మహాదేవ్ బెట్టింగ్ యాప్ కథ ఏంటి... రణబీర్ కపూర్‌కు ఈడీ ఎందుకు సమన్లు జారీ చేసింది?

ఫొటో సోర్స్, GETTY IMAGES
- రచయిత, అలోక్ ప్రకాష్ మన్నెక్విన్
- హోదా, బీబీసీ కోసం
ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయం ఎదురుగా రోడ్డుకు అవతలవైపు ఫ్రూట్ జ్యూస్ విక్రయించే ఓ చిన్న దుకాణం ఉంది. దాని పేరు జ్యూస్ ఫ్యాక్టరీ.
గత కొన్ని నెలలుగా ఈ జ్యూస్ ఫ్యాక్టరీ ఓనర్ సౌరభ్ చంద్రశేఖర్ కోసం ఈడీ తీవ్రంగా వెతుకుతోంది.
సౌరభ్ చంద్రశేఖర్ వయసు 28 ఏళ్లు. కొన్నేళ్ళ కిందట భిలాయ్‌లో జ్యూస్ ఫ్యాక్టరీ పేరుతో తొలి దుకాణం తెరిచారు.
భిలాయ్‌కు చెందిన సౌరభ్ తన భాగస్వామి రవి ఉప్పల్‌తో కలిసి దుబాయ్ కేంద్రంగా ‘మహాదేవ్ గేమింగ్ బెట్టింగ్’ అనే పేరుతో ఒక ఆన్‌లైన్ గేమింగ్ యాప్‌ను నిర్వహిస్తున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
వీరి వార్షిక టర్నోవర్ 20 వేల కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని అంచనాలున్నాయి.
ఈ కేసులోనే నటుడు రణబీర్ కపూర్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ ప్రశ్నించడానికి పిలిచింది.

ఫొటో సోర్స్, ALOK PRAKASH PUTUL
ఛత్తీస్‌గఢ్ సీఎం సన్నిహితులతో పాటు వందల మందిపై విచారణ
ఈ కేసులో దేశవ్యాప్తంగా పలు నగరాలలో ఈడీ దాడులు చేసి వందల కోట్ల రూపాయల విలువైన సొత్తు స్వాధీనం చేసుకుంది.
పోలీసులతో సహా అనేకమంది అరెస్ట్ అయ్యారు.
చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ సన్నిహితులతో పాటు వందల మందిని విచారించారు.
ఈడీ విచారణ పరిధిలో పోలీసు ఉన్నతాధికారులు, ప్రభుత్వాధికారులు, సినీ పరిశ్రమలోని ప్రముఖులు, రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలు, మీడియాకు చెందిన వారితో పాటు పలు రంగాల వారు ఉన్నారు.
అయితే, మహాదేవ్ యాప్ ద్వారా సౌరభ్ ఏమీ చేయలేదని ఆయన న్యాయవాది చెప్పారు.
అతను కేవలం ఓ జ్యూస్ సెంటర్‌ను విజయవంతంగా నడిపి దాన్ని 25 జ్యూస్ సెంటర్ల దాకా విస్తరించడం నిజంగా స్ఫూర్తిదాయకమని తెలిపారు.
ఎన్నికల ఏడాదిలో తన సన్నిహితులను లక్ష్యంగా చేసుకున్నారని ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ చెప్పారు.
ఈ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గానీ, ఈడీ గానీ తీవ్రంగా పరిగణిస్తే యాప్‌ను మూసేయడానికి ఎందుకు చొరవచూపడం లేదని ప్రశ్నించారు.
యాప్‌ను మూసివేసే అధికారం కేంద్ర ప్రభుత్వ చేతుల్లోనే ఉందని ఆయన పేర్కొన్నారు.
కానీ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్‌కు ఈ యాప్ నిర్వాహకులతో సంబంధం ఉందని ప్రతిపక్ష బీజేపీ ఆరోపించింది.
ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత నారాయణ చందేల్ బీబీసీతో మాట్లాడుతూ, ‘‘ముఖ్యమంత్రికి ఈ కేసుతో సంబంధం లేకపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈడీ చర్యలపై ఆయన ఆందోళన చూస్తుంటే కచ్చితంగా ఏదో జరుగుతోందనిపిస్తోంది. అందుకే భయపడుతున్నారు. ముఖ్యమంత్రికి సంబంధం లేకపోతే ఆయన విచారణ సంస్థకు సహకరించాలి’’ అని చెప్పారు.

ఫొటో సోర్స్, ALOK PRAKASH PUTUL
ఉక్కు కర్మాగారం కారణంగా భిలాయ్ దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.
సౌరభ్ భిలాయ్‌లోని కేహెచ్ మెమోరియల్ పాఠశాలలో చదువుకున్నారు.
మున్సిపల్ కార్పొరేషన్‌లో పనిచేసే తన తండ్రి ఇచ్చిన డబ్బుతో జ్యూస్ షాపును ప్రారంభించారు.
జ్యూస్ బిజెనెస్ చేస్తూనే సౌరభ్ చంద్రశేఖర్ బెట్టింగ్ మార్కెట్‌ను విస్తరించారని భిలాయ్ పోలీసులు చెపుతున్నారు.
ఇలా స్థానికంగా కొందరి స్నేహితులతో ఈ పందేలు నిర్వహిస్తున్న క్రమంలో రెడ్డి అన్న గురించి సౌరభ్‌కు తెలిసింది.
దీని తరువాత సౌరభ్ తన మిత్రుడు రవి ఉప్పల్‌తో కలిసి ఆన్‌లైన్ బెట్టింగ్ మొదలుపెట్టారు.
రవి ఉప్పల్‌తో కలవడం వలన సౌరభ్ చంద్రశేఖర్ తన వ్యాపారాన్ని సరికొత్త ఎత్తులకు తీసుకువెళ్ళారు.
రవి ఉప్పల్ తండ్రి ఒకప్పుడు భిలాయ్ స్టీల్ కర్మాగారంలో ఉన్నతాధికారిగా పనిచేశారు.
చాలామంది స్నేహితులు ఈ వ్యాపారంలో చేరడం మొదలుపెట్టారు.
రాష్ట్రంలోని చాలామంది పోలీసులు ఈ వ్యాపారానికి వెన్నుదన్నుగా ఉండటమే కాకుండా, ఇందులో భాగస్వాములు కూడా అయ్యారు.
ఈడీ చెపుతున్న దాని ప్రకారం 2019లో సౌరభ్, రవి తమ మొత్తం వ్యాపారాన్ని దుబాయ్ నుంచి నిర్వహించడం మొదలుపెట్టారు.
ఇందుకోసం ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వందల మందికి దుబాయ్‌లో ఉద్యోగాలు ఇచ్చారు.

ఫొటో సోర్స్, ALOK PRAKASH PUTUL
క్రికెట్ నుంచి ఎన్నికల దాకా పందేలు కాయచ్చు
కొన్ని నెలల్లోనే 12 లక్షల మంది బుక్‌మేకర్స్ ‘మహదేవ్ బుక్’లో చేరారు.
వీరిలో ఎక్కువ భాగం ఛత్తీస్‌గఢ్‌కు చెందినవారే.
ఈ వ్యాపార విస్తరణలో సోషల్ మీడియా ప్రధాన పాత్ర పోషించింది.
ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలలో దీని ద్వారా కస్టమర్లు ఏర్పడ్డారు.
ఛత్తీస్‌గఢ్‌లో అనేకమంది ఈ యాప్ ఐడీ, పాస్‌వర్డ్ అమ్మడంలో పాలుపంచుకున్నారు.
ఈ ఐడీ, పాస్‌వర్డ్‌తో క్రికెట్ నుంచి ఎన్నికల దాకా పందేలు కాయచ్చు.
ఈ వ్యవహారాలన్నీ వేలాది బ్యాంకు ఖాతాల ద్వారా నడిచేవి.
2020 కరోనా సమయంలో పగటి పూట రెండింతలు జరిగే మహాదేవ్ యాప్ వ్యాపారం రాత్రివేళ నాలుగింతలయ్యేదని ఒక పోలీసు అధికారి చెప్పారు.
ప్రేక్షకులు లేకుండా ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లు జరిగినప్పుడు రెండు వేల కోట్లకు పైగా మహాదేవ్ యాప్ ద్వారా పందాలు నడిచాయి.
ఈ వ్యాపారం ద్వారా సంపాదించిన లాభాలతో కొన్ని సినిమాల్లో పెట్టుబడులు కూడా పెట్టారు.
బాలీవుడ్‌లోని ఓ ప్రముఖ నృత్య దర్శకుడు నటించిన సినిమాలో సౌరభ్ సోదరుడు పెట్టుబడి పెట్టాడు.
దీంతోపాటు హోటల్ వ్యాపారంలోనూ కొన్ని కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు.
ఓ ఉన్నతాధికారి బీబీసీతో మాట్లాడుతూ ‘‘2020 ఫిబ్రవరిలో ఆదాయపు పన్ను శాఖాధికారులు ఛత్తీస్‌గఢ్‌లో ప్రభుత్వాధికారులు, రాజకీయ నాయకుల నివాసాలపై దాడుల చేసినప్పుడు ఈ మహాదేవ్ యాప్ విషయం వెలుగులోకి వచ్చింది.
దుబాయ్‌లో హై ప్రొఫైల్ పార్టీలు, చత్తీస్‌గఢ్ నుంచి చాలా మంది ప్రజలు వీరి దగ్గరకు వెళ్ళడం మొదలుపెట్టడం ఈడీ దృష్టిలో పడింది.
ఈ యాప్ విషయంలో ఈడీ విచారణ మొదలుపెట్టగానే చత్తీస్‌గఢ్ పోలీసులు కూడా చర్యలు తీసుకోవడం మొదలుపెట్టారు. పెద్ద సంఖ్యలో అరెస్ట్‌లు జరిగాయి’’ అని చెప్పారు.
మహాదేవ్ యాప్‌పై చర్యలు తీసుకోవడం ఒక పక్క సాగుతుంటే... మరోపక్క ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్ ఆడకూదంటూ పోలీసులు హెచ్చరికలు, పోలీసులు అరెస్ట్ చేసిన ఏజెంట్ల గురించిన వార్తలతో పాటు ఈ యాప్‌కు సంబంధించిన ప్రకటనలు పత్రికలలో ప్రచురితమయ్యాయి.
సౌరభ్, రవితో సంబంధం ఉన్నవారు మహాదేవ్ యాప్ గురించి సమాచారం ఇస్తుంటే.. మరో పక్క పోలీసుల నుంచి కాపాడతామంటూ ఈ యాప్ నిర్వాహకుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేశారు.
ఈ క్రమంలో సౌరభ్ చంద్రశేఖర్, రవి ఉప్పల్ కుటుంబ సభ్యులు మెల్లగా భారత్ నుంచి దుబాయ్‌కు జారుకున్నారు.

ఫొటో సోర్స్, ALOK PRAKASH PUTUL
పెళ్లి, బాలీవుడ్, హవాలా...
ఈ ఏడాది ఆగస్టులో మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఛత్తీస్‌గఢ్ పోలీసు అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ చంద్ర భూషణ్ వర్మ, సతీష్ చంద్రశేఖర్, హవాలా ఆపరేటర్లు అనిల్ దమ్మని, సునీల్ దమ్మనిని అరెస్ట్ చేసిన తర్వాత మహాదేవ్ యాప్ గురించి కేసులను ఈడీ చెప్పుకొచ్చింది.
దీని తరువాత కిందటి నెల 15వ తేదీన ఇచ్చిన ప్రకటనలో కోల్‌కతా, భోపాల్, ముంబాయి, తదితర 39 నగరాలలో దాడులు చేసి 417 కోట్ల రూపాయల నగదు, సొత్తు, ఇతర ఆధారాలు సీజ్ చేసినట్టు పేర్కొంది.
మహాదేవ్ ఆన్‌లైన్ బుక్‌ను సౌరభ్ చంద్రశేఖర్, రవి ఉప్పల్ కలిసి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని కేంద్ర కార్యాలయం నుంచి, తమకు తెలిసిన వారికి 70:30 శాతం నిష్పత్తిలో లాభాలు పంచుకునేలా ఫ్రాంచైజ్‌లు నడిపారని ఈడీ చెపుతోంది.
విదేశీ ఖాతాలకు బెట్టింగ్ డబ్బు మళ్ళించేందుకు పెద్ద ఎత్తున హవాలా కార్యకలాపాలు సాగాయని ఈడీ చెపుతోంది.
దీంతో పాటుగా బెట్టింగ్ వెబ్‌సైట్స్‌లో ప్రకటనల కోసం భారీ ఎత్తున నగదు ఖర్చు చేశారు.
యూఏఈలో సౌరభ్ చంద్రశేఖర్, రవి ఉప్పల్ తమ కోసం ఏకంగా ఒక సామ్రాజ్యాన్నే నిర్మించుకున్నారని ఈడీ తన ప్రకటనలో పేర్కొంది.
హఠాత్తుగా వారి అక్రమార్జన బట్టబయలైంది.
సౌరభ్ చంద్రశేఖర్ రాస్ అల్ ఖైమాను 2023 ఫిబ్రవరిలో యూఏఈలో పెళ్లాడారు.
పెళ్ళి వేడుకల కోసం మహాదేవ్ యాప్ ప్రమోటర్లు దాదాపు 200 కోట్ల రూపాయలను నగదు రూపంలో ఖర్చుచేశారని ఈడీ తెలిపింది.
నాగపూర్ నుంచి కుటుంబ సభ్యులను యూఏఈకి తీసుకువెళ్ళడానికి ప్రైవేటు జెట్లు వినియోగించారు.
పెద్ద పెద్ద సెలబ్రిటీలను పెళ్లికి పిలిచారు. డాన్సర్లను, పెళ్ళి మండపాన్ని అలంకరించేవారిని ముంబయి నుంచి పిలిచారు.
వీరందరికీ డబ్బు చెల్లించేందుకు హవాలా కాంటాక్టులను వినియోగించుకున్నారనే ఆరోపణలున్నాయి.
ఈ కేసులో హవాలా మార్గంలో 112 కోట్ల రూపాయలను యూఏఈ దిర్హామ్స్ రూపంలో ఆర్-1 ఈవెంట్స్ ప్రైవేటు లిమిటెడ్ ఆఫ్ యోగేష్ పాపట్‌కు బదిలీ చేసినట్టు, హోటల్ బుకింగ్ పేమెంట్స్ కింద 42 కోట్ల రూపాయలు చెల్లించారని ఈడీ పేర్కొంది.
పాపట్‌తో పాటు మిథిలేష్, ఇతర నిర్వాహకుల గురించి వెతుకుతున్నామని, 112 కోట్ల రూపాయలకు హవాలా చెల్లింపుల గురించి ఆధారాలు సేకరించాలని ఈడీ తెలిపింది.
మరోపక్క యోగేష్ పాపట్‌కు చెందిన లెక్కలు లేని 2.37 కోట్ల రూపాయల సొమ్మును రికవరీ చేశారు.

ఫొటో సోర్స్, ALOK PRAKASH PUTUL
మహదేవ్ యాప్‌తో ప్రముఖులకు సంబంధం
సౌరభ్ చంద్రశేఖర్, రవి ఉప్పల్‌కు చెందిన ఈ పందేల వ్యాపారాన్ని అనేకమంది ప్రముఖులు సమర్థించారని, ఇందుకు గాను వీరందరికీ పెద్ద మొత్తంలో అనేక అనుమానాస్పద లావాదేవీల ద్వారా సొమ్ము ముట్టిందని ఈడీ ఆరోపిస్తోంది.
ఈ డబ్బంతా ఆన్‌లైన్ బెట్టింగ్ ద్వారా పొందినదే అని పేర్కొంది.
భోపాల్‌కు చెందిన ధీరజ్ అహుజా, విశాల్ అహుజాల రాపిడ్ ట్రావెల్స్‌లో ఈడీ సోదాలు జరిపింది.
ఈ కంపెనీ మహదేవ్ యాప్ ప్రమోటర్లకు, వారి కుటుంబ సభ్యులకు, బిజినెస్ సహచరులతో పాటు ఫెయిర్ ప్లే.కామ్‌ను సందర్శించే పలువురు ప్రసిద్ధ వ్యక్తులకు టిక్కెట్లు బుక్ చేస్తుంటుంది.
అన్నా యాప్, మహదేవ్ యాప్ లాంటి బెట్టింగ్ వెబ్ సైట్లకు రెడ్డి మద్దతు పలుకుతుంటాడు.
మహదేవ్ యాప్‌కు సంబంధించిన మొత్తం హవాలా వ్యవహారాలను కోల్‌కతాకు చెందిన వికాస్ చపారియా నిర్వహిస్తుంటాడని ఈడీ పేర్కొంది.
ఇంకా ఈ వ్యవహారంలో ఎవరెవరి ప్రమేయం ఉందో కనుగొనాల్సి ఉందని విచారణ సంస్థ చెప్పింది.
ఈడీ చపారియా ప్రాంతాలను, ఆయన అసోసియేటర్లను సెర్చ్ చేయడం మొదలుపెట్టాకా, టెక్ ప్రో ఐటీ సొల్యూషన్స్ ఎల్‌ఎల్‌సీ, పర్ఫెక్ట్ ప్లాన్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఎల్ఎల్‌పి, ఎగ్జిమ్ జనరల్ ట్రేడింగ్ ఎఫ్‌జెడ్‌కో వంటి ఇతని కంపెనీలు భారతీయ స్టాక్ మార్కెట్‌లో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టినట్టు ఈడీ గుర్తించింది.
చత్తీస్‌గఢ్‌లో ఈ అతిపెద్ద ఆన్‌లైన్ నేరంపై విచారణ ఎలా ఉన్నా భిలాయ్ నుంచి రాయ్‌పూర్ దాకా అనేక వదంతులు వినిపిస్తూనే ఉన్నాయి.
ఒకరోజు ఒక చురుకైన ఐపీఎస్ అధికారి ఈ కేసులో అరెస్టయ్యారని, మరొక రోజు ఈ వ్యాపారంలో భాగస్వామి అయ్యేందుకు గాను సింగపూర్‌కు వెళ్ళేందుకు సిద్ధపడిన ఎమ్మెల్యే సోదరుడిని అరెస్ట్ చేశారని ఇలా రకరకాల వదంతులు పుడుతున్నాయి.
ఇక సౌరభ్ చంద్రశేఖర్‌ను, రవి ఉప్పల్, వారి కుటుంబసభ్యులను చూశామని చెప్పేవారి సంఖ్యకైతే కొదవేలేదు.
ఈ కేసులోని అనేకమందికి వ్యతిరేకంగా కచ్చితమైన ఆధారాలు ఈడీతో పాటు పోలీసుల దగ్గర ఉన్నాయని భిలాయ్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త చెప్పారు.
వారెవరన్నది చూడాలనే ఆసక్తి అందరికీ ఉంది.
చాలా సందర్భాలలో ఈ కేసులో చర్యలు తీసుకోవడం ఎవరికీ ఇష్టం ఉన్నట్టుగా కనిపించదు. కేవలం ఈ అంశాన్ని ఫైల్స్ లోనూ, వార్తలలోనూ కొంత కాలం నాన్చుతారు. తర్వాత అంతా సద్దుమణుగుతుందని అంటున్నారు.
ఇవి కూడా చదవండి:
- సిక్కిం ఆకస్మిక వరదల్లో 22 మంది జవాన్లు సహా 102 మంది గల్లంతు, క్లౌడ్ బరస్ట్ అంటే ఏమిటి?
- ఏషియన్ గేమ్స్: ఈ ఫోటోను చైనా ఎందుకు సెన్సార్ చేసింది?
- పారిస్‌పై నల్లుల దండయాత్ర, భయపడిపోతున్న జనం, ఎక్కడ చూసినా నల్లులే..
- వరల్డ్ కప్ 2023: ఇండియా - పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడు? లైవ్ ఎక్కడ వస్తుంది?
- శ్రీదేవి ఉప్పు తినకపోవడం వల్లే చనిపోయారా? బోనీ కపూర్ ఏమన్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














