మ్యాడ్ సినిమా రివ్యూ: జాతిరత్నాలు స్టయిల్లో హ్యాపీడేస్...

ఫొటో సోర్స్, Sithara Entertainments
- రచయిత, సాహితి
- హోదా, బీబీసీ కోసం
ఇవ్వాల్టి రోజుల్లో ఎవరికీ లాజిక్కులు అక్కర్లేదు. జస్ట్.. మ్యాజిక్ చేస్తే చాలు. కథలూ, స్క్రీన్ ప్లే టెక్నిక్కులూ.. లేకుండా కూడా సినిమాని జనరంజకంగా తీయొచ్చు. దానికి 'జాతిరత్నాలు' ఓ లేటెస్ట్ ఉదాహరణ.
మీకు శేఖర్ కమ్ముల 'హ్యాపీడేస్' గుర్తుందా..? 'జాతిరత్నాలు' లాంటి కాన్సెప్ట్‌ని 'హ్యాపీడేస్' సెటప్‌లో చెబితే ఎలా ఉంటుందన్న ప్రయత్నం ఈ 'మ్యాడ్' సినిమాలో కనిపించింది.
16 ఏళ్ల క్రితం వచ్చిన హ్యాపీడేస్, మొన్న వచ్చిన జాతిరత్నాలకు, ఈ సినిమాకు లింకేంటి?
అలా అలా సాగిపోయే కథ..
మనోహర్, అశోక్, దామోదర్‌ల కథ ఇది. ఇంజనీరింగ్ కాలేజీలో అడుగుపెడతారు మనోజ్ (రామ్ నితిన్), అశోక్ (నార్ని నితిన్), దామోదర్ (సంగీత్ శోభన్ ).
మనోజ్ మంచి ఫ్లటర్. అమ్మాయిల్ని ఈజీగా పడేస్తాడు. అశోకేమో కామ్ అండ్ కూల్ క్యారెక్టర్. తన పనేదో తనదే. ఇక దామోదర్ అల్లరి పిడుగు. ఈ ముగ్గురూ స్నేహితులైపోతారు. అక్కడి నుంచి రాగింగ్‌లు, కాలేజీ గొడవలు, క్యాంటీన్ కోసం కొట్లాడుకోవడాలూ, ప్రేమలూ, పరాచకాలూ మొదలైపోతాయి. ఇంజనీరింగ్ పూర్తయ్యే సరికి ఎవరు ఏమయ్యారు? ఎవరి కథ ఏ తీరానికి చేరింది? అనేది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.
'మ్యాడ్' సినిమా అంతా చూసొచ్చాక, కొన్ని సరదా సన్నివేశాలు తప్ప, కథ పెద్దగా గుర్తుండదు. దర్శకుడు కూడా కథపై పెద్దగా దృష్టి పెట్టినట్టుగా అనిపించదు. కాలేజీ స్నేహాలు, అల్లర్లు, ఆకతాయి తనం.. ఇవన్నీ కలగలిపి చూపిద్దామనుకొన్నాడు. అదే చేశాడు. లడ్డూ అనే సీనియర్ తన జూనియర్‌కి చెప్పిన కథతో ఈ సినిమా మొదలవుతుంది.

ఫొటో సోర్స్, SitharaEntertainments
మనోహర్, అశోక్, దామోదర్‌ల పరిచయం, వాళ్లు స్నేహితులుగా మారడం, క్యాంటీన్ కోసం వాలీబాల్ మ్యాచ్ ఆడడం.. ఇలా ఒకొక్క సన్నివేశం తరవాత.. మరోటి వస్తుంటాయి. హ్యాపీడేస్, హిందీలో వచ్చిన చిచోరే సినిమాల ఫార్మెట్‌ని దాదాపుగా ఫాలో అయిపోయాడు దర్శకుడు కల్యాణ్ శంకర్. కాలేజీ సీన్లు, ర్యాగింగ్ గోల, పరీక్ష హాల్ లో స్లిప్పులు పెట్టడం.. ఇవన్నీ దాదాపుగా పాత కాలేజీ కథల్ని గుర్తు చేస్తుంటాయి.
అయితే, పాత్రలు, సందర్భానుసారంగా పుట్టుకొచ్చే వినోదం మాత్రం కావల్సినంత టైంపాస్ ఇచ్చేస్తుంది. ముఖ్యంగా క్యాంటీన్ కోసం వాలీబాల్ మ్యాచ్ ఆడే ఎపిసోడ్ దాదాపుగా పది నిమిషాలు లాగాడు దర్శకుడు. ఈ పది నిమిషాల్లో నడిచే కథంటూ ఏం ఉండదు. కానీ, సరదాగా గడిచిపోతుంది.
ఈ ముగ్గురు స్నేహితులకూ మూడు ప్రేమ కథలు జోడించాడు. దాంతో ఇంకొంత సేపు బండి నడిచిపోయింది. దామోదర్ పాత్రకు ఓ అజ్ఞాత ప్రేమికురాలిని ప్రవేశపెట్టి, కాస్త సస్పెన్స్‌నూ, ఇంకాస్త వినోదాన్ని తీసుకొచ్చాడు.

ఫొటో సోర్స్, SitharaEntertainments
ఈ సినిమాలో ఆకట్టుకొనే విషయం ఏంటంటే, ఎలాంటి ఎమోషన్‌లోకైనా ఫన్‌ని తీసుకురావడం. సినిమా అంతా ఇలానే ఉంటుంది. ఆ పద్ధతి సత్ఫలితాల్ని ఇచ్చింది.
ప్రేమలో విఫలమైన ఒక స్నేహితుడి గురించి మరొకరు, 'నాలుగేళ్లుగా వాడు బాధ పడుతున్నాడు.. ' అంటే, 'నాలుగేళ్లు బాధ పడినవాడు ఇంకొక్క రోజు బాధ పడితే తప్పు లేదు. వాడి గురించి మనం రేపు ఆలోచిద్దాం. ఇప్పుడు తాగేద్దాం' అని ఓ గుటకేస్తాడు మరో మిత్రుడు. మిగిలిన వాళ్లూ 'చీర్స్' చెప్పుకొంటారు. ఇలా ఎమోషన్‌లోకి ఫన్ తెచ్చాడు దర్శకుడు.
సెకండాఫ్ కాస్త డ్రాప్ అవుతుందేమో అనుకొంటున్నప్పుడు లేడీస్ హాస్టల్ సీన్ వస్తుంది. దాంతో మళ్లీ హుషారు మొదలవుతుంది.
'హైదరాబాద్ సికింద్రాబాద్' లాంటి మంచి బీటున్న పాట కుర్రాళ్లలో ఎనర్జీ నింపుతుంది. చివరి పాట కూడా హుషారుగా సాగిపోతుంది. దామోదర్ ప్రేమకథలో వచ్చే ట్విస్టుని కూడా ఫన్నీగా మార్చుకోవడం బాగుంటుంది.
ఫన్ కోసం ఫన్

ఫొటో సోర్స్, Sithara Entertainments/FB
కొత్త మొహాలతో పాత కథ చెప్పినా కొత్తగానే అనిపిస్తుంది. ఆ ఫార్ములా `మ్యాడ్`లో వర్కవుట్ అయింది. సంగీత్ శోభన్, నార్ని నితిన్, రామ్ నితిన్ దాదాపుగా కొత్త వాళ్లే. వీళ్లపై ఎలాంటి అంచనాలూ ఉండవు. అందుకే రొటీన్ కాలేజీ కథే అయినా వర్కవుటైంది. ఈ ముగ్గురిలో సంగీత్ శోభన్‌కి ఎక్కువ మార్కులు పడతాయి. తన ఈజ్‌తో పాత్రని ఈజీగా లాక్కెళ్లిపోయాడు.
రామ్ నితిన్ చూడ్డానికి అందంగా ఉన్నాడు. తనలోనూ ఈజ్ ఉంది. డాన్సులు కూడా బాగా చేశాడు. నార్ని నితిన్ ఓకే. కొన్ని చోట్ల బిగుసుకుపోయినట్టు కనిపించాడు. హీరోయిన్లుగా నటించిన గౌరీ ప్రియ, అనంతిక, గోపికా ఉద్యాన్‌ల పాత్రలకు పెద్దగా ప్రాముఖ్యం లేదు. హీరోయిన్ల పేర్లు కూడా గుర్తుండవు. లవ్ ట్రాకులు కాస్త బాగా రాసుకుని ఉంటే, సినిమా ఇంకాస్త నిలబడేది.
రఘుబాబు ప్రిన్సిపల్ పాత్రలో ఎప్పటిలానే మెప్పించారు. లడ్డూ పాత్రలో కనిపించిన నటుడికి ఎక్కువ మార్కులు పడతాయి. అతడి పాత్ర నుంచి ఎక్కువ ఫన్ రాబట్టాడు దర్శకుడు. చిన్న చిన్న డైలాగులు కూడా బాగా పేలాయి.
కుర్రాళ్ల సినిమా
'హైదరాబాద్ సికింద్రాబాద్' పాట రావల్సిన సమయంలో వచ్చి, సినిమాని మళ్లీ జోష్‌లోకి తీసుకెళ్లింది. లవ్ సాంగ్ కూడా తెరపై చూడ్డానికి, హమ్ చేసుకోవడానికీ బాగుంది. చివరి పాటలో సంగీత దర్శకుడు భీమ్స్ ముద్ర కనిపించింది.
సినిమా అంతా రంగుల హరివిల్లులా ఉంది. మొత్తంగా ఇది కుర్రాళ్ల సినిమా. అలాగని గీత దాటి, బూతు జోకులతో కాలక్షేపం చేయలేదు. వీలైనంతలో ఆరోగ్యవంతమైన వినోదాన్నే పంచారు.
ఇవి కూడా చదవండి..
- సిక్కిం ఆకస్మిక వరదల్లో 22 మంది జవాన్లు సహా 102 మంది గల్లంతు, క్లౌడ్ బరస్ట్ అంటే ఏమిటి?
- ఏషియన్ గేమ్స్: ఈ ఫోటోను చైనా ఎందుకు సెన్సార్ చేసింది?
- పారిస్‌పై నల్లుల దండయాత్ర, భయపడిపోతున్న జనం, ఎక్కడ చూసినా నల్లులే..
- వరల్డ్ కప్ 2023: ఇండియా - పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడు? లైవ్ ఎక్కడ వస్తుంది?
- శ్రీదేవి ఉప్పు తినకపోవడం వల్లే చనిపోయారా? బోనీ కపూర్ ఏమన్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














