రమేశ్ బిధూరీ: పార్లమెంట్ గౌరవం, మర్యాదలు అలంకారప్రాయమేనా?- అభిప్రాయం

ఫొటో సోర్స్, ANI
- రచయిత, అనిల్ జైన్
- హోదా, సీనియర్ జర్నలిస్ట్, బీబీసీ కోసం
"ఒక దేశపు రోడ్లు మౌనంగా, నిర్జనంగా ఉన్నాయంటే, ఆ దేశ పార్లమెంటు వికృతంగా, అరాచకంగా మారుతుంది."
సోషలిస్టు, కమ్యూనిస్టు పార్టీల జెండాలు వీధుల్లో రెపరెపలాడుతూ కాంగ్రెస్ వ్యతిరేక ప్రజాఉద్యమాలు జరుగుతున్న తరుణంలో వీధులకూ, పార్లమెంటుకూ మధ్య ఉన్న పరస్పర సంబంధాలపై డాక్టర్ రామ్ మనోహర్ లోహియా చేసిన వ్యాఖ్య ఇది. అప్పట్లో ప్రజల నినాదాలు దేశపు పార్లమెంటులో ప్రతిధ్వనించాయి కూడా.
దాదాపు ఆరు దశాబ్దాల కిందట లోహియా చేసిన ఈ హెచ్చరిక గత కొన్నేళ్లుగా నిత్యం నిజమవుతూనే ఉంది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం 'అమృత' కాలంలో, సెప్టెంబర్ 21న పార్లమెంటు ప్రత్యేక సమావేశాల సందర్భంగా ఈ విషయం కొత్త రూపంలో వెలుగులోకి వచ్చింది.
పార్లమెంటు ప్రత్యేక సమావేశాల ప్రారంభానికి ముందు, ఈ సెషన్ వ్యవధి తక్కువగా ఉంటుందని, కానీ చరిత్రాత్మక నిర్ణయాలు జరుగుతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.
కోట్లాది రూపాయల వ్యయంతో నాలుగు రోజుల పాటు సాగిన ప్రత్యేక సెషన్‌లో రెండు చరిత్రాత్మక ఘటనలు జరిగాయి. ఒకటి అపూర్వమైనదైతే, రెండోది అనూహ్యమైనది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
పార్లమెంటు కార్యకలాపాల సమయంలో, సభ్యులు తీవ్ర ఆరోపణలు చేసుకోవడం, కొన్నిసార్లు దూషించుకునే వరకు వెళ్లడం సర్వసాధారణం. అలాంటి సమయంలో స్పీకర్ వారిని హెచ్చరిస్తూనే ఉంటారు. అభ్యంతరకరమైన పదాలు తొలగిస్తారు. కొన్నిసార్లు బహిష్కరిస్తారు కూడా.
ఆ సభ్యుడి లేదా సభ్యురాలి ప్రవర్తనను సభలోని వారంతా ఖండిస్తారు లేదా విచారం వ్యక్తం చేస్తారు.
కొన్ని సందర్భాల్లో, స్పీకర్ అటువంటి సభ్యులను కొన్ని రోజులు లేదా మొత్తం సెషన్ నుండి సస్పెండ్ చేసే చర్యలు కూడా తీసుకున్నారు. అయితే సెప్టెంబర్ 21న లోక్‌సభలో జరిగిన ఘటనను భారత పార్లమెంటుతోపాటు దేశం మొత్తం మొదటిసారిగా చూసింది.
చంద్రయాన్-3 విజయంపై చర్చ సందర్భంగా, దక్షిణ దిల్లీ నుంచి ఎన్నికైన బీజేపీ ఎంపీ రమేశ్ బిధూరి, అమ్రోహా నుంచి ఎన్నికైన బహుజన్ సమాజ్ పార్టీ ఎంపీ కున్వర్ డానిష్ అలీపై తీవ్రమైన పదాలతో విమర్శలు చేశారు. డానిష్ అలీ పట్ల అసభ్యకరమైన పదజాలం ఉపయోగించడమే కాక, సభ నుంచి బయటకు వస్తే నీ అంతు చూస్తానంటూ బెదిరించారు.

ఫొటో సోర్స్, ANI
డాక్టర్ హర్షవర్ధన్, రవిశంకర్‌లపై విమర్శలు
రమేశ్ బిధూరి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్న సమయంలో సభకు అధ్యక్షత వహించిన స్పీకర్ కొడికున్నిల్ సురేష్ ఆయనను ఆపడానికి ప్రయత్నించారు. కానీ, బిధూరి ఎక్కడా వెనక్కు తగ్గలేదు. డానిష్ అలీపై విమర్శలు చేస్తూనే ఉన్నారు.
ఆశ్చర్యంగా, బిధూరి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటే ఆయన పక్కనే కూర్చున్న కేంద్ర ఆరోగ్యశాఖ మాజీ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్, వెనుక కూర్చున్న కేంద్ర న్యాయశాఖ మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ నవ్వుతూ కనిపించారు.
అంతేకాదు, అధికార పార్టీకి చెందిన కొందరు ఎంపీలు తమ టేబుల్స్ మీద చరుస్తూ , బిధూరిని ప్రోత్సహించారు. సభలో ఉన్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి, ఇతర మంత్రులు కూడా బిధూరిని ఆపేందుకు ప్రయత్నించలేదు.
మోదీ కలల ప్రాజెక్టు అయిన కొత్త పార్లమెంటు భవనంలో ఇదంతా జరిగింది. నాలుగు నెలల కిందట ప్రధాని మోదీ వేద మంత్రోచ్ఛారణల మధ్య ఈ భవనానికి ప్రారంభోత్సవం చేశారు. చిత్రమైన విషయం ఏంటంటే, పార్లమెంటులో వాడకూడని (అన్‌పార్లమెంటరీ) పదాల సుదీర్ఘ జాబితా గత ఏడాది జూలైలో విడుదలైంది.
ఆ లిస్ట్‌లో ఉన్న పదాలను, బీజేపీ ఎంపీ మాట్లాడిన పదాలను పోల్చి చూస్తే, ఆయన ఎంత అసభ్యకరమైన మాటలు మాట్లాడారో అర్ధమవుతుంది.
ఈ కొత్త భవనంలో జరిగిన మొదటి సెషన్ ప్రారంభం సందర్భంగా, ఎంపీలకు ఈ భవనం కొత్త స్ఫూర్తిని, శక్తిని ఇస్తుందని, మన ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని ప్రధాని మోదీ అన్నారు.
అయితే, బిధూరి ప్రవర్తనపై మొత్తం ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేయడంతో పాటు అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడంతో, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ జరిగిన ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

ఫొటో సోర్స్, ANI
బిధూరి నోటి నుండి వచ్చిన దూషణ పదాలను దేశం మొత్తం విన్నది, ఇప్పుడది వీడియోగా ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతోంది.
‘‘బిధూరి అంటున్న మాటలను నేను సరిగ్గా వినలేకపోయాను, ప్రతిపక్షాలు ఆయన మాటలకు బాధపడినట్లయితే, నేను విచారం విచారం వ్యక్తం చేస్తున్నాను." అని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.
అలాంటి స్టేట్‌మెంట్ ఇచ్చిన వ్యక్తి పేరు రమేశ్ అని కాకుండా డానిష్ అయ్యుంటే ఏం జరిగి ఉండేదన్న ప్రశ్న సహజంగానే మనస్సులో తలెత్తుతుంది.
'సబ్ కా సాథ్, సబ్ కా విశ్వాస్, సబ్ కా వికాస్', 'వసుధైవ కుటుంబం' అంటూ దేశంలోనూ, అంతర్జాతీయ వేదికలపైనా గొప్పలు చెప్పుకుంటున్న ప్రధాని నరేంద్ర మోదీ ఈ మొత్తం ఘటనపై ఇంతవరకు స్పందించలేదు.
వాస్తవానికి, బిధూరి ఒక మామూలు బీజేపీ ఎంపీ కాదు. దక్షిణ దిల్లీ లోక్‌సభ నియోజకవర్గం నుండి వరుసగా రెండుసార్లు ఎన్నికయ్యారు. దిల్లీలో అత్యంత సంపన్నమైన, ప్రముఖమైన వ్యక్తిగా పేరుంది. ఆయన మూడుసార్లు దిల్లీ అసెంబ్లీకి కూడా ఎన్నికయ్యారు.
ప్రధాని మోదీ విదేశీ పర్యటన ముగించుకుని తిరిగి రాగానే దిల్లీ విమానాశ్రయంలో ఆయనకు స్వాగతం పలికేందుకు వచ్చారు. ఇది కాకుండా, దిల్లీలో మోదీ పాల్గొనే ఏ ర్యాలీ లేదా రోడ్ షోకైనా ప్రజలను తరలించే బాధ్యతను బిధూరీయే చూసుకుంటారు. ప్రధానికి ఇష్టమైన ఎంపీల్లో ఆయన ఒకరు.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అధినేత మోహన్ భగవత్‌తో బిధూరికి చాలాకాలంగా అనుబంధం ఉంది. హిందువులు, ముస్లింలు ఒకే డీఎన్ఏ కలిగి ఉన్నారని, అందరూ భారతమాత సంతానమేనని మోహన్ భగవత్ తరచూ చెబుతుంటారు.
అయితే బిధూరి ప్రవర్తనపై సంఘ్ కూడా ఇంకా స్పందించలేదు.

ఫొటో సోర్స్, ANI
కొందరికి సస్పెన్షన్, కొందరికి మాత్రం కేవలం హెచ్చరికలా ?
రమేశ్ బిధూరి మాట్లాడిన అభ్యంతరమైన మాటలను లోక్‌సభ రికార్డుల నుంచి తొలగించాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఆదేశించారు. అయితే, పార్లమెంటు కార్యకలాపాలు ప్రత్యక్ష ప్రసారంతో ఇంటింటికీ చేరుతున్న ఈ కాలంలో అలాంటి చర్యలు ఇకపై ఏ మాత్రం అర్ధవంతం కాదు.
డానిష్ అలీపై బిధూరి వాడిన అభ్యంతరకర పదాలు యావత్ దేశం మనసుల్లోకి వెళ్లిపోయాయి. పార్లమెంటు చరిత్రలో భాగమయ్యాయి. వీడియోల రూపంలో ప్రపంచమంతా వ్యాపించాయి.
చిన్న చిన్న విషయాలకే విపక్ష ఎంపీలను సెషన్ మొత్తానికి సస్పెండ్ చేసే స్పీకర్, ఈ విషయంలో బిధూరిని కేవలం హెచ్చరికలతో వదిలిపెట్టారు. సభలో మరోసారి ఇలా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా లోక్‌సభలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు అధిర్ రంజన్ చౌధరి, రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎంపీ సంజయ్ సింగ్ తమ సీట్లలో నుంచి లేచి వెల్‌లోకి దిగినందుకు వారిని సస్పెండ్ చేశారు.
మణిపుర్ సమస్యపై ప్రధాని ప్రకటన చేయాలని వారు అప్పట్లో డిమాండ్ చేస్తూ స్పీకర్ ఎదుట బైఠాయించారు.
రాజ్యసభలో, అలాగే 17వ లోక్‌సభలో ప్రతిపక్ష ఎంపీల సస్పెన్షన్‌కు సంబంధించిన అనేక ఘటనలు కనిపిస్తాయి. కానీ, వాటితో పోలిస్తే బిధూరి కేసు చాలా తీవ్రమైనది.

ఫొటో సోర్స్, ANI
రాజ్యాంగంలోని ఆర్టికల్ 105 (2) ప్రకారం, పార్లమెంటులో ఏ ఎంపీ ఏం మాట్లాడినా, ఎలా ప్రవర్తించినా ఏ న్యాయస్థానానికి జవాబుదారీ కాదు. అలాంటి వ్యక్తులపై పోలీసు చర్యలు తీసుకోవడానికి అవకాశం లేదు. అలాంటి సందర్భాలలో, లోక్‌సభ విధివిధానాలు, ప్రవర్తనా నియమాల ప్రకారం చర్యలు తీసుకునే హక్కు కేవలం స్పీకర్‌కు మాత్రమే ఉంటుంది.
ఒక ఎంపీ మరొక ఎంపీని కించపరిచేలా పదజాలం ఉపయోగించినప్పుడు, దుర్భాషలాడినప్పుడు స్పీకర్ తనకున్న ప్రత్యేక అధికారాన్ని ఉపయోగించవచ్చా లేదా అన్నది ప్రశ్న.
ఇలాంటి సందర్భాలలో స్పీకర్ ఏం చేయవచ్చు, లేదంటే మీరు స్పీకర్ స్థానంలో ఉండి ఉంటే ఏం చేసేవారు అంటూ ఒక లోక్‌సభ మాజీ స్పీకర్, బీజేపీ నాయకురాలిని అడిగినప్పుడు, ఆమె తనకు ఈ విషయం గురించి ఏమీ తెలియదని దాట వేయడానికి ప్రయత్నించారు.
అంతే కాదు, రమేశ్ బిధూరి, డానిష్ అలీ ఎవరో తనకు తెలియదని ఆమె అన్నారు. ఆమె స్పీకర్‌గా ఉన్న సమయంలో కూడా బిధూరి లోక్‌సభ సభ్యుడిగా ఉన్నారు.
సరే, తెలియకపోతే తెలియకపోయింది, ఇలాంటి ఘటన మీరున్నప్పుడు జరిగితే ఏం చేసేవారు అని అడిగినప్పుడు, "ఇప్పుడు నేను స్పీకర్‌ని కాదు, దీని గురించి నేనేం చెప్పగలను? ఈ విషయం స్పీకర్‌ని అడిగితేనే బాగుంటుంది" అన్నారామె.

ఫొటో సోర్స్, ANI
గతంలోనూ నేతలు అభ్యంతరకర వ్యాఖ్యలు
ప్రస్తుతానికైతే పార్టీ బిధూరికి షోకాజ్ నోటీసు ఇచ్చింది. 15 రోజుల్లో సమాధానం ఇవ్వాలని కోరింది. కానీ,నోటీసు ఇచ్చిన వారికి, తీసుకున్న వారికి కూడా ఆ నోటీసుతో ఉపయోగం లేదని తెలుసు.
జరిగిన దానికి విచారం వ్యక్తం చేస్తున్నానని బిధూరి ప్రకటిస్తారు. దానితో సమస్య ముగిసిపోతుంది.
నిజానికి, ముస్లిం కమ్యూనిటీని టార్గెట్‌గా చేసుకుని ఇలాంటి అభ్యంతరకర పదాలు వాడిన బీజేపీ నేతల్లో బిధూరి తొలి వ్యక్తి ఏమీ కాదు.
పార్లమెంటులో ఇటువంటి పదాలను ఉపయోగించిన మొదటి నేత ఆయన కావచ్చు. కానీ, పార్లమెంటు, అసెంబ్లీల వెలుపల యోగి ఆదిత్యనాథ్, అనురాగ్ ఠాకూర్, ప్రజ్ఞాసింగ్ ఠాకూర్, గిరిరాజ్ సింగ్, హిమంత బిస్వా శర్మ, సాధ్వి నిరంజన్ జ్యోతి...ఇలా చాలామంది ఇలాంటి వ్యాఖ్యలు చేశారు.
ఇలాంటి ప్రకటనలు ఇవ్వడంలో పేరున్న వ్యక్తులకు ఇప్పటి వరకు ఏమీ కాలేదు. పైగా వారికి ప్రమోషన్లు కూడా వచ్చాయి.
2020లో, అనురాగ్ ఠాకూర్, కేంద్ర సహాయ మంత్రి హోదాలో, పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దిల్లీలోని షాహీన్ బాగ్‌లో కొనసాగుతున్న ఉద్యమంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓ ర్యాలీలో పాల్గొన్న ఆయన దేశద్రోహులను కాల్చిచంపాలని వ్యాఖ్యానించారు.
కానీ, ఆయనపై ఎఫ్.ఐ.ఆర్. కూడా నమోదు కాలేదు. కేసు ఇంకా కోర్టులో పెండింగ్‌లో ఉంది. కొంతకాలం తర్వాత ఆయనకు కేబినెట్ పదవిని, రెండు కీలక మంత్రిత్వ శాఖలు ఇచ్చారు.
మహాత్మా గాంధీ హంతకుడు నాథూరామ్ గాడ్సేను దేశభక్తుడంటూ తరచూ ప్రకటనలు చేసే నాయకుడిగా బిహార్ బీజేపీ నేత గిరిరాజ్ సింగ్‌కు పేరుంది. ప్రధాని మోదీ మొదటి టర్మ్‌లో సహాయ మంత్రిగా పని చేశారు. రెండో దఫాలో కేబినెట్ మంత్రిగా ప్రమోట్ అయ్యారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2

ఫొటో సోర్స్, Getty Images
భోపాల్ ఎంపీ ప్రగ్యా సింగ్ ఠాకూర్ 2008 మాలేగావ్ బాంబు పేలుళ్ల కేసులో ప్రధాన నిందితురాలు. ఆమె తీవ్రవాద కార్యకలాపాల నిరోధక చట్టం యూఏపీఎ కింద విచారణలో ఉన్నారు.
అయినా, ఆమెకు 2019 లోక్‌సభ ఎన్నికలలో భోపాల్ నుంచి సీటు ఇచ్చారు. నాథూరామ్ గాడ్సే దేశభక్తుడని, గొప్ప వ్యక్తి అంటూ ఎన్నికల ప్రచారంలోనే ప్రకటనలు చేశారామె.
ఈ ప్రకటనపై అసంతృప్తిని వ్యక్తం చేసిన ప్రధాని మోదీ, ఇలాంటి ప్రకటన చేసినందుకు ప్రగ్యా ఠాకూర్‌ను క్షమించలేనని అన్నారు. కానీ, పార్టీ మాత్రం ఆమె సభ్యత్వాన్ని రద్దు చేయలేదు. ప్రస్తుతం ఎంపీగా ఉన్న ఆమె, ఇప్పటికీ అలాంటి ప్రకటనలు చేస్తూనే ఉన్నారు.
ప్రగ్యా సింగ్ ఠాకూర్ కేసుపై బీజేపీ క్రమశిక్షణా కమిటీని ఏర్పాటు చేసిందని, కానీ ఒక్కసారైనా ఈ కమిటీ సమావేశమైనట్లు ఎవరికీ తెలియదు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
అయిదేళ్ల కిందట కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన హిమంత బిస్వ శర్మ కూడా ముస్లిం కమ్యూనిటీపై విద్వేషపూరిత ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. బీజేపీ ఆయన్ను అస్సాం ముఖ్యమంత్రిని చేసింది.
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కేంద్ర సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి ‘రామ్‌జాదే వర్సెస్ హరామ్‌జాదే’ అని ప్రసంగించినప్పుడు మోదీ ఆమెను సమర్ధించారు. ఆమె వెనుకబడిన కులానికి చెందిన వ్యక్తి అని, గ్రామీణ నేపథ్యం నుండి వచ్చిన నాయకురాలని అన్నారు. అంటే, ఆమె మాటలను పట్టించుకోకూడదు. విమర్శించకూడదు.
ఈ ఉదాహరణలు, రమేశ్ బిధూరికి సోషల్ మీడియాలో బీజేపీ మద్దతుదారుల నుంచి లభిస్తున్న మద్దతు చూస్తుంటే, పార్టీ ఆయనపై చర్యలు తీసుకునే అవకాశాలున్నాయని అనిపించడం లేదు.
ఇవి కూడా చదవండి:
- చిత్తూరు: ‘టమోటా సాగుతో కోట్ల రూపాయలు వచ్చాయంటే మేం కూడా పంట వేశాం. తీరా చూస్తే..’
- డిజిటల్ చెల్లింపులతో డబ్బును వృథాగా ఖర్చు చేయడం పెరుగుతోందా?
- మెక్సికో: 'ఏలియన్స్'కు ల్యాబ్‌లో పరీక్షలు, ఫోరెన్సిక్ నిపుణులు ఏం తేల్చారు?
- చంద్రుని మీద టైం ఎంతో చెప్పగలమా...
- జర్మనీ: హిట్లర్ ప్రైవేట్ లైఫ్ గురించి ఆశ్చర్యానికి గురిచేసే నిజాలను బయటపెట్టిన 'వీడియో'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















