోవాలి. అదే సమయంలో విపక్ష నేతల పట్ల అధికార పక్షంలో ఉన్న వారి తీరు కూడా సమర్థనీయం కాదు. ఏ పార్టీలో ఉన్నా మహిళా నేతల మీద దురుసుతనం నియంత్రించకపోతే తమకే నష్టం చేస్తుందన్నది తెలుసుకోవాలి. మహిళలకు రక్షణ కల్పించాల్సిన స్థాయిలో ఉన్న నాయకులే ఇలా ఉంటే ఎలా? మంత్రి హోదాలో ఉన్న మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తిస్తుంటే ఇక సామాన్యులకు ఎవరు భరోసా కల్పిస్తారు" అంటూ రమాదేవి ప్రశ్నించారు.
సోషల్ మీడియాలో రెచ్చిపోతున్న గుంపులకు అడ్డుకట్ట వేయాలని, అంతకుముందు నాయకత్వ స్థానంలో ఉన్న వారు బాధ్యతగా వ్యవహరించడం అలవర్చుకోవాలని సూచించారు.

ఫొటో సోర్స్, Instagram/rojaselvamani
నైతికంగా దెబ్బతీయడానికే: సెల్వమణి
రోజా పోరాటం చేయడానికి వెనుకాడరని, అందుకే ఫైటర్‌గా ఉన్న రోజాను నైతికంగా దెబ్బతీయడం కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ మంత్రి రోజా భర్త, సినీ దర్శకుడు సెల్వమణి వ్యాఖ్యానించారు.
"రోజా మీద ఇలాంటి వ్యాఖ్యలు మొదటిసారి కాదు. అన్నింటినీ ఎదుర్కొంటాం. రోజా ఓ ఫైటర్ కాబట్టి, ఆమెని ఎదుర్కోలేక ఇలాంటి కుయుక్తులు పన్నుతున్నారు. నిజంగా అలాంటి వీడియోలుంటే విడుదల చేయాలి. ఒట్టి మాటలు ఎందుకు? రోజా వెనుకాడే ప్రసక్తే లేదు. అలాంటి వారందరినీ ఎదుర్కొంటుంది. అందరికీ సమాధానమిస్తుంది" అని సెల్వమణి అన్నారు.

ఫొటో సోర్స్, Twitter/Anitha Vangalapudi
సోషల్ మీడియాలో ఉన్నవే చెప్పారు: వంగలపూడి అనిత
రోజా మీద బండారు సత్యనారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలను తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత సమర్థించారు. భువనేశ్వరి, బ్రాహ్మణి గురించి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలను రోజా సమర్థించారని, అప్పుడు ఏమైందని ఆమె ప్రశ్నించారు.
"బండారు సత్యనారాయణ మాటల వల్ల బ్రహ్మాండం బద్ధలయిపోయినట్టు చెబుతున్నారు. కానీ, ఆయన మాటలు సోషల్ మీడియాలో ఉన్నవే. రోజాకు మహిళల గురించి మాట్లాడే ముందు ఇంగితం ఉండాలి. అసెంబ్లీ సాక్షిగా నాపై నోటికొచ్చినట్టు మాట్లాడారు. పది రోజులు నేను ఇంటి నుంచి బయటకు రాలేకపోయా. ఆ రోజు నేను ఆడదాన్ననే సంగతి మరిచిపోయిందా? మాజీ మంత్రి పీతల సుజాత గురించి బాడీ షేమింగ్ చేయలేదా? వికృత చేష్టలు చేసిన సంగతి రోజా మరిచిపోయారా? ఈ రోజు రోజా నీతులు మాట్లాడితే కంపరంగా ఉంది" అని అనిత వ్యాఖ్యానించారు.
తమ మీద అసభ్యంగా వచ్చిన పోస్టుల మీద ఫిర్యాదు చేస్తే కనీసం కేసు కూడా నమోదు చేయని ప్రభుత్వం ఇప్పుడు స్పందించడం అధికార దుర్వినియోగానికి నిదర్శనమని అనిత విమర్శించారు.
బెయిల్ మీద బయటికొచ్చిన బండారు తను చేసిన వ్యాఖ్యల్లో తప్పులేదంటూ సమర్థించుకున్నారు.
ఇవి కూడా చదవండి
- కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలకు ఎవరు బాధ్యులు? తల్లిదండ్రులా? కోచింగ్ సెంటర్లా? – బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- నాందేడ్: ‘డాక్టర్లు లేరు, మెషీన్లు ఆగిపోయాయి.. పిల్లలు చనిపోయాక మా సంతకాలు తీసుకున్నారు’
- బంగారం కొనాలా? బంగారం బాండ్లు కొనాలా? ఏది లాభం?
- ఇందూరు సభ: ‘మీకో రహస్యం చెప్పనా’ అంటూ కేసీఆర్‌పై ప్రధాని మోదీ ఆ వ్యాఖ్యలు ఎందుకు చేశారు?
- దేవ్ రతూడి: సైకిల్‌పై పాలు అమ్మిన ఈ భారతీయుడు, చైనా సినిమాల్లో విలన్‌గా ఎలా సక్సెస్ అయ్యాడు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














