పవన్ కల్యాణ్: టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయి.. చంద్రబాబు అరెస్ట్ వెనుక బీజేపీ లేదు

టీడీపీ

ఫొటో సోర్స్, TDP

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీతో కలిసి ఎన్నికలలో పోటీ చేస్తామని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రకటించారు.

బుధవారం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన తరువాత బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు.

ఆ సందర్భంగా చంద్రబాబుపై ప్రస్తుత ప్రభుత్వం చేసిన ఆరోపణలన్నీ అవాస్తమవని, ఆయన్ను అన్యాయంగా జైలులో పెట్టారని పవన్ అన్నారు.

రాజ్యాంగాన్ని, చట్టాలను ఉల్లంఘించే ఏపీ సీఎం జగన్ పూర్తిగా అవినీతి బురదలో కూరుకుపోయి మిగతా అందరిపైనా బురద జల్లుతున్నారని పవన్ అన్నారు.

ఈ సందర్భంగా ఆయన వచ్చే ఎన్నికలలో టీడీపీ, జనసేనలు కలిసి పోటీ చేస్తాయని ప్రకటించారు.

బీజేపీతో కూడా తమతో కలిసి వచ్చే అవకాశం ఉందని చెప్పారు.

చంద్రబాబుపై అవినీతి ఆరోపణలు, అరెస్ట్ వెనుక బీజేపీ ఉందని తాను అనుకోవడం లేదని పవన్ చెప్పారు.

నారా లోకేశ్, పవన్ కల్యాణ్, బాలకృష్ణ

ఫొటో సోర్స్, janasena

‘చంద్రబాబుతో ఉన్నవి పాలసీపరమైన విభేదాలే’

చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని, ఆయనకు సంఘీభావం ప్రకటించడానికే ఇక్కడికి వచ్చానని పవన్ అన్నారు.

చంద్రబాబుకు తనకు గతంలో పాలనాపరమైన, పాలసీ పరమైన అభిప్రాయభేదాలున్నాయని, అప్పట్లో వేర్వేరుగా పోటీ చేశామని చెప్పిన పవన్ కల్యాణ్ ఇప్పుడు చంద్రబాబును అన్యాయంగా అరెస్ట్ చేసినందున మద్దతు తెలుపుతున్నానన్నారు.

2014 ఎన్నికలలో నరేంద్ర మోదీకి తాను ఎందుకు మద్దతు తెలపాల్సి వచ్చిందో ఆయన చెప్పుకొచ్చారు.

దక్షిణ భారత దేశం నుంచి మోదీకి బహిరంగంగా మద్దతు పలికింది తానేనని, అప్పుడు అంతా తనను వ్యతిరేకించారని.. కానీ, తాను ఒక నిర్ణయం తీసుకుంటే వెనక్కి వెళ్లే ప్రసక్తే ఉండదని.. చంద్రబాబు విషయంలోనూ అంతేనని, చంద్రబాబు చేసిన అభివృద్ధి, ఆయన సామర్థ్యాలపై తనకు ఎలాంటి అనుమానం లేదని.. కేవలం ప్రత్యేక హోదా విషయంలో, పాలసీల విషయంలో విభేదించానని చెప్పారు.

Nara Lokesh, Pawan Kalyan, Nandamuri Balakrishna

ఫొటో సోర్స్, janasena party

‘సంపద సృష్టించిన వ్యక్తి అవినీతి చేస్తారా’

ఎంతో సంపద సృష్టించిన వ్యక్తిని రూ. 371 కోట్ల అవినీతి ఆరోపణలు మోపడం సరికాదన్నారు.

అన్ని రాజ్యాంగాన్ని, చట్టాలను ఉల్లంఘించిన జగన్, ఈడీ కేసులున్న జగన్ ఇలా చంద్రబాబుపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు పవన్.

రాష్ట్రంలో అభివృద్ధి లేదని, మద్యపాన నిషేధం హామీ, సీపీఎస్ రద్దు వంటి హామీలన్నీ ఇచ్చి ఏ ఒక్కటీ నిలబెట్టుకోని జగన్ అవినీతికి పాల్పడుతున్నారని.. ఆయన అవినీతి బురదలో కూరుకుపోయి అందరిపై బురద చల్లాలని ప్రయత్నిస్తున్నారని పవన్ ఆరోపించారు.

తనను కూడా ఆంధ్ర సరిహద్దుల్లోకి రాగానే అడ్డుకున్నారని.. తనలాంటి వాడికే ఇన్ని ఇబ్బందులు పెడుతున్నారని.. అలాంటి గతంలో అధికారంలో ఉన్న చంద్రబాబును ఇబ్బందులు పెట్టడం వారికో లెక్క కాదన్నారు.

జగన్ చేస్తున్న దోపిడీ, బెదిరింపులు కారణంగానే తాను ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదన్న నిర్ణయానికి వచ్చానని అన్నారు.

pawan

ఫొటో సోర్స్, janasena

ఈ రోజు చంద్రబాబుకు.. రేపు మనందరికీ

‘ఈ రోజు చంద్రబాబుకు జరిగింది రేపు రాష్ట్రంలోని అందరికీ జరిగే ప్రమాదం ఉంది. రోడ్డుపై వచ్చి నిరసన తెలిపినంత మాత్రానే హత్యాయత్నం కేసులు పెడుతున్నారు’ అన్నారు.

‘చంద్రబాబు తప్పు చేసినట్లు ఆధారాలుంటే చూపించండి.. ఇది రాజకీయ ప్రతీకారం తప్ప ఇంకేమీ కాదు’ అన్నారు.

చంద్రబాబును జైలులో పెట్టడాన్ని ఖండిస్తున్నానని.. ఖండించి ఇక్కడి నుంచి వెళ్లిపోవడం లేదని.. టీడీపీ, జనసేన, భాజపా కలిసి పోటీ చేయాలన్నదే నా కోరిక అన్నారు పవన్.

అంతకుముందు పవన్ కల్యాణ్ హైదరాబాద్ నుంచి రాజమండ్రి సమీపంలోని మధురపూడి విమానాశ్రయానికి వచ్చిన అక్కడి నుంచి రోడ్డు మార్గంలో రాజమండ్రి జైలుకు వచ్చారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్,ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌ ‌ను సబ్‌స్క్రైబ్ చేయండి.)