హైదరాబాద్: లులు మాల్‌లో దొంగలు పడ్డారా? ఆ ట్రెండింగ్‌ వీడియోల్లో ఏముంది?

హైదరాబాద్‌లోని లులు మాల్‌

ఫొటో సోర్స్, UGC/ Lulu Group

    • రచయిత, బళ్ల సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

నాలుగు రోజులుగా హైదరాబాద్‌లో ఎవరి నోట విన్నా ఒకటే మాట.. అదే లులు మాల్. కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో కొత్తగా ప్రారంభమైన ఈ మాల్‌ని చూడటానికి వస్తోన్న జనంతో కొన్ని గంటల పాటూ ట్రాఫిక్ జామ్ అవుతుండడమే అందుకు కారణం.

మాల్ లోపల కూడా ఇసుక వేస్తే రాలనంత జనంతో కిటకిటలాడుతోంది.

ఈ మాల్ లోపలి జనం, బయటి ట్రాఫిక్ జాముల వీడియోలకు ‘‘అరే ఎవర్రా మీరంతా…’’ అంటూ యుగానికి ఒక్కడు సినిమా డైలాగును జోడించిన రీల్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ముఖ్యంగా కూకట్‌పల్లి పరిసరాల్లో మాల్ ప్రారంభమైన తరువాత రోజువారీ ప్రయాణం మునపటి కంటే దాదాపు గంట నుంచి రెండున్నర గంటల వరకూ పెరిగింది.

మాల్ కెపాసిటీకి మించి జనం వస్తుండటంతో లోపలికి వెళ్లే వాహనాలు క్రమంగా స్లో అయి మాల్ బయట వరకూ వస్తున్నాయి.

సరిగ్గా మాల్ ఎదురుగా జేఎన్టీయూ ఫ్లైఓవర్ ఉండడంతో దారి మరింత సన్నబడింది. దీంతో అక్కడ ట్రాఫిక్ సమస్య ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా దూరం వరకు కొనసాగుతోంది.

హైదరాబాద్‌లోని లులు మాల్‌లో పరిస్థితి

ఫొటో సోర్స్, Memesmalokam

ఇక మాల్ వెనుక వైపు ఉండే ఫుడ్ కోర్ట్ లైన్‌లో కూడా ట్రాఫిక్ బాగా పెరిగిపోయింది.

ఈ మాల్ ట్రాఫిక్ సమస్య ఎంత తీవ్రమైనది అంటే.. ‘‘మాల్ అక్కడే ఉంటుంది. తర్వాత అయినా వెళ్లవచ్చు. కానీ ఈ భారీ ట్రాఫిక్ జాముల వల్ల ఆసుపత్రులకు వెళ్లాల్సిన ఎమర్జెన్సీ పేషెంట్లకు ఆలస్యం అయితే ప్రాణాలు దక్కవు..’’ అంటూ కూకట్‌పల్లికి చెందిన ప్రముఖ వైద్యులు డా. ముఖర్జీ ట్వీట్ చేశారు.

కేవలం జనం కిటకిటలాడడం, ట్రాఫిక్ జామ్ అవ్వడం మాత్రమే కాదు.. మరో విషయం కూడా వెలుగులోకి వచ్చింది.

అదే మాల్ లోపల బిల్లు కట్టకుండా ఆహార పదార్థాలు తినడం. అవును, లులు హైపర్ మార్కెట్ చూడటానికి వెళ్లిన చాలా మంది అక్కడ అమ్మకం కోసం పెట్టిన పదార్థాలు తినేసి, సగం తిన్న వాటిని అక్కడే పారేసి, లేదా ఖాళీ పాకెట్లు పారేసి, ఇంకొందరు అయితే తినకుండా కేవలం పాకెట్‌లు ఓపెన్ చేసి వదిలేసి వెళ్లిపోతున్నారు.

తిని, తాగిన ఖాళీ పాకెట్లు, కూల్ డ్రింక్ సీసాలు మాల్ కిందే వదిలేస్తున్నారు. ఈ రీల్స్ కూడా బాగా వైరల్ అయ్యాయి.

లులు మాల్

ఫొటో సోర్స్, Lulu Group

అప్పట్లో ఐకియా, సుబ్బయ్య…

హైదరాబాద్‌లో కొత్త వ్యాపారాల ముందు జనం క్యూ కట్టడం ఇదే మొదటిసారి కాదు..

గతంలో 2018వ సంవత్సరంలో స్వీడన్‌కి చెందిన ఐకియా సంస్థ భారతదేశంలో తన మొట్టమొదటి స్టోర్ ప్రారంభించినప్పుడు చూడటానికి వచ్చిన వారితో ఆ సంస్థ సెల్లార్ నిండిపోయింది.

ఒక రకంగా తొక్కిసలాట లాంటి వాతావరణం ఏర్పడింది.

ఆ రోడ్డు మీద వాహనాల సంగతి చెప్పక్కర్లేదు. ఆ స్టోర్ ప్రారంభించిన సమయంలో గచ్చిబౌలి హైటెక్ సిటీ మధ్య తీవ్రమైన ట్రాఫిక్ జామ్ అయింది.

దాదాపు అదే సమయంలో హైదరాబాద్‌లో కాకినాడకు చెందిన సుబ్బయ్య హోటెల్ సంస్థ తన మొదటి బ్రాంచిని కేపీహెచ్బీలోనే ప్రారంభించింది.

గోదావరి జిల్లాల వారికి బాగా పరిచయమైన బ్రాండ్ కావడంతో అక్కడ భోజనం కోసం జనం బారులు తీరారు.

మొదటి అంతస్తు నుంచి మెట్ల మీదుగా కింద కొన్ని మీటర్ల దూరం క్యూ ఉండేది.

‘‘ఐకియాలో షాపింగ్ చేసి, సుబ్బయ్య హోటెల్‌లో భోజనం చేసి రావాలంటే రెండు మూడు రోజులు సరిపోతుందంటారా..?’’ అంటూ వాట్సాప్‌లో జోకులు వేసుకున్నారు చాలా మంది.

తాజాగా మళ్లీ ఈ లులు మాల్ ఓపెనింగ్ సందర్భంగా ఈ తరహా వాతావరణం కనిపించింది.

లులు మాల్

ఫొటో సోర్స్, Lulu Group

‘మన పరువు మనమే తీసుకుంటున్నాం’

‘‘ ఏదైనా మనోళ్లకు కొత్తొక వింత, పాత ఒక రోతలా తయారయ్యింది. ఇలాంటి మాల్ ఏమీ హైదరాబాద్‌లో ఫస్ట్ కాదు. అక్కడ దొరికే ప్రోడక్ట్స్ ఏవీ ఎక్కడా దొరకనవి కూడా కాదు. ఇటీవల అల్లు అర్జున్ థియేటర్‌ ప్రారంభం సమయంలో కూడా అంతే’’ అని బిజినెస్ అనలిస్ట్ నాగేంద్ర సాయి బీబీసీతో అన్నారు.

‘‘ఇన్‌ఫ్లూయెన్సర్స్‌ను ప్రత్యేకంగా పిలిపించి వాళ్లతో వీడియోలు చేయించడం వల్ల కూడా ఈ పరిస్థితి తలెత్తుతోంది. ఇది క్రేజ్ కాదు.. పిచ్చితనంగా మారుతోంది. మన హైదరాబాద్ పరువును మనమే తీసుకుంటున్నట్టు. ఐకియా ఓపెనింగ్ టైంలో నెల రోజుల పాటు జనాలు మరీ ఫ్రీగా ఫర్నిచర్ ఇచ్చినట్టు ఎగబడ్డారు. ఇప్పుడు లులు మాల్‌లో ఇలా తిండి దొంగల్లా వ్యవహరించడం మన పరువును మనమే తీసుకునేలా చేస్తోంది. ఒకరకంగా లూటీ చేసినట్టు చేశారు. అంత మంది క్రౌడ్ వస్తే.. ఎంత మంది ఎంప్లాయీస్ ఉన్నా ఏం చేస్తారు ? బాధ్యత మనలో ఉండాలి.

ఇప్పుడు ఈ వీడియోలు వైరల్ అవడం వల్ల మన పరువే పోతోంది. మళ్లీ మనమే ఆ వీడియోలు సర్కులేట్ చేసుకుని మురిసిపోతున్నాం.

లులు ఉదంతంతో మరోసారి మన అత్యుత్సాహం, కొత్త వాటిపై ఎడతెగని అభిమానం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.

ఇన్‌ఫ్లూయెన్సర్స్‌ పేర్లతో సంస్థలు చేసే అతి పబ్లిసిటీ కూడా ఇందుకు కారణం.

మన మాల్ కెపాసిటీ ఎంత, ఎంతవరకూ సర్వ్ చేయగలం, అంత మంది జనాలు మీద పడినప్పుడు.. ఏదైనా జరిగినా బ్యాకప్ ప్లాన్ ఉందా.. వంటివి ఆలోచించకుండా ఇలా చేయడం కూడా సంస్థల బాధ్యతారాహిత్యం. మొత్తానికి వాళ్ల అత్యాశ, ఓవర్ పబ్లిసిటీ.. మనోళ్ల అతి ఉత్సాహం ఇందుకు కారణం’’ అని నాగేంద్ర సాయి చెప్పారు.

లులు మాల్ ప్రారంభం

ఫొటో సోర్స్, Lulu Group

అసలేంటీ లులు మాల్?

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశంలోని అబుదాబి ప్రధాన కేంద్రంగా కలిగిన వ్యాపార సంస్థ లులు గ్రూప్ ఇంటర్నేషనల్.

ఎంఎ యూసఫ్ అలీ దీని వ్యవస్థాపకులు. ఈయన భారతీయుడు. కేరళకు చెందిన వ్యక్తి.

1995లో ప్రారంభం అయిన ఈ సంస్థలో సుమారు 57 వేల మంది పనిచేస్తున్నారు.

వివిధ రకాల గ్రాసరీ (కిరాణా) వస్తువులు, పండ్లు, కూరగాయలు, మాంసం.. సహా అన్నీ ఒకచోట అమ్మే హైపర్ మార్కెట్ వ్యాపారంలో ప్రపంచంలోనే పెద్ద సంస్థల్లో లులు ఒకటి.

లులు మాల్

ఫొటో సోర్స్, Lulu Group

మొత్తం 22 దేశాల్లో 255 హైపర్ మార్కెట్లు, 24 మాల్స్ ఉన్నాయి. గల్ఫ్ దేశాల్లో ప్రధానంగా ఈ సంస్థ వ్యాపారం ఎక్కువగా ఉంటుంది. ఆ దేశంలో చాలా నగరాల్లో ఉంది.

హైదరాబాద్‌లో తన మాల్‌ని సెప్టెంబరు 27న ప్రారంభించింది.

అంతకుముందు దాన్ని మంజీర మాల్‌గా పిలిచేవారు. కొంత కాలంగా మూతబడ్డ ఆ మాల్ ని లులు టేకోవర్ చేసింది.

లులు మాల్స్ లో హైపర్ మార్కెట్లే ప్రత్యేకం. ఈ మాల్ విస్తీర్ణం 5 లక్షల చదరపు అడుగులు ఉంటే అందులో 2 లక్షల చదరపు అడుగులు కేవలం హైపర్ మార్కెట్టే ఉంటుంది.

తెలంగాణలో 500 కోట్ల పెట్టుబడి పెట్టాలనుకున్న లులు అందులో భాగంగా 300 కోట్లతో ఈ మాల్ ప్రారంభించింది.

లులు మాల్

ఫొటో సోర్స్, Lulu Group

ఆంధ్రా టు తెలంగాణ

లులు గ్రూపు మొదట్లో ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో పెట్టుబడులు పెట్టాలని ప్రయత్నించింది.

సంస్థ విశాఖను వదలి ఇప్పుడు హైదరాబాద్‌లో ఈ మాల్ ప్రారంభించింది.

విశాఖపట్నంలో ఒక ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ ప్రారంభించాలని లులు గ్రూప్ గతంలో అనుకుంది. 2018 ఫిబ్రవరిలో శంకుస్థాపన జరిగింది.

ఆ సంస్థకు చంద్రబాబు హయాంలో చేసిన భూమి కేటాయింపును 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రద్దు చేసింది.

‘‘ఆ భూమిపై వివాదాలు ఉండడం, పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించడం, అలాగే లులు గ్రూప్ మాత్రమే సింగిల్ బిడ్ వేయడం వల్ల ఆ కేటాయింపు రద్దు చేశాం.

సింగిల్ బిడ్ ఉన్న టెండర్ నిబంధనలకు విరుద్ధం. ఇది మేం లులు గ్రూపుకు వ్యతిరేకంగా చేయడం లేదు. కానీ నిబంధనలకు వ్యతిరేకం కాబట్టే భూమిని రద్దుచేశాం.’’ అని అప్పట్లో మీడియాకు చెప్పారు అప్పటి పరిశ్రమల మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి.

‘‘వాళ్లు టీడీపీతో ఒప్పందం చేసుకున్నప్పుడే పని మొదలుపెట్టి ఉంటే ఈపాటికి అయిపోయేది. వాళ్లు పని మొదలుపెట్టలేదు అంటేనే సమస్య ఉన్నట్టు కదా.’’ అని కూడా వ్యాఖ్యానించారు.

‘‘అయితే తాము చట్టప్రకారమే టెండర్ ప్రక్రియలో పాల్గొన్నాం.’’ అని లులు గ్రూపు వివరణ ఇచ్చింది.

లులు మాల్

ఫొటో సోర్స్, Lulu Group

త్వరలో హైదరాబాద్‌లో 2 వేల కోట్ల పెట్టుబడితో మరో మాల్

2021 తరువాత లులు గ్రూప్ హైదరాబాద్‌‌కు వస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ప్రస్తుత మాల్ గురించి 2022లో దావోస్ తెలంగాణ మంత్రి కేటీ రామారావు, యూసఫ్ అలీ కలసి ప్రకటించారు.

త్వరలో తెలంగాణలో 500 కోట్ల పెట్టుబడి పెడతామని దావోస్ నుంచి యూసఫ్ ప్రకటించారు.

తరువాత మళ్లీ ఈ ఏడాది జూన్‌లో మంత్రి కేటీఆర్‌ని కలసినప్పుడు ఇక్కడ రూ.3,500 కోట్ల పెట్టుబడి పెడతామని ప్రకటన చేశారు ఆ సంస్థ అధిపతి యూసఫ్ అలీ.

త్వరలోనే 2 వేల కోట్లతో హైదరాబాద్‌లో ఒక డెస్టినేషన్ మాల్ కడతామని కూడా లులు గ్రూపు తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)