చంద్రబాబు రిమాండ్ రిపోర్టులో ఏముంది?

చంద్రబాబునాయుడు

ఫొటో సోర్స్, UGC

    • రచయిత, బళ్ల సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కుంభకోణం ఆరోపణలపై ఏపీ సీఐడీ అరెస్టు చేసింది.

చంద్రబాబుని విజయవాడ ఏసీబీ కోర్టులో ప్రవేశ పెట్టారు.

ఇవాళ ఉదయం నుంచి ఏసీబీ కోర్టులో రెండు వర్గాలు వాదోపవాదనలు వినిపించాయి.

చంద్రబాబునాయుడిని తమకు జ్యూడిషియల్ కస్టడీకి అప్పగించాలని ఏపీ సీఐడీ పోలీసులు రిమాండ్ రిపోర్టును కోర్టులో దాఖలు చేశారు.

చంద్రబాబునాయుడు

ఫొటో సోర్స్, UGC

అసలు రిమాండ్ రిపోర్ట్ అంటే ఏమిటి

నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు, అతడు లేదా ఆమెను 24 గంటల్లోపు కోర్టులో హాజరుపర్చాలి.

కోర్టులో హాజరుపరిచిన తర్వాత వారిని జైలుకు పంపవచ్చు లేదా వారి నుంచి మరింత వివరాలను రాబట్టేందుకు మరింత విచారణ జరపాలంటూ పోలీసులు కోర్టు ముందు అభ్యర్థన పెట్టుకోవచ్చు.

నేరారోపణ ఎదుర్కొంటున్న వ్యక్తిని తమ కస్టడీకి ఇవ్వమని పోలీసులు పెట్టుకునే అభ్యర్థననే రిమాండ్ రిపోర్టు అంటారు.

ఈ రిమాండ్ రిపోర్టులో తమ దగ్గరున్న సమాచారామంతా తెలుపుతారు. అంటే నేరం ఎలా జరిగింది? ఎవరెవరి ప్రమేయం ఉంది? ప్రాథమిక ఆధారాలేంటి? ఆరోపణలు ఎదుర్కొంటోన్న వ్యక్తిని కస్టడీకి తీసుకోవడం ద్వారా ఏయే విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారు వంటి అన్ని విషయాలను రిమాండ్ రిపోర్టులో తెలుపుతారు.

చంద్రబాబునాయుడిని తమ కస్టడీకి అప్పగించాలంటూ సీఐడీ కోరుతున్న రిమాండ్ రిపోర్టులో ఏముందో చూద్దాం..

చంద్రబాబునాయుడును తమ కస్టడీకి అప్పగించాలంటూ 28 పేజీల రిమాండ్ రిపోర్టును ఏపీ సీఐడీ పోలీసులు కోర్టులో దాఖలు చేశారు.

రిమాండ్ రిపోర్టు ప్రారంభంలోనే ఏపీ మాజీ సీఎం చంద్రబాబును ఏ 37గా పేర్కొన్నామన్నారు.

కానీ, అసలు ఈ కుట్రకు సూత్రధారే ఆయన అని అర్థం వచ్చేలా రాశారు.

నేరపూరిత కుట్ర, చట్టాన్ని గౌరవించకపోవడం, మోసం, ఫోర్జరీ(నకిలీ పత్రాలు సృష్టించడం ద్వారా మోసం చేయడం), సాక్ష్యాలను మాయం చేయడం, ప్రజాసేవకుడిగా ఉంటూనే ఖజానాకు నష్టం కలిగేలా చేయడం అంటే ప్రజల డబ్బులను దుర్వినియోగం చేశారంటూ చంద్రబాబునాయుడిపై ఏపీ సీఐడీ ఆరోపణలు చేసింది.

అంతేకాక, ఈ రిమాండ్ రిపోర్టులో ఈ నేరం ఎలా జరిగిందంటూ సుదీర్ఘంగా వివరించారు.

స్కిల్ డెవలప్‌మెంట్ విషయంలో ప్రైవేట్ కంపెనీలకు, ఏపీ ప్రభుత్వానికి జరిగిన అగ్రిమెంట్ అంతా చెప్పారు.

2015 జూన్ 30న జీవో నెంబర్ 4 ద్వారా రూ.371 కోట్లను విడుదల చేయడానికి ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు.

ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన రూ.371 కోట్ల రూపాయలు దుర్వినియోగమయ్యాయని సీఐడీ పోలీసులు ప్రధానంగా ఆరోపిస్తున్నారు.

ఈ నేరాన్ని మొట్టమొదటిసారిగా గుర్తించింది డైరెక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్.

జీఎస్టీ పన్ను ఎగవేతదారుల్ని గుర్తించడం కోసం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ సంస్థ పనిచేస్తోంది.

రూ.371 కోట్లను ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చినప్పుడు, ప్రైవేట్ కంపెనీలు వేరే కంపెనీలకు బదిలీ చేసినప్పుడు జీఎస్టీ సక్రమంగా చెల్లించలేదని ఈ సంస్థ గుర్తించింది.

అప్పుడు వెంటనే డైరెక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ రాష్ట్ర ప్రభుత్వాన్ని అలర్ట్ చేయగా.. సీఐడీ ఈ కేసును విచారణకు తీసుకుందని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఇలా ఈ నేరం బయటపడింది.

నోటీసులపై సంతకం పెడుతున్న చంద్రబాబు నాయుడు

ఫొటో సోర్స్, TDP

నామినేషన్ బేసిస్‌లో డబ్బులు విడుదల

రూ.371 కోట్లను కేవలం నామినేషన్ బేసిస్‌లో ఇచ్చేశారు. అంటే కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏదైనా పని ప్రారంభించేటప్పుడు ఒక ప్రొసీజర్ ద్వారా టెండర్ వేస్తారు. పారదర్శకంగా కాంట్రాక్టర్‌ను ఎంపిక చేస్తారు.

కానీ, ఇక్కడ మాత్రం రూ.371 కోట్ల పనిని ఎలాంటి పారదర్శకత లేకుండా నామినేషన్ ప్రక్రియలో ఇచ్చేశారని వారు ఆరోపించారు.

ఈ రిమాండ్ రిపోర్టులో ఇప్పటికే ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు.

అరెస్ట్ చేసిన వారెవరంటే.. ఘంటా సుబ్బారావు, సౌమ్యాద్రి శేఖర్ బోస్, వికాస్ వినాయక్ ఖన్వెల్క్, ముకుల్ చంద్ర అగర్వాల్, శిరీష్ చంద్రకాంత్, విపిన్ శర్మ, నీలమ్ శర్మ. ఇందులో ఘంటా సుబ్బారావు మాత్రమే ప్రభుత్వంలో పనిచేశారు. తెలుగువారు. మిగిలిన వారు ఇతర ప్రాంతాలకు చెందినవారు.

ఎఫ్‌ఐఆర్‌లో ఎవరెరవరి పేర్లను చేర్చారో కూడా రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.

ఘంటా సుబ్బారావును ఈ కేసులో ఏ1గా పేర్కొన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు ఎండీ, సీఈవోగా పనిచేశారు. ఈ కేసుతో సంబంధం ఉన్న కొందరి పేర్లను రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.

వీరితో పాటు 2023 సెప్టెంబర్ 8న తారీఖునే చంద్రబాబునాయుడిని ఏ37గా అభియోగ పత్రంలో చేర్చినట్లు రిమాండ్ రిపోర్టులో చెప్పారు.

ఈ ప్రైవేట్ కంపెనీలను చంద్రబాబునాయుడికి పరిచయం చేసిన వ్యక్తి గురించి కూడా రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించారు.

ఇల్లెందుల రమేష్ అనే వ్యక్తి చంద్రబాబునాయుడికి వీరిని పరిచయం చేశారని పేర్కొన్నారు.

నోటీసులు ఇవ్వడానికి వచ్చిన అధికారులతో చంద్రబాబు

ఫొటో సోర్స్, UGC

కేబినెట్‌ను తప్పుదోవ పట్టించడం

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే ప్రతి ముఖ్యమైన ఖర్చును, ప్రతి ముఖ్యమైన కార్యక్రమాన్ని మంత్రిమండలి(కేబినెట్) ఆమోదించాల్సి ఉంటుంది.

అయితే, ఈ రెండు కంపెనీలను ఎంపిక చేసి, డబ్బులిచ్చే ప్రక్రియలో పారదర్శకంగా వ్యవహరించలేదని సీఐడీ పోలీసులు ఆరోపించారు.

అంతేకాక, వివరణాత్మకంగా ఉండే ప్రాజెక్ట్ రిపోర్టు ఇవ్వలేదని చంద్రబాబునాయుడిపై ఆరోపణలు చేశారు.

ఈ విషయాలను కేబినెట్ ముందు దాచిపెట్టారని ఆరోపించారు.

అచ్చెనాయుడు అప్పట్లో స్కిల్ డెవలప్‌మెంట్ మంత్రిగా ఉన్నారు. అచ్చెనాయుడికి కూడా ఈ వ్యవహారమంతా తెలుసన్నారు. కానీ, కేబినెట్‌కు ఏం తెలుపలేదన్నారు…

ప్రైవేట్ కంపెనీలతో ప్రభుత్వం కుదుర్చుకున్న అగ్రిమెంట్‌ జరిగిన విధానం, ప్రభుత్వం ఇచ్చిన నిబంధనలు జీవో నెంబర్ 4కి విరుద్ధంగా ఉన్నాయన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ అప్పటి ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఉన్న కే. సునీత అనే అధికారి ఈ ప్రక్రియలో డబ్బులు వెళ్లకూడదని, దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. అయితే, ఆమె అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోలేదన్నారు.

నోట్ ఫైల్స్ ధ్వంసం

అగ్రిమెంట్ చేసుకునేటప్పుడు తెలిసి ప్రభుత్వానికి నష్టం చేకూర్చేలా, ప్రభుత్వ ఖజానాను దుర్వినియోగపరిచారని సీఐడీ పోలీసులు ఆరోపించారు.

చంద్రబాబునాయుడికి తెలిసే ఈ తప్పు జరిగిందని ఏపీ సీఐడీ పోలీసులు తమ రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు.

నోటు ఫైల్స్ అనేవి ప్రధాన ఫైల్స్ నుంచి తొలగించారని కూడా ఏపీ సీఐడీ పోలీసులు ఆరోపించారు.

నోటు ఫైల్స్ అంటే ఉన్నతాధికారికి దేనిగురించైనా ప్రతిపాదన పంపినప్పుడు, దాని గురించి ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, అభ్యంతరాలు ఏంటి అనేవి దీనిలో రాస్తారు.

దీన్ని అధికారిక పరిభాషలో నోటు ఫైల్స్ అంటారు. ఈ ఫైల్ ఎలా ముందుకు వెళ్లిందనే విషయం దీనిలో ఉంటుంది.

జీఎస్టీ శాఖ పన్ను ఎగవేతలను గుర్తించిన వెంటనే ఈ నోటు ఫైల్స్‌ను మాయం చేశారని కూడా సీఐడీ పోలీసులు రిమాండ్ రిపోర్టులో ఆరోపించారు.

దీనికి సంబంధించి ప్రభుత్వం వాటాగా డబ్బులు విడుదల చేసినప్పటికీ, ఆ రెండు ప్రైవేట్ కంపెనీల 90 శాతం సహకారంపై మాత్రం అప్పటి ప్రభుత్వం ఎలాంటి ఒత్తిడి చేయలేదని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.

కావాలనే అడలేదని మరో అభియోగం.

మరో కీలకమైన ఆరోపణను కూడా సీఐడీ పోలీసులు చేశారు. ఇలా దుర్వినియోగం చేసిన డబ్బు వల్ల చివరిగా చంద్రబాబునాయుడు, తెలుగుదేశం పార్టీ లబ్ది పొందిందని రిమాండ్ రిపోర్టులో ఏపీ సీఐడీ పోలీసులు ఆరోపించారు.

చంద్రబాబునాయుడి పేరును ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ.. ఆయన ఒక్కడే ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకున్నాడు, ఆయనే దీనికి ప్రధాన సూత్రధారి అని సీఐడీ ఆరోపిస్తుందని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.

దీనికి సంబంధించిన ముఖ్యమైన సమాచారమంతా చంద్రబాబునాయుడు వద్ద ఉందని ప్రస్తావించారు. దీని ద్వారా తనకేం తెలియదని చంద్రబాబునాయుడు తప్పించుకోవడానికి వీలులేకుండా చేశారు.

నారా లోకేశ్‌ పేరు ఉన్నప్పటికీ, నేరుగా ఈ కేసుతో లింక్ చేస్తున్నట్లు రిమాండ్ రిపోర్టులో చెప్పలేదు.

నోటు ఫైల్స్ ద్వారా సాక్ష్యాలు తారుమారు చేయడం, సాక్ష్యాలు మాయం చేయడం అనే దానిపై రెండుసార్లు రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించారు. దీనిపై బెయిల్ రావడం కష్టంగా ఉంటుంది.

ఈ కేసు చాలా లోతైనది, అందుకే తాము చంద్రబాబునాయుడిని అరెస్ట్ చేశామని చెప్పారు.

చంద్రబాబునాయుడు

ఫొటో సోర్స్, TDP

అరెస్ట్ అయిన తర్వాత చంద్రబాబు ప్రవర్తన

అరెస్ట్ అయిన తర్వాత చంద్రబాబునాయుడి ప్రవర్తన అనే అంశాన్ని కూడా రిమాండ్ రిపోర్టులో వివరించారు.

అరెస్ట్ చేసినప్పుడు హెలికాప్టర్‌లో తీసుకొస్తామని చెప్పామని కానీ, ఆయన అంగీకరించకుండా రోడ్డు మార్గంలోనే వస్తానని అన్నారని తెలిపారు.

ఇలా చేయడం మధ్యలో ఆయన్ను తీసుకెళ్లకుండా టీడీపీ నేతలు అడ్డుకోవడం జరిగిందని, చట్టాన్ని గౌరవించలేదన్నారు.

చంద్రబాబునాయుడు కుట్రపూరితంగా ఇలా చేశారన్నారు. తమకు సహకరించలేదని తెలిపారు.

చంద్రబాబునాయుడిని తమకెందుకు కస్టడీకి ఇవ్వాలంటే అనే విషయాన్ని కూడా వివరించారు.

  • ఆరోపణలు ఎదుర్కొంటోన్న వ్యక్తి సహకరించడం లేదు
  • ప్రశ్నలు అడిగినప్పుడు సరైన సమాధానం చెప్పలేదు
  • కస్టడీలోనే ఉంచి ఆయన్ను విచారించినప్పుడు కొన్ని కీలక విషయాలు బయటపడతాయంటూ 17 పాయింట్ల జాబితాను వారు వివరించారు.
  • ఈ పాయింట్లలో కొంత మంది అధికారులు విషయాలు విచారించాల్సి ఉందని తెలిపారు
  • చంద్రబాబునాయుడు బ్యాంకు అకౌంట్లను, లావాదేవీలను విచారించాల్సి ఉంది
  • లోతైన సమస్య అని, లోతుగా విచారణ చేయాలన్నారు. దీని వెనుక పెద్ద కుట్ర దాగి ఉందన్నారు.
  • సేకరించిన సమాచారమంతా, సాక్ష్యాలన్నీ ఆయనకు వ్యతిరేకంగా ఉన్నాయి, కానీ ఆయన ఇప్పటికే చాలా మందిని ప్రభావితం చేయడానికి చూస్తున్నారని ఆరోపించారు.
  • ఇది పెద్ద వ్యవహారమని చెప్పారు.
  • చంద్రబాబునాయుడికి ప్రభుత్వ యంత్రాంగంతో సంబంధాలున్నాయి. దీంతో ఆయన సాక్ష్యాలను తారుమారు చేయగలరని ప్రస్తావించారు.
  • 17 పాయింట్ల దృష్ట్యా చంద్రబాబునాయుడిని తమకు కస్టడీకి అప్పగించాలని కోరారు.

దాంతో పాటు, చివరిగా చంద్రబాబునాయుడిని విచారించడం కోసం 15 రోజుల పాటు సీఆర్‌పీసీ సెక్షన్ 167 కింద తమ జ్యూడిషియల్ కస్టడీకి అప్పగించాలని అభ్యర్థించారు.

డీఎస్పీ ధనుంజయుడు ఈ రిమాండ్ పిటిషన్‌ను కోర్టులో దాఖలు చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)