‘రూల్స్ రంజన్’ రివ్యూ: కిరణ్ అబ్బవరం సినిమా మిమ్మల్ని నవ్విస్తుందా, లేదా?

కిరణ్ అబ్బవరం

ఫొటో సోర్స్, YT/@TseriesTelugu

    • రచయిత, సాహితి
    • హోదా, బీబీసీ కోసం

పక్కింటి కుర్రాడి ఇమేజ్‌తో కిరణ్ అబ్బవరం చేసిన చిత్రాలు మంచి ఫలితాలను ఇచ్చాయి.

ఈ మధ్య ‘మీటర్’ అనే చిత్రంతో మాస్ ప్రయత్నం చేసి నిరాశపడ్డ కిరణ్.. మళ్లీ తనకు కలిసొచ్చిన వినోదాత్మకమైన పంథాలో ‘రూల్స్ రంజన్’ చిత్రం చేశాడు. మరి, ఈ చిత్రం ప్రేక్షకులను అలరించిందా? కిరణ్‌‌కు మరో విజయాన్ని ఇచ్చిందా?

మనోరంజన్ (కిరణ్ అబ్బవరం) ముంబయిలో సాఫ్ట్వేర్ ఉద్యోగి. తనని ఆఫీస్‌లో, అపార్ట్మెంట్‌లో అందరూ రూల్స్ రంజన్ అని పిలుస్తుంటారు. తన క్రమశిక్షణ, సమయపాలనతో వరుసగా ఉత్తమ ఉద్యోగి అవార్డులు అందుకుంటాడు.

తన ఉద్యోగ జీవితం బావున్నా వ్యక్తిగత జీవితంలో ‘రంగూ, రుచీ, వాస‌నా’ ఉండవు. అయితే, అనూహ్య ఘటనతో తనకి ప్రేమపై ఆసక్తి పుడుతుంది. జీవితంలో ఒక తోడుంటే బావుంటుందని భావిస్తాడు.

సరిగ్గా ఇదే సమయంలో కాలేజీలో చదువుకున్న రోజుల్లో తను ఇష్టపడిన అమ్మాయి సన (నేహా శెట్టి) ముంబయిలో మళ్లీ పరిచయం అవుతుంది. ఒక రోజంతా ఇద్దరూ సరదాగా గడుపుతారు. రంజన్ తన మనసులో మాట చెప్పేలోపలే సన మళ్లీ తిరుపతి వచ్చేస్తుంది.

ఈ కంగారులో క‌నీసం ఆమె నంబర్ కూడా తీసుకోలేకపోతాడు రంజన్. దీంతో తన ప్రేమని తెలియజేయడానికి తను కూడా సొంత ఊరైన తిరుపతికి ప్రయాణం అవుతాడు. తర్వాత ఏం జరిగింది ? సనని రంజన్ మళ్లీ కలిశాడా? తన ప్రేమ సంగతి చెప్పాడా?- అనేది మిగతా కథ.

కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి

ఫొటో సోర్స్, YT/@TseriesTelugu

ఫొటో క్యాప్షన్, కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి

టైటిల్ ఓకే .. కొత్తదనం ఉందా?

ప్రతి ప్రేమకథలో సామాన్యంగా కొన్ని అంశాలు ఉంటాయి. అమ్మాయి, అబ్బాయి కలవడం, ఇష్టాన్ని చెప్పుకోవడం, ఏవో అరమరికలు రావడం, విడిపోవడం, మళ్లీ కలవడం. ఎలాంటి ల‌వ్ స్టోరీ అయినా వీటి మ‌ధ్యే తిరుగుతుంది. అందులోనే ఎంత కొత్తగా చూపిస్తున్నాం.. అనేదానిపైనే ప్రేక్షకులకు ఆసక్తి కలిగే అవకాశం ఉంటుంది.

రూల్స్ రంజన్‌లో కూడా ఓ ప్రేమకథ ఉంది కానీ, అది వినోదాత్మకంగా ఉండదు. కథ పరంగా చూసుకుంటే.. రూల్స్ రంజన్‌కి బిలో యావరేజ్ మార్కులే పడతాయి. రూల్స్ రంజన్ పాత్ర కానీ, అతని సంఘర్షణతో కానీ ప్రేక్షకుడు పెద్దగా కనెక్ట్ అవ్వలేడు.

పైగా క్యారెక్టర్ పేరుని టైటిల్‌గా పెట్టినపుడు అతని క్యారెక్టర్ వలన కథలో ఎలాంటి ప్రభావం వచ్చిందనేది చాలా ముఖ్యం. కానీ, రూల్స్ రంజన్ విషయంలో ఇందులో ఎలాంటి ప్రాముఖ్యం ఉండదు. కేవ‌లం హీరోకంటూ ఓ క్యారెక్ట‌రైజేష‌న్ ఉండాల‌ని.. ఆ పాత్ర‌ని అలా డిజైన్ చేసి ఉంటారు.

రూల్స్ రంజన్ నటులు

ఫొటో సోర్స్, YT/@TseriesTelugu

కాలం చెల్లిన అడల్ట్ కామెడీ

ప్రథమార్ధం అంతా ముంబయిలో జరుగుతుంది. సన ముంబయి వచ్చేవరకూ వెన్నెల కిషోర్ చేసే అడల్ట్ కామెడీపైనే ఆధారపడ్డాడు దర్శకుడు. పైగా ఆ కామెడీ కూడా చాలా చోట్ల ఇరికించిన‌ట్టు ఉంటుంది.

వెన్నెల కిశోర్ పాత్ర అమ్మాయిలని ఇంట్లోకి తెచ్చుకోవడం, వాళ్లతో ఆడే సరసాలు .. ఇవన్నీ తెరపై చూస్తునపుడు కాలం చెల్లిన వ్యవహారంతో పాటు ‘ఫ్యామిలీ ఆడియన్స్‌’ను ఇబ్బంది పెట్టేలా అనిపిస్తాయి.

సన, రంజన్ ఒకరికొకరు పరిచయం అయిన తర్వాత వచ్చే సన్నివేశాలు కూడా అంత కొత్తగా అనిపించవు. పైగా ఇందులో మందు తాగితే అమ్మాయి స్పృహ, వివేచ‌న కోల్పోయి ఏదేదో చేస్తుందనే కోణంలో కొన్ని సీన్లు రాసుకొన్నారు. దాన్నే ఒక సంఘర్షణగా చూపించే ప్రయత్నం చేశారు. కానీ, ఇది సరిగ్గా వర్కౌట్ కాకపోగా లేనిపోని అయోమయానికి గురిచేసింది.

ఇక విరామ ఘట్టం కూడా దర్శకుడు జ్యోతి కృష్ణ గత చిత్రమైన ‘నీ మనసు నాకు తెలుసు’ ని గుర్తుకు తెస్తుంది.

కిరణ్ అబ్బవరం

ఫొటో సోర్స్, Kiran Abbavaram/twitter

పట్టాలు తప్పిన ద్వితీయార్ధం

సనను వెతుక్కుంటూ వచ్చిన రంజన్ .. ఆమెను కలిసినప్పటికే ప్రీ క్లైమాక్స్ వరకూ వచ్చేస్తుంది సినిమా. అప్పటివరకు తెరపై జరిగిన తంతు చూసిన ప్రేక్షకుడిలో ఈ కథలో విషయం లేదనే సంగతి అర్థమైపోతుంది. ముగ్గురు స్నేహితులతో చేసిన కామెడీ చాలా ‘అవుట్ డేటెడ్‌‌’గా ఉంటుంది.

సుబ్బరాజు, అజయ్ పాత్రలు కూడా ఈ కథను మార్చలేకపోయాయి. అంత మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లని తీసుకున్న దర్శకుడు వాళ్ల నుంచి నటన రాబట్టుకోలేదనిపిస్తుంది. ఇక రీయూనియన్ పేరుతో చేసిన హంగామా కూడా ఆకట్టుకోదు.

అయితే, క్లైమాక్స్ లో పెళ్లి మండపంలో జరిగిన తంతు కొన్ని సినిమాలకు పేరడీ అనిపించినప్పటికీ కొంతలో కొంత నవ్వించగలిగింది.

రూల్స్ రంజన్ నటులు

ఫొటో సోర్స్, YT/@TseriesTelugu

ఎవరి నటన ఎలా ఉంది?

ఇందులో కిరణ్ అబ్బవరం నటన చాలా సెటిల్డ్‌గా ఉంది. దర్శకుడు తనకి ఏమని చెప్పాడో కానీ, తన నటన అంతా ఒక మీటర్‌లో కొలిచినట్లుగా ఉంటుంది. డైలాగుల్లో, యాక్షన్‌లో ఎక్కడా కూడా పాత్రదాటి రాలేదు.

సన పాత్రలో నేహా శెట్టి అందంగా ఉంది. అభినయం కూడా ఓకే. సమ్మోహనుడా పాటలో గ్లామరస్‌గా కనిపించింది.

వెన్నెల కిషోర్ పాత్రలో హాస్యం ఉంది కానీ, కొంచెం అడల్ట్ టచ్ ఉంది. హైపర్ ఆది, హర్ష, సుదర్శన్ టైమింగ్ బావుంది కానీ, ఆ పాత్రలని మరీ పాతకాలంలా తీర్చిదిద్దారు. మిగతా పాత్రలు పరిధిమేర ఉన్నాయి.

డైరెక్టర్ ఏం చెప్పాలనుకొన్నాడో!

సాంకేతికంగా కూడా రూల్స్ రంజన్‌లో కొత్తదనం లేదు. కెమెరా పనితనం అంతగా ఆకట్టుకోదు.

చాలా సన్నివేశాలు సీరియల్ తరహాలో సాగుతుంటాయి.

సినిమాటిక్ లైటింగ్‌పై కాస్త దృష్టి పెట్టాల్సింది.

నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకోదు.

సమ్మోహనుడా పాట మాత్రం బావుంది.

డైలాగుల్లో ప్రాస‌లు ఎక్కువ‌య్యాయి. చాలా జోకులు పాతగా అనిపించాయి. నవ్వించకపోగా, విసిగించాయి.

ఎడిటింగ్ ఇంకాస్త పదునుగా ఉండాలి.

ద‌ర్శ‌కుడు ల‌వ్ స్టోరీని చెప్పాల‌నుకొన్నాడా? ఓ క్యారెర్ట‌ర్ ఫాలో అవుతూ క‌థ అల్లుకుందామ‌నుకొన్నాడా? అనేది స్ప‌ష్టం అవ్వ‌దు. త‌న‌కు ఏం న‌చ్చితే అది రాసుకొని, ఏదొస్తే అది తీసినట్టు అనిపిస్తుంది. పైగా ఈ జనరేషన్ ప్రేక్షకుల నాడిని పట్టుకోవడంలో పట్టు తప్పాడనే చెప్పాలి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)